శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -2
సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి
4-లయన్ శ్రీ బందా వెంకటరామారావు –విజయవాడ -9393483147
ఆశించి భంగపడిన ఆంధ్రమాత ?
ప్యాకేజీలకై ఆశించి భంగపడిన అధికార పక్షం
ప్రత్యేకహక్కులకై పోరాడి అలసిపోయిన ప్రతి పక్షం
పక్షం ఏదైనా ఎన్నికల రణ క్షేత్రం లో వారిచ్చే సాక్ష్యాలివి
వేలాది పుత్రులు సృష్టించిన పున్నామ నరకాలివి
అసామాన్యులనుండి ఆశించి భంగపడిన ఆంధ్రమాతా ?
ఇవేవీ పట్టని కోట్లాది మాన్యుల సామాన్యుల రూపం లో జీవించు
అరిషడ్వర్గ విజేత నీ పుత్రుడు ఆంధ్రకేసరి లేకున్నా
ఆత్మాభిమానమే శ్వాసగా జీవించిన నందమూరి తిరిగి రాకున్నా
వారి అంశలలో మేమున్నాం ,మమ్ము చూసి గర్వించు
మా ఉన్నతిని అమ్మలా ఆశించు –మమ్ము దీవించు .
ఆంధ్రమాతా 1 అడ్డాలనాడు బిడ్డలే కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా వీరు ?
నీ బిడ్డలలో కొందరు అమెరికా ,ఇటలీ భక్తులు
మరికొందరు రష్యా చైనా శక్తులు
ఇంకొందరు పాక్ బంగ్లా కుయుక్తుల చరితులు
నీ బిడ్డలలో ఎందరో కులమతాల మలాల్లో కుళ్ళిన భోక్తలు
వారే –వేల సంవత్సరాల వయసున్న నిన్ను వృద్ధాశ్రమం లో చేర్చారు
అంతరించి పోయే అమ్మవని నమ్మబలికారు
నీ సంస్కృతీ సంప్రదాయాలకు సమాధులు కట్టారు
వారి ఉన్నతికై వారి వారి మార్గాల్లో తరలి వెళ్ళిపోయారు
ఆంధ్రమాతా !సింగపూర్ చైనా దావోస్ జపాన్ వలె ఉండాలని నీవు కలవరిస్తావు
వాటిలా నిన్నూ మార్చేస్తామని ఉత్తర కుమారుల్లా ఊసులు చెప్పేస్తారు
నీ వలే అమ్మా నాన్నా అనకుండా ఆంగ్లం లో మమ్మీ డాడీ అనమంటారు
నీపుత్రులు సృష్టించిన పున్నామ నరకం లో అభివృద్ధిని ఆశించావా
నీకలలను సాకారం చేసేవాడికి అధికార పీఠాన్ని అందించు
ఆశించి భంగపడిన ఆంధ్రమాతా !
నిన్నుకాదని పెంపుడు తల్లులను పోషిస్తున్నారు ఘనులు
పొరిగింటి పుల్లకూర రుచి వలదని వారించు
నిన్ను నిన్నుగా చూడాలని మందలించు
నీకు మరోమారు మల్లె పూలదండ వేయాలని శాసించు
ఆంధ్రమాతా –ఇదే ఈ కాల వేదం –ఈ బందా నాదం .
5-శ్రీమతి వి. శ్రీ ఉమామహేశ్వరి –విజయవాడ -9985154331
ఆశలు పూసిన వేళ
కలసి ఉంటె కలదు సుఖమని –అన్నదమ్ముల అనుబంధంసౌఖ్యమని
అభివృద్ధికై అహర్నిశలు శ్రమించి –రత్నగర్భను గడించి వినుతికెక్కిన వేళ
అరవై ఏళ్ళు పైబడిన షష్టిపూర్తీ నుండి తేరుకోకముందే –అర్దారాత్రి పడిందొక వెన్ను పోటు
అన్నదమ్ములని విడదీసిన అత్యాశ కాటు
అలనాడు భారత ఖండంబనెడి చక్కని పాడియావు
పొదుగు పితుకుతున్న తెల్ల దొరల వోలె
ఈ నాడు ఆంద్ర రాష్ట్ర మనెడి పాడి యావు
పొడుగు చీల్చారు తెలంగాణా దొరలు .
దగా పడ్డ తెలుగు బిడ్డ –బడబాగ్ని గుండెల్లో దాచుకుని
కష్ట జీవికి ఏ గడ్డైనా బంగారమేనని –నవనిర్మాణానికి శ్రమిస్తుంటే
ఎన్నికల వేళ చేయి అందించినవారే –బడ్జెట్ వేళ’’చేయిస్తే ‘’
తిరగబడ్డ తెలుగు బిడ్డ –తెలుగు పౌరుషం చూపి
విదేశీ పెట్టుబడులు సాధించ –బ్రహ్మాండమైన సభ దీర్చి
చాటి చెప్పే తెలుగు గడ్డ వైభవం .
మనిషి ఆశాజీవి –ఆంధ్రుడు కష్టజీవి
కష్టమే తీరుస్తుంది ఆశల్ని
మన ఆశలు నెరవేరే రోజొస్తుంది తప్పకుండా
ఉగాదికాలం లా ఆకులు రాలినా –ఆశలు వ్రాలినా
ఆకులు మరల చిగిర్చి వసంతం వచ్చినట్లే
మన ఆశలు మళ్ళీ చిగిర్చి పూసి ఫలవంత మౌతాయి .
6-మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –విజయవాడ -9299303035
దగాపడిన ఆంద్ర
1-మత్తకోకిల –ముక్కలయ్యేను తెల్గు దేశము మోదమెట్టుల కల్గునూ
చక్కగా నిక పాలనంబును సాగుటెట్టుల చెప్పుమా
అక్కరంతయు తీరె నంచును ఆదమరచె కేంద్రమే
చెక్కు చెద్రని పట్టు తోడను చేవ జూపగ నిల్వుడీ .
2-కందం –మద్దతిచ్చెద నంచును –పద్దతిగా మాటలాడి పదవులపొందెన్
ఉద్ధతి తగ్గిన పిదపను –‘’మొద్దై ‘’నిలుచుండె’’మోది’’ మోసము చేయన్ .
3-కందం –ఓ విళంబి నీవు ఓర్పుతో నీ భువి –తెలుగు వెలుగు మరల దీప్తి నొసగి
కాచి రక్ష చేయు కరుణామయి గ దల్తు-రావె ఇట కుగాది రమ్య ఫణితి .
4-ముందుకు సాగు
ఓ హస్తం విడగొట్టింది –బాధపడ్డాం
ఓ స్నేహ హస్తం ఆదుకుంటుందని –ఆశించి భంగ పడ్డాం
ఓ తెలుగువాడా !
మోసపోయానని కుంగిపోకు
అలనాటి ఆంద్ర పౌరుషాన్ని రగిలి౦చి మళ్ళీ చూపించు
ఏ యెండకాగొడుగు పట్టే స్వభావం కాదని నిరూపించు
ప్రాత్యేక హోదా భిక్షం కాదని –మనహక్కే నని తెలిసేలా చెయ్యి
నీ పాలు గౌరవంగా పొందటానికి ధైర్యంగా ముందుకు సాగు
ఆంద్ర కేసరి నిన్నావహించినట్లు గుండె దిటవు చూపించు
ధైర్యంగా ముందుకు మునుముందుకే సాగు సాగు సాగు సాగిపో .
7-శ్రీ చావలి శివ సుబ్రహ్మణ్యం –విజయవాడ -9985973239
గీతి సుగతి
1-ఆ.వె.-ఆంధ్ర దేశమెల్ల ననుపమంబై యొప్ప –జాతి జనులలోన జాతి రత్న
మగుచు నిలుచునన్న ఆశతో ఆ నాడు –సేవ జేసినాము క్షేమమరసి .
2-తే.గీ.స్వార్ధ రాజకీయము రెచ్చి స్వంత జనము-చీల్చి –తెలుగుజాతిని రెండు చేసినారు
వనరులన్నియు నొకవైపు వ్రాలిపోగ-అకట!నిర్విణ్ణమై పోయె నాంధ్ర ధరణి .
3-ఆ .వె.-రాజదానిలేక ,రహదారులును లేక –కూలినాలి చేయు కొలువులేక
ఆత్మహత్యలంచు నట్టిట్టుపరిగెత్తు-దీన జనుల గాచు తెరవు లేదు .
4-ఆ .వె.-బాధ్యతలను తల భరియించవలసిన –రాష్ట్ర నేతలెల్ల రచ్చబడిరి
దేశాపాలకులను దేవురించిన గూడ –ఆత్మ గౌరవమ్ము అంతరించె.
5-ఆ.వె.-సొంతబలము పెంచి సొంపార నింపార –కలసిమెలసి మనము గళము లెత్త
ఎదురు పడెడు ఇడుము లెన్నైన దొలగును –పూర్వవైభ’’మ్మపూర్వ ‘’మగును .
6-తే.గీ.-నిత్య శ్రామికులైనట్టి నీదు బిడ్డ –లెల్ల రేపవల్ కష్టించి యెదిగి మరల
పూర్వ వైభవమ్మొసగ నపూర్వ రీతి –దీక్ష బూనుచు సేవ లంది౦తురమ్మ .
7-తే.గీ.-పాలకులకెల్ల స్వార్ధంపు పరిధి తప్ప –పాలితులగాచి పాలించు బాధ్యతేది ?
ఆంద్ర సామాజికా౦శముల్ అరసిపట్టు –‘’సరస భారతి ‘’సౌహార్ద్ర సాంద్ర కీర్తి .
8-ఆ.వె.-హేవళంబి గడిచె ‘’హే విళంబీ’’ రమ్ము –కాల చక్రగతుల గాచిమమ్ము
ధర్మమార్గమందు ధరణి సర్వస్వమ్ము-వరలి ,శుభము గూర్చు వరము లిమ్ము .
8-శ్రీమతి ఎం. సరస్వతీ దేవి –ఉయ్యూరు -9040821541
స్వప్న భంగం
ఆంద్ర అన్న పేరులోనే –వినిపిస్తుంది ఓ ఠీవి-కనిపిస్తుంది ఓ హోదా
ఆంద్ర శబ్దం కాదు నిన్నటిది –కానే కాదు ఈనాటిది
ఐతరేయ బ్రాహ్మణం లోనే చోటు చేసుకున్నది –
చరిత్ర పుటల మడతల్లో కనిపిస్తుంది దీని వైభవం
మన దౌర్భాగ్యం ,స్వయంకృతం వల్ల
నేడు మనం ప్రగతికొరకు చేతులు చాచి అర్ది౦చాల్సిన కర్మపట్టింది
మన పూర్వవైభవ హోదాలను పొందేందుకు ఉండాలి మనలో ఆరాటం
అందుకే చేయాలి అవిశ్రాంత పోరాటం .
రోడ్ల నూడ్చి ,బాంకు ‘’నోట్లనూడ్చేసి ‘’
ప్రజల నేమార్చిన ఏలికలపాలనలో
మనహోదాను,ప్రగతిని నిలుపుకొనే పోరాటం లో
మనకు మిగిలిందేమిటి ?మోచేతిదానం తప్ప .
ఇదే తగిన అదును
ఊరూ, వాడా జాతీ, మతం,భాషా, వేషం అన్నీ మరిచి
ఏకమవుదాం అందరినీ కూడగట్టి అనుకున్నది సాధిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-4-18 –ఉయ్యూరు