మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు

13-4-18 శుక్రవారం రాత్రి 9-45గం.లకు 82 ఏళ్ళ  మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో వారం రోజుల అశ్వస్థత తో మరణించి మా అందరినీ శోక సాగరం లో ముంచేసింది .ఆమె ఆత్మకు శాంతి కలిగించవలసినదిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను .

ఆరు రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ కు

13 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకే మా మేనకోడలు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ‘’మామయ్యా !అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ,కొన్నిగంటలు మాత్రమె నని డాక్టర్లు చెప్పారు .చిన్నన్నయ్య శాస్త్రి శనివారం ఉదయం 7-30 గం .అమెరికానుంచి హైదరాబాద్ వస్తున్నాడు ‘’అని చెప్పింది .ఎంతో సీరియస్ గా ఉందని అర్ధమై ఉయ్యూరు నుంచి నేనూ మాశ్రీమతీ బయల్దేరటానికి కారు వెంటనే బుక్ చేశాం ,

మా మనవడు చి శ్రీకేత్ ఉపనయనానికి మార్చి 21 కి కారులో హైదరాబాద్ వచ్చిన మేము ఏప్రిల్ 2 ఉపనయనం అయ్యాక , ఏప్రిల్ 5న మా అల్లుడు శ్రీఅవధాని ,మనవడు చి శ్రీకేత్ అమెరికావెళ్ళాక  . ,ఏప్రిల్ 9సోమవారం మా అమ్మాయి శ్రీమతి విజ్జి ,పిల్లలు చి ఆశుతోష్ ,పీయూష్ లు అమెరికా వెళ్ళేదాకా ఉందామనుకున్నాం . అప్పటికే మా అచిన్నక్కయ్యకు హిమోగ్లోబిన్ 3 శాతం కు తగ్గిపోయి ,కేర్ హాస్పిటల్ లో చేర్చినట్లు తెలిసింది.కొంత నయమయ్యాక  ఇంటికి తీసుకు వెళ్లారట .వాళ్ళు అంతా హాస్పిటల్ హడావిడిలో ఉన్నారు .నేనూ మా అమ్మాయి  శని ఆదివారాలలో వెళ్లి మా అక్కయ్యను చూసివద్దామనుకున్నాం .5వ తేదీ శుక్రవారం రాత్రి ఇక్కడ విపరీతంగా వర్షం, అంతకు ముందు కూడా రోజూ వర్షమే .అప్పటికే మజ్జిగ రసం తో లాగిస్తున్న మా ఆవిడ ఇక ఇక్కడ తట్టుకోలేనని సోమవారం దాకా ఉండలేనని వెంటనే బయల్దేరి ఉయ్యూరు వెళ్లి పోదామని అంటే,  అప్పటికప్పుడు వోలా కాబ్ బుక్ చేసే ప్రయత్నం చేసి 6 వతేదీ శనివారం మధ్యాహ్నం 2 గం లకు బయల్దేరే ఏర్పాటు చేసుకున్నాం .ఓపిక లేకపోయినా తూలుతూ దేకుతూ మా ఆవిడ శుక్రవారానికే  చలిమిడి   తయారు చేసి రెడీగా ఉంచింది .6 వ తేదీ శనివారం ఉదయం మా అమ్మాయి ఒడిలో చలిమిడి పెట్టింది .మధ్యాహ్నం 2-30కి బయల్దేరి రాత్రి 7 -30 గంటలకు ఉయ్యూరు చేరాం

.ఆదివారం మా అబ్బాయి మూర్తి సెలైన్ ఎక్కించే ఏర్పాటు చేశాడు .సాయంత్రం దాకా రెండు బాటిల్స్ ఎక్కించాక ఆవిడకు కొంత రిలీఫ్ కనిపించింది .కొద్దికొద్దిగా  అన్నం తినటం మొదలెటింది .అమ్మయ్య అనుకున్నాం .ఆదివారం సాయంత్రం మా బావ శ్రీ వివేకానంద్ గారు ఫోన్ చేసి మా అక్కయ్య పరిస్థితి బాగాలేదని ,మళ్ళీ కేర్ లో చేర్పించామని సోడియం లెవెల్స్ బాగా తగ్గాయని మనుషుల్ని గుర్తు పట్టటం లేదని కంగారుగా ఉందని  తెలియజేశారు  .ఆ రాత్రి మా మేనకోడలు పద్మకు  ,పెద్దమేనల్లుడు అశోక్ కు ఫోన్లు చేసి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను .ఆదివారం రాత్రి మాబావ మళ్ళీ ఫోన్ చేసి పరిస్థితి కొంతనయం అని చెప్పారు .పద్మ మాటలలో నైరాశ్యం కనిపించింది .అందులో అమావాస్య దగ్గరలో ఉంది కనుక చాలా విషమ పరిస్థితి అనిపించింది .10 వ తేదీ మంగళవారం ఉయ్యూరులో ‘’గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ ‘’ఆధ్వర్యం లో A A వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం హడావిడి లో ఉన్నాం అయినా మా అబ్బాయి రమణ కూడా పరిస్థితి అడిగి తెలుసుకొంటూనే ఉన్నాడు.అనుకున్న భయం నిజమే అయింది శుక్రవారం పద్మ ఫోన్ తో .ఏ స్థితిలో అక్కయ్యను చూడాల్సి వస్తుందో ననే దిగులు మాకు .మా ఆవిడ తట్టుకోలేక ఏమైనా సరే హైదరాబాద్ బయల్దేరి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టింది .అలా ఉయ్యూరు వచ్చిన 6 రోజులకే మళ్ళీ హైదరాబాద్ కు బయల్దేరాం .రాత్రి 10-15 కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి  మల్లాపూర్ చేరి సామాన్లు లిఫ్ట్ లో పెడుతుండగా మా తమ్ముడు మోహన్ ఫోన్ చేసి అరగంట క్రితమే అక్కయ్య వెళ్లి పోయింది ,ఇంటికి ఓల్డ్ బోయిన్ పల్లికి తీసుకు వెడుతున్నాం అని చెప్పాడు. సరే రేపు ఉదయం వస్తాం అని చెప్పాను .

అక్కయ్య మరణం

శుక్రవారం రాత్రి 8-30 వరకు అక్కయ్య అప్పటికే సీరియస్ నెస్ విషయం తెలిసి చూడటానికి వచ్చిన అందరితో బాగానే మాట్లాడిందట .ఆకలేస్తోంది త్వరగా అన్నం పెట్టమని నర్సుకు చెప్పండి అనికూడా అన్నదట.కాని అన్నం పెడితే వంటి అయి మరీ సీరియస్ అవుతుందని వాళ్ళు పెట్టలేదట .మనవరాలు భార్గవితో ‘’ఏమే బాబాయి వస్తాడన్నావు.ఇంకా రాలేదా ?’’అని అడిగిందట .’’బాబాయి రేపు పొద్దున్న వస్తాడుమామ్మా’అని చెప్పిందట .  భార్గవి భర్త విశ్వనాధ మురారి ‘’గుర్తుపట్టారా అమ్మమ్మ గారూ ‘’అంటే ‘’అదేమిటి నువ్వు గుర్తులేకపోవటమేమిటి మురారివి కదా ‘’అన్నదట .సరిగ్గా రాత్రి 9 గంటలకు హాస్పిటల్ వాళ్ళు అశోక్ కొడుకు ప్రత్యూష్ కు ఫోన్ చేసి రమ్మని పిలిస్తే వెళ్ళాడట .అప్పటికే కండిషన్ సీరియస్ అనిపించిందట .బయటికి వెళ్లి అందరికీ చెప్పేలోపు మళ్ళీ వాడిని పిలిపించారట .మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్లి వెళ్ళద్దని వారిస్తున్నా పద్మకొడుకు తేజా తో వెళ్లి చూశాడట .డాక్టర్ చూసి పెదవి విరిచాడట .ఫైట్స్ వస్తున్నాయట .మా బావ కూడా హాస్పిటల్ లోనే ఉన్నారు .రాత్రి 9-45 కిమా చిన్నక్కయ్య  తుది శ్వాస విడిచిందట .అప్పుడు తానూ అక్కడే ఉన్నాను అని ప్రత్యూష్ తన మామ్మ మరణాన్ని ప్రత్యక్షంగా చూశానని నేను వాడిని’’ అసలు సీరియస్ నెస్ అని ఎందుకు ఎలా అనిపించింది?’’ అని అడిగితె  గుండెలనిండా దుఖం తో నిన్న నాకు ఈ వివరాలు తెలిపాడు .

తలిదండ్రుల సేవలో సోదరులు

దాదాపు మూడు సంవత్సరాలనుండీ మా అక్కయ్య మోకాలికి ఆపరేషన్ తర్వాత పెద్దగా బయటికి రాలేదు .వాళ్ళ మనవరాలు పద్మ కూతురు చి రవళి పెళ్ళికి తప్ప .మా చిన్నమేనల్లుడు శాస్త్రి ఆవిడ సేవలకోసం 24గంటలూ ఒక నర్సు ,వంట కు దేవుడి పూజకు ఒక బ్రాహ్మణ ఆవిడను  ,కింద ఇంట్లో డ్రైవర్ వర్మ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. తలిదండ్రులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు .ఖర్చుకు వెనకాడటం లేదు .వాళ్ళిద్దరి ఆరోగ్యమే ముఖ్యం గా వాడి తపన హర్షించదగింది. ఏడాదికి కనీసం నాలుగు సార్లు అమెరికానుంచి వచ్చి చూసి వెడుతున్నాడు .భార్యాపిల్లలు ఏదాడికి రెండు సార్లు వచ్చి చూసి వెడుతున్నారు .తలిదంద్రులంటే అన్నదమ్ములు అశోక్ ,శాస్త్రి లకు అత్యంత గౌరవం ,ప్రేమ ,ఆరాధన .  ఈ ఇద్దరికీ చెల్లెలు పద్మ అంటే విపరీతమైన అనురాగం  .మా అక్కాబావలు పిల్లలను అతి గారాబంగా  అత్యంత జాగ్రత్తగా పెంచారు .అశోక్ కూతురు భార్గవి అంటే మరింత చనువు .శాస్త్రి పిల్లలు అంటే చెప్పలేని ఆప్యాయం .మాబావ యూరిన్ ప్రాబ్లెం తో సుమారు పదేళ్లనుండి ఇబ్బంది పడుతున్నారు .అయినా బ్యాంక్ పనులు బయట చిన్నచిన్నపనులు అన్నీ తానె వెళ్లి చేసుకోస్తారు .మా అక్కా బావలు ప్రేమైక జీవులు .సరిగ్గా చెప్పాలంటే ‘’జీవికా జీవులు ‘’.ఒకరిపై ఒకరికి ఆరాధనా, అవగాహనా ,ప్రేమ నిండుగా ఉన్నవారు .మాబావ కొంచెం తొందరపడినా మాక్కయ్య ఆయన్ను కను చూపుతో కట్టడి చేస్తుంది .ఒకరి స్వభావం ఒకరికి పూర్తిగా తెలిసినవారు .బంధుప్రేమ పుష్కలంగా ఉన్నవారు .అందరూ కావాలనుకొనేవారు .అందరూ తమ ఇంతకి రావాలనుకునే వారు.అందరితో ఫోన్ లో టచ్ లో ఉంటారు .అందుకే వాళ్ళు దేనికి పిలిచినా బంధువులందరూ విధిగా హాజరవుతారు .అశోక్ సోదరులు తల్లిదండ్రుల షష్టిపూర్తి, వివాహ షష్టిపూర్తి వగైరాలను చాలా ఘనంగా చేశారు . తలిదండ్రులు ఉండటానికి  అన్న అశోక్ ఇంటికి దగ్గరలోనే రెండస్తుల భవనం అన్ని హంగులతో కట్టించాడు .అశోక్ భార్య సంధ్య ,శాస్త్రిభార్య విజయలక్ష్మి అత్త మామలంటే ఎంతో భక్తీ శ్రద్ధలు .వాళ్ళ పిల్లలకూ మామ్మ తాతయ్య గారంటే అంతే గౌరవం .

మార్గ దర్శనం

అలాగే మా బావ కూడా తలిదండ్రులు శ్రీ వేలూరి కృష్ణమూర్తి  గారు అత్తమ్మగారు అనబడే శ్రీమతి కాంతమ్మ గారలను  కంటికి రెప్పలా చివరిదాకా చూసుకున్నారు . దీనికి అన్నివిధాలా సహకరించింది మా అక్కయ్య .అలాగే మాబావగారి అన్నగారు ముకుందం గారు చనిపోతే ,ఆకుటుంబాన్ని అక్కున చేర్చుకుని ,ఆయనకున్న ఇద్దరాడపిల్లలవివాహాలను, కొడుకు పవన్ వివాహాన్ని బాధ్యత మీద వేసుకుని నిర్వహించారు .ఇందులో మా బావ కంటే మా అక్కయ్య చూపిన ఓర్పు నేర్పు చాలా ప్రశంసనీయ౦  .బతికి ఉన్నప్పుడే తలిదండ్రులను  సోదరులను మర్చిపోయేకాలం లో ఇంతటి పెద్ద బాధ్యత వారిద్దరూ నిర్వహించటం ముకుందం గారి కుటుంబం చేసుకున్న అదృష్టం . వాళ్ళూ ,ముఖ్యంగా పవన్  భార్య శ్రీమతి రాధా అంతే విధేయతతో మా అక్కాబావా యెడల ఇప్పటికీ ప్రవర్తిస్తారు .ఇదీ వాళ్ళ సంస్కారం .

అమెరికాలో చూడని ప్రదేశం లేదు

మా చిన్నమేనల్లుడు మా అక్కా బావలను చాలా సార్లు అమెరికా తీసుకువెళ్ళి అక్కడి అన్ని ప్రదేశాలను చూపించాడు .బహుశా వాళ్ళు అమెరికాలో చూడని ప్రదేశమే లేదు అంటే ఆశ్చర్యం కాదు ..అలాగే నేపాల్ తో సహా భారత దేశం లోని పుణ్య క్షేత్రాలన్నీవాళ్ళు సందర్శించారు .2008లో మేము మూడవసారి అమెరికాకు  మా అమ్మాయి వాళ్ళున్న స్టెర్లింగ్ హైట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మామేనల్లుడు శాస్త్రి ఉంటున్న కాలిఫోర్నియాకు వచ్చారు .తరచూ మాట్లాడుకొనే వాళ్ళం .మాక్కయ్యకు మేనకోడలు విజ్జి అంటే మా అమ్మాయి  అంటే మంచి ఆత్మీయత .ఇద్దరూ సరదాగా గంటలు గంటలు మాట్లాడుకుంటారు

మా తో క్షేత్ర దర్శనం

మా అక్కా బావ లతో మా దంపతులం 1998 ఏప్రిల్ –మే నెలలో కేదారనాథ్ , బదరీనాథ్ సందర్శనం మధురానుభూతినిచ్చింది . వాళ్ళిద్దరి ప్రోత్సాహం తోనే ప్రోద్బలం తోనే మేమిద్దరం  వెళ్ళగలిగాము  .మాబావ ది పక్కా ప్లాన్ ప్రోగ్రాం .గవర్నర్ ప్రోగ్రాం లాగా రూపొందించి అమలు చేస్తారు .వారిద్దరితో మేమిద్దరం,మా అత్తగారు పద్మావతక్కయ్య , మా తమ్ముడు, భార్య కాశీకి వెళ్లి మా అమ్మ అయిదవ మాసికం పెట్టటం ,సారనాద్ ,బుద్ధగయ ప్రయాగ సందర్శనం ,కూడా చిరస్మరణీయం. దీనికి పక్కాప్లాన్ మా బావగారిదే .మా మేనల్లుడు అశోక్ ఉయ్యూరులో మా దగ్గరఉయ్యూరు లో  ఒకటవ క్లాస్ నుంచి  ఎస్.ఎస్ .ఎల్. సి .వరకు చిదివినప్పుడు వాడికి సకల సౌకర్యాలు కలిపించేవారు .మా ఇంట్లో భోజనం నిద్రతప్ప మిగిలిన ఖర్చు అంటా వాళ్ళదే .నన్ను వాడిని తీసుకుని బీహార్ లో ఆయన పని చేసే జమ్తారా కు తీసుకు రమ్మంటే వెళ్ళా .మరోసారి మా వేదవల్లితో కలిసి మేము ముగ్గురం వెళ్లాం  మొదటి సారి వెళ్ళినప్పుడు నాలుగు రోజుల పక్కాప్లాన్ తో మమ్మల్ని కాశీ ప్రయాగ అలహాబాద్ ,శాంతినికేతన్ ,జంషెడ్పూర్  కలకత్తా వగైరాలు చూపించాడు బావ.  అప్పుడు మా అక్కయ్య ఉయ్యూరులో మా ఇంట్లో ఉంది .

తరచూ ఉయ్యూరు కు

మా అబ్బాయిల, అమ్మాయి పెళ్ళిళ్ళకూతప్పక వచ్చేవారు అక్కాబావా .మా తలిదండ్రుల ఆబ్దికాలకు కూడా వీలు చూసుకు వచ్చేవారు .మా ఇంట్లో నాతోపాటు మా బావ అభిషేకం చేసుకునేవారు .అందరం ఐలూరు  బెజవాడ కృష్ణా స్నానం ,మోపిదేవి ,హంసలదీవి క్షేత్ర దర్శన కలిసి చేశాం .ఒక క్రష్ణాపుష్కరానికి అందరం తోట్ల వల్లూరు వెళ్లి పుష్కరం పెట్టాం .ఇలా మా అనుబంధం మర్చిపోలేనిది .మా శ్రీమతికి మా అక్కయ్య అంటే విపరీతమైన గౌరవం .

వాళ్ళ ఇంటి నుంచే మా అమెరికా ప్రయాణం

2002,05,08 లలో మేమిద్దరం అమెరికా వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో మా అక్కయ్యా వాళ్ళ ఇంటి నుంచే అమెరికాకు బయల్దేరి వెళ్లాం .మాకు అదొక సెంటి మెంట్ గా ఉండేది .అశోక్ ద్వారా స్టేట్ బాంక్ లో డాలర్లు తీసుకునేవాళ్ళం .2008 తర్వాత మా వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళలేదు. ఇద్దరి ఆరోగ్యాలు బాగుండక. అంటే పదేళ్ళ నుంచి వాళ్ళు అమెరికా వెళ్ళలేదన్నమాట .అందుకే అమెరికానుంచి వాళ్ళే వస్తున్నారు .మేము అమెరికా వెళ్ళిన ప్రతిసారీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకుని వెళ్ళేవాళ్ళం .అయిదోసారి మేము అమెరికా 20 17ఏప్రిల్ లో వెళ్ళినప్పుడు మా శ్రీమతి మేడమేట్లు ఎక్కలేను  అంటే నేనూ మా మనవడు చరణ్  భువన లతో వెళ్లి మాబావ నుంచి డాలర్లు తీసుకుని ఇద్దరి ఆశీర్వాదం పొందాం .అక్టోబర్ లో తిరిగి వచ్చినప్పుడు మా ఆవిడా నేనూ మనవడు లతో కస్టపడి పైకి వెళ్లి అక్కాబావాలను చూసి బట్టలు పెట్టి ఆశీర్వాదం పొందాం .అయితే మాటలహడావిడిలో బొట్టు పెట్టటాలు ఇద్దరూ మర్చిపోయారట .ఇంటినుంచి బయటికొచ్చి కాబెక్కి కొంతదూరం వెళ్ళాక  మా ఆవిడ జ్ఞాపకం చేసుకుని ‘’సెంటిమెంట్ గా ఫీలయి’’ చాలా బాధపడింది .అంటే మా అక్కయ్యను చూసి అప్పుడే 6 నెలలయింది .అదే ఆవిడను చూసి మాట్లాడిన చివరి సారిఅయి పోయింది .ఊహించని పరిణామం . మధ్యలో పండగలకూ పబ్బాలకూ ఫోన్ చేయటమే తప్ప వచ్చి చూసే అవకాశం కుదరలేదు .

గౌరమ్మ తల్లిలా వెళ్లి పోయిన దుర్గమ్మ తల్లి

13 తేదీ శుక్రవారం ఇంటికి వచ్చిన అక్కయ్యను ఓల్డ్ బోయిన్ పల్లి విఠల్ ఎన్క్లేవ్ లో స్వగృహం లో ఉంచారు .శనివారం ఉదయం 8 గంటలకు మేమిద్దరం మా పెద్దకోడలు శ్రీమతి సమత కాబ్ లో బయల్దేరి 9 గంటలకు అక్కడికి చేరాం .మా అబ్బాయి శాస్త్రి స్కూటర్ పై వచ్చాడు .అప్పటికే మామేనల్లుడు శాస్త్రి అమెరికానుంచి వచ్చాడు .మమ్మల్ని కావలించుకుని బోరున ఏడ్చేశాడు .మాబావను పట్టుకోవటం శక్యం కాలేదు .ఆయన్ను దగ్గరకూర్చుని కొంత ఓదార్చాం .పద్మ సంగతి చెప్పక్కర్లేదు . భరించరాని  దుఖాన్నిగుండెల్లో అదుముకుని ,జరగాల్సిన కార్యక్రమాలు చూస్తూ మధ్యమధ్యలో ఆనకట్టపై నుంచి దూకి పడే జలప్రవాహం గా కన్నీటిని కారుస్తూ కుమిలి పోతోంది .అప్పటికి మాన్నయ్యగారి అమ్మాయి కూతురు వేదవల్లి కొడుకు రవి, భార్య గాయత్రి వచ్చారు .మా అబ్బాయి శర్మ ,తర్వాత మోహన్ ఫామిలీ మాబావ అక్కయ్య కూతుళ్ళు అంటే జనమంచి వారు కొడుకు ,అశోక్ వియ్యంకుడు వియ్యపురాలు ,పద్మ మామగారు, ఆడబడుచులు ,అశోక్ బామ్మర్దులు భార్యలు ,ముకు౦ద౦గారి ఇద్దరమ్మాయిలు మనవడు ,శాస్త్రి ఫ్రెండ్ జిడ్డు ,మాబావ తమ్ముడు అబ్బి భార్య ,మాబావ చెల్లెలు శాంతమ్మగారు, కొడుకు రాంబాబు మొదలైన వారంతా వచ్చారు .పురోహితులిద్దరూ  మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు .కార్యక్రమం ప్రారంభించారు .శాస్త్రోక్తంగా చేయించారు అశోక్ శాస్త్రి సోదరులతో .పుట్టింటి వారు పెట్టాల్సిన ఆకుపచ్చచీర ,ఎర్ర జాకెట్ ,ఆకుపచ్చ ,ఎర్రగాజులు పూలు దండ  మురారికి డబ్బు ఇచ్చి తెప్పించమంటే  రవళికిచ్చి  వీటిని కొని తెప్పించాడు .మంచి చీర త్సేలేక్ట్ చేసి తెచ్చింది రవళి .వీటిని అలంకరించి ముఖానికి పసుపు పూసి రూపాయి కాసంత కుంకుమ బొట్టు పెడితే మా అక్కయ్య సాక్షాత్తు గౌరీ దేవిగా భాసించింది .పద్మకూడా ఎర్రసిల్కు చీరర జాకెట్ గాజులు తెప్పించి వేయించింది. మహా లక్ష్మిలాగా కనిపించింది మా అక్కయ్య . బంధుమిత్రులు  విషన్నవదనాలతో  వీక్షిస్తుండగా అందరూ కడసారి దర్శనం చేసుకున్నాక మా అక్కయ్య పార్ధివ దేహాన్ని వాహనం లోకి ఎక్కించారు .శ్మశాన వాటికి దుబాయ్ గేట్ కు నడిచే దూరం లో చాలా దగ్గరలో ఉంది  .మా బావతో సహా అందరం అక్కడికి మధ్యాహ్నం3 గంటలకు చేరాం .అన్ని విధులు నిర్వహించాక దేహాన్ని చితిపై చేర్చారు .వేద మంత్రాల పఠనం జరుగుతుండగా  పెద్దకొడుకు అశోక్ చితికి నిప్పు అంటించాడు .సుమారు 20 కిలోల ఆవునెయ్యి కట్టెలపై పోసి గంధపు చెక్కలు ముత్యం పగడం లతో శవ దహనం చేశారు .కపాల మోక్షం అయ్యే వరకు అందరం ఉండి అక్కడే స్నానాలు చేసి  ఇంటికి తిరిగి వచ్చాం .సోదరులు ఇంటికి రాగానే దీపారాధనకు నమస్కరించి ఇంటిలోకి ప్రవేశించారు .ఇలా మా చిన్నక్కయ్య సాక్షాత్తు గౌరీ దేవి రూపంగా ,మహా లక్ష్మి కళతో మా అందరి నుండి రంగరంగ వైభవంగా పుణ్య లోకాలకు తరలి పోయింది .

సేవాభాగ్యం

మేము ఇంటికి చేరే సరికి ఇల్లు కడిగి వంట బ్రాహ్మిణిలతో వంట చేయించి సిద్ధంగా ఉంచారు మేడపైన అందరం భోజనాలు చేశాం. అన్నీ రుచికరంగా చేశారు .ఈ మొత్తం కార్యక్రమానికి సారధి సచివుడు వ్యూహకర్త ,నిర్వాహకుడు సర్వం తన భుజ స్కంధాలపై వేసుకుని నిర్వహించిన  మా అక్కాబావల కుమార్తె శ్రీమతి పద్మ భర్త , ఇంటల్లుడు  శ్రీ గణపవరపు రామకృష్ణ అభినందనీయుడు .అశోక్ అల్లుడు మురారి అందరికీ తలలో నాలుకగా, సహకారం గా నిర్వహించిన తీరు మరువలేనిది . అలాగే మనవలు తేజ ,ప్రత్యూష్ లు  మనవరాళ్ళు భార్గవి ,రవళి కాలికి బలపాలు కట్టుకుని చేసిన సేవ మర్చిపోలేనిది .ముఖ్యంగా భార్గవి వాళ్ళతాతగారు అంటే మా బావ పక్కనే కూర్చునిధైర్యం చెబుతూ, క్షణ క్షణంఆయన్ను కంటికి రెప్పలాగా కనిబెడుతూ చూసిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది .  విశ్రాంతి లేకుండా వర్మ ,అతని తల్లి, చెల్లెలుఇంట్లోని మనుషులకన్నా ఎక్కువగా మా అక్కకు బావకూచేసిన, ,ఇప్పుడూ చేసిన చేస్తున్న సేవ మాటలతో చెప్పటానికి వీలు లేనిది .ఎన్నో జన్మల అనుబంధమేమో  అనిపిస్తుంది .ఇందరి మంచి మనసుల మంచి మనషుల నుంచి దూరమై వెళ్లి పోయింది మా చిన్నక్కయ్య దుర్గ .ఆమె జ్ఞాపకాలు కొన్నే రాశాను .ఎన్నెన్నో తేనే పట్టు లాగా మధురమైనవి 70ఏళ్ళుగా ఉన్నాయి . వరుసలో తెలియ జేసే ప్రయత్నం చేస్తాను .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.