మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2         

 మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు  -2            హిందూపురం జ్ఞాపకాలు

మా చిన్నక్కయ్య దుర్గ గురించి మొదటి జ్ఞాపకాలు మేమందరం అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఉన్ననాటి వి.అంటే నాకు జ్ఞాపకమున్నంతవరకు అంటే నాకు కొంత లోకజ్ఞానం వచ్చినప్పటివి –నేను 1940 లోపుట్టాను .మాక్కయ్య నాకంటే 3ఏళ్ళు పెద్దది .కనుక సుమారు 1946 నుండి కొంత జ్ఞాపకం . మానాన్న హిందూపూర్ లో ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్(ఇ.సి.య౦) లో సీనియర్ తెలుగు పండిట్  .రామమందిరం దగ్గర మిద్దె ఇంటిలో అద్దెకు ఉండేవాళ్ళం .కింద వంటిల్లు ,స్నానాలగది ,మధ్యాహాలు ,స్టోరు రూము ,చిన్న నేలమాలిగ,దొడ్లో బావి ,దానికి ఆనుకుని వేడినీళ్ళు కాచుకునేమట్టి ఇటుకలపై  ‘’పెద్ద రాగి అండా’’ ఉండేవి .నీళ్ళు కాచుకోవటానికి చింత కాయ పొట్టు ,లేక వేరుసెనగ పొట్టు వాడేవాళ్ళం . మధ్యహాలు నుంచి పైకి మెట్లు .పైన రెండు గదులు ,విశాలమైన హాలు .హాలుకు బయట ఆరుబయలు .రాత్రిళ్ళు భోజనం చేయటానికి పిచ్చాపాటీ కబుర్లకు ఆడవాళ్ళూ ఆడుకోవటానికి పనికొచ్చేది .లోపలిగదుల్లో ఒకటి నాన్న రామకోటి, పద్దులు రాసుకోవటానికి ,తెలుగు ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చే వారికి వీలుగా ఉండేది. రెందోగది మేము వాడుకునే వాళ్ళం .ఆడవాళ్ళు ఈ గదిలోనే బొట్టూకాటుక పెట్టుకుని అలంకారాలు చేసుకుని జడ వేసుకోనేవాళ్ళు .గాలి ధారాళంగా వచ్చే వీలు ఉండేది .అది ఎక్కువభాగం బ్రాహ్మణ పోరుగున్న ప్రదేశం .అంతకు ముందు వేరే రెండు మూడు చోట్ల అద్దెకు  ఉండేవారని అమ్మావాళ్ళు చెప్పగా విన్నాను .మ మామ్మ ,మా అమ్మ ,నాన్న ,పెద్దక్కయ్య లోపాముద్ర ,చిన్నక్కయ్య దుర్గ ,నేను ,మాతమ్ముడు మోహన్ అక్కడ ఉండేవాళ్ళం .

  మా చిన్నక్కయ్య మునిసిపల్ గర్ల్స్ స్కూల్ లో చదివేది .మా ఇంటికి దగ్గరే .నడిచి వెళ్ళేది .బహుశా 8 వ తరగతి వరకు అక్కడ చదివిన గుర్తు .స్కూల్ బాగా ఉండేది .స్కూల్ కంచే గా రబ్బరు చెట్లు అనే వెడల్పాకు చెట్లు ఉండేవి వాటి ఆకులను చీల్చి కొడితే శబ్దం వచ్చేది మాకు బలే తమాషా ఉండేది .దాని కాడలు సుమారు అరంగుళం మందంగా లో ఉండేవి .దట్టంగా గుబురుగా చెట్లు అల్లుకునేవి .మా అక్కయ్య సంగీతం కూడా ఇక్కడే కొంత నేర్చుకున్నది .మా పెద్దక్కయ్య పెళ్లి అప్పటికే అయినజ్ఞాపకం  మద్రాస్ లో  మా బావ గాడేపల్లి కృపానిధి గారు కార్పోరేషన్ లో హెల్త్ డిపార్ట్ మెంట్ లో పని చేసేవారు .వేసవికి ఇక్కడికి వచ్చేవారు అప్పటికి వాళ్లకు ఇంకా పిల్లలు పుట్టలేదు .మా అన్నయ్య లక్ష్మీనరసింహ శర్మ బళ్ళారిదగ్గర హాస్పేట్ లో రైల్వే అసిస్టంట్ స్టేషన్ మాస్టర్ .

  నేను మా ఇంటికి దగ్గరలోనే గడ్డమీద మునిసిపల్ ఎలిమెంటరి స్కూల్ లో నాలుగు, అయిదు క్లాసులు’’ మిడికాను’’ .నాలుగో తరగతి క్లాస్ టీచర్ ఆశీర్వాదం గారు .తెల్ల పంచె తెల్ల చొక్కా పైన కోటు మెడలో మఫ్లర్ తో ఉండేవారు కారునలుపు రంగు .ఉబ్బసం మనిషి .అయితే ఏమి మహాబాగా చదువు చెప్పేవారు .ఇంగ్లీషు లెక్కలు వగైరా ఆయనే బోధించేవారు.తెలుగుకు మాత్రం వెంకటరామ శాస్స్త్రి అనే ఆయన  వచ్చేవారు .ఈయన మానాన్న శిష్యుడు నన్ను బాగా గారాబం చేసేవాడు .కన్నడికుడు  .తెలుగు బాగా చెప్పేవారు .ఆయన చెప్పిన ఒకమాటకు అర్ధం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది –అది –కలకలం అనే మాట దీనికి ఆయన ‘’గద్దలం’’అనే అర్ధం చెప్పారు .ఈ రెండిటి అర్ధాలు అప్పటికి మాకు తెలిసేవికావు .మానాన్నను అడిగితే  వాటికి విపరీతమైన శబ్దం అని చెప్పారు .

  అయిదవ తరగతి క్లాస్ టీచర్ ఐరావతమ్మగారు . ముఖం కాలి పోయి వికృతంగా ఉండేది కాని మెత్తటిమనసు .బోధన బాగుండేది .మా క్లాస్ మేట్లు మా ఇంటి దగ్గరే ఉన్న ఈమని అబ్బాయి ,దక్షిణామూర్తి గుడిపూజారికొడుకు దక్షిణామూర్తి ,వైశ్యుడు చలపతిరావు ,మరొకడు సోమ సుందరరావు  .వీళ్ళంతా ఖాళీ దొరికితే మా ఇంటికి వచ్చేవాళ్ళు .చదువు ఆట పాటా తో కాలక్షేపం .నాకు లెక్కలు రావు. చలపతి బాగా చేసేవాడు. వాడికి కాల్చిన చిలగడ దుంపలు ‘’లంచమిచ్చి’’ లెక్కలు చెప్పించుకునేవాడిని .మిగిలిన సబ్జెక్ట్ లలో నేనే ఫస్ట్.లీడర్ కూడా నేనే .వీళ్ళంతా వీర విధేయులు గా ఉండేవారు .స్కూల్ లో’’ రాయలు మేష్టారు ‘’అనే ఆయన ఉండేవారు .పంచెకట్టుతో మెడలో ఉత్తరీయం తో మన స్టేజినటుడు రఘురామయ్యలాగా ఉండేవాడు .నవ్వుముఖం శాంతమూర్తి .పిల్లనగ్రోవి అంటే వేణువు  విద్వాంసుడు .పాడుతుంటే నాగులు కూడా నిద్రపోవాల్సిందే.అంత కమ్మగా ఊదేవారు .మా అందరికి ఆయనంటే పరమ భక్తీ. మా గడ్డమీది స్కూల్ కు ఆయన నడిచి మా ఇంటి ముందు నుంచే వెళ్ళేవారు .ఒకసారి మేము  అందరికంటే ముందు వెళ్లి గేటు తీయకపోతే నేను రెండు ఇనుప కడ్డీలమధ్య కొంత ఎడం ఉంటె తలకాయ దూర్చి లోపలి వెళ్ళే ప్రయత్నం చేశా .తలకాయ ఇరుక్కు పోయి బిగిసిపోయింది. ఇక లోపలి కదలలేక పోయా .మా బృందం అరుపులు కేకలు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు నాకోసం. దాదాపు అయిపొయింది నాపని అని అందరూ అనుకున్నారు .అదే టైం కి రాయలు మాస్టారు వచ్చారు. చూసి ఉపాయంగా తలకాయ తిప్పి నా తల  బయటికి  లాగి బతికించారు .లేకపోతె నా చరిత్ర అంతటితో సమాప్తం .ఇంకా ఏదో లోకాన్ని ఉద్ధరించాలి వీడు అని దేవుడు ఆయువుపోశాడేమో ?అప్పటినుంచి ఆయన అంటే నాకు ఆరాధన మరీ జాస్తి అయింది .

  ఇంట్లో భారత మాత ఫోటో ఉండేది .చాలా అరుదైన ఫోటో .అందులో దేశానాయకులందరూ ఉండేవారు పాకిస్తాన్ కూడా మనలో భాగంగా ఉండేది .ప్రతి శుక్రవారం రాత్రి భారతమాత పూజ భజన మా ఇంట్లో చేసేవాళ్ళం .మా అక్కయ్య ప్రసాదం చేసేది .దాదాపు గంట సేపు భజన జరిపేవాళ్ళం .జనం బాగా వచ్చేవారు మా అమ్మా నాన్న మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు .ఇదే మేము ఉయ్యూరు వెళ్ళాక’’శివపూజ ‘’గా కొనసాగించాం .మా ఇంటికి దగ్గరలో ఈమని వెంకటరామయ్య  ఉండేవారు ఆయన పురోహితుడు  భార్య అన్నపూర్ణమ్మ మా అమ్మకు స్నేహితురాలు .వాళ్ళబ్బాయి’’అబ్బాయి ‘’ నాకు స్నేహితుడు శిష్యుడూ జోడీ .వీదితంముడు మా తమ్ముడిమేటు. వీళ్ళ ఇంటి  ప్రక్కన సాహేబుల కుటుంబం ఉండేది .చాలామంచి ఫామిలి. సాయంకాలం మమ్మల్ని పిలిచి స్వీట్లు పెట్టేవారు .వాళ్ళప్రక్కన  రాఘ వేంద్ర రావు  అనేకన్నడ  సెకండరీ టీచర్ కుటుంబం ఉండేది .ఆయన మా నాన్న స్కూల్ లో టీచర్  .ఆయనభార్య గోదావరమ్మ మునిసిపల్ మెంబర్ .మాంచి పలుకుబడి ఉన్నావిడ .ఇంట్లో బయటా ఆవిడదే పెత్తనం .అన్నపూర్ణమ్మ ఆవిడకు నమ్మినబంటు .అన్నపూర్ణమ్మ ఇంట్లో ఏపనీ చేసేదికాడు అంటా భర్తే చేసేవాడు అన్నం వండటం అందరికీ వడ్డించటం అన్నీ ఆయన పనులే .ఆయన వడ్డించే తీరు తమాషాగా ఉండేది .’’రెండు పిర్రలమీద బట్ట పైకి లాగి వంగి వడ్డించేవాడు విపరీతంగా నవ్వుకునేవాళ్ళం .నేను ఆయన్ను బాగా ‘’ఇమిటేట్ ‘’చేసేవాడిని మా అక్కయ్యావాళ్ళు అడిగి అడిగి నాతో ఇమిటేట్ చేయించి తెగనవ్వుకునేవారు ఉయ్యూరువచ్చినా అది తప్పలేదు  .గోదావరమ్మ భర్త కంచం ముందు కూర్చుని కనీసం ముప్పావుగంట తినేవాడు ప్రతిమేతుకు నమిలి తినటం ఆయన ప్రత్యేకత ఇదీ మాకు నవ్వు తెప్పించేది .గోదావరమ్మ కూతుళ్ళు మా పెద్దక్కయ్యకు చిన్నక్కయ్యకు క్లాస్ మేట్స్.అందులో  తార అనే అమ్మాయి సునంద అనే అమ్మాయి లతో మా అందరికి మంచి స్నేహితం . సునంద ను మా నాన్న శిష్యుడు మూర్తి పెళ్లి చేసుకుని ఉయ్యూరు పాలిటెక్నిక్ కాలేజి ప్రిన్సిపాలయ్యాడు .తరచుగా మా ఇంటికి వచ్చేవారు ఇద్దరూ .రావుగారి తల్లి కావేరమ్మ శుద్ధ సనాతన పద్ధతిలోఎర్రరంగు బట్టలతో  ఉండేది. తెలుగు అసలు రాదు .వీరి అబ్బాయి బొంబాయి లోనో  ఎక్కడో డాక్టరీ చదివేవాడు .మేము అక్కడినుంచి వచ్చేశాక మునిసిపల్ చైర్మన్ అయ్యాడని విన్నాము .అన్నపూర్ణమ్మ ,గోదావరమ్మ మా ఉయ్యూరు వచ్చి రెండు రోజులు గడిపి వెళ్ళారు .వీళ్ళ ఇంటి ప్రక్కనే నా స్నేహితులు కల్లూరావు ,గుండూ రావు ల రెండు అంతస్తుల భవనం ఉండేది కన్నడం వాళ్ళు .మాకు మంచి స్నేహితులు .వాళ్ళమ్మ గారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసేవారు .గోదావరమ్మగారి పెద్దమ్మాయి అల్లుడు ,మా ఇంటికి ఎడమవైపు చివర ఇంట్లో ఉండేవారు .వీళ్ళ అమ్మాయి  నాగరత్నమ్మ మాకు మంచి దోస్తు .అల్లుడు మామగారింటికి వెళ్ళడు అనుకునేవారు. మా నాన్న శిష్యుడు లెక్కల మేష్టారు రాఘవేంద్ర రావు గారు అని ఇంకొక ఆయన ఉండేవాడు .అయన సైకిల్ మీద స్కూల్ నుంచి వచ్చేసమయానికి మా సందు చివర కాపలాకాసేవాళ్ళం .ఆయన కోటు జేబునిండా చాక్ పీసులు ఉండేవి .జేబులన్నీ తెల్లబడేవి .మాకు కావలసిన చాక్ పీస్ లు ఇచ్చేవారు .ఆయన సైకిల్ దిగితే మళ్ళీ ఎక్కటానికి అరఫర్లాంగు తోసుకుంటూ ఒక్కసారి యెగిరి సీటు మీద కూర్చునేవాడు  . అది చూసి నవ్వుకునేవాళ్ళం .ఆయన అంటే మాకు మహా ఇష్టం .పంచె చోక్కాపై కోటు ఉండేది .మా నాన్న స్కూల్ నుంచి ఒక్క చాక్ పీస్ ముక్క కూడా తెచ్చేవాడు కాదు మేము అడిగి గీపెట్టి గోల చేసినా .

  అప్పుడు ఇళ్ళకు వేరుగా లెట్రిన్ లు ఉండేవికావు .అందరం చెరువు దగ్గరకో ,లేక విష్ణ్వాలయం పోస్టాఫీసు మధ్య వున్నా సందులోనో ‘’కానిచ్చేవాళ్ళం ‘’.ఈ సందులో  వైశ్యస్త్రీలు ‘’అదికానిస్తూ ‘’చెప్పుకునే ముచ్చట్లు అంటే ‘’అల్లుడోచ్చిండు.ఇంతపరమాన్నం సేస్తిని .అంత పులిహోరకలిపితిని ‘’అంటూ మాట్లాడుకునేమాటలు విని మా క్కయ్యావాళ్ళు మాకు చెబితే పగలబడి నవ్వేవాళ్ళం .

 మా చిన్నక్కయ్య స్నేహితురాళ్ళు రెండుమూడు బజారుల అవతల ఉండేవాళ్ళు. అందులో  కొందరు కన్నడం వాళ్ళు కొందరు తెలుగు వాళ్ళు .వీళ్ళు పాటలు నేర్చుకుంటూ పాడుతూ చిన్నచిన్న నాటికలు వేస్తూ ఉండేవాళ్ళు .మేము వెళ్లి చూసేవాళ్ళం.మా నాన్న తో పని చేసే డ్రాయింగ్ మాస్టారు హిందూపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అంటే దాదాపు మునిసిపల్ హై స్కూల్ దగ్గర ఉండేవారు .నెలకొకసారి అందరం వాళ్ళింటికి వెళ్లి భోజనం చేసి వచ్చెవాళ్ళం .అక్కడ వాతావరణం చాలాబాగా ఉండేది . భార్య కూడా చాల మర్యాదగా ఆప్యాయంగా మమ్మల్ని చూసేది .అలాగే సుబ్బరామయ్య అనే పురోహితుడి కూతురు కూడా మా అక్కయ్య క్లాస్ మేట్.తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం .కొబ్బరి చిప్పలు ఇచ్చెవారు .కాశీనాద్ అనే డాక్టర్ మా ఇంటి డాక్టర్ .ఏ జబ్బు చేసినా ఆయన దగ్గరకే వెళ్ళేవాళ్ళం .ఎర్రరంగు నీళ్ళు అప్పుడు ఔషధం .ఏ డాక్టర్ అయినా అదే ఇచ్చేవాడు .

  మా ఇంటికి దగ్గరలో శివాలయం  విష్ణ్వాలయం దక్షిణామూర్తి గుడి ,కన్యకాపరమేశ్వరి దేవాలయం ఉన్నాయి .తరచూ వెళ్ళేవాళ్ళం సాయంత్రం ప్రసాదాలు పెట్టేవారు .ధనుర్మాసం లో ఉదయమే మా అమ్మతో కలిసి శివాలయానికి వెళ్లి దర్శనం చేసి ప్రసాదాలు తినేవాళ్ళం .హిందూపురం వైశ్యులు గొప్ప వితరణ శీలురు .పురాణాలు హరికధలు చెప్పించి ఘన౦గా సత్కరించి పంపేవారు .కన్యకా పరమేశ్వరి గుడి ఇలాంటివాటికి గోప్పవేదిక .పిల్లలమఱ్ఱి రామదాసు అనే హరి దాసు నెలలతరబడి రామాయణ భారత భాగవాటాలు హరికధ గా చెప్పేవాడు. ఆయనకున్న ఖ్యాతి ఎవరికీ ఉండేదికాదు .ఇలాంటివారి సన్మానానికి మా నాన్న గారిని ఆహ్వానించి ఆయన ఆధ్వర్యం లో జరిపేవారు .విశ్వనాధ ,జమ్మలమడక,జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి వంటివారు మా ఇంటి ఆతిధ్యం పొంది సభలలో సత్కారాలు పొందేవారు .పిల్లలమఱ్ఱి రామదాసుగారికధలకు వేలాది మంది జనం హాజరై తన్మయత్వం తోతెల్లవారుఝాము వరకు  విని తరించటం చూసిన అదృష్టవంతులం మేము .భారత ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారిని నీలం సంజీవరెడ్డి ని బహిరంగ సభలలో చూశాం

  మా ఇంటికి అతి దగ్గరలో కల్లూరి సుబ్బారావు అనే వారు ఉండేవాడు .ఆయన ‘’రాయల కళా సమితి ‘’అనే దానిని స్థాపించి నెలకొకసారి తన ఇంట్లోనే సాహిత్య సభలు జరిపేవాడు .కనీసం పది మందిని కూడా ఎప్పుడూ మేము ఆసభలలో చూడలేదు .డాబూ దర్పం తప్ప సరుకు లేదు అని మాకే తెలిసేది .గుమ్మం మీద రోజూ అటూ ఇటూ పూలు అలంకారంగా పెట్టేవారు భార్యను గుమ్మం దాతనిచ్చేవాడుకాదని గుసగుసలాదేవారు ఒకటి రెండు సార్లు ఆవిడను చూశామేమో గుర్తు .రాయల సమితి అంటే ఒక  అవహేళన గా  ఉండేది మాకు .

  అప్పుడు హిందూపూర్ లో టూరింగ్ టాకీస్ ఒకటి ఉండేది .కొంచెం దూరమే .నడిచి ఇంటిల్లిపాదీ వెళ్లి సినిమా చూసేవాళ్ళం .నేలమీద కూర్చోవటమే .’’సంసారం ‘సినిమా చివరి సినిమాగా గుర్తు .సినిమామారినప్పడల్లా నాలుగు చక్రాల బండికి అటూ ఇటూ పోస్టర్లు అంటించి దప్పులు కొడుతూ ఊరంతా అడ్వర్టైజ్ చేసేవాళ్ళు .ఆ సినీ కధా వివరాలను ఫామ్ప్లేట్లు గా పంచేవారు .వాటిని కలెక్ట్ చేసి దాచుకోవటం మాకు అప్పటిహాబీ .ఎవరి దగ్గర ఎన్ని రకాల వి ఉంటె వాళ్ళది విజయం .ఎప్పుడూ నేనే గెలిచేవాడిని .మా మేడమెట్లు ఎక్కుతుంటే కొంచెం పైన ఒక సొరుగు లాంటిది ఉండేది .అందులో దాచేవాడిని వీటిని .

  కమ్మని పూసలు పేరుకున్న నెయ్యి ,ఎర్రటి గడ్డ పెరుగు తో మా భోజనం మజా మజా .అప్పుడు రేషన్ రోజులు .బియ్యం దొరికేవి కావు .రాగులు కిరోసిన్ లు రేషన్ లో కొద్దిగా ఇచ్చేవారు .అయినా మానాన్న అమ్మా వారానికి నలుగురైదుగురు విద్యార్ధులకు వారాలు ఇచ్చేవారు .వాళ్ళూ మాతోపాటే రాగిసంకటి రాగిపిండి తినేవాళ్ళు .మామ్మ ,అమ్మ సంకటిలోకి భలేకమ్మగా ఉండే సాంబారు లాంటిది చేసేవారు .సంకటిలో దాన్ని నంజుకు తింటే’’స్వర్గానికి బెత్తెడు ‘’లో ఉన్నట్లు ఉండేది. రాగిపిండి బెల్లంకలుపుకు తింటే అదరహా యే.వీలున్నప్పుడు మా మామయ్య గంగయ్యగారు  ఉయ్యూరునుంచి బియ్యం మరపట్టించి పర్మిషన్లు పొంది గూడ్సులో హిందూపూర్ పంపేవాడు .

  ఇక్కడ పండగలు ఎలా చేసుకోనేవాల్లమో పెద్దగా గుర్తులేదు. కాని దసరా మాత్రం మహా వైభవం గా జరిపేవారు .విజయదశమి నాడు ‘’జంబూ సవారీ ‘’అని నిర్వహించేవారు అంటే ఆ రోజు అందరూ  ఊరి పొలిమేరలు దాటి అంటే సీమోల్లంఘనం చేయాలన్నమాట .ఆ రోజు బస్సులన్నీ ఫ్రీగా జనాలను ఎక్కించుకుని తిప్పేవారు .మాకు అయిదు కిలో మీటర్ల దూరం లోబె౦గుళూరు వెళ్ళేదారిలో   ‘’సూగూరు ‘’అనే చోట ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది .పిల్లలం అందరం సాయంత్రం  నా ముఠాతో సహా బస్సుఎక్కి అక్కడికి వెళ్లి స్వామి దర్శనం చేసి తిరిగి వచ్చేవాళ్ళం ,ఇదొక గొప్ప అనుభూతి గా మిగిలింది మా అందరికి .గుడి చిన్నదేకాని ఖ్యాతిమాత్రం ఘనంగా ఉండేది .మా నాన్న శిష్యుడు ఒక సాహేబు గారికి గుర్రపు బండీ ఉండేది .ఆయనకు ఒక కాలు కుంటిఅని గుర్తు గడ్డం తో గల్లలుంగీ చొక్కాతో ఉండేవాడు .మేము ఎక్కడికి వెళ్ళాల్సివచ్చినా ఆయన బండీలోనే వెళ్ళేవాళ్ళం .ఒక్కోసారి నేనూ మా తమ్ముడు అక్కయ్యా ఆటపట్టిన్చేవాళ్ళం .గుర్రబ్బండ్లు లాంతరు  స్థంభం సెంటర్ లో ఉండేవి .పెద్ద దూరమేమీ కాదు .మేము నడిచి వెళ్లి అక్కడున్న మసీదులో జరిగే ప్రార్ధన చూసి ,ఆ సాయిబు గారిని ‘’మా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలట బండీ కట్టించుకు రమ్మన్నారు ‘’అని చెప్పేవాళ్ళం .అతను నమ్మి మమ్మల్ని ఎక్కించుకుని ఇంటిదాకా తీసుకోచ్చేవాడు .మేము దిగి సందులోనుంచి ఇంట్లోకి జారుకోనేవాళ్ళం .అతడు చూసి చూసి విసుగెత్తి వెళ్ళిపోయేవాడు లేక ఇంటికి వచ్చి అసలు విషయం తెలిసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు .ఇదో బాల్య చేస్ట మాకు .ఇందులో మా అక్కయ్యకూడా మాకు గొప్ప సపోర్టు .మా ఇంటికి కుడివైపు అరవవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వలేక చచ్చిపోయేవాళ్ళం .మా ఇంటికి ఎడమవైపు పాకలో చాకలి కుటుంబం ఉండేది .ఇంటాయన తెగతాగి తెల్లార్లూ గొడవ చేసేవాడు .

  మా ఇంటి దగ్గర రామమందిరం , దానికి దగ్గరలో ఒక ఠాణా ఉండేది .వీధి దీపాలు ఆరిపోతే మేము అక్కడ బయట ఉండే బండ రాళ్ళ చేరి రామనామం జపించేవాళ్ళం కరెంటు వచ్చేదాకా .ఇంట్లో కరెంట్ ఉండేదికాదు ,లాంతరు దీపాలు, గుడ్డిదీపాలే .

  మేమున్న రోజుల్లో మండ్రగబ్బలు విపరీతంగా ఉండేవి ప్రతి ఇంట్లోనూ .వాటిని చూసి మా అక్కయ్య తెగభయపడేది .నాకు అవి ‘’కేరేఝాట్ ‘’.జాగ్రత్తగా వాటి కొండికి తాడుకట్టి బయటికి తెచ్చి కరెంట్ స్తంభానికి కట్టేసి రోకలి బండతో చంపేసేవాడిని .అందుకని ఎవరింట్లో మండ్రగబ్బ కనిపించినా నన్నే పిలిచేవారు .వాటి పనిపట్టటం నాపని ,ఒకరోజు ఇలా 50 కి పైగా మండ్ర గబ్బలను  చంపి’’ మండ్రగబ్బ వీరుడు’’ అనిపించుకున్నాను .

  అప్పుడే ఊరంతా ప్లేగు వ్యాధి చాలా విజ్రుమ్భించింది .చాలామంది చనిపోయారు మున్సిపాలిటీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది .ఇల్లు అంతా మూసేసి ఒక చిన్న రంధ్రం ద్వారా ఎలుకలను చంపే మందు పంపేవారు .దాని ప్రభావానికి అవి నిమిషాలమీద చచ్చిపోయేవి .మున్సిపాలితీవాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు .ఆ వాసన భరించరానిదిగా ఉండేది .ఇలా ఎన్నో అనుభవాలు ఆనాడు .

  హిందూపురం లో ఉండగా లేపాక్షి ,విదురాశ్వత్దం  హోస్పేట ,హంపీ విజయనగరం చూశాం .

 మేము హిందూపూర్ లో ఉండగా మా మేనమామ వాళ్ళమ్మాయి రాజ్య లక్ష్మితో ఇక్కడికి వచ్చాడు .రాజ్యాన్ని మేము ‘’దాచ్చి ‘’అనేవాళ్ళం .కొంచెం అమాయకం గా ఉండేది .మా మామయ్య మమ్మల్ని బెంగుళూరు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. అప్పుడు రిజర్వేషన్ లు లేవు కదా .అందుకని ఉదయం హిందూపూర్ నుంచి బయల్దేరే పాసింజర్ ఎక్కి వెళ్ళాలి .మేము అంటే నేను మా చిన్నక్కయ్య ,రాజ్యం మామామయ్య తెల్లవారుజ్హామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాలినడకన స్టేషన్ కు బయల్దేరాం .మరచేమ్బులనిండా తాగటానికి నీళ్ళు చిన్న చేతి సంచుల్లో మగపిల్లలం  తోకల పోట్టిలాగు ,పోట్టిచోక్కా ఆడపిల్లలు లంగా జాకెట్లు ఇదే మా సామాను . స్టేషన్ చేరే లోపు మా మామయ్యకు ‘’పాసనాలు ‘’.దాదాపు పది సార్లు వెళ్లి ఉంటాడు. నీరసపడి పోయాడు .మందూ గట్రా ఏమీ లేదు .ఆయన ‘’దానికోసం ‘’వెళ్ళటం ,మేము కడుపుబ్బానవ్వుకోటం.ఈ సంఘటన చాలా ఏళ్ళు చెప్పుకుని చెప్పుకుని తెగ నవ్వుకునేవాళ్ళం .మా మామయ్యకూ చెప్పి నవ్వి౦చేవాళ్ళం నేనూ మా అక్కయ్య. రాజ్యం పాపం ఏడవలేక నవ్వేదిమాతోపాటు .అదోరకం చిలిపి తనం .

  చివరికి బెంగుళూరు చేరాం .మిట్టమధ్యాహ్నమయింది .శృంగేరి శంకర మరానికి మమ్మల్ని నడిపించుకొని తీసుకు వెళ్ళాడు. అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే భోజనాలు పెడతారని ఆయన నమ్మకం .తీరా అక్కడిని వెడితే వాళ్ళెవరూ ఈయనమాట వినలేదు పట్టించుకోలేదు లేక అప్పటికే సమయం దాటిందో గుర్తులేదు  .ఖాళీకడుపుతో రోడ్లన్నీ తిరిగి ఎక్కడోహోటల్ లో ఇన్ని ఇడ్లీలు మింగి సాంబారు తాగి కడుపు నింపుకుని సాయంత్రం రైల్ లో జైపరమేశ్వారా అంటూ కొంపకు బయల్దేరి వచ్చాం .ఇదొక చిరస్మరణీయమైన సంఘటన మా చిన్నతనం లో.  .

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.