మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -3
హాస్పేట జ్ఞాపకాలు
ఏ సంవత్సరమో కరెక్ట్ గా చెప్పలేనుకానీ మేమందరం మా అన్నయ్య శర్మ స్టేషన్ మాస్టర్ గా పనిచేసిన హాస్పేట్ కు వెళ్లాం .రైల్వే క్వార్టర్స్ లోనో లేక విడిగా ఇల్లు తీసుకునో అన్నయ్య వదినలు ఉన్నారు .మేము సుమారు నెలరోజులున్నట్లు గుర్తు బహుశా వేసవి సెలవలు అయి ఉంటాయి .అక్కడ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి అదే మేము మొదట చూసిన పెద్ద నిర్మాణాలు ఆశ్చర్యం లో మునిగి పోయే వాళ్ళం .నేను మా అక్కయ్యావాళ్ళతో ‘’నేను అప్పనకొందమామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని 10 అనట్స్తుల భవనం కడతాను ‘’అని గప్పాలు కొట్టేవాడిని మా అక్కయ్యలిద్దరూ పగలబడి నవ్వేవాళ్ళు .మా చిన్నక్కయ్య ఎప్పుడూ ఈ మాట గుర్తు చేసి నన్ను ఉడికించేది .మా అన్నయ్యకు అరగంట కొకసారి కాఫీ తాగే అలవాటు ఉండేది .మేమూ తాగేవాళ్ళం .స్టేషన్ కు తీసుకు వెళ్లి అన్నీ వివరంగా మాకూ మా అక్కయ్యా వాళ్ళకూ చూపించేవాడు .నల్లటి పొడుగాటి మనిషి కోటేరు తీసినట్లుండే ముక్కు ,స్టేషన్ మాస్టర్ తెల్లని యూనిఫాం లో అన్నయ్య బహు అందంగా ఉండేవాడు .మమ్మల్ని చాలా ప్రేమించేవాడు మా చిన్నక్కయ్యను మా నాన్న ‘’బజ్జమ్మా ‘’అని మిగిలినవాళ్ళు బజ్జీ అని పిలవటం పరిపాటి .మేమూ బజ్జక్కా అనేవాళ్ళం .కోపం వచ్చేదికాదు .మానాన్న మరీ మురిపెంగా ‘’చెల్లాయమ్మా ‘’లేక చెల్లాయ్ అని తరచూ పిలిచేవాడు ఆయనకు అక్కా చెల్లెళ్ళు లేని లోటును ఈ సంబోధనతో తీర్చుకునేవాడేమో .మా పెద్దక్కయ్య లోపాముద్రను ‘’పాప ‘’అనే పిలిచేవాడు దాదాపు అందరూ అలానే పిలవటం గుర్తు .మేముమాత్రం అక్కయ్యా అనే వాళ్ళం !.వంట మా మామ్మ అమ్మ చేసేవాళ్ళు .భోజనాల సమయం లో మా మామ్మ చేసిన వంటకు అనేక వంకలు పెట్టేవాడునాన్న .దానికి మేమూ తందానా తాన అనేవాళ్ళం .ఆవిడ ఏమీ అనుకునేదికాదు. ముసిముసినవ్వులు నవ్వేది అంతే.మా అక్కయ్యలకు మా నాయనమ్మ నాగమ్మగారు జడలు వేసేది .అన్నం సరిగ్గా ఉడక్క పొతే సబ్బు బిళ్ళల్లా అన్నం ఉంటె నాన్న ‘’పచామ్యన్నం చతుర్విధం ‘’అని చమత్కరించేవాడు .చారుపెడితే ‘’ఏడిచారా ‘?అనేవాడు .మామామ్మ పులుసు అని సరిగ్గా పలకగాలిగేది కాదు .’’పుస్సు ‘’అనేది .మాకు తెగనవ్వు వచ్చేది .నాన్న ‘’అమ్మా !ఇవాళ చారా పుస్సా ‘’అని అడిగేవాడు మళ్ళీ పగలబడి నవ్వు .భోజనాలు అంత సందడిగా ఉండేవి .ఇదంతా రాత్రి వేళ.పగలు ఎవరి హడావిడి వాళ్ళది .ఇంత చద్దన్నం మెక్కి వెళ్ళటమే కదా .హిందూపూర్ లోనూ ఇదే తంతు .ఉయ్యూరులోనూ ఇంతే మార్పు లేదు .అన్నయ్య మమ్మల్ని సిని మాలకు తీసుకువెళ్ళి చూపించేవాడు .ఏయే సినిమాలో గుర్తులేదు .మా అమ్మ హోళిగలు బేడల చారు (పప్పు చారు )బాగా చేసేది .వంకాయలతో ‘’వాంగీ బాత్ ‘’చేస్తే రొట్ట లేస్తూ తినేవాళ్ళం .మా అమ్మ వీటిలో ఎక్స్పర్ట్ .
తర్వాత అందరం హంపీ విజయనగరం చూశాం బహుశా ఇది రెండవసారి అనుకుంటా .తర్వాత ఎప్పుడో మాబామ్మర్ది ఆనంద్ కర్నూలు దగ్గరలో లో పనిచేస్తుండగా అందరం వెళ్లి చూశాం మూడోసారి . పెద్దగా స్నేహితులింటికి వెళ్ళడాలు లేవు .ఎక్కువభాగం ఇంట్లోనే .అన్నయ్య ఇంగ్లీష్ లో చాలానిధి. ధారాళంగా మాట్లాడేవాడు .ఎన్నో ఇంగ్లిష్ నవలలు పుస్తకాలు ఉండేవి .అప్పుడు వాటిని తిరగేయట మే తప్ప చదవటం రాదు .ముఖ్యంగా అన్నయ్యకు మాక్సిం గోర్కీఅంటే మహా ఇష్టం అనుకుంటా ఆయన జీవితచరిత్ర ,కధలు నవలలు చాలా ఉండేవి బీరువాలో. అన్నయ్య 1958 లో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో చనిపోయినప్పుడు ఇవన్నీ ఉయ్యూరు వచ్చాయి .అప్పుడు,తర్వాత కొన్ని చదవగలిగాను . ఇవన్నీ 1950 లోపే జరిగినట్లు గుర్తు .అంటే నాకు 10 సంవత్సరాల వయసులోపు జరిగినవి .1950 లో మానాన్నసర్వీస్ తో సహా హిందూపూర్ నుంచి క్రష్ణాజిల్లాబోర్డ్ కు ట్రాన్స్ ఫర్ అయి , జగ్గయ్యపేట హైస్కూల్ లో సీనియర్ తెలుగుపండిట్ గా అపాయింట్ అయి చేరారు .ఏడాదో రెండేళ్లోపనిచేసి ఉయ్యూరు హై స్కూల్ కు బదిలీ అయి ఇక్కడే రిటైరయ్యారు .అప్పుడు నేను 8 ,మాతమ్ముడు ఏడు ,మా చిన్నక్కయ్య 9 వతరగతి లో చేరి చదివాం .ఆ విశేషాలు తర్వాత .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్