మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4

ఉయ్యూరు జ్ఞాపకాలు

1950లో మా కుటుంబం హిందూపూర్ నుంచి ఉయ్యూరు వచ్చేసింది .మేము బోర్డ్ హైస్కూల్ లో చేరాం. రోజూ ఇంటినుంచి మా అక్కయ్య ,మేమిద్దరం నా ముఠాఅంటే సూరి నరసింహం ,పెద్దిభొట్ల ఆదినారాయణ ,మామిళ్ళపల్లి సత్యనారాయణ ,కలిసి సీతంరాజు వారింటి ముందునుంచి మామయ్యగారి మామిడి తోట దాటి ప్రక్కనే ఉన్న హైస్కూల్ చేరేవాళ్ళం .ఇక్కడే రాయప్రోలు కొదందరామయ్యగారి 5 ఎకరాల దట్టమైన బంగినిపల్లి మామిడి తోట ఉండేది .మధ్యాహ్నం అలాగే ఇంటికి వచ్చి బట్టలు విప్పేసి బయట పారేసి బొందులాగూ లేక తువ్వాల కట్టుకుని అన్నం తిని మళ్ళీ బయల్దేరే వాళ్ళం .బడి బట్టలతో ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు .తప్పనిసరిగా బట్టలు మార్చాల్సిందే ఆడ అయినా మగ అయినా .మా అక్కయ్య స్నేహితురాళ్ళు సూరి మంగమ్మగారబ్బాయి శ్రీరామ మూర్తి కూతురు కమల ,హెడ్ కర్ణం ఆదిరాజు నరసింహారావు గారమ్మాయి సుందరి ,మాఅమ్మ బెస్ట్ ఫ్రెండ్ శ్రీమతి చోడవరపు  అమ్మన్న ,మానాన్న బెస్ట్ ఫ్రెండ్ చంద్రశేఖరరావు దంపతుల  కూతురు తేజ ,బట్టల షాపు యజమాని నెప్పల్లి మల్లికార్జునరావు గారమ్మాయి ,ఆదిరాజు చంద్ర మౌళీశ్వరరావు గారమ్మాయి అని గుర్తు .ఆదివారాలలో వీళ్ళందరూ కలిసి ఆడుకునేవారు .మా అక్కయ్యలిద్దరూ ప్రముఖ సంగీత విద్వాంసుడు గరికపాటి కోటయ్య దేవర గారమ్మాయి వద్ద సంగీతం నేర్చుకునేవారు .స్వరాలు సరళీస్వరాలు జంటస్వరాలు అయ్యాక ‘’లంబోదర లకు మికరా –అంబా సుత అమర వినుత ‘’కృతి నేర్పేవారు. వినటం వలన మాకూ నోటికి వచ్చేసేవి .సంగీతం క్లాసులు సాయంకాలం 5 తర్వాతే .

వేసవిలో ఊరగాయలు వేయటం మామిడి కాయ ముక్కలు తరగటం లో మా అక్కయ్యలు బాగా సహకరించేవాళ్ళు మా అమ్మకు. నేను కాయలు తుడిచి దబ్బనం తో జీడి తీసేవాడిని తర్వాత ముక్కలు తరగటమూ అలవాటైంది .కాయలన్నీ మా మామయ్యగారి తోటలోనివే పాలేళ్ళతో కోయించి ఇంటికి పంపేవాడుమామయ్య .అదొక యజ్ఞం గా జరిగేది .వాళ్ళపాలేళ్ళు తాటి చెట్ల నుండి తాటి గెలలు దించి ,’’జల్లాబండీ ‘’లో తోలుకు వచ్చి వాళ్ళ దొడ్లో పడేసి పాలేళ్ళు పదునైన కొడవలితోచుట్టూ కోసి  ముంజెలు తీసి  మాకు ఇస్తే మహా కమ్మగా జుర్రేవాళ్ళం .సీమచింతకాయలు తినేవాళ్ళం కొనే వాల్లంకాడు .మా దొడ్లోను మా పెరడు వెనకున్న ‘’చామలి ‘’లోనూ ఉన్న ఈత చెట్ల నుండి పండిన ఈత  గెలలు మా స్నేహితులే కోసుకొస్తే అందరం తినేవాళ్ళం మహా రుచిగా ఉండేవి .అందులోని గింజను ఉమ్మేయటం ఒక కళ.తాటిము౦జెలు తిని  అరగటానికి మామిడి ముక్కలు లేక ఆవకాయ తినే వాళ్ళం .పోటీలు పడి తినేవాళ్ళం ఆడా మగా అందరం .

డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో రేగిపళ్ళు అమ్మవచ్చేవి. బుట్టల్లో పెట్టుకుని స్త్రీలు ఇళ్ళకు తీసుకోచి అమ్మేవారు .డబ్బులిచ్చి కొనటాలు లేవు .వడ్లు పోసి కొనటమే .రెండు గిద్దల  వడ్లకు  ఒక గిద్ద రేగిపళ్ళు ఇచ్చేవారు లేక బియ్యానికైతే సరికి సరి. బియ్యంతో కొనటానికి పెద్ద వాళ్ళు ఒప్పుకునేవారు కాదు .మా అక్కయ్య లిద్దరికీ రేగి పళ్ళు మహా ప్రాణం .వాకిట్లోకి వస్తే కొనకుండా వదిలే వారు కాదు .అంతమోజు .ఇక మామిడిపళ్ళు చెప్పక్కర్లేదు .మా ఇళ్ళ చుట్టూ మామిడిపళ్ళ ‘’కావ’’ లుండేవి .తాటాకు బుట్టలతో కొనుక్కోచ్చేవాళ్ళం. హిందూపూర్ నుంచి వచ్చిన కొత్తలో మా మామయ్యే మాకు కొనిపెట్టేవాడు .తర్వాత మేము’’ ముదిరి ‘’మేమే కొనేవాళ్ళం .స్కూలు పుస్తకాలకు అక్కయ్యలె చక్కగా అట్టలు వేసే వాళ్ళు  .అదీ ఒక కళగానే అనిపించేది నాకు .ఇప్పటికీ అట్ట వేయటం రాదు .స్కూల్ బుక్స్ అన్నీ మామయ్య దగ్గరుండి కొనిపించేవాడు .ఒక నియోగి బ్రాహ్మలాయన సెంటర్ లో ఫాన్సీ షాప్ పెట్టాడు అక్కడే కొనే వాళ్ళం అప్పుడు .

దీపావళి కి నెల రోజుల ముందు నుంచి హడావిడి .మామామయ్య మాకు మతాబాలు తయారు చేయటం నేర్పాడు మా అక్కయ్యలిద్దరూ మతాబ గొట్టాలు తయారు చేయటం లో ఎక్స్పర్ట్ లు .సురేకారం గంధకం సున్నం ఆముదం సరైనపాళ్ళ లో కలిపించేవాడు .అడుగున కొద్దిగా ఇసుకపోసి మందు దట్టించి కూరేవాళ్ళం .బాగా ఎండ బెట్టేవాళ్ళం .దీపావళికి భలే తేజస్సుతో కాలేవి .నెల రోజులు ముందునుంచే’’ రోలు- రోకలి ‘’కొని తాళ్ళుకట్టి టపాసు మందు ఒక సీసాలో పోసుకుని ,తాటాకు ముక్కతో రోట్లో వేసుకుని రోకలి బిగించి గట్టి రాయి కేసి రోకలి తగిలేట్లు కొడితే గుండెలు పగిలే శబ్దం వచ్చేది .భలే సరదా .అలాగే సంక్రాంతికి ముందు ఇంటి వాకిట్లో దొడ్లో గొబ్బెమ్మలు వాటికి అలంకారాలు గొబ్బిపాటలతో మా అక్కయ్యలు హోరేత్తించేవారు ..మేళగాళ్ళు వాయిద్యాలు ఊదుకుంటూ జోలె పుచ్చుకుని ఇళ్ళకు వస్తే పాలేల్లతో వడ్లకోట్లోనుంచి ముందే తీయించి ఉంచిన వడ్లబస్తాలోని వడ్లను మా అక్కయ్యలు చేటల్లోకి బియ్యపు డబ్బాతో పోసి రెడీ చేస్తే వచ్చిన వాళ్ళందరికీ విసుగు లేకుండా పెట్టేవాళ్ళం .ఇంటి మంగలికి మరికాస్త ఎక్కువ పెట్టేవాళ్ళం .చాకళ్ళకు మామూళ్ళు ,తిరునాలకు మామూలు,ఏరువాక పౌర్నమి మామూళ్ళు,దసరామామూళ్ళు పశువులాసుపత్రి వాళ్ళ ,పోస్ట్ మాన్ల మామూళ్ళు ఇవ్వటం లో ఎంతో తృప్తి ఉండేది .

మా నాన్న ను ఎంతో బతిమిలాడితే తప్ప సినిమాకు తీసుకు వెళ్ళేవాడుకాడు .మా చిన్నక్కయ్య అడిగితెనో లేక మా తమ్ముడు అడిగితెనో లేకపోతె మా మామయ్య కూతురు ‘’మామయ్యా సినిమా ‘’అని పీడిస్తేనో సినిమాకు తీసుకు వెళ్ళేవాడు .రామినేని బుచ్చిబాబు వాళ్ళ ఒకే ఒక హాలు ఉండేది .దేవదాసు మల్లీశ్వరి ,పెళ్లి చేసి చూడు చూశాము .ఒకసారిమమ్మల్ని అందరిని బెజవాడ దుర్గా కళామందిరం లో ఆడుతున్న ‘’అప్పుచేసి పప్పు కూడు ‘’సినిమాకు తీసుకు  వెళ్ళిన జ్ఞాపకం.

చిన్నక్కయ్య వివాహం

తేలప్రోలుదగ్గర చిరివాడ అగ్రహారం లో శతావధాని వేలూరి శివరామ శాస్స్త్రి గారు ఉండేవారు .ఆయన తమ్ముడే వేలూరి కృష్ణ మూర్తి గారు .వీళ్ళకు రైస్ మిల్ ఉండేది. మిల్లు కృష్ణమూర్తి గారు అనే వారు ఆయన్ను .ఆయన రెండవ కుమారుడే మా బావ వివేకానందం గారు .అప్పుడాయన ఉయ్యూరు పాలిటెక్నిక్ లో ఎల్. సి .ఇ .చదివేవాడు .కొంతకాలం కంసాలి బజార్లో ,తర్వాత మా ఇంటి సందుకు ఎదురుగా ఉన్న వంగల వెంకాయమ్మగారింట్లో రూమ్ లో అద్దెకు ఉండేవాడు .స్వయంగా వంట చేసుకునేవాడు .మా అమ్మ మేనమామల ఊరుకూడా చిరివాడ కావటం తో కొంత బంధుత్వం ఉంది .తరచుగా మా ఇంటికి వచ్చి కబుర్లు చెప్పేవాడు సినిమా లు చూసి కధలు వినిపించేవాడు .ముఖ్యంగా హిందీ సినిమాలు మా అక్కయ్య లిద్దరికీ బాగా నచ్చేవి. వాటి కదలు పూస గుచ్చినట్లు చెప్పేవాడు .రాత్రి పడి గంటలదాకా ఆయనతో మాకు కాలక్షేపం .చాలా మంచి వాడు .మా అక్కయ్యకు మనసులో ఆయన బాగా నచ్చినట్లున్నాడు .ఆయనకూ మా చిన్నక్కయ్య బాగా నచ్చింది .ఈ విషయం తెలిసి అటూ ఇటూ పెద్దవాళ్ళు కూర్చుని సంబంధం ఖాయం చేసి వాళ్ళ తలిదండ్రులను పిలిపించి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ,1956 లో మాఘ శుద్ధ ఏకాదశినాడు ఉదయం పూట వివాహం జరిపించారు .చిరివాడ నుండి ఆయన బంధుగణం అంతా రెండెడ్ల బళ్ళలో ఉయ్యూరు చేరారు .విడిది కొలచల శ్రీరామమూర్తి మామయ్య ఇంట్లో .మామేనమామ అన్నీ దగ్గరుండి చూసి వివాహం వైభవోపేతంగా జరిపించారు .వంగల సుబ్బావధానులు అనే మా నాన్న శిష్యుడే మా ఇంటి పురోహితుడు .ఆయనే బ్రహ్మగారు. ఆ పెళ్లినాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను సారధి స్టూడియో అధినేత మోహన్ తీశాడు .దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు మా అక్కయ్య బావా దంపతులు .మూడు నిద్రలకు చిరివాడ వెళ్ళటం ,చిరివాడ అడ్డరోడ్డు దగ్గర ఉయ్యూరు –తేలప్రోలు బస్సు దిగటం అక్కడినుండి వాళ్ళ ఒంటేద్దుబండీలో వాళ్ళ ఇంటికి చేరటం మాకు అలవాటైంది .లేకపోతె అడ్డరోడ్డుననుండి లెఫ్ట్ అండ్ రైట్ . .వాళ్ళబండీ తోలేవాడిపేరు ‘’గడ్డెన్న’’మన సినిమా’’ బొడ్డపాటి’’కి అన్నలా ఉండే వాడు  నోట్లో పొగాకు చుట్ట బానపొట్ట తలపాగా పొట్టి మనిషి తూర్పు యాస .మందు ఎక్కితెకాని బండీ తోలేవాడుకాడు .ఒకసారి మండీలో మమ్మల్ని తీసుకొస్తూ పంటకాలువలోకి దించాడు .అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు .

చిరివాడ లో మా బావా వాళ్లకు ఇంటి వెనుక ప్రత్యేకమైన మంచినీటి చెరువు ,దానిపైనా ఇంటి చుటూ వెదురు పొదలు ,బండీ ఎడ్లు వ్యవసాయం  నౌకర్లు చాకర్లు బాగా ఉండేవారు .మాబావగారి తల్లిగారు  కాంతమ్మగారు పొట్టి మనిషి .రూపాయ బిళ్ళ అంత కుంకుమ బొట్టుతో లక్ష్మీ దేవిలా ఉండేది .తండ్రి పొడుగ్గా ఎర్రగా సన్నగా ఉండేవారు మంచి సంస్కారి.అన్ని విషయాలూ తెలుసు .వాళ్ళింట్లో హెచ్ ఏం వి గ్రామఫోన్ ఉండేది .గ్రామఫోన్ రికార్డ్ లు వినేవాళ్ళం వెళ్ళినప్పుడల్లా .కృష్ణ శాస్స్త్రి గారి పాటలు ,’’అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే ‘’అనే మోహన్ కందా పాడిన సినిమాపాట చెంచీత పాటలు మాకు ఎంతో ఇష్టం .

మా బావ చెల్లెలు శాంతమ్మగారి పెళ్ళికీ వచ్చిన గుర్తు .ఆవిడను తరచూ తేలప్రోలు స్టేషన్ లో గుంటూరు ట్రయిన్ ఎక్కించి వచ్చేవాళ్ళం .అన్నగారు ముకు౦ద౦ గారు రైస్ మిల్ బాధ్యత వహించేవారు .భార్య కూడా ఇక్కడే ఉండేది .చిరివాడ ఇల్లు రుషి ఆశ్రమ లాగా చాలా ప్రశాంతంగా ఉండేది .అత్తమ్మగారి ఫిల్టర్ కాఫీ రుచి ఇంకెక్కడా మళ్ళీ చూడలేదు .ఆవిడ వంటా బాగుండేది .చారులో బెల్లం బాగా వేసేది .మా ఇంట్లో చారు తియ్యగా ఉంటె మేము ‘’చారు చిరివాడ వెళ్లి వచ్చినట్లుంది ‘’అని యెగతాళి చేసేవాళ్ళం .

మా అక్కయ్యలు మంగళ గౌరీ నోములు నోచేవాళ్ళు .అప్పుడు పుల్లేరు కాలవదగ్గర చెరుకుపల్లి శాస్త్రి గారింట్లోనే అందరూ వెళ్లి నోచుకునేవారు . తర్వాత కోట క్రష్ణమూర్తిగారింట్లో .చివరి రోజు అమ్మవారిని కాలవ లో ‘’వాలలాడింపు ‘’ . నోచుకున్నవారందరూ సామూహిక భోజనాలు చాలా హడా విడిగా ఉండేది .చెరుకుపల్లి వారింట్లో మా మామయ్యగారింట్లో నృసింహ జయంతికి అందరం వెళ్ళేవాళ్ళం. శాస్స్త్రి గారింట్లో ఊర్లో బ్రాహ్మలందరికీ భోజనాలు ఉండేవి మర్నాడు ,మామిడిపళ్ళు వేసేవారు .తాటాకు విసినకర్ర పానకం వడపప్పు ప్రత్యేకం మహా రుచిగా శుచిగా వంట ఉండేది .పూర్ణం బూరలు తప్పని సరి. అందరినీ ఆప్యాయంగా ఆదరించి భోజనం పెట్టేవారు శాస్స్త్రిగారు భార్య అన్నపూర్ణమ్మ గారూనూ

మా మేనమామ గంగయ్యగారు ఆయన పినతండ్రి నరసింహం గారు కలిసి ఉయ్యూరు దగ్గరలో ఉన్న కనకవల్లి అగ్రహారం లో శివాలయం కట్టించి శివ లింగ ప్రతిష్ట రంగ రంగ వైభవం గా చేశారు .పదిరోజులు అందరం అక్కడే రెండుపూటలా టిఫిన్లు భోజనాలు. మాకే కాదు కనకవల్లి గ్రామ బ్రాహ్మణులందరికీ .పెద్ద పెళ్లి జరిగినట్లు జరిగింది .వంటబ్రాహ్మణులలో సన్నగా పొడవుగా ఉండే ఆయన వంటలో దిట్ట .మహా రుచికరం గా ప్రతిపదార్ధం ఉండేది .ఈయనే మా చిన్నక్క పెళ్ళికి వంట చేశాడు .మా కుటుంబం అన్ని రోజుల్లో తమలపాకులు వక్కపొడి ఏర్పాటు .మా అక్కయ్యావాళ్ళు కిళ్ళీలు కట్టి ఇచ్చేవారని జ్ఞాపకం .

అలాగే మా మామయ్య కూతురు రాజమ్మ పెళ్లి అయిదురోజులు ఘనంగా చేశారు .నా వడుగు కూడా బాగా జరిగింది .సుబ్బయ్యగారే బ్రహ్మ పసుమర్తి సీతారామయ్య వంట .చాలా బాగా చేశాడు. అప్పుడు శుభాకార్యాలంటే తాటాకు పందిళ్ళు ,అరిటాకు లేక తామరాకు విస్తళ్ళలో భోజనాలు. మూడురోజులు తప్పని పేరంటాలు .వచ్చినవారు 16 రోజుల పండగ దాకా ఉండటాలు ,ఉండకపోతే సోడ్డ్లు వేయటాలు .భోజనాలకు ఎవరు వెళ్ళినా పైన తువ్వాల చేతిలో నీళ్ళ గ్లాసు తో వెళ్ళాల్సిందే .

మల్లె పూలు వేసవిలో బాగా వచ్చేవి మా అక్కయ్యలిద్దరూ చక్కగా దండలు కట్టేవారు .శివాలయం లో నవరాత్రి ఉత్సవాలు,విష్ణ్వాలయం లో వైశాఖపౌర్ణమి కళ్యాణాలు మర్చిపోలేము .అలాగే ధనుర్మాసం లో పందిళ్ళ కింద  హరికధలు అర్ధ రాత్రి దాకా అక్కయ్యలతోకలిసి చూడటాలు ఇప్పటికీ గుర్తే .అత్తరు సాహెబ్ దగ్గర కళ్ళల్లో ‘’సుర్మా’’ పెట్టి౦చు కోవటం అత్తరు సెంటు కొనటం ఆయన యాసబాస కు నవ్వుకోటం గుర్తుకొస్తున్నాయి .మాకు శ్రీరాములు గారు అనే రిటైర్డ్ టీచర్ ఇంగ్లీష్ ను ఇంటికొచ్చి నేర్పటం ,విష్ణ్వాలయం లో మామయ్య పురాణాలు ,భాగవత సప్తాహాలు ,కాలవ అవతల గాయత్రి అనంతరామయ్యగారి(కేమోటాలజిపిత కోలాచల సీతారామయ్యగారి అన్నగారు ) మామిడి తోటలో కార్తీక వనభోజనాలు ,ఆదంపతులు మా ఇళ్ళకు రావటాలు తో మహా సందడిగా ఆ రోజులు గడిచిపోయాయి సరదాగా .మా చిన్నక్కయ్య కూ నాకూ వయసులో మూడేళ్ళే తేడా అవటం తో అక్కయ్యనాకు స్నేహితురాలుగా అనిపించేది పెళ్లి అయి ఒరిస్సాకు కాపురానికి వెళ్ళే దాకా .అప్పుడు తెలిసింది అక్కయ్య విలువ .అక్కయ్యపై ఆరాధన అప్పటినుంచే బాగా పెరిగింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.