మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం ) ఉత్తరాలకోసం నిరీక్షణ

మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -5 (చివరి భాగం )

              ఉత్తరాలకోసం నిరీక్షణ

 మా బావ వివేకానందం గారిని ఇంట్లో అందరం అదే పేరుతొ పిలిచేవాళ్ళం .పెళ్ళయ్యాక కూడా చాలా రోజులు అలాగే పిలిచి తర్వాత అలా పిలవకూడదని గ్రహించి బావగారూ అనే వాళ్ళం .పాలిటెక్నిక్ పరీక్ష పాస్ అవగానే ఆయనకు వెంటనే ఒరిస్సా లో సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో డ్రాఫ్ట్స్ మన్ ఉద్యోగం వచ్చింది .అక్కను తీసుకుని అక్కడికి వెళ్ళారు .అప్పటిదాకా మా కళ్ళముందు రోజూ కనిపించే అక్కయ్య దూరం అవటం తో మాకు పిచ్చెక్కిపోయేది.ఏమీ తోచేదికాదు. మా అమ్మా నాన్న ల పరిస్థితి మరీ దారుణం .కనుక వాళ్ళనుంచి ఉత్తరాల కోసం రోజూ ఎదురు చూసేవాళ్ళం  .అక్కడ రాసి వేసిన ఉత్తరం ఇక్కడికి చేరటానికి కనీసం వారం రోజులు పట్టేది .రోజూ నేనూ మా తమ్ముడు మా మిత్రులు ఉదయం  స్కూల్ కు వెడుతూ దారిలో ఇప్పుడు డిబి ఆర్ కాంప్లెక్స్ ఉన్న చోట అప్పుడు పెంకుటింట్లో పోస్టాఫీస్ ఉంటె కిటికీ దగ్గర నిలబడి పోస్ట్ మాన్ ‘’షేకాలీ ‘’ని ఉత్తరం వచ్చిందా అని అడిగే వాళ్ళం వస్తే ఇచ్చేవాడు లేకుంటే రాలేదని చెప్పేవాడు. ఆతను మా నాన్న శిష్యుడు అవటం తో మాకు చనువు ఎక్కువ .అతని కిర్రు చెప్పుల చప్పుడు విని పోస్ట్ వచ్చిందని తెలిసేది ఇంట్లో .అప్పుడు అంతా కార్డు మీద రాయటమే .కార్డు అర్ధణా ,కవరు బేడ అని జ్ఞాపకం .ఇన్లాండ్ లెటర్ చాలాకాల్నికి కానీ రాలేదు .అక్కయ్యనుంచి ఉత్తరం రాగానే సరాసరి ఇంటికి వెళ్లి ఇచ్చి బడికి వెళ్ళేవాళ్ళం .

  ఒరిస్సాలోని వాళ్ళున్న చోటుకు వెళ్ళాలంటే బెజవాడ వచ్చి ట్రెయిన్ ఎక్కి వెళ్ళాలి .మొదటి సారి అందరం బెజవాడ వచ్చి ట్రెయిన్ ఎక్కించి అది ఏ తెల్లవారు ఝామునో బయల్దేరే దాకా ప్లాట్ ఫాం పై పడిగాపులు కాచి ,అప్పుడు ఉయ్యూరు చేరేవాళ్ళం. ఇందులో ఎంతో ఆనందం ఉ౦డేది మాకు .ఎప్పుడైనా అరునెలలకోసారి వచ్చేవారేమో .ఒకసారి మా బావ అక్కయ్యలతో ఏలూరు వెళ్లి అక్కడ ఆయన అక్కగారి మరిది జనమంచి కృష్ణ ఇంట్లో దిగి .రాత్రి రెండవ ఆట సినిమాకు రిక్షాలో ‘’జయభేరి ‘’సినిమా చూసి ఇంటికి వచ్చి తెల్లారిన తర్వాత ట్రెయిన్ లో వాళ్ళను ఎక్కించి ఇంటికి వచ్చాను .సినిమాకు వెళ్ళేటప్పుడు ,వచ్చేటప్పుడు రిక్షాలో మా బావ ఒడిలో కూర్చుని వెళ్ళటం బాగా జ్ఞాపకం .అప్పుడు చూసిన జయభేరి ఇంకా గుండెల్లో  భద్రంగా మోగుతూనే ఉంది .అలాగే మరో సారి మాతమ్ముడు వాళ్లిద్దరు కలిసి రామారావు భానుమతి ,జమున నటించిన సినిమా రెండో ఆట చూశాం బెజవాడలో .అందులో భానుమతిపాడిన లాలిపాట బాగా ఉంటుంది .

   మా తమ్ముడి ఉపనయనానికి  వాళ్ళిద్దరూ వచ్చి వాడిని తమతో తీసుకు వెళ్ళారు .1961 నవంబర్ లో మానాన్న చనిపోయినప్పుడు వాళ్ళు బీహార్ లో ఉండేవాళ్ళు .రమ్మని టెలిగ్రాం ఇస్తూ ‘’స్టార్ట్ బై ఎయిర్ ‘’అని రాసినట్లు జ్ఞాపకం .మా నాన్న గారి మరణం మాకు పెద్ద గా బాధ కలిగించింది .అంతకు ముందుమా అన్నగారి మరణం .ఈ రెండూ మా అమ్మ జీర్ణించుకోలేక పోయింది చాలా ఏళ్ళు .బయటికి వచ్చేదేకాదు.మా నాన్నగారి మరణం తర్వాత మా నాయనమ్మ నా చేతుల్లో నే 1966లో  చని పోయింది .సుమారు 90 ఏళ్ళు ఆవిడకు అప్పుడు .పండగలా కర్మకాండ చేశాం .దీనికీ అక్కాబావా వచ్చారు .

                           బందరు జ్ఞాపకాలు

  మా బావ రాష్ట్రానికి చాలా దూరం లో పని చేస్తూ ఉండటం వలన మా బావ తాను ఒక్కడే అక్కడ వండుకు తింటూ ,పిల్లల చదువుకోసం బందరులో బచ్చుపేట లో కాపురం పెట్టించాడు .ప్రముఖ కధారచయిత ఆర్ ఎస్ ఎస్ నాయకుడు ,జాగృతి వారపత్రిక కాలమిస్ట్ హిందూ హై స్కూల్  లేక్కలమేస్టారు శ్రీ రాజనాల శివరామ కృష్ణమూర్తి (ఆర్ ఎస్ కె మూర్తి )గారి దగ్గర పిల్లల ట్యూషన్ .హిందూహైస్కూల్ కాలేజీలలో అశోక్  శాస్త్రి పద్మలు చదివారు .వీలైనప్పుడల్లా మేము బందరు వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చేవాళ్ళం నేను స్పాట్ వాల్యుయేషన్ కు వెడితే అన్ని రోజులూ అక్కడే .వాళ్ళూ పండగలకు ఉయ్యూరు వచ్చేవాళ్ళు ఒకసారి ఫోర్ట్ రోడ్ లో మెహర్ బాబా హాల్ లో మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గానకచేరీ అందరం కలిసి చూశాం . ఇక్కడే రెండు చింతల ఆయన ఇంట్లో కొంతకాలం అద్దేకున్నారు వాళ్ళతో అనుబంధం ఎవరూ మర్చిపోలేం .మరో ఇంట్లో వీళ్ళ ఇంటి సగభాగం లో పమిడిముక్కల నేటివ్  ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ‘’భక్త జయదేవ్ ‘’సినిమా దర్శకుడు పమిడి ముక్కాల రామారావు గారు అద్దెకుండేవారు ఆయనతో నాకు అంతకు ముందే పరిచయం .

ఇలా సవ్యం గా సాగుతున్న మా జీవితాలలో మరో రెండు కుదుపులు కొంత ఇబ్బంది పెట్టాయి .పూనాలో డిఫెన్స్ ఫాక్టరీ లో పని చేస్తున్న మా తమ్ముడు మాకు తెలీకుండా తనతో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు .మా అక్కయ్యా బావలకు ఇది తెలిసింది .మాకు చెప్పలేదు .ఒకసారి ఉత్తరం రాసి విషయం తెలియజేశాడు .మా అమ్మ దీన్ని జీర్ణించుకోలేక పోయింది .ఆవిడను ఆపటం మా వశంకాలేదు .వాడంటే మా అమ్మకు ప్రాణం .మా అక్కయ్యకూ అంతే.చివరికి మ బావ ఉయ్యూరు వచ్చి అందరినీ శాంతపరచి వాళ్ళిద్దరినీ మా ఇంట్లో కి ప్రవేశం కల్పించేట్లు చేశాడు .ఇందులో మా అక్కా బావల ఓర్పు నేర్పు ప్రశంసనీయం .అందరం కలిసి పోయాం .హాయిగా ఉన్నాం .

   బందరులో చదివి డిగ్రీ పాసై న౦బూర్ నాగార్జున యూనివర్సిటి లో లెక్కల ఏం ఏ లో చేరి చదువుతున్న మా మేనల్లుడు  బందరు లో తన స్నేహితుడి అక్కను ప్రేమించి  వాళ్ళ ప్రోద్బలంతో మాకు మా అక్కా బావాలకు తెలియజేయకుండా తిరుపతి లో పెళ్లి చేసుకున్నాడు .మా తమ్ముడి విషయం లో సంయమనం పాటించిన మా అక్క బావ కొడుకు విషయం లో సమాధానం పడక  తెగ తెంపులు చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు .ముందుగా వాళ్ళిద్దర్నీ ఉయ్యూరు రమ్మని చెప్పి వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కొంత ఉపశమనం కలిగించాం  .కలపటమే కాని చీల్చటం  కూల్చటం తెలియని నేను ,రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది .నేనూ నా భార్య ప్రభావతి ముందు గా మా అమ్మను ఒప్పించి నెమ్మదిగా మా అక్కా బావల దగ్గరకు వెళ్లి ప్రత్యక్షంగా మాట్లాడి ఎన్నో సార్ల ప్రయత్నం లో వాళ్ళను కన్విన్స్ చేయగలిగాము  .ససేమిరా అని అగ్గిమీద గుగ్గిలమై పోతున్న మా బావను వెనక తాను మా తమ్ముడి విషయం లో చేసింది గుర్తుకు తెచ్చి ,మా అక్కయ్యనూ శాంతపరచ గలిగాను .అందర్నీ కలిపే బాధ్యత నాపై పెట్టారిద్దరూ .అశోక్ బావమరదులు అత్తా మామలతో మాట్లాడి చీవాట్లు పెట్టి చేసింది తప్పే అని ఒప్పించి ,చెప్పించి రాజీ ప్రయత్నం చేశా .ఒక మంచి రోజు ఆదివారం మా అక్క బావల ఇంట్లోనే అశోక్ భార్య సంధ్య లతో సత్యనారాయణ వ్రతానికి ఏర్పాటు చేయించి , అమ్మాయి తరఫు వాళ్ళనూ  పాల్గోనేట్లు చేసి ఉయ్యూరునుంచి మేమూ వచ్చి పాల్గొని స్వామి సమక్షం లో అందరూకలిసేట్లు చేశాను .దీనికి మా అక్క బావా ఎంతో సంతోషించారు .పిల్లలపై అధిక మమకారం ప్రేమ ఉంటె  మా అమ్మలాగే, మా అక్కా బావ లాగే ఇబ్బంది పడతారని అర్ధమయింది  .ఈ ఒక్కటి తప్ప మా మేనల్లుడు అశోక్ బంగారం .వాడి హృదయం అమృతం .తర్వాత అందరూ హాయిగా కలిసిపోయారు ఏ పొరపొచ్చాలు లేకుండా .

   అశోక్ కి సిద్ధిపేట  స్టేట్ బాంక్ లో ఉద్యోగం రావటం తో చదువు మానేసి కాపురం పెట్టటం ,తలిదండ్రులు అక్కడికి వెళ్ళటం  వాడి మామ్మ తాతయ్యలనూ దగ్గరుండి చూసుకోవటం  వారిద్దరూ మరణిస్తే కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించటం తమ్ముడిని అక్కడే కాలేజి లో చేర్పిచి చదివించి గోప్పబాధ్యత తీసుకుని మా అక్కా బావల మనసు మార్చాడు .మేమూ సిద్ధిపేట వెళ్లి వచ్చేవాళ్ళం .అప్పుడే ఓరుగల్లు కోట చూపించాడు మా మేనల్లుడు శాస్త్రి .అశోక్ ఇంటిదగ్గర ఉదయం సాయంత్రం ఇంటర్ వాళ్లకు లెక్కలు ట్యూషన్ చెప్పేవాడు .కిటకిట లాడేవారు జనం లో మంచి పేరు తెచ్చుకున్నాడు .దీనితో తలిదండ్రులూ పొంగిపోయేవాళ్ళు .

  మా బావ కు హైదరాబాద్ దగ్గర కు ట్రాన్స్ ఫర్ అవటం ,కాకతీయ నగర్ లో కాపురం ,మాతమ్ముడు పూనాలో మానేసి హైదరాబాద్ డిఫెన్స్ లో చేరి కొంతకాలం మా అక్కయ్యా వాళ్ళ ఇంట్లో ఉండటం  మేమూ తరచూ అక్కయ్యా వాళ్ళింటికి వెళ్ళటం జరిగేది .ఎక్కడున్నా అక్కయ్యా వాళ్ళు అంటే మాకు మహా ప్రాణం .శాస్త్రికి ,పద్మకు హైదరాబాద్ సంబంధాలే కుదరటం తో వాళ్ళ కు మరింత ఆనందం కలిగింది .అల్లుడూ కోడలూ కూడా మంచివాళ్ళు అవటం అదృష్టం .శాస్త్రి రిజర్వ్ బాంక్ లో ఉద్యోగం పొంది ,క్వార్టర్స్ లోఅమ్మానాన్న లతో  కాపురం పెట్టి తర్వాత చదువులకు స్నేహితుల ప్రోత్సాహం తో అమెరికా వెళ్లి చదివి ఉద్యోగం సాధించి భార్య విజయలక్ష్మినీ తీసుకుని వెళ్లి ఆమె కూ ఉద్యోగం రాగా హాయిగా కాలం గడుపుతున్నారు .మా బావ అన్నగారు ముకుందం గారబ్బాయి పవన్ ను శాస్త్రి అమెరికా తీసుకువెళ్ళి చదివించి ఉద్యోగం వచ్చేట్లు చేశాడు .

  అశోక్ ఓల్డ్ బోయిన్ పల్లి లో ఇల్లు కట్టుకుని అమ్మా నాన్నలతో సహా అందులోనే ఉన్నాడు .ఇక్కడికీ తరచూ వచ్చేవాళ్ళం .మాబావకు నేనంటే విపరీతమైన మమకారం నా మాటకు విలువ నిచ్చేవారు .తర్వాత శాస్త్రి అన్న ఇంటికి దగ్గరలోనే స్థలం కొని రెండస్తుల బిల్డింగ్ కట్టించి ,తలిదండ్రులకు కన్వీనియెంట్ గా ఉంటుందని అక్కడ ఉంచాడు .అమెరికా వెళ్లి వస్తున్నాడు .కొడుకు ఉపనయనం ఇక్కడే చేశాడు .అశోక్ కూతురి పెళ్లి, కొడుకు పెళ్లి చేశాడు వీళ్ళకూ హైదరాబాద్ సంబంధాలే .కనుక కళ్ళముందే కొడుకు కోడలు మనవరాలు మనవడు,కూతురు కుటుంబం ఉండటం తో హేపీ హేపీ .

  ఇంతహాపీ గా ఉన్నా చిన్నకొడుకు దూరంగా ఉన్నాడనే బెంగ వాళ్ళిద్దరికీ .లోపలఉండి, అది తొలి చేస్తోంది .బిగపట్టుకుని పైకి గంభీరంగా ఉంటున్నారు .ఇది గ్రహించి శాస్త్రి ఇక్కడే హై టెక్ సిటీ లో కోటి రూపాయలు పెట్టి ఇల్లుకొని అమ్మానాన్నలకు దగ్గరలో ఉండి పోదామని ప్రయత్నించాడు .రెండు నెలలు ఉన్నాడుకూడా .కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి  కొన్న ఇంటిని కారు ని అమ్మేసి అమెరికాలో కాలిఫోర్నియాలోనే అప్పుడు అమ్మేసిన స్వంత ఇంటిదగ్గర్లోనే మళ్ళీ కొనుక్కుని ఉంటున్నాడు .పిల్లలిద్దరూ ప్రయోజకులై ఉద్యోగస్తులయ్యారు .తలిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు అన్నమాటే కాని వాళ్లకు కావాల్సిన సదుపాయాలూ వైద్య సౌకర్యాలు అన్నీ స్వయం గా చూస్తున్నాడు .అశోక్ బార్య పిల్లలూ  రెండుపూటలా  వచ్చి ,రోజూ అన్నం కూరలు ఆధరువులూ తెచ్చి ఏ లోపం లేకుండా చూస్తున్నారు .అయినా వాళ్ళిద్దరి మనసులలో దిగులు గూడు కట్టుకుని ఉంది.దాన్ని పొ గొట్టే అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నారు సోదరులిద్దరూ .ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సింది జరిగే పోయింది 13 వ తేదీ శుక్రవారం రాత్రి .మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ మరణం అందరి మనసులను కలచి వేసింది .మా బావ కు అందరూ ధైర్యం చెప్పి బాధను దూరం చేయాలి .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-4-18 –కాంప్-మల్లాపూర్- హైదరాఆద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.