శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం )
సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి
9-శ్రీమతి గుడిపూడి రాధికారాణి-మచిలీపట్నం -9494942583
ఆ .భం.ఆం.
తెల్ల వాళ్ళని తరిమి కొట్టి –నల్లవాళ్ళని నెత్తి కెత్తుకుని
దొంగల చేతికి తాళమిచ్చుకుని-బతుకిక భద్రమని
భ్రమలో బతుకుతూ –అలసట ఎరుగక –అదరక బెదరక
నడుస్తున్నాం –నిశ్చింతగా ,నిర్భీతిగా
నమ్ముతున్నాం భవిత మాదని బతుకు మాదని
నవ్వుతున్నాం అమాయకంగా ,అపురూపంగా
రుణ భారానికి వంగి పోతూ –నోటుకీ మాటకీ లొంగిపోతూ
చేయని తప్పుకు కుంగిపోతూ –ఎదురు చూపులతో ఎండిపోతూ
కరువు చూపులతో కుమిలిపోతూ –మనముందే
భుక్తాయాసపు త్రేన్పుల మోతల్లో
ఆకలి పేగుల అరుపులు సోకక
తక్కువగా దోచింది –నేనంటే నేనంటూ
నా నట్టింట్లో నేతల వీరంగా లెన్నాళ్ళు ?
హక్కును నాకివ్వక –నా హోదా రాదనీ బెదిరి౦పి౦కెన్నాళ్ళు ?
అందుకే –ఓటు అనే ఆయుధమున్నోళ్ళూ!
అమ్ముకోకు ఆండాళ్ళు !వాడి చూడు పెరుమాళ్ళు !.
10-శ్రీమైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు -9290995112
ఆశించి భంగపడ్డ దెవరు ?
ఆశించిన ఆంధ్రా వాడు అంధుడుకాడు
బతికి చెడిన ఆంధ్రా పులి –అదను కోసం వేచి ఉన్న బెబ్బులి
ఏదో ఆశించి ,మరేదో జరిగిందని భంగపాటు ఎందుకు ?
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునేవాడికి –చేతిలో చిప్పెందుకు ?
అధికారం లేని హోదానా –హోదా లేని అధికారమా ?
బరి తెగించి బజార్లో రచ్చ రచ్చ చేయట మేలా?
నిన్ను నీవు దిద్దుకో –గురివింద సామెత గుర్తుంచుకో
బతికి చెడిన వాడి అసహనం కోరలున్న పెద్దపులి
హద్దు దాటితే పంజా విసిరి నంజు కుంటుంది జాగ్రత్త .
11-శ్రీమతి కొమాండూరి కృష్ణా –విజయవాడ -9246434485
చాంద్రాయణం
శ్రీరామ చంద్రుని అలవోకగ వీడితి కల్వ చంద్రా
ఈ గోదారి ఆంధ్రాకై పోలవరమును వేడితి
భద్రాద్రి యాదాద్రి వేదాద్రి శైలాద్రి
ఒంటి మిట్టను వీడగ ఒంటరిగ మిగిలితి
బోధల బుద్ధుడు బాధలు కలిగించె-
ఆ ‘’సాగర ‘’హద్దుల కవుల గాధలు కరిగించే
‘’హై టెక్కు ‘’పోవగా ‘’బీ టేక్కే ‘’మిగిలెగ
ఏ టెక్ చద్విన బీటలై పొగిలెగ
చదువుల కొలువులు –పరువుల పదవులు
నిండు సభ లోన నిల్చిన ద్రౌపది చందము
మిల్లులతో బాటుగా ,కాగితపు ‘విల్లు ‘’ను వదలితి
తెల్లకాగిత రీతిగా వెలిగితిని మిగిలితిని
గనులను వనులను జనులను విడదీసె
తనవును మనసును సొగసును యెడ జేసె
దేశము ప్రాంతము భాష పై భక్తితో
నావారు ,నాదను భావముతో నేనుంటి
రంగాలు, వాని అంగాలు ఒకటంటి
కాని కాదనె వాదముతో శుష్క వేదాంతి నైతిని
పెరుగుట ఎరుగక తరిగేటి చందాన –చాంద్రాయణ వ్రతము చేసిన రీతిగ
తెలుగుకు వెలుగును మెరుగును కూర్చుము
జిలుగులు వెలయించి మెరుపులు కురిపించు .
12-శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య –విజయవాడ -9490400858
కోకిల వీడిన విళంబి
ఉగాది వచ్చేసింది –నేనే దిగాలుపడి చూస్తున్నాను –దిక్కు తోచక
కొత్తపాటలు నేర్చు కోస్తానని గట్టిగా ఒట్టేసి
కుకూ కుకూ అని కూస్తూ –వెళ్ళిన కోయిలమ్మ
మళ్ళీ తిరిగి రానే లేదు –మరిచిపోయిందేమో !
సెల్ టవర్లలో చిక్కుకుందేమో
చెట్లకోసం తిరుగుతూ –చైనా రష్యాలకు చేరి పోయిందేమో !
ఉగాది మాత్రం ఆగదుగా వచ్చేసింది
వేప పూత తెస్తానని అమ్మకు మాటిచ్చి
ఉదయం నుంచీ ఉసూరు మంటూ తిరుగుతూనే ఉన్నాను
వేప చెట్ల కోసం వెయ్యి కళ్ళతో
కట్టడాలకు అడ్దోచ్చాయని-కరెంటు తీగలకు
అడ్డంగా ఉన్నాయని నరికి పారేశారట
అమెరికావాడు మన వేప చెట్టుపై పేటెంట్ తీసుకున్నాడేమో
ఇండియాలో ఎక్కడా వేప చెట్టు ఉండకూడదని శాసనం వేశాడేమో తెలీదు .
గ్లోబల్ అడుగులకు మడుగులొత్తే దేశం మనది
ప్రపంచీకరణ పేరుతో ప్రకృతినే తాకట్టు పెట్టిన ఘనత మనది .
వేపపూత పొడి గ్రాము వెయ్యి రూపాయలంటే
వేలం వెర్రిగా కొనే వేర్రినాగన్నలం మనం .
కొత్త శోభ తెస్తానని చెప్పిన కోయిలమ్మ
పత్తా లేకుండా పోయింది
‘’రేడియేషన్ ‘’-పక్షులనే కాదు –
వాటి అండాలనూ చిదిమేస్తుంది
పిండాలనూ పిండేస్తుంది
జీవావరాణాన్ని నిర్జీవం చేసేస్తుంది .
భవిష్యత్తులో కోయిలలుండవు మిత్రమా పాటలు పాడటానికి
కాకులుండవు నేస్తమా చుట్టాల ఉనికి చెప్పటానికీ
పితృ దేవతల పిండాలు స్వీకరించటానికి
పిచ్చుకమ్మల కిచకిచలుండవు దోస్తూ
రామ చిలుకలు ,రాయ౦చలతో పాటు కనుమరుగైపోతాయ్
కొంగలు౦డవ్ దేశవాళీ కోళ్ళు కూడా ఉండవ్
పండగకోచ్చే అల్లుళ్ళకు
రష్యాకొంగలూ ఇక్కడి పరిస్థితి గమనించి
రాము రామని రాం రాం చెప్పేస్తాయి .
కోకిలమ్మ లేని ఉగాది నాకొద్దు
ఉగాదిపచ్చడి లేని ఉగాదులెందుకు ? నాకు వద్దే వద్దు .
చెట్లన్నీ కూలిపోతే –కోయిలమ్మలు మరణిస్తే
కవితలకు స్పూర్తి ఏదీ ప్రేరణ ఎక్కడ ?
ఉగాది కవితా సదస్సులో శూన్యమనస్కంగా
నేనేమని పాడాలి యేమని చెప్పాలి ?
‘’గూగుల్లో ‘’కోయిలమ్మను చూస్తూ ‘
‘’యు ట్యూబ్ ‘’లొ పాట విని రాయనా ?
అప్పుడు వచ్చేది కవిత్వం కాదు –మాటల పోగు
కళావిహీనమైన కవిత కలకాలం మన లేదు కదా .
అయినా అవన్నీ నాకెందుకు ?
అందరూ వెళ్ళండి –నా కోకిలమ్మను వెదకండి
కనబడితే కబురు చెప్పండి
తనపై అలిగానని ఎదురు చూస్తున్నానని తెలపండి .
కోకిలపాట వింటేనే నాకు ఉగాది.
విళంబు లొద్దు- వికారులొద్దు
కోకిలపాట వింటేనే నాకు ఉగాదులు –ఉషస్సులు
అందాకా నాకు తమస్సే.
13-పేరు రాయని కవి
ఆశల చిగురులు మోసుకుంటూ
పచ్చనైన నా ఆంధ్రం విచ్చిన్నమై –అడకత్తెరలో పోక చందమైతే
జీవదారల నదీమతల్లులు ఎండి ఎడారు లౌతుంటే
వాటిపై ప్రాజెక్ట్ లు కట్టే మహామహుల రాజ్యమేర్పడింది .
పచ్చనిపోలాల పిల్లగాలి ,కరకు రాజకీయ కొడవళ్ళకు చిక్కి
నశించి రాతిమేడల రాజ్యాల్లో చోటులేక తరలి పోయింది
గడియకో ఎత్తుగడతో కొమ్మకోపార్టీ,
రాచకీయ సింహాసనం కోసం కుమ్ములాటలతో
భగ్గుమంటున్న భారత దేశం
బరి తెగించిన విషనాగుల కాటుకు
కాటికి చేరుతున్న అభాగ్య జీవాలెన్నో
ఎవరికైనా పట్టిందా ?
ఆ –మనకెందుకులే
స్పెషల్ పాకేజీ మిఠాయి కోసం
పోటీపడుతున్నాం –విసిగించకు ,కసిపెంచకు
బ్రెయిన్ డెడ్ లు ఎన్ని జరిగితేనేమి
కళ్ళదగ్గర నుండి కాలేయం దాకా
అమ్ముకోవచ్చు అంతా దేశ సేవేకదా బ్రదర్
నిన్న ఉన్నది నేడు లేదు –రేపు ఉంటున్నదని నమ్మకం లేదు
అస్థిర అస్తిమిత జీవన మార్గం లో
గమ్యమేమిటో ఎవరికీ తెలీని బ్రహ్మ పదార్ధం .
ముక్కలైన నా రాజ్య౦ ఉద్ధరించే వాడికోసం వెక్కి వెక్కి పడుతోంది
కుల మతాల కుమ్ములాటలు ,మతాల మారణ హోమాలలొ
మానవత్వం బిక్క చచ్చి న వేళ వచ్చిందో ఉగాది
ఆశల చిగురులు మోసుకుంటూ .
14-శ్రీ మునగంటి వేంకట రామాచార్యులు –విజయవాడ -9295753960
దగా పడిన తమ్ముళ్ళు
గుండె కుములుతున్నది –గొంతు పెగలకున్నది
నాటి మహామహుల త్యాగ నిరతి –నిష్ఫలమై పోతున్నది
శతవసంతాల తెలుగు ప్రజలపసిడి కాంక్ష
పగిలిన అద్దమౌతున్నది
ఆంధ్రులంటే ఆది నుంచీ –కేంద్ర ప్రభుతకు చిన్న చూపే
ప్రతిసారీ మనం దగా పడిన తమ్ముళ్ళే.
తూర్పు సముద్ర తీరం లొ –దిగువ దక్షిణ ప్రాంతం లొ
తొలిసారి పాక వేసి నివసించిన
‘’ముతరాసు ‘’చెన్నపు ఆంధ్రుడు
ముతరాసే మదరాసు గా మద్రాసు గా మారింది .
అదే చెన్నప్ప పేర చెన్న పట్టణ మై
ఇప్పుడు’’ చెన్నై ‘’గా చలామణి లొ ఉన్నది .
ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ అక్కడే ఆంధ్రులే అత్యధికం
తమిళనాడుకు ఈశాన్యంగా చెన్నై ఉన్నది .
సమైక్యత తమిళుల సహజ లక్షణం
అనైక్యత ఆంధ్రుల ఉగ్గుపాలతోనే వచ్చింది
మనవనుకున్నవాటిని ఎదుటి వారికి వదిలేసి
అసమర్ధులు గా ముద్రపడి బతుకుతున్నాం
అగస్త్యభ్రాతలకు ఉదాహరణగా చెల్లుబాటవుతున్నాం
తెల్లవాడి తుపాకులకు రొమ్ము చూపించి
గర్జించాడు ఆంధ్రకేసరి టంగుటూరి
‘ఎక్కడ మీ ఆంధ్రా ?’’అని హేళన చేసిన నెహ్రూకు ‘
‘’అణా’’నాణెం తీసి దానిపై తెలుగులో ఉన్న
‘’అణా’’చూపించి నోరుమూయించాడు
భోగరాజు పట్టాభి సీతారామయ్య .
దక్షిణాది భాషల్లో ఒక్క తెలుగుకి మాత్రమె
దక్కిన అరుదైన గౌరవం అది
అదే దాని ప్రాచీనతకు నిదర్శనం .
శతాబ్దాల చరిత్ర ఉన్న తెలుగును
ఆంగ్లేయులు గుర్తించి గౌరవించారు
స్వతంత్ర భారతం మాత్రం
చులకన చేసి అగౌరవ పరచింది .
ఆంద్ర సంస్కృతీ భాషలను
గుర్తించని కేంద్రం ప్రత్యెక రాష్ట్రానికి
మొకాలోడ్డి ఎదురు నిలిచింది
అమరజీవి పొట్టి శ్రీరాముల
ఆత్మ బలిదానంతో సహనం నశించిన ఆంధ్రుల
ఆవేశ కావేష ఆందోళనలకు మాత్రమె దిగొచ్చింది
ఆంద్ర రాష్ట్రం ఇచ్చి చేసిన ఆలస్యానికి
బుద్ధిగా చెంపలేసుకున్నది కేంద్రం .
గరిక పోచలు ,గడ్డిపరకలు ఏకమైతే
‘’వెంటి’’ గా మారి ఏనుగునైనా బంధిస్తాయి
బిందు సమూహమే
అవధుల్లేని సింధువు అవుతుంది
శ్రమ సాధనాలు దీక్షా దక్షతలతో
ఉద్యమ ఉద్వేగాలు ఉరకలెత్తితే
సాధనకు అందనిదేమున్నది !
తలలో జేజమ్మైనా దిగి వస్తుంది
అకుంఠిత దీక్షా ,అవిరళ కృషికి
రూపొందని దేముంటుంది ?.
కవి సమ్మేళన కవితలు సమాప్తం
శ్రీ విళంబి కవి సమ్మేళనాన్నిదక్షతతో నిర్వహించింది యువకవి ‘’శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య’’ అని మరొకసారి గుర్తు చేస్తున్నాను .
రేపు 20-4 -18 శుక్రవారం –శ్రీ శంకర జయంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-4-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్