మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6

మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6

  జాతీయ గీతా గానం

మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైస్కూల్ లొ చదివేటప్పుడు   జంపా రెడ్డి గారు అనే సోషల్ మాష్టారు ఉండేవారు .ఆయనే స్కౌట్ మాస్టారు కూడా .ఆయన కు మంచి నాటకానుభవం ఉండేది పాటలు బాగా పాడేవారు ,నేర్పేవారు .స్వతంత్రం వచ్చిన కొత్త కనుక జాతీయ గీతాలు చాలా ఇంటరెస్టింగ్ గా నేర్పేవారు .మా అక్కయ్య కంఠ స్వరం బాగా ఉండటం సంగీతం కూడా నేర్చుకోనటం వలన ,మా అక్కయ్య మిగిలిన ఆడపిల్లలకు ఆయన జాతీయ గీతాలు నేర్పారు వాటిని పరమ శ్రావ్యంగా మా అక్కయ్యా వాళ్ళు పాడేవారు .అక్కయ్య ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయటం తో మాకూ అవి నోటికి వచ్చేసేవి .అందులో నాకు బాగా జ్ఞాపకం ఉన్న పాటలు 1-జయజయ భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభతరుణం  2-ఎత్తవోయి జయ జండా జయజండా ౩-మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతీ .అలాగే స్కౌట్ అండ్ గైడ్స్ లొ తాళ్ళతో ముడులు వేయటం  కుట్లు ,అల్లికలు కూడా బాగా నేర్చుకునేది .అల్లేది కూడా .

  మా పడమటింట్లో అచ్చనగాయలు ఆడుకునే వీలుండేది .ఖాళీ సమయం లొ గవ్వలు ఆచ్చనగాయలు ఆడేవారు .మా పెద్దక్కయ వీటిలో ఎక్స్పర్ట్ .ఆ రోజుల్లో స్నానాలు తలంటి అన్నీ కుంకుడు కాయలతోనూ పెసరపిండి నలుగు పిండితోనూ ఉండేవి. డబ్బాలకు డబ్బాలు సున్నిపిండి పట్టించి ఉంచేది మా అమ్మ .కుంకుడు కాయలు కారు చౌక .ఎప్పుడూ సిద్ధం .

  హిందూపురం లొ ఉండగా కాకుమాను శ్రీకృష్ణయ్య శ్రేష్టి అనే వ్యాపారి ఉండేవాడు మంచి వితరణ శీలి .ఆయన కొడుకులు మా నాన్న దగ్గర తెలుగు ప్రైవేట్ చదివే వాళ్ళు .సెట్టిగారు మంచి ఆధ్యాత్మిక పరులు .స్కూలు పిల్లలకు ఆయన భగవద్గీత పోటీలు నిర్వహించారు .మా నాన్న నాకూ అక్కయ్యకూ భగవద్గీత నేర్పారు ఆ పోటీల్లో పాల్గొనటానికి .నాకు భక్తీ యోగం మా అక్కయ్యకు పురుషోత్తమ ప్రాప్తి యోగం అధ్యాయాల లొ పరీక్ష .ఆడ పిల్లలలో మా అక్కయ్య ,మగ పిల్లలలో నేను ఫస్ట్ వచ్చాం .భక్తీ యోగం శ్లోకాలు వెనక నుంచీ ముందుకు చెప్పమంటే నేను చెప్పేశాను అందరూబాగా మెచ్చారు దీన్ని నేను చాలాగార్వంగా చెప్పుకునేవాడిని .మాకు భగవద్గీతలు బహుమానంగా ఇచ్చారు .వాటిని అపురూపంగా భద్రపరచుకున్నాం .దానిమీద శ్రేష్టి గారు ఇచ్చినట్లు స్టాంప్ కూడా ఉంది .

              సూరి కమల పెళ్లి

 మా రేపల్లె బాబాయి అంటే మా నాయనమ్మగారి అక్కగారి కుమారుడు రాయప్రోలు శివ రామ దీక్షితులు గారు ఒక్కరే మాకు తెలిసినబాబాయి .మానాన్నకు అన్నదమ్ములూ అక్క చెల్లెళ్ళు లేరు .ఈ బాబాయి పెద్దకొడుకు సుబ్రహ్మణ్యం అనే సుబ్బులుకు ఉయ్యూరు లొ పుల్లేరు దగ్గర ఉంటున్న సూరి మంగమ్మగారబ్బాయి శ్రీరామ మూర్తి కూతురు కమల కు ఉయ్యూరులోనే వివాహం జరిగింది .పెళ్లి చూపులు మా ఇంట్లోనే అని జ్ఞాపకం .కోలచల శ్రీరామ మూర్తి ,గౌరయ్య గారిళ్ళ మధ్య ఖాళీ స్థలం లొ పందిరి వేసి రాత్రి పూట పెళ్లి చేశారు .భోజనాలు కూడా అక్కడే .పెళ్లి కూతురి సింగారింపు అంతా మా అక్కయ్యే చేసింది .దగ్గరుండి పెళ్లి జరిపించింది అప్పటికి అక్కయ్య పెళ్లి కాలేదని గుర్తు .మా బాబాయి ,లక్ష్మీకాంతం పిన్ని  మా పెద్దమామ్మ అందరూ వచ్చారు .బాబాయి కూతురే ‘’పిచ్చాలు ‘’.పిచ్చాలు కొడుకే సుబ్రహ్మణ్యం .పెళ్ళయ్యాక పిచ్చాలు అత్తారింటికి బందరు వెళ్ళింది .ఆయన వారణాసి వారబ్బాయి .చాలామంచి వాడు .మా అక్కయ్యా వాళ్ళు బందరు కాపురం పెట్టినప్పుడు తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం .పే…ద్ద మండువా లోగిలి .

 మా పెళ్ళికి కోడాక్ ‘’డబ్బా కెమెరా ‘’కానుక

 1964 ఫిబ్రవరి 21 నాకూ ప్రభావతికి మా మామగారి ఊరు నూజివీడు –ఏలూరు మధ్య ఉన్న  వేల్పు చర్ల లొ పెళ్లి జరిగింది .అప్పుడు మా అక్కా బావ నాకు’’ కోడాక్ డబ్బా కెమెరా’’ కానుకగా ఇచ్చారు .అప్పటికి మా ఇళ్ళల్లో ఎవరికీ కెమెరా లేదు .’’బుజ్జి ముండ ‘’నల్లగా బాగుండేది దానితోనే పెళ్లి ఫోటోలు తీశాడు బావ .తర్వాత అది మా ఆవిడతో పాటు జీవిత భాగస్వామి అయింది .మోపిదేవి హై స్కూల్ లొ నేను మొదట సైన్స్ మాస్టర్ గా చేరి ఉద్యోగం చేస్తున్నాను .ఆస్కూల్ ఫోటోలు ,నాతో పనిచేసిన లేక్కలమేస్టారు రమణారావు గారు , సెకండరీ మాస్టారు ,కృత్తివెంటి నరసింహారావు ,తెలుగు పండిట్ కూచిభొట్ల సత్యనారాయణ (ఈయననే వాసన మాస్టారు అనేవాళ్ళం –కారణం ఆయనకు ‘’ వాసన’’ అనే మాట ఊతపదంగా ఉండేది )లతో మోపిదేవిలోనూ ఉయ్యూరులోనూ ,అలాగే శిష్యులు అడివి శ్రీరామమూర్తి  మాధవ్ లతోనూ ,కాటూరు చేను మహాసూలు అంటే కుప్ప నూర్పిళ్ళ కు ,ఉయ్యూరు హై స్కూల్ ,మానికొండ హై స్కూల్ అక్కడ ట్యూషన్ పిల్లల ఫోటోలు ,ఉయ్యూరు లొ మా పెద్దక్కయ్య బావ మేనల్లుడు మేనకోడళ్ళు మాతమ్ముడు  మా అన్నయ్యగారబ్బాయి  నేనూ అశోక్ మా బావ ఉంటున్న జమ్తారా వెళ్ళినప్పుడు అప్పుడే కొత్తగా ప్రవేశపెట్టబడిన జనతా ఎక్స్ ప్రెస్ ,దానిలో మా ఇద్దరి ప్రయాణం జమ్తారా ఫోటోలు వగైరా ఫోటోలన్నీ దానితో తీసినవే. చాలా క్లారిటీ గా ఉన్నాయి .అన్నిటినీ ఆల్బం లొ ఉంచాము .. కాశీ లొ మా అమ్మ అస్తికలు నిమజ్జనం చేసి  అయిదవ మాసికం  పెట్టటం మా చిన్నక్కయ్యా బావా పాత్నానున్చిరావటం ,  ,వ్యాసకాసి, గయా , ప్రయాగ ,పాట్నా లొ మా అక్కయ్యా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి ఫోటోలు అన్నీ దాని పుణ్యమే .ఒకరకంగా మా అక్కా బావా నా పెళ్ళికి ‘’అపురూపమైన కానుక’’గా దాన్ని ఇచ్చారనుకోవాలి .చాలాకాలం డబ్బా కేమేరానే వాడాను తర్వాత కొత్తకేమేరాలు ,2005 లొ రెండవసారి అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి వాళ్ళున్న డెట్రాయిట్ దగ్గరున్న ట్రాయ్ లొ కోడాక్ డిజిటల్ కెమెరాలు కొని నాకు మా అబ్బాయి లిద్దరికీ ఇచ్చింది మా అమ్మాయి విజ్జి .అప్పుడు కొన్న కోడాక్ డిజిటల్ కేమేరానే ఇప్పటిదాకా వాడుతున్నా .ఇదీ బుజ్జి ముండే.’’దాని అక్క డబ్బా ‘’లాగే బాగా పని చేస్తోంది .

   మా పిల్లలతో మా అక్కయ్యల పిల్లల సందడి

  మాకు పిల్లలు పుట్టాక  మా అక్కయ్యలు బావలు వేసవిలో ఉయ్యూరులో గడపటానికి వచ్చేవారు .అప్పటికి మాకు పాలేళ్ళూ  పాడీ ,వ్యవసాయం ఉంది . దొడ్లో దక్షిణవైపు నుయ్యి ఉండేది .స్నానాలగదిలో ఒక పెద్ద నీటి తొట్టె ను మా చిన్నక్కయ్య పెళ్లికే కట్టించాడు నాన్న .దీనినే మేము ‘’కుండు ‘’అనేవాళ్ళం .చుట్టూ ప్రహరీ గోడలు ,దొడ్డి నున్నగా సిమెంట్ తో గచ్చు వంటింట్లో అలమరలు ఉండేవి .మడి పచ్చళ్ళకు  ఒకటి మిగిలిన వాటి కొకటి అలమరలు .మడి అలమర అమ్మమాత్రమే మడితో ముట్టుకునేది .మేమేవరమైనా ముట్టుకోవాలంటే తడి తువ్వాలతోనే .పాలేరు రెండుపూటలా కుండు నిండా నీళ్ళు తోడి పోసేవాడు .దొడ్లో గచ్చుమీద గంగాళాలు కాగులు బిందేలనిండా నీళ్ళు నింపేవాడు .మా పిల్లలు ,మా చిన్నక్కయ్య పిల్లలు అశోక్  శాస్త్రి ,మాఅన్నయ్య కొడుకు రాంబాబు లు ‘’గోచీలు ‘’పెట్టుకుని దొడ్లో గచ్చుమీద నీళ్ళు పోసుకుంటూ ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ సరదాగా నున్నటి గచ్చుపై పడుకుని జారుతూ స్నానం చేస్తుంటే మహా ముచ్చటగా ఉండేది .మా వాళ్ళు ఎప్పుడూ ఈ సీన్ గుర్తు చేసుకునేవారు .అలాగే ఆరుబయట దొడ్లో రాత్రి భోజనాలు అందర్నీ వర్సుగా కూర్చోబెట్టి పెద్ద పెద్ద కంచాలలో అన్నం కలిపి అక్కయ్యలు, మా ఆవిడా, అందరికీ పెట్టి తినిపిస్తుంటే అది మరో గొప్ప దృశ్యం .’’అన్నం తినను’’ అని మారాం చేసే మా మేనకోడలు పద్మ ఉయ్యూరు వస్తే అందరితో కలిసిపోయి కడుపునిండా తినేది .’’అక్కడ తినవు ఇక్కడ తింటావు ఎందుకే ‘’అని మా చిన్నక్కయ్య  కూతురు పద్మ ను అడిగితె ‘’పెద్దమామయ్య వాళ్ళింట్లో తింటుంటే పెళ్లి లొ తింటున్నట్లుంది అందుకే అంత ఇష్టం గా తింటాను ‘’అనేదట అక్కయ్య చెప్పేది. అలాగే మా పెద్దమేనకోడళ్ళు అంటే పెద్దక్కయ్య కూతుళ్ళు కళ,జయ లు  మేనల్లుడు శ్రీను కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు.’’మూడో సీను’’ మరీ ప్రత్యేకమైనది .వేసవి లొ వస్తారు కనుక పుష్కలంగా మామిడిపళ్ళు దొరికేవి .అందులో అందరికీ రసాలు అంటేనే ఇష్టం .సెంటర్ కు వెళ్లి గంపలకు గంపలు పండిన చిన్న రసాలు తెచ్చేవాడిని .అక్కయ్యలతో సహా అందరూ మహా సంతోషంగా తినేవారు. మూడు పూటలా మామిడి పళ్ళే.తినటానికి వాళ్లకు విసుగు ఉండేదేమోకాని కొని తేవటానికి నాకు విసుగు ఉండేదికాదు మహా సరదాగాఉండేది .ఈ మామిడిపళ్ళ భోజనం మా మేనల్లుల్లు మేనకోడళ్ళు ఎప్పుడూ గుర్తు చేసుకొంటూనే ఉంటారు  .అదొక మధురానుభూతిగా మిగిలి పోయింది .ఈ బాచ్ తర్వాత మా వేదవల్లి కొడుకులు రవి హరి  హవా వచ్చింది .వేసవిలో వాళ్ళు వచ్చారంటే పళ్ళే పళ్ళు .మహా ఇష్టంగా తినేవాళ్ళు అందులో హరి కడుపు బరువెక్కి ‘’తాతయ్యా ఇంక నేను తినలేను తాతయ్యా ‘’అని గోల చేసేవాడు .రసాలు పూర్తిగా అయితేనే బంగినపల్లి తినేవాళ్ళం .పెద్దరసాలు తినటం తక్కువే .

  ఇదికాక మా మేనమామ గంగయ్యగారింట్లో వేసవి లొ రెండు మూడు తద్దినాలు వచ్చేవి .ఇంటిల్లి పాదీ భోజనాలు వాళ్ళ ఇంట్లోనే .మా మామయ్యా ముందుగానే రసాలు తెప్పించి వాళ్ళ గదిలో కావ వేసి తద్దినం నాడు తిన్న వాళ్లకు  తిన్నన్ని మామిడి పళ్ళు వడ్డించేవాడు .ఒక్కో విస్తరి దగ్గర చిన్నసైజు కొండలాగా మామిడి టెంకలు గుట్టలు ఏర్పడేవి .రసాలు అయిపెతే బంగినపల్లి వాటిని తరిగి ముక్కలు చేయటానికి ఇద్దరుండేవారు.ఆయనకూ మామిడి పళ్ళు తినిపించటమంటే అంత సరదా .అందుకే వాళ్ళింటి వేసవి తద్దినాలను మేము ‘’మామిడి పళ్ళ తద్దినాలు ‘’అనేవాళ్ళం.ముంజెలు తేగలూ సీమచింతకాయలు ,ఈతపళ్ళు సరేసరి .వేసవులు ఇంత సరదాగా గడిచిపోయేవి .మా శ్రీమతికి నాకంటే ఇంకా సరదా వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ గడపటం .

                మామిడిపళ్ళ రవాణా

  మామిడి సీజన్ లొ అందరి కోసం జాడీలకు జాడీలు ఊరగాయలు పెట్టటం మామూలే .మరి వాళ్ళు ఒకరు మద్రాస్ లొ మరొకరు  బీహార్ లొ ఉంటె మామిడిపళ్ళు ఎలా తింటారు ?అక్కడ ఈ వెరైటీ దొరకవుకదా  .అందుకని బెజవాడ వన్ టౌన్ కు వెళ్లి  మామిడి కావు వేసే చోటు వెతికి కనీసం రెండు గంపలు దోరరకం చిన్నరసాలు కొని వాళ్ళతోనే పాక్ చేయించి ,రైల్వే స్టేషన్ కు రిక్షాలో తీసుకు వెళ్లి వాటిని బుక్ చేయించిపంపేవాడిని మద్రాస్ కొకటి బీహార్ కు ఒకటి .అవి వాళ్లకు చేరటానికి కనీసం వారం పట్టేది .కుళ్ళిపోకుండా జాగ్రత్తగానే చేరేవి .అందినట్లు , తిని ఆనదాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఉత్తరం రాస్తే వారానికి మాకు చేరేది . .అలాగే బియ్యం కూడా ఇద్దరికీ పంపేవాడిని .

  మా బావ బీహార్ నుంచి వచ్చినప్పుడల్లా  బంగాళా దుంపల  బస్తా తెచ్చేవాడు .అక్కడి దుంపలు చాలా బాగా ఉండేవి రుచీ ఎక్కువే .అలాగే ఎర్రగోధుమలూ తెచ్చేవారు .విశాఖ దగ్గరున్న ‘’పలాసా ‘’ స్టేషన్ లొ ములక్కాడలు కట్టలకు కట్టలు అమ్ముతారు .పలాసా ములగ మహా శ్రేష్టం బావ .ఎప్పుడూ అయిదారు కట్టలు కొని తెచ్చేవాడు .

          బావ వంట

  అశోక్ ను తీసుకుని నేను మొదటిసారి జమ్తారా కు వేసవిలో వెళ్ళా .అక్కడ గంగానది ఉంది .బావ సూపర్ వైజర్ .ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ‘’కళాసీ’’ తో ,ఇంకొక అసిస్టెంట్ తో పడవ మీద గంగానదిలో ప్రయాణం చేస్తూ అయిదారు చోట్ల నీటి మట్టం నీటి ప్రవాహం వగైరాలను కొలిచి 11 గంటలకు తిరిగి వచ్చేవారు.అందుకని ఉదయమే లేచి టిఫిన్ చేసి కాఫీ పెట్టి మాకిచ్చి ఆయనా కానిచ్చి అప్పుడు డ్యూటీకి వెళ్ళేవాడు .తర్వాత’’ ఉమ్రావ్ స్టవ్’’లేక కిరోసిన్ గాస్ స్టవ్ మీద వంట చేసేవాడు .ఆయన ఏది వండిగా అద్భుతః .ముఖ్యంగా బంగాళాదుంప వేపటం లొ కూర చేయటం లొ ఆయన మంచి ఎక్స్ పర్ట్ .పప్పు సాంబారు చేస్తే అదరహా .రోట్లో నూరి చేసిన పచ్చడి స్వర్గానికి బెత్తెడు .పెరుగు తోడుపెడితే గొడ్డలితో నరకాల్సిందే .రాత్రిళ్ళు చపాతీకాని ,పూరీ కానీ చేసి బంగాళాదుంప కూర చేసేవారు .కడుపునిండా తినేవాళ్ళం .ఆయనకొక బీహారీ బ్రాహ్మణుడు హెల్పర్ గా ఉండేవాడు గోచీపోసి పంచెకట్టి పిలకతో ఉండేవాడు నమ్మినబంటు .చాలాకాలం బావ దగ్గరే పని చేశాడు .అక్కాబావ అతనికి దైవ సమానం .

  మా బావ యమా స్ట్రిక్ట్ .రూల్స్ బాగా పాటించేవాడు .ఎవరికీ వంగి వంగి సలాములు చేసేవాడుకాడు .డ్యూటీ ఫస్ట్.అంతే. గంగ నీటిని రోజూ రెండుపూటలా గేజ్ చేసి పైకి రిపోర్ట్ రోజూ పంపాలి  . ప్రభుత్వం  కాగితాలు సరిపడా సరఫరా చెయ్యదు .ఈయన కొని బిల్లు పెట్టేవాడు .ఇవ్వటానికి ఏడ్చేవాళ్ళు .దీనిపై పై ఆఫీసర్ కు రిపోర్ట్ చేసేవాడు .వాళ్లకు గుర్రుగా ఉండేది .వాడు వినకపోతే ఆ పై ఆఫీసర్ కు పంపేవాడు .చివరికి సాధించేవాడు .నిజాయితీకి నిఖార్సైన ఉద్యోగిమా బావ .దీనితో ఆయన ప్రమోషన్ చాలాకాలం ఆగి పోయింది .కాగితాలతోనే పోరాటం చేసి పై పై అధికారులకు తాను చేస్తున్నది కరెక్ట్ అని తెలియ జెప్పి రిటైర్ మెంట్ చివరలో రావలసిన ప్రమోషన్ లు అన్నీ పొంది సంతృప్తిగా రిటైర్ అయ్యాడు .ఈ విషయం లొ మా అక్కయ్య ఎంతో ఓర్పూ నేర్పు తో వ్యవహరించి ఆయనకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించేది .సంఘం లొ ,సాటి ఉద్యోగుల్లో ఆయనకు అమిత గౌరవం ఉండేది ఎక్కడ పని చేసినా .ఆయన ఏ డ్రాఫ్ట్ రాసినా చాలా పకడ్బందీ గా ఉండేది .మా అమ్మా నాన్నలు అంటే బావకు విపరీతమైన గౌరవం .

                    కొత్తమీద మోజు

 మార్కెట్ లోకి ఏ కొత్త రేడియో వచ్చినా మా బావ కొనటం హాబీ .అలాగే నాణాల కలెక్షన్లు కూడా తర్వాత డాలర్ల కలెక్షన్లు .అయన దగ్గర నోట్లు ఎప్పుడూ సరికొత్తగా ఫెళ ఫెళ లాడుతూ ఉండాల్సిందే . మహా బోళావాడుబావ  .అవతలివాడిని యిట్టె నమ్మేస్తాడు ఒక్కోసారి .ఒకసారి జీతం  ,ఎరియర్లు అన్నీ భారీగా తీస్సుకుని డబ్బు సూట్ కేసు లొ పెట్టుకుని ఉయ్యూరు వస్తుంటే ఎవడో తెలుసుకుని తోటి ప్రయాణీకుడుగా ఉంటూ ,నమ్మకం గా కబుర్లు చెబుతూ డబ్బు సంచీ తో ఉడాయించాడు .పాపం కట్టుబట్టలతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉయ్యూరు వచ్చాడు .అప్పుడు అక్కయ్యా వాళ్ళు ఇక్కడే ఉన్నారు .జరిగింది చెప్పటానికి మొహమాటం .మేమే మా అక్కయ్యద్వారా అర్ధం చేసుకుని డబ్బు సర్ది మళ్ళీ పంపాం ఉద్యోగానికి .ఇది తప్ప ఇంకెక్కడా ఆయన మోసపోలేదు .

                 పజిల్ విజార్డ్స్

    హైదరాబాద్ లొ బోయిన్ పల్లి లొ మా అశోక్ దగ్గర ఉన్నప్పుడు వాడు బాంక్ నుంచి మేగజైన్లు తెచ్చేవాడు .వాటిని చదువుతూ క్రమంగా వాటిల్లోని పజిల్స్ పై మా అక్కయ్యా బావ ఆకర్షణ పెంచుకున్నారు .వీళ్ళిద్దరూ కలిసి పజిల్స్ పూర్తీ చేస్తే అశోక్ వాటిని పోస్ట్ లొ పంపేవాడు .ముఖ్యంగా ఆంధ్రభూమి వార మాసపత్రికల పజిల్స్ బాగా సాల్వ్ చేసేవాళ్ళు .అనుమానం వస్తే నన్ను అడిగేవాళ్ళు నాకు తెలిసిన సమాధానం చెప్పేవాడిని .ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఎప్పుడు వీలయితే అప్పుడు ఫోన్ చేసి క్లూ అడిగేవాళ్ళు తెలిస్తే వెంటనే చెప్పేవాడిని లేకుంటే రిఫర్ చేసి నేనే ఫోన్ చేసి చెప్పేవాడిని .హైదరాబాద్ లొ వీళ్ళ దూరపు బంధువు వేలూరి కృష్ణమోహన్ గారికీ ఇదే యావ .ఆయనాకొంత హెల్ప్ చేసేవాడు .ఎన్నో సార్లు ప్రైజ్ లు కొట్టారిద్దరూ .కొంతకాలం తమ పేర్లతో తర్వాత కొడుకులపేర కోడళ్ళ పేరా ,కూతురి పేరా మనవడు మనవ రాళ్ల రాసిపంపెవారు .ప్రైజ్ రాకపోవటం అరుదు .దీనికోసం బ్రౌన్ నిఘంటువు ,మామూలు తెలుగు నిఘంటువు కొన్నారు ఇదికాక నేను పర్యాయ పదాల నిఘంటువు కూడా అందజేశాను .వీటితో వాళ్లకు చాలా ఈజీ అయింది .అందుకే వాళ్ళని  పజిల్ విజార్డ్స్ అన్నాను ‘

   ఎమెస్కో గ్రంథాలయం

 అక్కయ్య పుస్తకాలు నవలలు బాగా చదువుతుంది .అందుకని బావ ఎమెస్కో వాళ్ళ ‘’ఇంటింటా గ్రంధాలయం ‘’పధకం లొ చేరి దాదాపు మూడు వందల పుస్తకాలు కొని అన్నిటికీ అట్టలు వేసి బీరువాలలో అందంగా అలంకరించి సరస్వతీ సేవ చేశారు .ఆయన సేకరించని నవల, కదా సంకలనం లేదంటే ఆశ్చర్యం లేదు .అన్నీ చక్కగా చదివేశారు .వాటిలోని విషయాలు బాగా విస్పష్టంగా చర్చించుకుంటారు ఇద్దరూ .

          బుల్లి తెర పోషకులు

పజిల్స్ నవల కథ మేగజైన్ లు చదవటమే కాక మా అక్కా బావాలకు గత 15 ఏళ్ళనుంచి టి వి తో అనుబంధం ఎక్కువ .అందులో వచ్చే సీరియళ్ళను చానళ్ళు మార్చి మార్చి మహా ఆసక్తిగా ఇద్దరూ కలిసి చూస్తారు .చర్చించుకుంటారు .నాకు తెలిసినంతవరకూ చూడని సీరియల్ ఉండదేమో .దూరదర్శన్ అంటే అమితాసక్తి ఇద్దరికీ .వయసు మీద పడినకొద్దీ ఈ వ్యాపకం వాళ్లకు కొంత రిలీఫ్ ఏమో !

            పూజా పునస్కారాలు

  తెల్లవారుజామునే లేవటం ఇద్దరికీ అలవాటు .కాఫీ తాగాక మా బావ పూల బుట్ట తీసుకుని బయటకు వెళ్లి దొడ్లోను రోడ్డుప్రక్కలా ఉన్న రకరకాల పూలను కోసు కోస్తాడు .స్నానం చేసి సంధ్యావందనం చేసి దేవుడి పూజ చేస్తాడు కనీసం రెండు గంటలసేపు .మొదట్లో మా అక్కయ్యే పూజ చేసేది ఈయనకేమీ పట్టేదికాదు .ఒకసారి ఇద్దరూ ఉయ్యూరు వచ్చినప్పుడు ‘’ఒరే !మీ బావ సంధ్యా లేదు పూజా లేదు .కాస్త చెప్పరా ‘’అన్నది .నేను నెమ్మదిగా ఆయనతో మాట్లాడి ఆసక్తికలిగించి సంధ్యావందనం పుస్తకం పూజా విధాన పుస్తకాలు ఇచ్చాను .క్రమ౦గా అలవాటు చేసుకుని తర్వాత చక్కగా అమలు పరుస్తున్నారు .పూజ తర్వాత రామకోటి రాయటం భగవద్గీత చదవటం అలవాటు ఆయనకు .దేవాలయ  సందర్శనాలు  చేస్తారు .సంగీత కార్యక్రమాలకు రవీంద్ర భారతి లొ జరిగే నాటకాలు సాహిత్య సభలకూ వెళ్ళేవాళ్ళు త్యాగరాజ గాన సభలో సభ్యత్వం ఉన్నది ‘ అక్కడి కార్యక్రమాలకు వెళ్ళేవారు. వెళ్లి మాకు విశేషాలు చెప్పేవాళ్ళు .నోములు వ్రతాలు అన్నీ చేశారు చేయించారు .

  మా బావ తలిదండ్రుల ఆబ్దీకాలను అతి శ్రద్దగా ఇంటి దగ్గరే పెట్టేవాడు .అన్న ముకుందం గారి తద్దినాలు కూడా హైదరాబాద్ లొ వాళ్ళుండే దర్గా లొఉన్న ఇంట్లో పెట్టేవారు .మేమూ ఒకసారి వెళ్లాం. అప్పుడు పవన్ ఇంకా చదువులో ఉన్నాడు . మా అక్కయ్య వీటికి స్వయంగా వంట చేసేది  .తర్వాత వంట బ్రాహ్మణులతో చేయించేవారు .తర్వాత తర్వాత ఓపిక తగ్గటం తో మఠాలలో పెట్టేవారు .ఈమధ్య అయిదారేళ్ళ  నుంచి ఇల్లు కదలటమే కష్టమై పోవటం తో అదీ చేయలేక శ్రీశైలం దేవాలయం లొ డబ్బుకట్టి  తిధులనాడు అన్నదానం చేసే ఏర్పాటు తో తృప్తి చెందుతున్నారు  .

  ఇలా ఏనాడూ తమ  విధ్యుక్త ధర్మాలను విడువకుండా మా చిన్నక్కయ్యా బావా జీవితాలను గడిపారు .అందరికీ ఆదర్శ ప్రాయమై ,ప్రేరణగా నిలిచిన అపురూప  దంపతులు  అని పించుకున్నారు . .మా చిన్నక్కయను మేమెవరం మరిచిపోలేము .మా అక్కయ్య లేని లోటును  మా బావ కు తట్టుకోవటం కష్టమే .గుండె దిటవు చేసుకుని ధైర్యంగా ఆయన ఉండాలి .కుటుంబ సభ్యులందరూ ఆయనకు మనోధైర్యం కలిగిస్తూ మామూలు మనిషిని చేయాలి .

  శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలతో

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-18 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ –

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.