ఉయ్యూరు విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?
అది ఉయ్యూరు విష్ణాలయం ,శివాలయాలకు ఒకే ఎక్సి క్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకట రెడ్డి ఉన్నకాలం .అప్పుడు బ్రాహ్మణ సంఘం కూడా శ్రీ వేమూరి దుర్గయ్య గారి అధ్యక్షతన చాలా పవర్ ఫుల్ గా ఉండేది .విష్ణ్వాలయ వంశ పారంపర్య అర్చకులు ,ఆలయ ప్రతిస్టాది క్రతువులలో నిష్ణాతులు శ్రీ వేదాంతం శ్రీ రామాచార్యులు గారు విష్ణ్వాలయం లో వైశాఖమాసం లో స్వామి వారలకు కల్యాణం జరగటం లేదని బ్రహ్మోత్సవాలు కూడా ఆగి పోయాయని కనబదడినప్పడల్లా మాతో ఆవేదనగా చెప్పేవారు .బ్రాహ్మ సంఘం మీటింగు లలోనూ మొత్తుకునేవారు . మే మేం చేయగలం .పైన ఆఫీసర్లు వగైరాలున్నారు .మా వల్ల ఏమవుతుంది .అనుకునేవాళ్ళం .ఇలా పదే పడదే మా చెవుల్లో ఇల్లు కట్టుకుని హోరు పెడుతుంటే ఒక్కసారి నామనసు గతం లోకి ‘’గుండ్రాలు చక్రాలు ‘’ద్వారా వెళ్లి అప్పటి కళ్యాణ వైభోగం కళ్ళకు దర్శన మిచ్చింది .
మా చిన్నతనం లో విష్ణ్వాలయ కమిటీ ప్రెసిడెంట్ గా హెడ్ కర్ణం శ్రీ ఆది రాజు నరసింహా రావు గారు ఉండేవారు .ఆయన,ఆయన శ్రీమతి పీటలమీద కూర్చుని వైశాఖ పౌర్ణమి నాడు లేక త్రయోదశి నాడు రాత్రి పూట స్వామి వారలకు కల్యాణం చేసేవారు .పుచ్చపువ్వు లాంటి పండు వెన్నెలలో మాకు గొప్ప అనుభూతి కలిగేది .శ్రీ వేదాంతం రామచంద్రాచార్యులు శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యులు శ్రీ వేదాంతం వాసుదేవా చార్యులు మొదలైన అర్చకులు చాలా పద్దతిగా చేయిన్చేవారని జ్ఞాపకం .మా నాన్నగారు మృత్యుంజయ శాస్త్రి గారు , మా మేనమామ గంగయ్యగారు ,చోడవరపు చంద్ర శేఖరరావు గారు ,ఆది రాజు చంద్ర మౌళీశ్వరరావు గారు డా మామిళ్ళపల్లి నరసింహ మూర్తిగారు , జస్టిస్ వారణాసి సదాశివ రావు, బూరగడ్డ బసవయ్య గారు, ఊర సోదరులు, చిన్నకర్ణం సీతంరాజు లింగమూర్తి సామశివరావు గార్లు వంటి పెద్దలు అందరూ విధిగా హాజరయ్యేవారు .ఆలయం స్త్రీపురుషులతో కిక్కిరిసి పోయి ఉండేది .మేము పిల్లలం .కాసేపు ఇక్కడ వేడుక చూస్తూ కాసేపు రావి చెట్టు కింద ఆడుతూ ,సరిగ్గా మామిడి పళ్ళు పంచి పెట్టె సమయం లో చేరేవాళ్ళం .కళ్యాణ శోభతో పాటు విరగ బూసిన పొగడపూల సుగంధం ఇప్పటికీ మా నాసా పుటలలో భద్రం గా కూర్చుంది .ఆ పూలు ఏరుకుని తినటం అప్పుడొక సరదా .గన్నేరురు పూలలోని మకరందం తాగటం మరో వేడుక . కరణం గారిని చలోక్తులతో ఆట పట్టించేవాడుమామయ్య . .ఆయనకు కోపం వచ్చినా తమాయి౦చుకునేవారు .ఆయన మా మేనమామకు సహాధ్యాయి ,ఏరా అనే చనువు .కల్యాణం రోజు రాత్రి’’పెద్ద పెద్ద బంగినపల్లి పళ్ళు ‘’. .స్వామికి నివేదన చేసి అందరికీ నరసింహారావు గారు పంచి పెట్టేవారు .వడపప్పు పానకం సరేసరి .మల్లె పూల గుబాళింపు ఉండనే ఉంది .తాటాకు విసనకర్ర ల పంపకం మరో ప్రత్యేకత .ఇలా చాలాకాలం జరిగిన జ్ఞాపకం .అవి బ్రహ్మోత్సవాలు గా జరిగాయా లేదా అన్నది నాకు తెలియని విషయం .ఎన్ని రోజులు చేసేవారో కూడా గుర్తులేదు .
ఇంతవైభవంగా వైశాఖమాస కల్యాణం జరిగేది .తర్వాత కొంతకాలం ఆగి పోయినట్లున్నది .అర్చకులూ తమకు పట్టనట్లే ఉండేవారేమో ?ఇందరు అర్చకులున్నా రామా చార్యులగారికే ఎందుకు పట్టింది బ్రహ్మోత్సవాల పిచ్చి అను కునేవాడిని .ఆయన వీటిలో నిష్ణాతులు .మళ్ళీ ఆ వైభవం తనకాలం లో చూడాలని తహతహ .అంతేకాని వేరొకటి కాదు .ఇలా ఉండగా ఒక రోజు ఆయన మా ఇంటికి వచ్చి బ్రహ్మోత్సవాల సంగతి మళ్ళీ ప్రస్తావించి ‘’ప్రసాదూ !నువ్వు వెళ్లి రెడ్డి గారితో మాట్లాడితే ఒప్పుకుంటారు ‘’అన్నారు .’’నేను ఒక్కడినీ వెడితే సంఘబలం ఉండదు .అందరం ఆలోచించి నిర్ణయానికి వచ్చి ఆయన్ను కలవాలి ఇంతమంది వచ్చి అడిగారు కనుక ఆయన మనసు మారవచ్చు ‘’అని నచ్చ చెప్పాను సరే అని వెళ్లి పోయారు .
ఈ విషయం దుర్గయ్య ,సీతంరాజు లక్ష్మీనారాయణ ,మంత్రాల రాధాకృష్ణమూర్తి ,గోవిందరాజు వెంకటేశ్వరరావు ,వేగరాజు సోదరులు, బూరగడ్డ కృష్ణమోహన్ మొదలైన వారందరితో చర్చించి అందరం కలిసి ఇ వో రెడ్డి గారిని శివాలయం లో కలిసి విషయం అంతా వివరంగా చెప్పాం .ఆయన కోపం తో ‘’వీరభద్రుడే ‘’అయ్యాడు .ఎందుకో ఆయనకు అర్చకులమీద కోపం ఉన్నట్లు కనిపించింది .నెమ్మదిగా నేనూ దుర్గయ్య మాట్లాడి ‘’ఉత్త బద్రయ్య ‘’ను చేసి శాంతపరచి ‘’బ్రహ్మోత్సవాలను పునరుద్ధరించటం తప్పని సరిగా జరగాలి .ఒక వేళ మీకు నిధులు లేకపోతె మేమందరం తలా కాస్తా వేసుకుని సహాయ పడతాం .ఆ ముసలాయన కోరిక తీరుద్దాం .ఇది గ్రామానికి మంచిది శ్రేయస్కరం కూడా’’ అని నచ్చజెప్పాం .ఆయన కూడా ఆలోచించి ‘’ఈ ఏడాది కి మాత్రం ఒక్క రోజే చేద్దాం .ఫండ్స్ మేమే ఇస్తాం .ఆచార్లగారిని అతిగా ఆశ పడొద్దని చెప్పండి ‘’అన్నారు .హమ్మయ్య అనుకుని విష్ణ్వాలయం లో రామాచార్యులగారిని కలిసి విషయం అంతా వివరం గా చెప్పాం .ఆయన ఆనందానికి అవధులు లేవు .
వైశాఖ మాసం పౌర్ణమి రోజో ఎప్పుడో బ్రహ్మోత్సవాల పేరిట శ్రీ పంచ పట్టాభి రామస్వాములకు శ్రీ రాజ్య లక్ష్మీ వేణుగోపాలస్వాములకు అతి నిరాడంబరం గా కళ్యాణ వైభవం శ్రీ రామాచార్యుల ఆధ్వర్యం లో రెడ్డిగారి దంపతులు పీటలపై కూర్చోబెట్టి జరిపించాం. మేమందరం హాజరయ్యాం. ప్రసాదాలు కూడా మా బృందం చేయించిందని గుర్తు .తర్వాత తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ జరుగుతూనే ఉన్నట్లు అనిపించింది .ఒకసారి మాత్రం ఆలయం లోపలా బయటా తాటాకు పందిళ్ళు వేసి రంగ రంగ వైభవం చేశారట .ఒక రోజు చూడటానికి వెడితే చేయించే ఆచార్యు స్వాములే ఎక్కువ భక్తులు తక్కువగా కనిపించారు .బహుశా కమ్యూని కేషన్ గాప్ అనుకున్నా .
ఈ సంవత్సరం మే 1 వరకు బ్రహ్మోత్సవాలు వారం రోజులు చేస్తున్నట్లు కనిపించింది .బయట బానర్ చూసి తెలుసుకున్నా .నిన్న మా అన్నయ్యగారబ్బాయి రాం బాబు మా ఇంటికి వస్తే బ్రహ్మోత్సవాల ప్రస్తావన వస్తే వాడిని వెళ్లి చూశావా అని అడిగితె వెళ్లి చూస్తూనే ఉన్నాను అంటే జనం బాగా వస్తున్నారా అంటే ‘’పాతిక-ముప్పై ‘’మంది కల్యాణం రోజున ఉన్నారన్నాడు .ఇంత వైభవంగా చేస్తుంటే ఊళ్ళో జనం ఎందుకు హాజరవటం లేదో ఆశ్చర్యం .వాడు చెప్పిన దాని బట్టి అర్చకులకు ,ఆలయ పాలక మండలి వారికి సరైన అవగాహన ,సయోధ్య ఉన్నట్లు లేదని అర్ధమయింది .ఏమైనా ‘’దే. పె.అం .హ’’అంటే దేవుడి పెళ్ళికి అందరి హడా విడి ఉంటేనే శోభస్కరం కదా .రాం బాబు తో మాట్లాడగానే ఇవన్నీ ఫ్లాష్ బాక్ గా వచ్చాయి .అవే ఇక్కడ రాశాను . ఇంతకంటే ఎవరికైనా వివరాలు తెలిస్తే తెలియ జేసి వ్యాసాన్ని సంపూర్తి చేయవచ్చు.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-30-4-18 –ఉయ్యూరు