6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్ ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్
నా దారి తీరు-108
అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ
నేను మేడూరు లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991 ఆగస్టు 14 సాయంత్రం అడ్డాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా చేరాను .అక్కడ నాకు గుమాస్తా అంజిరెడ్డి తెలుసు .ఇద్దరం పామర్రులో ఇదివరకుకలిసి పని చేయటం ,వాళ్ళ అమ్మాయిలిద్దరూ ,అబ్బాయి అక్కడ చదవటం అతని పెద్దమ్మాయిని ఉయ్యూరు దగ్గర యాకమూరు లో ఉంటున్న నా శిష్యుడికిచ్చి వివాహం చేయటం జ్ఞాపకం వచ్చాయి . లాబ్ అసిస్టెంట్ శ్రీ బాలకృష్ణ ఎర్రగా తెల్ల గ్లాస్కో పంచెకట్టు చొక్కాతో నవ్వుతూ పలకరించాడు . స్కూల్ లో కరెంట్ పోయి చాలాకాలమైంది .పాత హెడ్ మాస్టర్ మనం వెళ్లి పోతున్నాం కదా అని పట్టించుకోలేదు . మరి రేపు ఆగస్టు 15 జండావందనం స్వాతంత్ర దినోత్సవం జరిపే ఏర్పాట్లు చేశారా అని అడిగితె బెల్లం కొట్టిన రాయి లాగా ఎవరూ మాట్లాడలేదు .నోటీస్ పంపారా అంటే ఇంచార్జి హెచ్ ఏం, సైన్స్ మాస్టర్ కె వెంకటేశ్వరరావు పంపించారని అన్నారు . అసలు జెండా ఉందా అని అడిగితె చినిగి పోయింది అన్నాడు రెడ్డి . నా తపన గుర్తించిన బాలకృష్ణ ‘’సార్ !ఈ రాత్రికి ఎలక్ట్రీషియన్ ను పట్టుకొని రేపు పొద్దున్న కల్లా కరెంట్ వచ్చేట్లు చేస్తాను ఖర్చు నేనే పెడతాను జండా రెడ్డి తో తెప్పించటం మిగిలిన ఏర్పాట్లు నేనే బాధ్యతగా చేస్తాను ‘’అన్నాడు .హమ్మయ్య అనుకొన్నా .అంటే ఇక్కడ అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలన్నమాట . కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామ బ్రహ్మం గారిని ఊరిలోని పెద్దలనూ కూడా ఆహ్వానించమని చెప్పాను . సరే దిగితేకాని లోతు లోతు (టు)తెలియనట్లు ఇక కార్యక్రమం ,ప్రక్షాళన ప్రారంభించాలని సంకల్పించా .ఏ శుభ ముహూర్తం లో ఈ సంకల్పం వచ్చిందో తెలియదు కానీ ,నేను1998 జూన్ 31 అంటే సుమారు 7 ఏళ్ళు ఇక్కడ పని చేసిన కాలం లో నాకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవ్వలేదు . నేను అనుకొన్న అన్ని పనులు చేసి గుడివాడ డివిజన్ లో అడ్డాడ మోడల్ హై స్కూల్ అనే పేరు తేగలిగాను .విద్యాశాఖ ,జిల్లాపరిషత్తు ,అందరూ ఏదైనా నేర్చుకోవాలంటే అడ్డాడ హై స్కూల్ కు వెళ్లి నేర్చుకోండి .అని చెప్పేవారు .కావాలని ఇక్కడికి వచ్చినందుకు నాకూ ,పాఠశాలకు గొప్ప గుర్తింపు వచ్చింది .
అడ్డాడలో మొదటి స్వాతంత్ర దినోత్సవం
15-8-1991 జండా పండుగనాడు ఉదయం ఉయ్యూరులో బయల్దేరి రెండు బస్సులు మారి 9 గంటలకే అడ్డాడ చేరాను . స్టాఫ్ అందరూ వచ్చారు .రామ బ్రహ్మం గారు వచ్చి పలకరించారు .కరెంట్ వచ్చింది కొత్త జెండా వచ్చింది .పతాకావిష్కరణ చేశాను . విద్యార్థులు వందేమాతరం జాతీయగీతాలు పాడారు .పిల్లలందరికీ బాలకృష్ణ కొన్న బిస్కట్లు చాకోలెట్లు పంచిపెట్టాం .తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి టీ బిస్కెట్స్ ఇప్పించాను .ఇక్కడ నాకు పామర్రులో నాతోపాటు పనిచేసిన సెకండరీగ్రేడ్ మాస్టర్ శ్రీ డి వీరభద్రరావు ఉండటం కొంత బలాన్నిచ్చింది . మంచివాడు సమర్ధుడు ,విలువలు కోరేవాడు . నన్ను నేను అందరికి పరిచయం చేసుకొని స్టాఫ్ మెంబర్లను ఒక్కొక్కరినీ ఎవరి పరిచయం వారు చెప్పమని వారి గురించి తెలుసుకున్నాను . నేచురల్ సైన్స్ బోధించే డి ఏం విజయలక్ష్మి ఇంగ్లిష్ ఏం ఏ కూడా . వెంకటేశ్వరరావు ఫిజికల్ సైన్స్ టీచర్ . యెన్ .సీతారామరాజు లెక్కల మే స్టర్ . శ్రీ టి .ఎల్ .కాంతారావు గ్రేడ్ వన్ తెలుగుపండిట్ . గ్రేడ్ 2 తెలుగుపండిట్ లేడీ శ్రీమతి పార్వతీదేవి . సమర్ధురాలైన టీచర్ .ప్రశాంతత ,పవిత్రత ముఖం లో స్పష్టంగా కనిపించేవి . సోషల్ మాస్టారు శ్రీ సి హెచ్ వెంకటేశ్వరరావు మంచి దైవ భక్తి ఉన్నవారు ,ఆదర్శప్రాయుడైన టీచర్ ఆరోగ్యం తక్కువే అయినా చాలా కష్ట పడి పని చేసే తత్త్వం అరవింద శిష్యులు . క్రాఫ్ట్ మాస్టర్ కె . మల్లికార్జునరావు క్రాఫ్ట్ పని ఏమీలేక గార్డెన్ పని చూసేవాడు .ఎస్ సుజాతః మరొక సెకండరీ గ్రేడ్ టీచర్ .బి ఏ బి ఎడ్ . లైబ్రేరియన్ కూడా అప్పటికి బాలకృష్ణయే .తర్వాత రాజా రావు వచ్చి చేరాడు .ఘంటసాలలాగా పాడగలడు . తర్వాత డ్రిల్ మాస్టర్ గా శ్రీ తుర్లపాటి జగన్మోహనరావు గారు .’’అంతా భగవదనుగ్రహం ‘’అంటూ నవ్వు ముఖం తో పలకరించేవారు . అటెండర్ గురవయ్య నైట్ వాచ్ మన్ ప్రసాద్ .ఈ ఇద్దరూ కుర్రాళ్లే .వినయంగా ఉండేవారు . అంజిరెడ్డి గుమాస్తా . ప్రస్తుతం వీరే స్టాఫ్ మెంబర్లు .స్టాఫ్ సెక్రెటరీ లేడు .
నేను అడ్డాడరావాలంటే ఉయ్యూరు నుంచి పామర్రు వచ్చి ,అక్కడ గుడివాడ వెళ్లే బస్ ఎక్కి అడ్డాడ లో దిగాలి. రోడ్డుకు బడి చాలాదగ్గరే . ఫెన్సింగ్ లేదు .అందరూ స్కూల్ నుంచే రాకపోకలు . రిటైర్డ్ నైట్ వాచ్ మన్ అబ్రహాం బడికి దగ్గరలో ఉండేవాడు .ఎప్పుడూ ‘’ఫుల్ డోస్’’ లో ఉండేవాడు .అప్పుడప్పుడు వచ్చి పలకరించేవారు .అతని భార్యా కూతురు కూడా వస్తూ ఉండేవారు . మొదటి స్టాఫ్ మీటింగ్ పెట్టి ,స్టాఫ్ సెక్రెటరీని ఏర్పాటు చేసుకోమని చెప్పాను అందరూ ఏకగ్రీవంగా ఫిజికల్ సైన్స్ మాస్టర్ వెంకటేశ్వరరావు పేరే చెప్పారు . ఆయన్నే చేసాం ,అసిస్టెంట్ గా వీరభద్రరావు ఉంటె బాగుంటుంది అన్నారు ఒకే చేశా . ‘’నేను పొడిచేస్తా చింపేస్తా అని చెప్పను .మనం అందరం కష్ట పడి పని చేద్దాం బడికి మంచి గుర్తింపు సాధిద్దామ్ . పదవతరగతి సెంటర్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది .తర్వాత తీసేశారు .మనం అందరం తీవ్ర ప్రయత్నం చేసి సెంటర్ తెప్పిద్దాం .క్రమశిక్షణ చాలాముఖ్యం .టెస్ట్ పరీక్షలతో సహా అన్ని పరీక్షలూ స్ట్రిక్ట్ గా నిర్వహిద్దాం . కాపీలను అనుమతించవద్దు .అన్ని జాతీయ పండగలు చేద్దాం .పిల్లలతో సృజన శక్తిని పెంచటానికి ప్రతి 15 రోజులకొకసారి డిబేట్ ,వ్యాసరచన క్విజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిద్దాం . బహుమతులు ఇద్దాం .అప్పుడు వాళ్లలో కొంత కదలిక వస్తుంది ‘స్కూల్ అసెంబ్లీ సమయానికి అందరం హాజరవుదాం . క్లాస్ టీచర్లు క్లాస్ వెనకాల ఉండాలి . జాతీయ గీతాలు బాగా ప్రాక్టీ స్ చేయించాలి . అటెండెన్స్ బాగా ఉండేట్లు చూడండి .పరీక్ష పెట్టిన నాలుగైదు రోజుల్లో పేపర్లు దిద్ది మార్కులు ఇవ్వండి .పిల్లలకు రాసిన ఆన్సర్ షీట్లు ఇచ్చి తప్పొప్పులు తెలియ జేయండి . మార్కుల రిజిస్టర్ లో క్లాస్ టీచర్ మార్కులు పోస్టింగ్ చేయండి .కన్సాలిడేటెడ్ ఆటేండెన్స్ రిజిస్టర్ లో పేర్లు రాసి ప్రతినెలా హాజరు నమోదు చేయండి .ప్రోగ్రెస్ రిపోర్ట్ లు తయారు చేసి మార్కులు తగ్గిన చోట్ల రెడ్ ఇన్క్ తో సున్నా చుట్టి ,నాకు చూపి నా సంతకం అయ్యాక పేరెంట్ సంతకాలు పెట్టించి కలెక్ట్ చేయండి . లైబ్రరీ పుస్తకాలు చదివించండి . ఆటలు ఆడించండి . డ్రిల్ క్లాస్ విధిగా జరగాలి. వారానికొకసారి మాస్ డ్రిల్ ఉండాలి .టైం టేబుల్ కూడా ఈ ప్రకారం ఉండాలి ‘’అని చెప్పి వెంకటేశ్వరరావు రాజు గార్లకు టైం టేబుల్ బాధ్యత అప్పగించి నేను ఇంగ్లిష్ ప్రోజ్ అండ్ పొయిట్రీ ,నాండీటైల్డ్ తో సహా తీసుకొన్నాను .
ఇది ఆర్ధికంగా బాగా వెనకపడిన ఊరు .ఎక్కువమంది ఎస్ సి, బి సి విద్యార్థులు .హాస్టల్ లో ఉంటారు .కనుక చదువు చాలాతక్కువ .ఎంతో రుద్దితే ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటే తప్ప చదువు రాదు .పదవతరగతి ఉత్తీర్ణతా శాతం 25 మాత్రమే .కనుక నాకు ఒక సవాల్ గా మారింది .క్రమంగా నరుక్కు రావాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-17-కాంప్-షార్లెట్-అమెరికా