నా దారి తీరు – 109
ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం
ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం చేయటం అనేది లేదు .అందుకని మొదటి సారిగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరిపి విద్యార్దులచేత తమ ఉపాధ్యాయులందరికీ పుష్పగుచ్చాలు ఇప్పించి ,పదవ తరగతి విద్యార్దులచేత పాధ్యాయులకు బిస్కెట్లు టీలు ఏర్పాటు చేయించాను .రాదా కృష్ణన్ పటాన్ని కొనిపించి పూలమాల వేయించాను .అంతకు ముందే స్టాఫ్ తో చెప్పి ,అద్దాడ లో పని చేసి ఇటీవలే రిటైర్ అయిన ఉపాధ్యాయులు ,సమర్ధులైన ఇద్దరికీ సన్మానం చేద్దాం అని చెప్పాను అందరూ చాలా సంతో షించారు .అలాంటి వారిలో ఇక్కడ అందరి హృదయాలనూ ఆకర్షించినవారు ఇద్దరున్నారని చెప్పారు .వారు శ్రీ రత్తయ్య-ఈడుపుగంటి వెంకట రత్నం అనే డ్రిల్ మాస్టర్ ,శ్రీ కే .సుబ్బారావు అనే సేకండరీ గ్రేడ్ టీచర్(తాడంకి వాస్తవ్యులు ) .రత్తయ్య గారు రుద్రపాక హెడ్ మాస్టర్ శ్రీ ఈడుపుగంటి వెంకటేశ్వరరావు (ఈ వి ఆర్ )సోదరుడు . వీళ్లిద్దరితో నేను మానికొండ హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పనిచేసినప్పుడు మా స్టాఫ్ మెంబర్లం మా హెడ్ మాస్టారు ఏం వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యం లో రుద్రపాక వెళ్లి జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారింట ఆతిధ్యం పొంది ఫ్రెండ్లీ మాచేస్ గా వాలీ బాల్ ,బాడ్ మింటన్ రెండు రోజులు సరదాగా ఆడిన విషయం గుర్తుకు కోస్తోంది .చైర్మన్ గారి ఆతిధ్యం ఆత్మీయత ,ఆయన అన్నగారి మన్నన ఈ వి ఆర్ గారి సహృదయత మరువలేనివి .సుబ్బారావు గారు తాడంకి లో ఉండేవారుకనుక ఆయనతో కొంత పరిచయమూ ఉన్నది .ఇద్దరూ నల్లని వారే అయినా ,తెల్లని పంచె కట్టు ,తెల్ల చొక్కా ,ఖండువాలతో తెలుగుదనం మూర్తీభవించి నట్లు ఉండేవారు . ఉపాధ్యాయ దినోత్సవం నాడు సుబ్బారావు ,రత్తయ్య గార్లను ఆహ్వానించి వారితో విద్యార్ధులకు సందేశం ఇప్పించి విద్యార్దులన్దారి సమక్షం లో వారిద్దరికీ శాలువాలు కప్పి ,పూలదండలు వేసి సత్కరించాం .ఆ ఇద్దరు ఇంతటి అపూర్వ సన్మానానికి పులకించిపోయారు .ఎంతో కృతజ్ఞత ప్రకటించారు .ఇదే ఈ స్కూల్ లో సన్మానాలకు నాంది అయి ,తర్వాత ఏడేళ్ళు అప్రతిహతంగా సాగి, అందరికీ మంచి పేరు తెచ్చింది .పెద్దలను సన్మానించాలి అనే సంప్రదాయానికి వరవడి పెట్టగలిగాను .దీనికి స్టాఫ్ ను, విద్యార్ధులను పూర్తిగా అభినందించాలి .అందరి సహకారం లేనిదే ఇవి కార్యరూపం దాల్చి ఫలవంతం కావు . అందరిలో నూతన ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .ఏపని అయినా సమర్దవంతం గా చేయగలం అనే భరోసా వచ్చింది .
విద్యా బోధన
పదవ తరగతి విద్యా బోధన పై దృష్టి పెట్టాను .తరచుగా క్లాసులకు వెళ్లి బోధనా తీరు ఎలా ఉందొ పరిశీలించి మెళకువలు చెప్పేవాడిని . అవసరమైతే ఎలా బోధించాలో వివరించేవాడిని .ఏడవతరగతి బోధన విషయం లో కూడా ఇదే అనుసరించాను .చైతన్యం తెచ్చి ముందుకు నడిపించాలన్నది నా ధ్యేయం .టెన్త్ లో తారకరాముడు అనే విద్యార్ధి మిగిలిన వాళ్ల కంటే తెలివిగా ఉండేవాడు .వాడికి అన్ని సబ్జెక్ట్ లలోనూ అత్యధిక మార్కులు రావటానికి ప్రత్యెక కృషి చేశాను .మధ్యాహ్నం ఇంటర్వల్ లో ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడిని. సాయంత్రం స్కూల్ తర్వాత ఒక గంట సేపు ఉంచి లెక్కలు ఫిజిక్స్ లలో బిట్స్ పై డ్రిల్లింగ్ ఇచ్చేవాడిని .షార్ట్ ఆన్సర్ లను బాగా బట్టీ పట్టించి రాయి౦చేవాడిని .రోజూ ఉదయం నా క్లాస్ లో ఇంగ్లిష్ హోమ్ వర్క్ చూసేవాడిని .ప్రశ్నలకు ఆన్సర్లు అందరి చేతా చెప్పించేవాడిని .ఇలా ఎంతో శ్రమపడితే కాని వాళ్ళు దారికి రాలేక పోయేవారు .ప్రతి స్కూల్ లో తెలుగు గురించి పెద్దగా ఇబ్బంది ఉండేదికాదు. కాని ఇక్కడ మాత్రం కాంతారావు గారి క్లాస్ చేపల మార్కెట్ గా ఉండేది .పావు గంటలో పాఠం అయిందనిపించి ఆతర్వాత వాళ్ళు ఏం చేస్తున్నా పట్టించుకొనే వాడుకాదు .కనుక నిరంతరం ఆయన క్లాస్ పై దృష్టి పెట్టాల్సి వచ్చేది .ఎన్ని సార్లు ఆయనకు చెప్పినా గోడకు చెప్పినట్లే అయ్యేది .ఇది చాలా ఇబ్బంది గా ఉండేది. కనుక తెలుగు సబ్జెక్ట్ విషయం లోనూ తల దూర్చాల్సి వచ్చింది .ఛందస్సు సరిగ్గా చెప్పేవాడుకాడు .వాటిపై అవగాహన కల్పించేవాడుకాదు .ఉపవాచక బోధన మరీ దారుణం .
తులశమ్మగారు అని హిందీ పండిట్ ఉండేవారు .నేను చేరిన నాలుగైదు నెలలకే రిటైర్ అయ్యారు . కనుక హిందీ బోధనా అందులో రావాల్సిన కనీసమార్కులు కూడా వచ్చే అవకాశం లేకపోయింది .అందుకని ఆవిడ పదవీ విరమణ రోజున ఘనం గా సన్మానం జరిపించి ఆమె ను కొత్త టీచర్ వచ్చేదాకా వచ్చి హిందీ చెప్పమని కోరాము . ఆమె అలాగే చేసి న్యాయం చేశారు . ఆమె భర్త జగపతి రావు గారు కూడా టీచరే.పెంజె౦డ్ర వాసులు వారు .అక్కడ అరవింద స్కూల్ నిర్వాహకులు కనుక డ్యూటీ విషయం లో వారికి ఎవరూ చెప్పక్కరలేదు కూడా .
బాలికలకు ఆటలలో ఉత్సాహం
డ్రిల్ మాస్టర్ జగన్మోహనరావు గారు డ్రిల్ క్లాస్ లను కాఖీ నిక్కర్ ,వైట్ ఇన్షర్ట్ తో పకడ్బందీ గా నిర్వహించేవారు .వారానికొకసారి మాస్ డ్రిల్ చేయించి నన్ను పిల్చి చూడమనేవారు .అంతా బాగానే ఉంది .మరి ఆడపిల్లలు ఇక్కడ ఆడరా అని అడిగాను .’’వాళ్ళు సిగ్గు పడుతున్నారు సార్ .దాన్ని ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తున్నా ‘’అన్నారు .అనుకోకండా గుడివాడలో ఆడపిల్లల గ్రిగ్ స్పోర్ట్స్ జరిగాయి .ఆయన మా స్కూల్ ఆడపిల్లలను అక్కడికి తీసుకు వెళ్లి చూపిస్తానన్నారు .సరే అన్నా ను .బస్ లో గుడివాడ స్వంత ఖర్చులతో తీసుకు వెళ్లి చూపించారు . వాళ్ళలో ఎంతో ఉత్సాహం వచ్చి తప్పకుండా కబాడీ, ఖో-ఖో ,టెన్నికాయిట్లలో ఆడుతాం అని చెప్పారు. అక్కడ తనకు తెలిసిన వస్త్ర వ్యాపారి కి ఈ విషయం చెప్పి వాళ్ళందరికీ బనీన్లు ఇప్ప్పించారు జగన్మోహన రావు గారు .అప్పటినుంచి అడ్డాడ ఆడపిల్లలు ఆటలలో పాల్గోనటం అనేక సార్లు ట్రోఫీలు పొందటం ప్రారంభించారు .వార్షికోత్సవానికి ముందు వ్యాసరచన వక్తృత్వం ,ఆటలలో మగపిల్లలతోపాటు ఆడపిల్లలకూ జూనియర్ సీనియర్స్ విడివిడిగా పోటీ లు పెట్టి౦చి ,అలాగే తరగతి పరీక్షలలో ఆవరేజ్ మార్కు లను తీసుకుని వీరికీ బహుమతులు ఇప్పించాము .కొన్నిటిని టీచర్లు స్పాన్సర్ చేశారు .కొన్ని స్కూల్ ఇచ్చేట్లు చేశాం .
బ్యాంక్ లావాదేవీలు
విద్యార్ధులకు పోస్టాఫీస్ ,బాంక్ లావాదేవీలు అలవాటు కావాలని నా ఉద్దేశ్యం .స్టాఫ్ కు చెబితే మంచిపనే చేదాం అన్నారు .లెక్కల మేష్టారు రాజు గారి ఆధ్వర్యం లో టెన్త్ విద్యార్ధినీ విద్యార్ధులను ఎలమర్రు ఆంధ్రా బాంక్ కు పంపి అక్కడి మేనేజర్ శ్రీ గౌరీశంకర్ గారి చేత వాళ్ళందరికీ ఆక్కడి ట్రాన్సాక్షన్ విధానం అంతా క్షుణ్ణం గా నేర్పించాము .ఆయన ఆశ్చర్యపోయి ‘’రాజు గారూ !ఎవరండీ మీ హెడ్ మాస్టారు ?ఇలా విద్యార్ధులకు నేర్పించాలి అన్న ఆలోచన నావెల్ ధాట్.ఆయన్ను అభినంది౦చానని చెప్పండి .ఏ స్కూల్ వాళ్ళకూ పట్టని ఈ విధానం మీ స్కూల్ లో మీ హెడ్మాస్టారు చేయటం చాలా ఆనందించ దగిన అభినందించదగిన విషయం ‘’అన్నారట .తర్వాత గౌరీ శంకర్ గారిని వార్షికోత్సవానికి ఆహ్వానించటం ఆయన సభాముఖంగా కూడా చెప్పటం జరిగింది .ఆయనతో స్నేహం ఆయన పామర్రు బదిలీ అయినా ఉయ్యూరు బదిలీ అయినా కొనసాగింది. ఉయ్యూరు సాహితీ మాండలి కార్యక్రమలో ఆయన్ను ఆహ్వానించి ప్రసంగింప జేసి సత్కరించాం. గొప్పసంస్కారి పుస్తకప్రియుడు డ్యూటీ మైండెడ్ వ్యక్తి గౌరీశంకర్ గారు .అలాగేఅడ్డాడ పోస్టాఫీస్ కు పంపి విద్యార్ధులకు అవగాహన కల్పించాం .
ఆ సంవత్సరం టెన్త్ ఫలితాలు కొంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి .అందరిలో కష్టపడితే ఫలితం ఉంటుంది అని తెలిసింది .తారకరాముడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు .తర్వాత అతను నూజివీడు కాలేజి లో లెక్కల లెక్చరర్ అయ్యాడని విన్నాను. వినయం, విధేయత , విద్యా, అణకువ ఉన్న ఉత్తమ విద్యార్ధి తారక రాముడు . అతడిని మరచి పోలేను .ఏడవ తరగతి పరీక్షలు స్ట్రిక్ట్ గానే జరిపాం .ఫలితాలు బాగానే వచ్చాయి .సంచాయిక అనే పిల్లల డబ్బు పొడుపు కార్యక్రమం కూడా బాగా నిర్వహించి ఎక్కువ డబ్బు కూడ బెట్టినవారికి బహుమతులిచ్చాం .హాజరు బాగా ఉండి క్రమ శిక్షణ ,చదువు ,ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో ముందుండే వారిని ఎంపిక చేసి వారికీ బహుమతులు అందించాం .బెజవాడ వెళ్లి మంచి పుస్తకాలు కొని బహుమతులుగా ఇచ్చాం .
ఏపని జరగాలన్నా డబ్బు కావాలి .ఇది ఎస్ టి ,ఎస్ సి విద్యార్ధులు ఎక్కువగా ఉన్న స్కూలు .స్పెషల్ ఫీజులు వాళ్ళు కట్టక్కరలేదు .రాయితీ ఇస్తుంది ప్రభుత్వం .మిగిలిన వారి ద్వారా వచ్చే ఆదాయం అతి స్వల్పం .చాక్ పీస్ డబ్బాలు కొనటానికి కూడా సరిపోదు .కాని అన్ని కార్యక్రమాలు పకడ్బందీ గా జరగాల్సిందే .కనుక ప్రత్యేక ఆలోచన చేయాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చాను .ఆ విషయాలు తర్వాత తెలియ జేస్తా .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –4-5-18-ఉయ్యూరు
—