నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

   నాదారి తీరు -110

  అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

             త్రాగు నీరు సరఫరా

ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ  గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి .వేసవిలో నీటి మట్టం తగ్గిపోతుంది .చుట్టుప్రక్కలవాళ్ళు అందరికీ ఈ నుయ్యే శరణ్యం .నీళ్ళు రుచిగా ఉండటం అదృష్టం .నైట్ వాచ్ మాన్ ప్రసాద్ స్కూల్ గదులన్నీ శుభ్రంగా ఊడ్చి,  ప్రతి రెండు తరగతి గదులకు ఏర్పాటు చేయబడిన మంచి నీటి కుండలో నీరు నింపే ఏర్పాటు అప్పటికే ఉన్నది అతడు జాగ్రత్తగానే విధి నిర్వహిస్తున్నాడు .కానీ జనవరి నుంచి నీటి వాడకం ఎద్దడీ ఎక్కువే .అందుకని సైన్స్ మాస్టర్ వేంకటేశ్వర రావు గారితో సంప్రదించి ఏం చేయాలో ఆలోచించాను .అప్పుడు ఆయన లాబరేటరి  లో ఎప్పటి నుంచో ఇనపగోట్టాలు  ,ఒక మోటారు పది ఉన్నాయి .వాటిని సద్వినియోగం చేస్తే బాగుంటుంది అన్నాడు .స్టాఫ్ అస్తుంది తో చర్చించి  మోటారు ను బాగుచేయించే ఏర్పాటు ,ఉన్న తాగు నీటి పంపులకు గొట్టాలలద్వారా కనెక్షన్ ఇప్పించాము .అంటే మోటారు వేయగానే త్రాగటానికి నీళ్ళు టాప్ ల లోకి వస్తాయి  .కొంతకాలం ఇలా గడిపాం .తర్వాత సైన్స్ రూమ్ పై భాగం లో ఒక చిన్న టాంక్ కట్టించి లేక ఉన్నదాన్ని బాగు చేసి టాంక్ కు గోట్టాలద్వారా కనెక్షన్ ఇప్పించాము .దీనితో కరెంట్ ఆదా కూడా చేయగలిగాము .కనుక సమృద్ధిగా త్రాగు నీరు విద్యార్ధులందరికీ అందించ గలిగామన్నమాట .దీనితో ఊళ్ళో  వాళ్లకు పరిసరగ్రామాల వారికి అద్దాడ హైస్కూల్ లో ఏవో  మంచి  మార్పులు జరుగుతున్నాయనే నమ్మకం కలిగింది .విద్యార్ధులకూ గొప్ప తృప్తి కలిగింది .మధ్యాహ్నం ఇంటర్వల్ లో క్లాసులు సాయంకాలం స్కూల్ తర్వాత  ఏడు ,పదీ తరగతులకు రుబ్బుడూ మానలేదు . కష్టపడితేనే మార్కులోస్తాయి అనే నమ్మకం బాగా కలిగించాను .బై పాస్ ఆపరేషన్ కు స్థానం లేదు అని అందరూ గ్రహించారు .

  వరి కోతలు మినప తీతలతో ఆర్ధిక పుష్టి

 ముందే చెప్పినట్లు ఏపనికైనా డబ్బే ప్రధానం .ఇక్కడ అది తప్ప అన్నీ ఉన్నాయి .మరి విద్యార్ధులకు మంచి బహుమతులివ్వాలన్నా గేమ్స్ ఆర్టికల్స్ కొనాలన్నా లాబ్ కు కావలసిన యాసిడ్స్ వగైరాలు కొనాలన్నా డబ్బు కావాలి .ఒక సారి స్టాఫ్ మీటింగ్ లో ఈ విషయమై చర్చించాం .ఒకప్పుడు ఇది హయ్యర్ సెకండరీ స్కూల్ .గొప్ప లాబ్ ఉంది .సైన్స్ రూమ్ లో ణే బోధన చేయటానికి ప్రయోగాలు చేయటానికి అనువుగా బల్లలు టేబుల్స్ ,వగైరా సరంజామా అంతా ఉంది .వాడకం లోకి తెచ్చే స్థితి మాత్రం లేదు .కారణం ప్రయోగాలు చేయటానికి కావలసిన కెమికల్స్ వగైరా లేవు .జిల్లాపరిషత్ ఏడాదికో రెండేళ్ళకో యేవో కొన్ని వాళ్లకు లాభాలు డబ్బూ బాగా గిట్టేవి కొని మొక్కుబడిగా మాకు సరఫరా చేసే వారు .అందులో పనికొచ్చేవి తక్కువే .అలాగే వాలీబాల్ బాడ్ మింటన్ ,టేన్నికాయిట్ బేస్ బాల్ వంటి ఆటలకు కావలసినవి కొనతానికీ డబ్బుకావాలి .కనుక స్కూల్ ఆ ర్ధికంగా పరి పుష్టి పొందనిది ఏమీ చేయలేము అని అందరం నిర్ణయించాం .

  అప్పుడు నాకు ఉయ్యూరు హైస్కూల్ లో అని చేసినప్పుడు పిల్లలతో  వరి కోతలుకోయించటం ,తర్వాత అడ్డాడ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పనిచేసిన బాలబందు ,బాలానందం అన్నయ్య శ్రీ ముదునూరు వేంకటేశ్వర రావు గారుతన అనుభవాలు గురించి ‘’మహాత్ముల అడుగు జాడలలో ‘’అనే ఆత్మకధ ను మా బావమరది ఆనంద్ నాకు ఇస్తే చదివా.అందులో ఆయన అద్దాడ లో వారి కోతలు కోయి౦చినట్లు రాసిన విషయం గుర్తుకు వచ్చింది .స్టాఫ్ కు ఈ విషయం చెప్పాను .ఎవ్వరూ సందేహించలేదు అందరూ తప్పకుండా చేద్దాం అన్నారు .తర్వాత ఒక రోజు స్కూల్ అసెంబ్లీ లో ఈ విషయం విద్యార్ధులందరికీ తెలియజేశాం .వారు మాకంటే ఎక్కువ ఉత్సాహం చూపించి అందరం పాల్గొంటామని హామీ ఇచ్చారు .హమ్మయ్య మంచి పరిష్కారం  దొరికింది అని అందరం ఊరట చెందాం కమిటీ ప్రెసిడెంట్ రామ బ్రమం గారి చెవిలో కూడా వేయించాం  కూడా ఆయనకు సన్నిహితులైన వారి ద్వారా .ఇక ప్లాన్ అమలు చేయటమే తరువాయి .

 డ్రిల్ మాస్టారు జగన్మోహనరావు గారు తమిరిస బదిలీ అయ్యారు ఆయన స్థానం లో శ్రీ దుగ్గిరాల నాగేశ్వరరావు అనే అంగలూరు నేటివ్ ,ఉత్సాహవంతుడు యువకుడు వచ్చి చేరాడు .ఆటలు ఆడటం ఆడించటం తర్ఫీదు ఇవ్వటం లో క్షణం కూడా తీరిక లేకుండా ఉండేవాడు .మాంచి నమ్మకస్తుడు గొప్ప ఆలోచనా పరుడు కార్య సాధకుడు .దీనితో నాకు కొండంత బలం కలిగింది .రోజూ లాస్ట్ పీరియడ్ లో ఆ తర్వాత సాయంత్రం 6 వరకు వాలీబాల్ ,బాడ్ మింటన్ ఆడేవాళ్ళం . పిల్లలలో కూడా ఆటలమీద బాగా శ్రద్ధ ఏర్పడింది ఆడపిల్లలతో సహా .కోర్టులు వేయాలన్నా కబాడీ కోర్టుకు ఇసుక కావాలన్నా సున్నం వేయాలన్నా ,బాల్స్ కొనాలన్నా డబ్బు కావాలి కనుక అందరం వరి కోతలు కోసి డబ్బు సంపాదించి కూడ బెడదామనే సంకల్పం అందరిలో బలీయమైంది . కనుక ఆటకైనా చదువు కైనా డబ్బు కావాలని గ్రహింపు కలిగింది .ఇనుము వేడిమీద ఉన్నప్పుడే ఎలాకావాలంటే అలా మలచుకోవచ్చు కదా .అదే అమలు చేశాం .

   క్రాఫ్ట్ మాస్టారు మల్లికార్జునరావు  గుమాస్తా అంజిరెడ్డి ,బాలకృష్ణ  వీరభద్రరావు లు ఊళ్ళో కోతకు సిద్ధంగా ఉన్న పొలాలను చూసి  అందులో విద్యార్ధులతో కోత కోయి౦చు కోవటానికి ఇష్టపడేరైతులను  డబ్బు కోసం త్రిప్పించుకోకుండా ఇచ్చేవారినీ ,విద్యార్ధులు ఎక్కువ దూరం నడవకుండా వెళ్ళగలిగే పొలాలను ఏ రోజు కోయాలో బురద లేని పొలాలను   ఎంపిక చేసి ,ఎకరానికి ఎంత ఇస్తున్నారో వాకబు చేసి  మాకు తెలియ జేసే వారు .అసెంబ్లీ లో తెలియ జేసి  ఆ రోజుకు సిద్ధమయ్యే వాళ్ళం .పామర్రు నుంచి పండిన అరటి గెలలు  ,బిస్కట్లు తెప్పించి వాటిని రిక్షాలో కోతకోసే పొలం దగ్గరకు చేర్పించి అందరం స్కూల్ నుండినడిచి వెళ్ళేవాళ్ళం .మాస్టర్లు అందరూ మంచి సహకారం ఇచ్చేవారు .లేడీ టీచర్స్ కూడా సందేహించకుండా వచ్చేవారు .అదొక పండుగ వాతావరణం లాగా అని పించేది .ఇక్కడి విద్యార్ధులు పొలం పనిలో ఆరి తేరిన వాళ్ళే కనుక కోత ఎలా కోయాలో చెప్పే అవసరం లేకుండా పోయింది .ఏడాదికి కనీసం 15-నుంచి 20 ఎకరాలు కోసేవాళ్ళు .వాళ్లకు కడుపునిండా బిస్కట్లు ,అరటి పళ్ళు ఇచ్చేవాళ్ళం ఎలాగూ వాళ్ల లంచ్ బాక్స్ వాళ్లకు ఉండనే ఉండేది .కనుక ఆకలికి ఎవరూ ఇబ్బంది పడలేదు రైతులు కూడా చాలా హుషారుగా ఇంతమంది మేస్టార్లు విద్యార్ధులు హెడ్ మాస్టారు తో సహా తమ పొలానికి వచ్చారని సంబర పది పోయేవారు ఇంటి దగ్గర ఉప్మా పులిహోర ,టీ చేయించి పాలేల్లతో తెప్పించి మాకు అందించేవారు .చాలా సుహ్రుద్వాతావరణం లో వరి కోతలు జరిగేవి .రైతుల వద్దనుంచి మక్తా కోత డబ్బు తెచ్చి నాకు అందాజేసేవారు దాన్ని పామర్రు ఆంధ్రాబాంక్ లో ఉన్న స్కూల్ జనరల్ ఫండ్ లో జమ చేసేవాడిని .

   వరికోతల తర్వాత అందరికీ మినపతీత తీస్తే బాగుంటుంది అని పించింది .విద్యార్ధులు కూడా చాలా సంతోషం గా ఒప్పుకున్నారు .కోత కంటే తీత కు డబ్బులు బాగా వచ్చేవి .ఏడాదికి కనీసం పది ఎకరాలు మినపతీత తీసే వాళ్ళం .డబ్బు ఇబ్బడి ముబ్బడిగావచ్చి పడిం ది .ఇక దేనికీ లోటు ఉండదు అనుకున్నాం విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించటానికి అవకాశం లభించింది .ఒక ఐడియా జీవిత విధానాన్నే మార్చేసింది .అడ్డాడ స్కూల్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాందీ వాచకం పలికే శుభ ఘడియలు వచ్చాయి .

  ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనం గా జరిపాం .విద్యార్ధులకు అన్ని విషయాలలో పోటీలు నిర్వహించి మంచి మంచి బహుమతులువారి స్థాయికి తగ్గట్లు పాయింట్ల బేస్ పై కొని అందించాం .స్కాలస్టిక్ అచీవ్ మెంట్ కు ఉపయుక్త గ్రంధాలు కొని బహూకరించాం స్కూల్ బెస్ట్ విద్యార్ధులకు జూనియర్స్ సీనియర్స్ లో ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చాం .ఎక్స్ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్ లో పాల్గొని గెలుపొందినవారికీ అంద జేశాం  .టీచర్ గేమ్స్ లో గెలిచినవారికీ బహుమతులిచ్చాం .ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ లో చదువుతున్న ప్రతి ముగ్గురులో ఒకరికి ఏదో ఒక బహుమతి వచ్చేది .ఇవాళఅన్నీ విద్యార్ధులలో గొప్ప స్పూర్తి దాయకమై ,ప్రేరణకలిగించి  పాఠశాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమయే మనస్తత్వం కలిగింది .పడవ తరగతి ఫలితాలుకూడా క్రమగా పెరుగుతూనే ఉన్నాయి ,అడ్డాడ స్కూల్ అంటే ఒక రకమైన మోజు అందరిలో ఏర్పడింది .ఇది అందరి సమస్టి కృషి ఫలితమే .

  బెజవాడ వెళ్లి నేనూ డ్రిల్ మాస్టర్ నాగేశ్వరరావు సైన్స్ ఎక్విప్ మెంట్ ,రసాయనాలు ,వాలీ బాల్స్ బాడ్ మింటన్ బాల్స్  కోర్ట్ లకు నెట్స్,సాఫ్ట్ బాల్స్ , స్టిక్స్ ,రింగ్ టెన్నిస్ కోసం రింగులు, లేజిమ్స్ కొన్నాం .కబాడీ కోర్ట్ లు రెండు వేయించి ఇసుక పోశాం .ఖోఖో పోల్స్ పాతించి జూనియర్ సీనియర్ ఆడ, మగ పిల్లలతో ఆడించాం .నీటికి ఇబ్బందిలేకుండా మోటారు ఎప్పటికప్పుడు బాగు చేయించటం   కొబ్బరి చెట్లకు నీళ్ళు పెట్టించి ,పురుగులు కొట్టకుండా స్ప్రే చేయించటం ,స్కూల్ చుట్టూ సీమతుమ్మ గింజలు పాతించి మొక్కలు మోలిచేదాకా నీళ్ళు పోయించి దట్టంగా అల్లుకుంట్లు చేసి  బయటివారు స్కూల్ ఆవరణలోకి రాకుండా కొంతవరకు కాపాడాం.స్కూల్ ఫంక్షన్స్  జరగటానికి ఉపయోగించే విశాలమైన హాల్ లో లైట్లు ఫాన్లు ఏర్పాటు చేయించాం .స్కూల్ మైక్ రిపేర్ చేయించి వాడుకలోకితెచ్చాం .

         పుస్తక ,సైన్స్ పరికరాల ప్రదర్శన

 స్కూల్ లో విలువైన పుస్తకాలు మంచి రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి ఇవి ఉన్నాయని చాలామందికి తెలియదు .అందుకని ఒకసారి లైబ్రరీ పుస్తకాల ప్రదర్శన రెండురోజులు నిర్వహించాం .మా విద్యార్దులేకాక ప్రక్క స్కూళ్ళ విద్యార్దులకూచూడటానికి అవకాశం కలిపించాం .అలాగే మరొక సారి ప్రయోగ శాలలోని అరుదైన ఎక్విప్ మెంట్ ను అంతటినీ లాబరేటరిలో ప్రదర్శనకు పెట్టి ,గుడివాడ తో సహా చుట్టూ ప్రక్కల పాఠశాలవిద్యార్ధులకు గ్రామాల జనాలకు చూసే వీలు కల్పించాం . జనం తండోప తండాలుగా వచ్చి చూసి ఆనందించి,అభినందించి  వెళ్ళారు .చాలాకాలం ఈ రెండు ప్రదర్శన ల గురించి బాగా చెప్పుకున్నారు .

   స్వాతంత్ర దినోత్సం ,రిపబ్లిక్ డే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యుఎన్ వో డే,గురుపూజోత్సవం మొదలైన వాటిని చాలాఘనంగా నిర్వహించాం .పెద్దలను పిలిచి సత్కరించాం .అప్పటిదాకా ఈ విషయాలేవీ ఇక్కడి వారికి తెలియదు .అన్నిటినీ ఫోటోలు తీయించి స్కూల్ ఆల్బం లో భద్రపరచాం.ఫోటో గ్రాఫర్ ఉయ్యూరు జిల్లాపరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ మాస్టారు గారబ్బాయి ప్రసాద్ .ఉయ్యూరులో పరిచయం .అతనికి చెబితే జరిగే ఫంక్షన్ కుసమయానికి వచ్చి చాలా చవకగా కార్డ్ సైజ్ కలర్  ఫోటోలు తీసి ఇచ్చి వెళ్ళేవాడు .ఇదొక గొప్ప రికార్డ్ .దీని తర్వాత పిల్లలు ఏ విధంగా తమ సృజన , ప్రతిభా సామర్ధ్యాలను నిరూపించారో ఆ విషయాలుతెలియ జేస్తాను .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-18-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.