మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి  చేకూర్చిన  భారవి

‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జునీయ కథ లో లేని పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబోయే కురు పాండవ సంగ్రామానానికి పాండవులను ఎలా సన్నద్ధం చేయాలో సంసిద్ధ పరచాలో తెలియ జెప్పి వైరివీరుల విక్రమపరాక్రమాలను కళ్ళకు గట్టేట్లు చేసి  అలాంటి వారిని గెలవటం తేలిక కాదు అన్న భావన మనసులో కలిగించి ,తద్వారా సాధన సామగ్రి సంపూర్ణంగా సమకూర్చుకొని యుద్ధ సన్నద్దులవటానికి పాండవులకు మహా గొప్ప అవకాశం కల్పించాడు భారవి .ఆ పాత్ర సృష్టి జరగకుండా ఉంటె కధ బలహీనమై కావ్యం రస హీనమై  తేలిపోయేది. అంతటి దూర దృష్టి ఉన్నవాడు భారవి .ప్రస్తుతం ఇదీ నేపధ్యం ,ఇప్పుడు భారవి ఒక్కో పాత్ర ను ఎలా సృష్టించి తాను అనుకున్నది ఎలా సాధించాడో  తెలుసుకుందాం .

             భీష్ముడు

భారత కిరాతార్జునీయ మూలకధలో ఎక్కడా భీష్ముని ప్రసక్తి చేయలేదు వ్యాసర్షి .అలాంటిది తనకావ్యం లో భీష్మ పాత్ర సృష్టించాడు భారవి .వ్యాసుడు పాండవులకు ప్రత్యక్షమై రాబోయే కురుక్షేత్ర యుద్ధం లోతాము యుద్ధం చేయబోయే  భీష్ముడు అజేయ పరాక్రమ సంపద కలవాడని హెచ్చరిస్తూభీష్ముని విశిష్టతను సంగ్రహ౦గానే అయినా సమగ్రంగా తెలిపాడు .ఏ వీరుడి పరాక్రమం అయినా ఆ వీరుని గురువు యొక్క పరాక్రమం తో ముందుగా  గణించి చెప్పటం లోక సంప్రదాయం .వ్యంగ్య వైభవం గా భారవి దీనిని ఉపదేశించటం విశిష్టమైన విషయం -21 సార్లు క్షత్రియ రాజులపై దండెత్తి సంహరించిన పరశురాముడు భీష్ముని గురువు అని ముందుగా గుర్తు చేశాడు .అలాంటి గురువునే ఎదిరించి ,జయించి,తన ధనుర్వేద పాండిత్య ప్రకర్షను గురువుకే ప్రత్యక్షంగా చూపించినవాడు  భీష్ముడు అని తెలియ జేశాడు –భారవి శ్లోకం –

‘’త్రి సప్త క్రుత్వో జగతీ పతీనాం –హంతా గురుర్యస్య చ జామదగ్న్యః  –

వీర్యావదూతః స్యతదా వివేద –ప్రకర్ష మాధార వశం గుణానాం ‘’

అంటే గురువు పరశురామునే జయించిన అవక్ర పరాక్రమ శాలి భీష్ముడు కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండాలి .ఆయన్ను జయించే ప్రయత్నాలూ  అసామాన్యంగా ఉండాలి అని చెప్పకనే చెప్పాడు .మరో శ్లోకం లో –

‘యస్మిన్ననైశ్వర్య కృత వ్యళీకః-పరాభవం ప్రాప్త ఇవాంత కోపి

దున్వన్ ధనుః కస్య రణే  న కుర్యా –న్మనో భయైక ప్రవణం స భీష్మః ‘

అంటే-ప్రాణులన్నిటినీ సంహరించే సర్వ శక్తి వంతుడైన యముడు కూడా భీష్ముని చేతిలో పరాభవం చెందాడు .అలాంటి భీష్ముని చేతిలో విల్లు కదులుతూ ఉన్నంత సేపూ ,ఎంతటివాడైనా ఆయన్ను ఎదిరించేప్పుడు భయ కంపితుడు కావాల్సిందే .భీష్ముడు తండ్రి నుంచి తనకు స్వచ్చంద మరణం వరంగా పొందాడు కనుక యముడు తన ఇష్టం వచ్చినప్పుడు భీష్ముడిని చంపటానికి శక్తి మంతుడు కాడు .అందుకని భీష్ముని చేతిలో యముడు కూడా ఓడినట్లే అని భావం ‘’స భీష్మః ‘అనటం వలన అంతటి విశిష్ట బలపరాక్రమాలు కల భీష్ముడిని జయించటం మీకు శక్యంకాని పని అని వ్యాసుని వ్యంగ్యోపదేశం .

  వ్యాస మహా భారతాన్ని ఆపోసన పట్టిన భారవి రెండే రెండు శ్లోకాలలో భీష్మ ప్రతాప గ్రీష్మాన్ని కళ్ళముందు కట్టించాడు .ఇదీ పాత్ర చిత్రణలో భారవి మహాకవి ప్రత్యేకత .

     ద్రోణుడు

 మహాభారత కిరాతార్జునీయం లో ద్రోణుడి పాత్రకూడా లేదు .కాని తనకావ్యం లో ద్రోణ పాత్ర సృష్టి చేసి తాను చెప్పవలసినదానికి వన్నె చేకూర్చాడు భారవి .ఈ కావ్యం లో వ్యాసుడే స్వయంగా ద్రోణుని ప్రాశస్త్యాన్ని వివరిచటం ఒక ప్రత్యేకత .పాండవులకు ద్రోణాచార్యుని పరాక్రమ విశేషాలు తెలియ జేస్తూ –

‘’రాబోయే యుద్ధం లో పుంఖాను పు౦ఖ౦ గా బాణాలు ప్రయోగిస్తూ ,మండుతున్న ,కదులుతున్న శిఖాగ్రాలు అనే నాలుకలు గల లోకాలను మ్రింగటానికి సిద్ధమౌతున్న ,ప్రళయాగ్నికి సమానమైన ద్రోణా చార్యుని మీలో ఎవరు చంపగలరు ?’’అని ప్రశ్నించాడు –

‘’సృజంత మాజా విషుసంహతీర్వ –స్సహేత కోప జ్వలితం గురుం కః

పరిస్ఫురల్లోల శిఖాగ్ర జిహ్వ౦ –జగజ్జిషు త్సంతమివాంత వహ్నిం ?

ద్రోణుని కి ఆగ్రహోదగ్రమైన ప్రళయాగ్ని సాద్రుశం అనుపమం .పాత్ర తత్వానికి చక్కగా భారవి ప్రయోగించిన శబ్ద సౌందర్యం ఇది .

    కర్ణుడు

కూడా మూల కధలో లేడు. భారవి సృష్టి౦చికావ్యమ్ లోపెట్టాడు .వేణీ సంహార నాటకం లో అర్జునునిచేత కర్ణుని పరాక్రమాన్ని తెలియ జేయించాడు నాటకకర్త భట్ట నారాయణకవి ‘కర్ణుడిని చంపి అర్జునుదు ముసలి రాజుతో –

‘’సకల రిపు జయాశా యత్ర బద్దా సుతాస్తే-తృణమివ పరి భూతో యస్య వీర్యేణ లోకః ‘’అని కర్ణుని పరాక్రమ శైలిని మెచ్చుకుంటాడు .ఇక్కడ కిరాతార్జునీయ కావ్యం లో భారవి కర్ణ పాత్ర సృష్టి చేసి ,వ్యాసుని తో కర్ణుని జయించగల మగాడు మీలో ఎవరున్నారో చెప్పండి అని సవాలు విసురుతాడు –‘’

‘’నిరీక్ష్య సంరంభ నిరస్త ధైర్యం –రాధేయమారాధిత జామదగ్న్యం

ఆ  సంస్తు తేషు ప్రసభం భయేషు –జాయేత మృత్యోరపి పక్షపాతః ‘’

భావం – ఎంతటి మహా వీరుడైనా ఎదిరించే సందర్భం లో అయినా  కోపోద్రేకం  చేత వాడి ధైర్యాన్ని సడలింప జేసే సమర్ధత ఉన్న పరశురాముడిని కర్ణుడు ఆరాధించాడు .కర్ణుని చూసి మృత్యువే ఇది వరకేప్పుడూ చూడని ,వినని భయాలను పొందుతుంది అని వ్యాసుని మనసు .అంటే పరశురామా రాదన  వలన కర్ణుడు మృత్యువును కూడా వణికి౦చ గలడు అని వ్యాస భావం .ఇలాంటి కర్ణ పరాక్రమ విక్రమాలను ఒకే ఒక్క శ్లోకం లో వ్యాసుని వలన భారవి పాండవులకే కాదు లోకానికికూడా ఎరుక పరచాడు. అదీ  భారవి ప్రత్యేకత .

ఆధారం –ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ వైవాహిక స్వర్ణోత్సవ కానుకగా,  జ్ఞాపికగా రచించి,-9-5-18 న వెలువరించి, ఆత్మీయంగా నాకు పంపగా 17-5-18 శుక్రవారం అందుకున్న   ‘’భారవి భారతి ‘’(కిరాతార్జునీయ కావ్య సమీక్ష )గ్రంథం.ఆచార్య సార్వ భౌమ వారికి కృతజ్ఞతలతో నమస్సులు .

   సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.