నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం

నెలలోపు లోనే ముగ్గురు ప్రతిభా మూర్తుల అస్తమయం

  ఆముగ్గురూ ఆంధ్రులే అవటం ,వారు దాదాపు కృష్ణాజిల్లాకు చెందినవారవటం మన అదృష్టం తోపాటు దురదృష్టంకూడా ..ఇందులో మొదటివారు ఈ ఏప్రిల్ 22 న మరణించిన సంగీత  సాహిత్య సృజన శీలి, గాయకుడు రేడియో స్టేషన్ డైరెక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు .నిడద వోలు లో జన్మించినా ఆయన కార్యక్షేత్రం విజయవాడ అవటం మన అదృష్టం .98 సంవత్సరాలు సార్ధకం గా జీవించి , అధికమాసాలతో కలిపి లెక్కిస్తే  శతమానం భవతి మాత్రమేకాకుండా శతాదికమానం భవతి అని పించుకున్నారు .ఆ ప్రతిభా వ్యుత్పత్తి నాన్యతో దర్శనీయం .

రెండవవారు 82  ఏళ్ళు జీవించి  గుంటూరు జిల్లాలో పుట్టినా బెజవాడ కార్యక్షేత్రం గా సఫల జీవితం గడిపి మధ్యతరగతి తెలుగు కధ కు పట్టాభి షేకం చేసి ,ఈ మే 18 న మరణించిన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారు .

మూడవ వారు  పుంఖాను పుంఖాలుగా , తిలక్ అన్నట్లు ‘’డూప్లి కేట్లు క్వాడ్రూ ప్లికేట్లు ‘’గానవలలు రచించి కృష్ణా జిల్లా కాజ గ్రామం లో జన్మించి  కృష్ణా జిల్లా ఆడపడుచు అనిపించి ,హైదరాబాద్ కార్యక్షేత్రంగా ,ఆతర్వాత అమెరికాలో అమ్మాయి దగ్గర ఉంటూ తెలుగు సినిమా తీయటానికి బెంగాలీ బాబుల కధలు అవసరం లేదు మనమూ రాయగలం అని సత్తా చూపి సినీ ట్రెండ్ సెట్టర్ గా ,మధ్యతరగతి ఆడపిల్లల మనస్తత్వానికి ప్రతీకగా వారి ఆత్మ ధైర్య స్తైర్యాలను ప్రతిబింబిస్తూ వారి ఆత్మ గౌరవం  నిలబెట్టే పాత్ర సృష్టి చేసి తనకంటూ ఒక నవలా శాతాబ్దినే సృష్టించుకుని ,రీడబిలిటికి పెద్ద పీట వేసి, యువతుల కు ఆదర్శంగా ఉన్న శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి 78 వ ఏట కాలిఫోర్నియాలో మే21 మరణించారు . నవలా సామ్రాజ్ఞి గా కీర్తి౦పబడ్డారు  .ఈ ముగ్గురూ ముగ్గురే –మూడు రత్నాలు .ఒకటి సంగీతానికి, రెండవది కథకు, మూడవది నవలకు ప్రతి రూపాలు . ముగ్గురూ నెలలోపే మరణించటం బాధాకరం .

                          వీరితో నా పరిచయం

                          1-రజని

నేను 1956-నుంచి 60 వరకు బెజవాడ ఎస్ ఆర్ ఆర్అండ్ సివిఆర్  కాలేజి లో  ఇంటర్ ,డిగ్రీ చదివాను  .ఇంటర్ లో ఉండగానే 1956 లో మాకాలేజీ లో సంగీత కార్యక్రమం నిర్వహించటానికి రజని వచ్చారు .తెల్ల పైజమా ,లాల్చీ తో ఉన్న ఆయన నా మనసులో స్థిరంగా నిలిచిపోయారు .కామన్ హాల్ అయిన R 4 లో శ్రీమతి వింజమూరి లక్ష్మి తో కలిసి చక్కని సంగీతం వినిపించారు .మా యువ హృదయాలను గెలుచుకున్నారు ..అందులో మొదటిసారిగా ‘’స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా ‘’అన్నపాట మనసుకు హత్తుకు పోయింది .ఆపాడిన విదానం ,ట్యూన్ నన్ను హాంట్ చేస్తూనే ఉంది .రజని గానం రజనీ గంధ సువాసనలీనుతుంది .అంత పరిమళ భరితం .నేను రాజమండ్రిలో బి ఎడ్ శిక్షణలో ఉన్నప్పుడు  మా సహాధ్యాయినులు  ,ప్రముఖ చారిత్రిక పరిశోధకులు స్వర్గీయ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మేనకోడళ్ళు శ్రీమతి ఇవటూరి వరలక్ష్మి ,ఆమె చెల్లెలు ఇవటూరి విశాలాక్షి లు  కాలేజి సాంస్కృతిక కార్యక్రమాలలో పాటలు ఆడేవారు .అందులో  సైన్స్ సబ్జెక్ట్ ఆవిడ విశాలాక్షి  ‘’స్వైరిణి అన్నారు ‘’ పాట చాలా బాగా పాడేది .అందులో పాథోస్ మనసును పట్టేసేది .ఆ తర్వాత రజని  గురించి నేను పేపర్లలో చదవటమే కాని ప్రత్యక్షంగా చూసింది లేదు .

 ఉయ్యూరు  జిల్లా పరిషత్ హై స్కూల్ సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు మిత్రుడు స్వర్గీయ టి ఎల్ కాంతారావు తో పరిచయం ,ఇద్దరం కలిసి తెలుగు ఎంయే ప్రైవేట్ గా రాసి పాసవటం ,అప్పుడు రజనీ గారు విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గా ఉండటం ,అక్కడ ఉగాది కవి సమ్మేళనాలకు నేనూ ,కాంతారావు ఆంజనేయ శాస్త్రి ,పిచ్చిబాబు, సూపర్ వైజర్ పూర్ణ చంద్ర రావు, చెంచారావు ,జ్ఞానసు౦దరరావు , హిందీ మేష్టారు కొడాలి రామారావు బృందంగా వెళ్లి ఆస్వాదించే వాళ్ళం .ఏ ఏ సంవత్సరాలు అంటే ఖచ్చితంగా చెప్పలేను .అప్పుడు విశ్వనాధ ,శ్రీ శ్రీ ఆరుద్రా కరుణశ్రీ  వంటి కవి దిగ్గజాలు వచ్చేవారు .విని పులకరించేవారం .అందరి కంటే ఆరుద్ర కవితలే ప్రభావితంగా ఉండేవి అనిపించేవినాకు .రేడియో నాటకాలు కూడా చూసేవాళ్ళం . అదొక గొప్ప అనుభూతి నిచ్చిన ఏళ్ళు ,నాళ్ళు మాకు .ఆ సంగతులే ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం .రజనితో ఎప్పుడూ మాట్లాడిన గుర్తు లేదు .రజని కాలం స్వర్ణ యుగం .ఆయన ప్రవేశ పెట్టిన ప్రతిదీ గొప్ప హిట్టే అయింది .అప్పటిగాయకులు నటులు ,అందరూ హేమాహేమీలే .బెజవాడ రేడియో నాటకం అంటే ఒళ్ళు పులకించేది . నండూరి సుబ్బారావు ,రామమోహనరావు, పాండురంగారావు ,పుచ్చాపూర్నానందం,యెన్ సి హెచ్ క్రిష్ణమాచారిగారు, వారబ్బాయి, దండమూడి రామమోహనరావు , అన్నవరపు రామస్వామి మల్లిక్ ,కోట సచ్చిదానంద శాస్స్త్రి ములుకుట్ల సదాశివ శాస్త్రి వగైరా దిగ్దంతుల హరికధలు ,ఓలేటి హిందూస్తానీ మాధ్యమ కర్నాటక సంగీతం ఒకటేమిటి అన్నీ నవరసభరితాలే .సంక్రాంతి ఉగాదులకు రేడియోలో వచ్చే హాస్య నాటకాలకు అర్రులు చాచే వాళ్ళం .విని ఒళ్ళు మరిచే వాళ్ళం .బాలమురళి భక్తీ సంగీతం ,సంగీత కచేరీలు మళ్ళీ మళ్ళీ వినాలని పించేవి .నాజర్ బుర్రకధల ఆకర్షణ చెప్పనలవికానిది   రజని తర్వాత వచ్చిన అనంత పద్మనాభ రావు గారి కాలం లోనూ మాకిదే పని .రేడియో పోషకులం అని గర్వంగా చెప్పుకొనే వాళ్ళం .ఉగాది, సంక్రాంతి రేడియో సమ్మేళ నాలు ఇంట్లో పెట్టుకుని మా బృందం విని ఆనందించేవాళ్ళం  .మా ఇంట్లో ఆడవాళ్ళకూ రేడియో అంటే విపరీతమైన క్రేజు ఉండేది .ఇప్పటికీ రాత్రిళ్ళు నాప్రక్కన రేడియో ఉండాల్సిందే .ఆపాటలు వింటే కాని నిద్రపట్టడు .మమ్మల్ని రేడియోకి ఇంతగాఎడిక్ట్ చేసిన వారు రజనీ గారే .   కాలప్రవాహం లో ఏళ్ళు గడిచిపోయాయి .ఆదివారం వస్తే రజని రాసి ,పాడిన ‘శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా దైవ చూడామణీ’’వస్తే, వింటే  ఒళ్ళు పులకింతే.అంతటి ప్రభావం దానికి ఉంది .98 ఏళ్ళు వచ్చినా రజనీ గారిలో సంగీత పటుత్వం తగ్గలేదు .సుమారుగా మూడేళ్ళ క్రితం వారింటికి మేమిద్దరం వెళ్లి ,మన సరసభారతి పుస్తకాలు అందించి వారి మంచం పై కూర్చుని  పళ్ళు అందేసి వారి పాదపద్మాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్న అదృష్ట వ౦తులం అయ్యాం మేమిద్దరం .మాకోరిక పై కొన్ని పాటలు పాడి వినిపించారు .అవి మర్చిపోలేని మధుర క్షణాలు మాకు .మా జన్మ ధన్యం అని భావించాం .రజని ఎక్కడున్నా రజనీ గంధం  మనల్ని పరవశింపజేస్తుంది .

              2- పెద్దిభొట్ల

పెద్దిభొట్ల వారి కథలు చదివా కాని నాకు అందులో ధ్రిల్ కనిపించేదికాదు .నేను ఎస్ ఆర్ ఆర్ కాలేజి, ఆయన, లయోలా కాలేజీ .బెజవాడ సభలలో తరచుగా కనిపించేవారు .కృష్ణా జిల్లా రచయితల సంఘం తో పరిచయం అయ్యాక సుబ్బరామయ్యగారిని మరీ క్లోజు గా చూసే అవకాశం లభించింది .ఎప్పుడూ పరిచయం చేసుకుని మాట్లాడింది లేదు .కాని 2000 లో ఫ్లోరా స్కూల్ వాళ్ళు నన్ను సూపర్ వైజర్ గా పని చేయమని బలవంత పెట్టినప్పుడు చేరి రెండేళ్ళు పని చేశాను .అప్పుడే ఆ స్కూల్ పుట్టి 10 ఏళ్ళు అయిన సందర్భంగా ,కొంచెం గ్రాండ్ గానే ఉత్సవం ను మా సువర్చలాన్జనేయస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రం లో నిర్వహిస్తూ సుబ్బరామయ్యగారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు .ఆయన్ను సభకు పరిచయంచేసే అవకాశం నాకు ఇవ్వగా ఆయన పై మంచి ప్రసంగం తయారు చేసి ఎవరో పిల్లాడికిచ్చి చదివించి నట్లు జ్ఞాపకం .అప్పుడే చిరంజీవి అనే ప్రయోక్త కూడా మొదటిసారి పరిచయమయ్యారు .అయితే సుబ్బరామయ్యగారితో  ముఖా ముఖీ మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడాను .

  బెజవాడలో జరిగే పుస్తక ప్రదర్శన లలో ,రచయితల సంఘం నిర్వహించేకార్యక్రమాలలో మరింత నిశితంగా చూసే అవకాశం వచ్చింది .కావాలని ఏనాడూ పరిచయం పెంచుకోలేక పోవటం నా లోపమే .ఆయన ఎప్పుడూస్నేహ హస్తం చాచే సహృదయులే . పెద్దిభోట్లకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించినప్పుడు ,రమ్య భారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ నాకుఫోన్ చేసి ‘’ప్రసాద్ గారూ !పెద్ది భొట్ల వారిపై ఒక వ్యాసం మీరు రాస్తే రమ్యభారతి లో ప్రచురిస్తే  బాగుంటుంది అని పించింది .వెంటనే రాసి పంపండి ‘’అని కోరితే ,అప్పుడు లైబ్రరీ మీద పడి ఆయన కథా సంపుటులు చదివి ,మిగిలిన చోట్లనుంచీ వివరాలు సేకరించి నాలుగైదు రోజుల్లో’కృష్ణా తీరం లో సాహితీ కెరటం ‘’ రాసి పంపిస్తే అన్నట్లే రమ్యభారతి లో అచ్చు అయింది.

’ శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖరరావు గారితో గత మూడేళ్ళుగా పరిచయం ఉంది .బహుశా 2016లో సుబ్బరామయ్యగారి పుట్టిన రోజు ,వారు తమ పేర పురస్కారాలను అందజేసే రోజు నన్ను తప్పక రమ్మని ఆహ్వానం పంపి ఫోన్ లో కూడా చెబితే వెళ్లాను .అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది అని రావు గారు తరచూ చెప్పేవారు. రోజూ ఫోన్ చేసి మాట్లాడి ఇంటికి వచ్చి కబుర్లు చెబితేకాని  ఊరుకునే వారు కాదని చెప్పేవారు .మొగల్రాజపురం లోని పైఅంతస్తు ఫంక్షన్ హాల్ లో సభ జరిగింది .ఆయన్ను వీల్ చైర్ లో తీసుకు వచ్చారు .ప్రముఖులు రావటానికి ఇంకా సమయం ఉంది .చంద్ర శేఖరరావు గారు పెద్దిభొట్ల వారి విశేషాలు మైక్ లో చెబుతూ’’ గాప్ ఫిల్లింగ్’’ గా ఎవరైనా వచ్చి మాట్లాడమన్నారు .నేను మాట్లాడి పైన చెప్పిన విషయాలు టూకీగా చేప్పి  ఆలస్యం చేయకుండా పెద్దిభోట్లవారికి నేను ఉయ్యూరు నుంచి తెచ్చిన శాలువ సరసభారతి తరఫున కప్పి ,నమస్కారం చేసి అప్పటికే రాత్రి 7 దాటినందున బొడ్డపాటి వారికి చెప్పేసి ఉయ్యూరు వచ్చేశా .ఇలా వారిని సభా ముఖంగా సన్మానించే మహద్భాగ్యం కల్పించిన వారు బొడ్డపాటి వారే .

  ఈ సందర్భంగా ఒక చిలిపి సంఘటన చెప్పకపోతే బాగుండదేమో అని చెబుతున్నా .అవి మేము ఉయ్యూరు హై స్కూల్ లో పని చేస్తున్నరోజులు .కాంతారావు వగైరా మా సాహితీ బృందం మా సైన్స్ రూమ్ ను ‘’అడ్డా’’గాఅంటే సాహితీ కేంద్రంగా  చేసి సాహిత్య కార్యక్రమాలు జరిపే రోజులు .ఒక సారి ఒక పాంఫ్లెట్ కాంతారావు కు వచ్చింది .అందులో బెజవాడ లో దాశరధి రంగా చార్యులుగారి నవల ‘’చిల్లర దేవుళ్ళు ‘’పై పెద్ది భొట్ల సుబ్బరామయ్యగారి ప్రసంగం ఉందని తెలిసింది .నాకు 8 వ తరగతి  తెలుగుమేస్టారు ,ప్రస్తుతం హై స్కూల్ లో సహాధ్యాయి  ,సెకండరీ టీచర్ శ్రీ మహంకాళి సుబ్బరామయ్య గారున్నారు .ఆయన్ను ఏ సభలో మాట్లాడమన్నా మాట్లాడటం లేదు .ఎలాగైనా మాట్లాడింప చేయాలని నేనె ఒక ఉపాయం పన్ని ఆహ్వాన పత్రం లో ఉన్న’’ పెద్దిభొట్ల’’ బదులు ‘’మహంకాళి ‘’అనిమార్చి  అటెండర్ ద్వారా అందజేయి౦చా .ఆయన చూసి ఆశ్చర్యపోయి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి ‘’ప్రసాదూ !ఇదేమిటి నన్ను మాట్లాడమని ఉంది . అసలు ఆనవల నేను చూడలేదే ‘’అన్నారు .గురువుగారు దారిలో పడ్డారని గ్రహించి ‘’నవల మన లైబ్రరీలో ఉంది .తీసుకుని చదవండి .అక్కడ మాట్లాడటానికి ముందు ఒకసారి మన సైన్స్ రూమ్ లో మాట్లాడండి అందరం వింటాం ‘’అన్నాను .సరే అని పుస్తకం చదివి సందేహాలుంటే నా దగ్గర తీర్చుకుని నోట్స్ రాసుకుని బాగా ప్రిపేర్ అయ్యారు గురువుగారు .ఒక శనివారం ఉదయం 11 గంటలకు సాహిత్య పిపాస ఉన్న స్టాఫ్  మెంబర్లు  అందర్నీ ఆహ్వానించి ,నాఖర్చుతో ,టిఫిన్ కాఫీ ఏర్పాటు చేసి గురువుగారి ని ప్రసంగించమన్నాం .అద్భుతంగా గంట ఏమాత్రం తడుముకోకుండా ‘’చిల్లర దేవుళ్ళు ‘’నవలపై మాట్లాడారు .చప్పట్లు మారు మోగించాం .ఉబ్బి తబ్బిబ్బయ్యారు మహంకాళి గారు .ఆయన ప్రసంగం అవగానే నేను లేచి ‘’మాస్టారు మమ్మల్ని క్షమించాలి .ఎన్నిసార్లు సభలో మాట్లాడమన్నా మాట్లాడక పొతే నేనె ఈ పాయం పన్నాను .వాళ్ళందరికీ  ఈ రహస్యం బయట పెట్టవద్దని చెప్పాను .మీరు అద్భుతంగా  మాట్లాడగలరు  అని అందరికీ తెలియ జేయటానికే ఈ పన్నాగం పన్నాను. ఆలోచన, ఆచరణా అంతా నాదే .శిష్యుడిని క్షమించండి ‘’అన్నాను .కళ్ళ నీళ్ళపర్యంతం అయ్యారు మాస్టారు .కొద్ది సేపు కోపంగా ఉన్నా తర్వాత సర్దుకు పోయారు .ఈ స౦ఘటన తరచుగా తలుచుకుని నవ్వుకొనే వాళ్ళం చాలా ఏళ్ళు .నాలోని చిలిపితనానికి ఇదొక నిదర్శనం అన్నమాట

     సులోచనా రాణి

 ఈమెతో ఏమీ పరిచయం లేదు .కానీ పామర్రు హై స్కూల్ లో పని చేసేటప్పుడు మాతోపాటు రాళ్ళబండి సాంబశివరావు అనే సోషల్ మాస్టారు ఉండేవాడు .ఆయన కాజ లో పని చేశాడు .తాను కాజలో పని చేసినప్పుడు యద్దనపూడి సులోచనా రాణి చదివిందని కాజ హైస్కూల్ ను చేసింది తానేఅని ఆమెకు అక్షరాభ్యాసం చేసింది కూడా తానేనని తన ఒళ్లో కూచుని చదువుకున్న చిన్నారి అని  సులోచనకు తను అంటే అధిక గురు భక్తీ ఉండేదని గొప్పగా ఒకటికి రెండు సార్లు చెప్పుకోనేవాడు .కొంచెం వాచాలత్వం ఎక్కువ అని నవ్వుకునేవాళ్ళం .ఆవిడ నవలలు సీరియల్స్ గా వచ్చినప్పుడు చదివా .టైలర్ మేడ్ దుస్తుల్లా ఉంటాయి పాత్రలుఅనిపించేవి .తర్వాత ఆనవలలను సినిమాలుగా తీస్తే అవి అత్యంత కలెక్షన్స్ తో ప్రదర్శి౦ప బడుతుంటే ఆవిడ గొప్పతనం తెలిసింది .మేము మొదటిసారి  అమెరికాకు డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ కు మా అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు ,అక్కడనుంచి 15 రోజులు కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ లో ఉన్న మా మేనలుడు శాస్త్రి వాళ్ల ఇంటికి  వెళ్లాం  ఒక ఫంక్షన్ లో సులోచనా రాణీ గారి అమ్మాయి పరిచయమైంది .చాలా బాగా మాట్లాడింది .నేను అప్పుడు ఆమెకు సాంబశివరావు మాస్టారు గురించి జ్ఞాపకంచేశాను .తన తల్లిగారికి నిజంగానే ఆయన అంటే అంతటి గురుభక్తి ఉందని  మేము కృష్ణా జిల్లావాళ్ళం అవటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది .తల్లి సులోచనగారు తరచూ తనతో మాట్లాడుతూ ఉంటారని వచ్చి వెడుతూ ఉంటారని చెప్పారు .ఇప్పుడు కూతురు చేతిలో సులోచనా రాణి తుది శ్వాస విడిచారు .

 

  ఈ ముగ్గురు ప్రతిభా మూర్తుల ఆత్మకు  శాంతికలగాలని కోరుతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.