ర(మ)ణ దీక్షితులు
తితిదే మాజీ అర్చకుడు రమణ దీక్షితులు ఎప్పుడూ ఎవరిపైనో ఒకరిపైన ఆరోపణలు చేసి మీడియాకు ఎక్కటం ,ఆయన చెప్పినవన్నీ తప్పులే అని దేవస్థానం బదులివ్వటం చాలా కాలంగా సాగుతున్న నాటకం .ఎప్పుడూ అఫెన్స్ లో ఉంటూ ‘’రణదీక్షితులు’’అని ముద్రపడ్డ ఆయన ఇప్పుడు ఉద్యోగం గోవిందా అయ్యేసరికి డిఫెన్స్ లో పడ్డాడు .వారం క్రితం ఆయన చాలా ఆరోపణలు చేశాడు .శ్రీవారి పోటు తవ్వారని నిధి నిక్షేపాలకోసం వెతికారని ,ఆలయం లో ఆగమ విధానం లో పూజలు జరగటం లేదని ,దేవుడి వజ్రం పోయిందని, పెద్ద పెద్ద ఆరోపణలు చేశాడు .దీనికి వెంటనే స్పందించిన ఆలయ పాలకవర్గం ఆయన అన్నప్రతిమాటనూ ఖండించింది .భక్తులమనోభావాలను దెబ్బతీస్తున్నాడని ,అసలు ఆయనకు మంత్రాలేరావని ఒకాయన అంటే ‘’వస్తే సరిగ్గా ఒక్కమంత్రమైనా ఉచ్చరించమనండి’’అని ఇంకో ఆయన సవాలు విసిరాడు .అయ్యా శ్రీవారిఆలయ పరిస్ధితీ, ప్రతిష్ట ఇలా నడిబజారు పాలు చేశారు అందరూ .’’ఆయన ఆడీ కారులో ఆలయానికి వస్తాడు ,టీషర్ట్ లతో దర్శనమిస్తాడు ,తిరుమలలోకంటే అభిమానుల ఇళ్ళల్లో పూజా పునస్కారాలు హోమాలు, యాగాలు చేస్తాడు ‘’అని మరో యాగీ . అర్చకులే రిటైర్మెంట్ కోరారు అన్న సాకుతో 65 ఏళ్ళు దాటిన అర్చకులను దీక్షితులుతో సహా ప్రభుత్వం ఉద్యోగాలనుండి పీకేసింది .సుప్రీం కోర్ట్ కు వెళ్ళే యావలో ఉన్నాడు దీక్షితార్ .సరే హక్కులకోసం పోరాడాల్సిందే .దానిలో తప్పేమీలేదు .కోర్టు తీర్పు అందరికీ శిరో దార్యం .
అయితే సామాన్యుడి సణుగుడు ఏమిటీ అంటే –అసలు రణదీక్షితులు విధులకు డుమ్మా కొడుతుంటే ,మంత్రాలు సరిగ్గా రావని తెలిస్తే ,నగలు అన్నీ ఉన్నాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు నిజాయితీగా తెలియజేస్తుంటే ,ఆయనపై ఇంతకాలం ఏ యాక్షన్ తీసుకోకుండా హాయిగాకాలు మీద కాలేసుకుని 22 ఏళ్ళు డ్యూటీ చేయించిన ఆలయ పాలకవర్గం బాధ్యత ఏమిటి ?ఆయన విద్యపై అంతకంటే సమర్ధులైన అర్చక స్వాముల చేత ఎందుకు పరీక్ష నిర్వహించలేక పోయారు ?నిర్వహించి దోషి అని ఎందుకుతేల్చలేక పోయారు ?ఎందుకంటె అక్కడ ముఖ్య పదవులన్నీ మొదటి నుంచి ‘’రాజ కీయ పునరావాసాలె’’. అవటం .ఆలయం ,దాని నిర్వహణ, ఆగమ శాస్త్ర విధానంలో అవగాహన ఉన్న ఏ ‘’పత్రిప్రసాద్ ‘’వంటి వారో తప్ప మిగిలిన వారంతా ఉత్సవ విగ్రహాలే .విఐ పి లు వస్తే తోడూ ఉండటానికి ,దర్శనం టికెట్లు తమవారికి ఇప్పించుకోవటానికి ,లడ్డూలు బుట్టలకు బుట్టలు కైకర్యం చేయటానికి తప్ప వీళ్ళు ఎందుకూ పనికి రాక పోతున్నారు .రాక్షసబలం ఉన్న సారా కాంట్రాక్టర్లో ,మావో ను తలకెత్తుకున్న యెర్ర దళనాయకులో , , అన్యమతాలతోదోస్తీగాతిరిగే వాళ్ళో, ఆలయ పాలకులైతే ఇలాగే అనుభవించక తప్పదు. ఆలయ పద్ధతీ ,విధానం తెలీని వారి నియామకాలవల్ల వచ్చే దుష్ఫలితాలివి .
ఇప్పుడు రణ దీక్షితులు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నాడని మరో ఆరోపణ .ఏ ఎండకా గొడుకు పట్టే వారికి అంతకంటే ఏంకావాలి ?ఏడు కొండలకే ఎసరు పెట్టాలని,రెండు మూడుకొండలు నోక్కేయాలని ‘’పంచే కట్టాయన ‘’ ప్రయత్నం చేశాడని ,ఆ ఫలితం అనుభవించాడని అప్పుడు చెవులు కొరుక్కున్నారు . ఇప్పుడు ‘’గుజరాత్ మాంత్రిక ద్వయం ‘’ఏడుకొండ’’లకూ ఎసరు పెట్టాలని ‘’ఎదురు చూస్తున్నట్లు మీడియా కథనం .ఇవాల్టి మీడియా లో పేపర్ కధనాలలో ‘’ఏ బీసీ న్యూస్ ‘’,సియేస్ డి ఎస్ ‘’సర్వే లో ‘’మళ్ళీ మోడీ వద్దు ‘’అని 47శాతం జనం అభిప్రాయ పడుతున్నట్లు ప్రకటించింది .కనుక సగం పతనం అయినట్లే లెక్క .
ఇప్పుడు రణ దీక్షితుల కేసు సుప్రీం కోర్ట్ లో ఉంది.కనుక పై ఆరోపణల విషయమూ మాన్య కోర్టు వారి దృష్టికి ఎలాగూ వస్తుంది . పై విషయాలపై క్లారిటీ వచ్చి అందరి అనుమానాలు పటా ప౦చలవుతాయని దోషులు శిక్షింప బడుతారని ,ఆలయ నిర్వహణ సమర్దులకే దక్కు తుందని ,ఇకపై రాజకీయ పునరావాసాలకు తావు ఉండదనీ ఆశిద్దా౦ .
అది సరే కాని సినిమావాళ్ళు ,రాజకీయనాయకులు ,న్యాయ మూర్తులు వగైరాలు బాలాజీ దర్శనానికి వస్తే వాటిని ప్రసారం చేయాలా ? వాళ్ళు వస్తారు దర్శన౦ చేసుకు పోతారు.ఆలయం లో మీడియా వాళ్ల వెంటపడటం , ప్రశ్నలు సంధించటం వాటినీ జాతీయ ప్రాధాన్యత ఉన్న వాటిగా చిత్రీకరించటం అవసరమా ?మీడియానుఇలాంటి వారి విషయం లో గుడికి దూరం చేసి,సామాన్యులు అక్కడ పడే బాధలు ప్రజల ,పాలకుల దృష్టికి తేస్తే ప్రయోజనం ఉంటుంది ఇవాళ అందరికీ ఫేస్ బుక్ ,వాట్సాఫ్ వంటివి ఉంటె మళ్ళీ ఈ తతంగం అంతాఎందుకు దండగ ?
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-18 –ఉయ్యూరు