ప్రణబ్ ప్రధాని కాకూడదా ?
ఊహూ కానే కాకూడదు అంటున్నారు రాజ్యాంగ నిపుణులలో మెజారిటీ .అసలు రాజ్యాంగం లో మాజీ రాష్ట్ర పతి మరే తక్కువ హోదా పదవీ స్వీకరి౦చ రాదని ఎక్కడా లేదు మహాప్రభో అంటున్నారు తరచిన వాళ్ళు .అది ఆయన ఇష్టం అభీష్టం అంటున్నారు .ఇది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అంటున్నారు మరికొందరు .ఇన్ని చిక్కుముడులతో మాజీ రాష్ట్రపతి వేసే అడుగు ఆధార పడి ఉంది.అది ముందడుగే అవుతుందో ,వెనకడుగే అవుతుందో జూన్ 7 న కానీ తేలదు కదా .ఇవన్నీ రాజ్యాంగ న్యాయ కోవిదుల బుర్రపదునుకు సంబంధించన విషయం .మనకు అర్ధం కాని విషయం కూడా .అలాగని జనం ఉపేక్షిస్తూ కూర్చోరు కదా.ఎవరి శక్తిని బట్టి వారు ‘’ఊహాగానం’’ చేస్తూ ‘’లత’’నే మించిపోతారు .
సామాన్యుని సణుగుడు ఇక్కడ ఏమిటి ?ప్రజాస్వామ్య విలువలను ,ఇచ్చిన వాగ్దానాలనూ ,న్యాయ వ్యవస్థ పట్ల చిన్నచూపు ,తమకు ఇష్టం లేకుంటే ఎమర్జెన్సీ ప్రకటన ,వీలయితే ఉక్కు పాదాలతో అణచివేయటం ,గవర్నర్ లను చెంచాగిరీ గా చూడటం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ చేసిన వికృత హీన హేయ రాచకీయం .నాలుగేళ్ళక్రితం గద్దె నెక్కిన గడ్డం ఆయన శుష్కవాగ్దానాలు శూన్య హస్తాలతో ,గారడీమాటలతో ఎన్నికలలో గెలుపే ప్రదాన లక్ష్యంగా కాంగ్రెస్ బాటలో నడుస్తూ , అహంకారం పెచ్చుపెరిగి ,అప్పటికే కాంగ్రెస్ వలన కుళ్ళి కునారిల్లుతున్న వ్యవస్థలన్నిటినీ బాగు చేయటానికి బదులు మరింత లోతుగా పాతిబెట్టాడు .ప్రజల ఆశలపై మరిగే నీళ్ళు కుమ్మరించి నెత్తిపై ధూళి చిమ్మాడు .ఏదో పొడి చేస్తాడు అని ఓపికగా వేచి చూసిన జనానికి సహనం నశించి, ఆశగా ఎవరైనా ఆపన్న హస్తం అందిస్తారా అని ఎదురు చూస్తున్నారు .అన్నీ మరచి అందరూ ఒకే త్రాటిపై నడచి ,అస్త,కమలాలకు అతీతంగా మంచి వ్యవస్థ ఏర్పడి ,కుళ్ళును కడిగేసి ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థ ఏర్పడి ఇన్నాళ్ళ ఆశలకు పట్టాభిషేకం జరగాలని ఉవ్విళ్లూరుతున్నారు .అందుకు సమర్ధుడైన ,పరిణతి చెందిన ఉత్తమ వ్యక్తి రావాలని పెద్దగా ఆశలు పెట్టుకున్నారు .ఇదీ ప్రణబ్ రంగ ప్రవేశానికి నేపధ్యం .
అమెరికాలో ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ రిటైరయ్యాక మానవ హక్కుల కోసం ,ప్రజాస్వామ్య రక్షణ కోసం బడుగువర్గాల గృహవసతి కోసం యెనలేని శ్రమ చేస్తున్నాడు .ప్రపంచ సమస్యలకు తన అనుభవ సారం రంగరించి పరిష్కారాలు కనిపెడుతున్నాడు .ఉత్తర కొరియాతో ,లిబియాతో సంబంధాలు మెరుగుపరచటానికి కృషి చేశాడు.టెన్షన్ ఫ్రీ అమెరికాకోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు .95 ఏళ్ళ వృద్ధాప్యం లోనూ తన దేశ ప్రజల అభ్యున్నతికోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు .
అలాగే అమెరికా ప్రెసిడెంట్ గా బిల్ క్లింటన్ ఉన్నప్పుడు రెండు సార్లు వైస్ ప్రెసిడెంట్ చేసిన ఆల్ గోరే తన సమర్ధతను చాటుకొని ,క్లింటన్ తర్వాత ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు .కాని ప్రజా సమస్యల పరిష్కారం లో ,గ్రీన్ వాయువులను అరికట్టటం లో ఇప్పటికీ యెనలేని కృషి చేస్తున్నాడు .మన కలాం గారు పదవీ విరమణ చేసినా జాతి సేవలో పునీతులయ్యారు .ఆదర్శంగా నిలిచారు .
ఇవాళ మన దేశం లో ఒక విలువలు లేని ,ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్నట్లు నటించే కుహనా ప్రజాస్వామ్యులవలన మహా శూన్యం ఏర్పడింది .దీన్ని పూరించటానికి సమర్ధుడు కావాలి.ఆదర్శం ఆయన గత చరిత్రగా ఉండాలి .నిర్దుష్ట ఆలోచన కలిగి ఉండాలి .ఇవన్నీ పుష్కలంగా ప్రణబ్ లో ఉన్నాయణి భావించి అందరి చూపు ఆయన పైనే ఉన్నది .ఇంకో విషయమూ ప్రచారం లో ఉంది .అత్యున్నతపదవి లో ఉన్నాయన ప్రధాని అభ్యర్ధి అయితే ఆయనపై ఎన్నికలప్రచారం లో బురద జల్లితే ఆయన ప్రతిభ పదవి కలంకితమవుతాయికదా అని .ఇది ఆలోచించదగిన విషయమే అయినా మనకున్న రాష్ట్ర పతులలో శ్రీ రాజేంద్ర ప్రసాద్,రాధాకృష్ణన్ ,జాకీర్ హుసేన్ ,హిదయతుల్లా ,జట్టి,సంజీవరెడ్డి ,అబుల్ కలాం మచ్చలేని వారుగా పేరుపొందారు .మిగిలినవారిపై యేవో నీలినీడలు ఉండనే ఉన్నాయి .
మార్గదర్శకం చేయవలసిన సమర్ధులు కిమ్మనకుండా ఉంటె భావిష్యత్తులేదు .విద్యారణ్యు లే లేకపోతె విజయనగర సామ్రాజ్యమే లేదు .సమర్ధ రామదాస్ లేకుంటే ఛత్రపతి శివాజీకి మార్గ దర్శనం ఎవరు చేసి ఉండేవారు ?ఈ ఇద్దరూ సర్వసంగ పరిత్యాగులే అయినా దేశ ఆపత్సమయం లో నిలబడి దారి చూపారు .ఇలా ఎన్నో ఉన్నాయి .కనుక ప్రణబ్ దాదా ఈ ఆపత్సమయం లో మార్గ దర్శనం చేయటానికి ముందుకొస్తే సంతోషంగా ఆహ్వానిద్దాం .ఆ తర్వాత కదా ప్రదానమంత్రిత్వం సంగతి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-18-ఉయ్యూరు