నాదారి తీరు -112 పద్యనాటక౦

నాదారి తీరు -112

  పద్యనాటక౦

ఒక సారి బెజవాడ  బుక్ ఎక్సిబిషన్ లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని  గారు రాసిన ‘’భారతావతరణం ‘’పద్యనాటకం పుస్తకం క౦టపడగానే  కొనేశా .చిన్నపుస్తకమే .పది రూపాయలు మాత్రమె .అది చదివాక స్కూల్ పిల్లలతో దీన్నివేయిస్తే బాగుంటుంది అనిపించింది .పిల్లలకు చెప్పి వాళ్ల ఇష్టం తెలుసుకున్నా .వాళ్లకు బాగానే ఉందనిపించినా ,ఆ మాటలు పలకగలమా, పద్యాలు నోటికి వస్తాయా అనే సందేహం నాతొ మాటు వాళ్ళకూ వచ్చింది .చిన్ననాటకం .నన్నయ్య ,నారాయణ భట్టు ,రాజరాజనరేంద్రుడు మూడే పాత్రలతో నాటకం అడి౦చాలనుకున్నాం  .పాత్రల సెలక్షన్ నేనేచేశా .ఆందులోభూషణం బాబు అనే ఒక కుర్రాడున్నట్లు మేము కిందటి ఏప్రిల్ లో అమెరికా  వెళ్ళినప్పుడు ,అప్పుడప్పుడు వాట్సాఫ్ లో ఆతను మాట్లాడినప్పుడు గుర్తు చేశాడు. తాను ,నన్నయ  వేశానని అన్నాడు మిగిలిన వాళ్ళు నాకు గుర్తులేరు .స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసి  ఎవరి పోర్షన్ వాళ్లకు చెప్పి రాయించి ,ఆపాత్ర చెప్పాల్సిన డైలాగ్ కు ముందు ఏపాత్ర మాట్లాడుతోందో అందులో చివరివాక్యం ఏమిటో కూడా రాయించి ప్రాక్టీస్ చేయించా .బాధ్యత అంతా నేనే తీసుకున్నా.నాకూ వాళ్ళకూ ఖాళీ ఉన్న సమయాలలో క్రాఫ్ట్ రూమ్ లో ప్రాక్టీస్ చేయి౦చేవాడిని .  చాలా కష్టంగా ఉండేది వాళ్లకు ,నాక్కూడా .వాళ్ళు సరిగ్గా పలక లేకపోతె చాలా చిరాకు పడేవాడిని. కాని వాళ్ళు ఎస్సి ,బి సి విద్యార్ధులు .స్వచ్చంగా పలకటం వాళ్లకు అలవాటు లేనిపని .అందులో పద్యాలు కొంత రాగ యుక్తంగా భావ యుక్తంగాపలికితేనే దాని స్వారస్యం తెలుస్తుంది .అందుకని ఎక్కడ లేని ఓపికా తెచ్చుకుని ,ప్రతి కుర్రాడికీ ప్రత్యేక శిక్షణ నిచ్చి సుమారు నెలలోపు వారిని నిష్ణాతులను చేయగలిగాను .  నాగలక్ష్మి చేత రికార్డ్ చేయించి వాళ్ళకే వినిపిస్తే మహా ఆశ్చర్య పోయారు వాళ్ళు .తర్వాత స్టాఫ్ అందర్నీ సమావేశ పరచి పద్యనాటకం ఆడించా .పద్యనాటకం అంటే డ్రెస్ లేమీ లేకుండానే అని గుర్తుంచుకోండి ,స్టాఫ్ ముందు కూడా నదురూ బెదురూ లేకుండా చక్కగా సుశబ్దంగా సంభాషణలు ,పద్యాలు పలికి వాళ్ళకూ ఆశ్చర్యం కలిగించారు మా పిల్లలు .’’తివిరిఇసుమున తైలంబు తీయవచ్చు ‘’అన్నదానికి ఉదాహరణే ఈ పద్యనాటకం .తర్వాత దీన్ని ఒక వార్షికోత్సవం నాడు వాళ్ళతో ప్రదర్శింప జేసినట్లు జ్ఞాపకం .తలిదండ్రులూ ముచ్చట పడి బోల్డు ఆశ్చర్యం ప్రకటించి మమ్మల్ని బాగా అభినందించారు .ఇదంతా పిల్లల అమోఘ కృషి మాత్రమె ,నాప్రయత్నం కొంత తోడ్పడింది .మంచి పని చేయటానికి యెంత కష్టపడాలో ఈ నాటకం మాకందరికీ నేర్పింది .రాసిన దివాకర్లవారికి ఎంతైనా రుణపడి ఉంటాం .

                   అ౦గలూరు డయట్ వారి ప్రశంసలు

 ప్రతి ఉపాధ్యాయ దినోత్సవానికీ విద్యార్ధులందరి భాగస్వామ్యం ఉండేట్లు చేసేవాడిని .ఉపాధ్యాయులకు అసెంబ్లీ లో శుభాకాంక్షలు తెలియజేయటం ,తర్వాత ప్రతి తరగతి లో ఆతరగతి క్లాస్ టీచర్ కు పుష్పగుచ్చాలు సమర్పించి సాల్యూట్ చేయటం ,విద్యార్ధులందరికీ స్వీట్స్ కొని పంచిపెట్టటం జరిగేది .ఇదంతా అయ్యాక  అంగలూరు దయట్ నుండి ఎవరో ఒకరిద్దరు లెక్చరర్ లను ఆహ్వానించి సమావేశ హాల్ లో విద్యార్దుల౦దర్నీ  కోర్చోబెట్టి పాటలు పాడించి డాన్సులు చేయించి వాళ్ళతోనే ముందుగా ఉపన్యాసాలు చెప్పించి తర్వాత దయట్ లెక్చరర్ లను మాట్లాడమనే వాళ్ళం .వాళ్ళు ఈ ఆర్భాటం హడా విడి చూసి ‘’డ౦గ్’’అయిపోయేవారు .సభా ముఖంగా నే వారు ప్రశ్నించేవారు ‘’ఎన్ని వేలు ఖర్చు చేశారు ?అని .’’మూడు నాలుగు వందలు ‘’అని చెప్పగానే మరింత ఆశ్చర్యపోయేవారు .వాళ్ళు ‘’ఇదే ఫంక్షన్ ఇదే తీరులో మా డయట్ లో జరపటానికి పదివేలు ఖర్చు చేస్తారు. కాని అందులో ఇక్కడున్న ఆప్యాయతా ,ఆత్మీయతా గౌరవం క్రమశిక్షణా కనిపించవు .మీరందరూ మనసు హృదయం బుద్ధీ చక్కగా పెట్టి దీన్ని ఇంత శోభాయమానంగా దిగ్విజయంగా చేశారు .మీ అందరికీ మా అభినందనలు .మీ హెడ్ మాస్టర్ గారి చొరవ ఆలోచనా మెచ్చదగినవి .మీ ఉపాధ్యాయుల  మీ విద్యార్ధుల సహకారం గొప్పది .మీరందరూ ఒకే కుటుంబంగా ఇలా ఈ ఉత్సవం జరిపి  మాకే తెలియని ఎన్నో విషయాలు నేర్పుతున్నారు ‘’అని చెప్పేవారు .అందులో తెలుగు లెక్చరర్ శ్రీ ఆంజనేయులుగారు అద్భుత ప్రసంగాలు చేసి విద్యార్ధులకు గొప్ప స్పూర్తి కలిగించేవారు .సాధ్యమైనంతవరకు ఆయన వచ్చేట్లు ప్రయత్నం చేసేవాడిని  పిల్లలే తమ ఇల్లదగ్గరున్న పువ్వులు తెచ్చేవారు లేడీ టీచర్ల సాయంతో దండలూ బొకేలు తయారు చేసేవారు .పదవ తరగతి విద్యార్ధులు తలాకాస్తా డబ్బు వేసుకొని టీచర్లకు పార్టీ ఇచ్చేవారు .అతిధుల సత్కారం అంతా స్కూల్ భరించేది .కనుక డబ్బు ఖర్చు చాలాతక్కువ .అందరి పార్టిసిపేషన్ ఉండటం తో రెట్టింపు ఉత్సాహం తో కలిసి పని చేసేవారు. ఎవరికీ బర్డెన్ అనిపించేదికాదు .ఒకరిద్దరు పాఠశాల ఉపాధ్యాయులకు సత్కారం చేసేవాళ్ళం .వాళ్ళకీ ఆనందంగా ఉండేది .

  అలాగే డయట్ ప్రిన్సిపాల్ డా. శ్రీ చాగంటి వెంకటేశ్వరరావు కూడా ఒకసారి వార్షికోత్సవానికి విచ్చేసి  మా అందరికీ ప్రేరణ కలిగించారు. అద్భుతమైన వాగ్ధాటి ఆయనది .తెలుగులొ. ఇంగ్లీష్ లో ఆయన ప్రసంగిస్తుంటే నోళ్ళు తెరుచుకుని వినాల్సిందే .గంగా ప్రవాహమే .కొన్ని దేశాలుకూడా తిరిగొచ్చిన అనుభవం ఆయనది .జిల్లాలో ఆయన ఉన్నకాలం బంగారుకాలంగా గుర్తుండి పోయింది .ఆయన వలన విద్యార్ధులకు అనేక విధాలుగా ప్రయోజనం కలిగింది .

                       గణితావధానం

 ఉయ్యూరు హై స్కూల్ లో నాశిష్యుడు  మా స్కూల్  డ్రాయింగ్ మాష్టారు నాకు గురువు,అదే స్కూల్ లో నాకు సహ ఉపాధ్యాయులుగా పనిచేసిన    శ్రీ తాడినాటి శేషగిరిరావు గారబ్బాయి ఫణి రాజమోహన్ లెక్కలలో దిట్ట .నాదగ్గర ట్యూషన్ చదివినవాడు .అనేక గణిత ఒలింపియాడ్ లో పాల్గొని ప్రైజులు అందుకున్నాడు .జిల్లా సైన్స్ ఫెయిర్ లలో ఎప్పుడూ ఉపాధ్యాయుడుగా ,విద్యార్ధులతో   ప్రాజెక్ట్ లు చేయించటం లోనూ బహుమతులుందుకున్న సృజన శీలి .అతనితో మేము ఉయ్యూరులో మా సాహితీ మండలి ఆధ్వర్యం లో ఒక ఆదివారం సాయంత్రం ‘’గణిత అష్టావధానం ‘’చేయించి అరంగేట్రం చేయించాం .బాగా చేశాడు .పత్రికలన్నీ మంచి కవరేజ్ ఇచ్చాయి .దీని పూనిక నాదే .స్పాన్సర్లుగా కెసీపి కెమిస్ట్ హాస్య, నాటకరచయితా కవీ   స్వర్గీయ   శ్తీ టి వి సత్యనారాయణ ,బీరువాల మీసాల రెడ్డిగారు .అప్పటినుంచి చాలాస్కూల్స్ లో ఆతను గణితావధానాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న లెక్కల మాస్టారు .

  ఈ ఫణిరాజ మోహన్ తో అడ్డాడ హైస్కూల్ లో ఒక వార్షికోత్సవానికి ‘’గణిత అష్టావధానం ‘’చేయించాం .తెలివిగల విద్యార్ధినీ విద్యార్ధులను లేక్కలమేస్టారు రాజుగారితో ఎంపిక చేయించి ప్రుచ్చకులుగా ఏర్పాటు చేశాం .వీరిలో నాగలక్ష్మి, పావని మొదలైన పిల్లలున్నట్లు గుర్తు పిల్లలు బాగా ప్రశ్నించారు  .అవధాని దీటుగా సమాదానాలు చెప్పి గొప్ప ప్రేరణ కలిగించాడు .అవధాన ప్రక్రియ విద్యార్ధులకు అందుబాటు లో తెచ్చినందుకు అందరం ఆనందించాం .బహుశా ఈ వార్షికోత్సవానికే ననుకుంటా డయట్ ప్రిన్సిపాల్ చాగంటి వారు ముఖ్య అతిధిగా గా వచ్చి ఇక్కడి విశేషాలకు అబ్బురపడి ,అవధానం చేయించినందుకు అభినందించి అవధానికీ ఆశీస్సులు అందజేశారు .అవధాని ,నాశిష్యుడు ఫణి కి గొప్ప సన్మానం చేశాం అతనూ ఎంతో మురిసిపోయాడు .

               శ్రీ బసవలింగం గారికి సత్కారం

శ్రీ నల్లూరి బసవలింగం గారు పామర్రు హైస్కూల్ లో సీనియర్ తెలుగుపండిట్ .తెలుగు కావ్యాలలో దిట్ట .రాగయుక్తంగాపద్యం పాడి పాఠం చెప్పటం లో అందెవేసిన చేయి .గొప్ప హరికధకులు కూడా .రేడియోలో చాలా హరికధలు చెప్పారు. గ్రామాలలో పామర్రు సెంటర్ లో  కూడా ధనుర్మాసం లో హరికధలు చెప్పేవారు .ఆయనగాత్రం అపర ఘంటసాల అనిపిస్తుంది .పద్యరచనలో మహా ప్రావీణ్యం ఉన్నవారు .నాకు అత్యంత ఆప్తులు .మా ఉయ్యూరు సాహితీ మండలికి తరచుగా వచ్చేవారు .మాఇంటికి వస్తే  భోజనం చేయకుండా పంపించేవాళ్ళం కాదు భోజనం ముందూ తర్వాత ఆయన పద్యాలను శ్రావ్యంగా గానం చేసి తన్మయులను చేసేవారు .అందులో నర్తనశాల ,  భీష్మ  సినీపద్యాలు , కరుణశ్రీ కుంతీకుమారి,  జాషువా కాటిసీను పద్యాలు పాడాల్సిందే. విని చప్పట్లు మోగించాగిల్సిందే .వాగ్దానం సినిమాలో రేలంగి చెప్పిన ఘంటసాల  హరికధ బసవలింగం గారి  గొంతు ద్వారా వింటే దాని రుచే వేరు . ఆయన పాటలుపాడితే  ఊగిపోవాల్సిందే .మాధుర్యం శబ్ద స్వచ్చత మనసులను యిట్టె ఆకర్షిస్తాయి .గాంధర్వ లోకం నుండి జారిపడిన వాడేమో అనిపించేది .గొప్ప ఇమిటేషన్ చక్రవర్తి కూడా శంకరాభరణం లో ఒక చిన్నపిల్లకు సంగీతం చెప్పే మాస్టారు ,సోమయాజులకు సంగీతం రాదనీ చెప్పే శీను ఆయన మక్కీకి మక్కి రెండు పాత్రలను అభినయించి చ్చ్పే అభినయం అమోఘం .స్కూల్ లో ఆయన కన్నడం కూడా నేర్పేవారు దానికోసం ట్రెయినింగ్ కూడా పొందారు .దీనికి  ప్రత్యెక ఇన్సెంటివ్ ఆయనకు దక్కేది .వేసవిలో బెంగుళూరు వెళ్లి పునశ్చరణ తరగతులలో పాల్గొనేవారు  వస్తానన్న టీచర్స్ ను తనవెంట తీసుకు వెళ్ళేవారు .ఆయన కన్నడం మాట్లాడుతుంటే  కన్నడం వాడేనేమో అనే అనుమానం వస్తుంది. అంత స్వచ్చంగా మాట్లాడేవారు .

  బందరు స్పాట్ వాల్యుయేషన్ లో ఆయన ఒక గొప్ప అట్రాక్షన్ .తెలుగు పేపర్లు దిద్దేవారంతా ఆయన నాయకత్వంలో గొప్ప సభల్లాంటివి జరిపేవారు .ఆయనతో పాటలు పద్యాలు పాడించేవారు .అక్కడ ఆయనను కలవటం మధురానుభూతి నిచ్చేది .బోళా మనిషి, కల్లాకపటం లేని వ్యక్తి .వీటన్నిటినీ మించిన మరొక విషయం ఉంది.పింగళి సూరన రాసిన ‘’కళాపూర్ణోదయం ‘’ప్రబంధం ఆయనకు పూర్తిగా కంఠతా వచ్చు .ఎక్కడ ఏపద్యం చెప్పమన్నా క్షణం లో చెప్పగలరు .కానీ అందులోని కథ గుర్తుపెట్టుకోవట చాలాకష్టం .దాన్ని ఆయన కరతలామలకం చేసుకున్నారు . ఎక్కడా ఎవరికీ విసుగు రాకుండా మహా నేర్పుగా చెప్పేవారు .వీటిని చాలాసార్లు రేడియోలో ధారావాహికంగా చెప్పారు అవి అనేకసార్లు పునః ప్రసారితాలై ఆయన ప్రతిభకు గీటు రాళ్ళుగా ఉండిపోయాయి .ఉయ్యూరు సాహితీమందలిలోనూ చెప్పారు బహుముఖ శేముషీ వైభవం ఆయనది .ప్రముఖ కవుల అష్టావధాన శతావధానాలలో ప్రుచ్చకులుగా ,అప్రస్తుత ప్రసంగ కర్తగా ప్రశంసలు పొందారు .ఇంతటి విద్వాంసుడు నాకు గొప్ప అభిమాని అవటం నా అదృష్టం .ఆంద్ర దేశం లో ఆనాటి సమకాలీన ప్రముఖ కవులందరితో ఆయనకు పరిచయం ఉన్నది

   శ్రీ బసవ లింగం గారిని రెండు సార్లు అడ్డాడ హైస్కూల్ కు ఆహ్వానించి ,పిల్లలకు ప్రేరణాత్మక సందేశాలిప్పించి ఘనంగా సత్కరించాం .ఆయనా నేనూ రిటైర్ అయ్యాకకూడా మా సాహితీ బాంధవ్యం చాలాకాలం కొనసాగింది .ఆయన ఆతర్వాత ఎక్కడో రెండు మూడు చోట్ల  ప్రైవేట్ కా  లేజీలలో  తెలుగు లెక్చరర్ గా పని చేయటంఅంతగా నచ్చక ఉండలేకపోవటం నాకు తెలుసు . ,వీలైనప్పుడల్లా మా ఇద్దరిమధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరగటం ఉండేది .క్రమ౦ గా తన ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు  రాసేవారు .మరొకసారి పెన్షన్ డబ్బు అంతా బళ్లారిలో పొలం కొని వ్యవసాయం చేయలేక ,చేసినా గిట్టుబాటు కాక  అయినకాడికి అమ్మేసి తెగ నష్టపోయి ఉయ్యూరువస్తే ఆయన ముఖం లో కాంతి ,ఉత్సాహం కనిపించలేదు .ఇంటివద్ద పరిస్తితులు కూడా అనుకూలంగాలేవని చెప్పారు .చాలా కృశించిపోయారు . కాని మాటల్లో ఆ హాస్యం మాత్రం తగ్గలేదు .ఆయనుంటే సందడే సందడి .మళ్ళీ ఎక్కడో ఉద్యోగం లో చేరి చాలా విసిగివేసారి పోయినట్లు రాశారు .ఆతర్వాతెప్పుడో ఆయన మరణవార్త తెలిసింది .స్నేహశీలి సహృదయుడు మంచిమనిషి, గొప్పకవి, భావుకుడు , మహావక్త గుణగ్రహణ పారీణుడు  కావ్యాల ను లోతుగా పరిశీలించినవాడూ , కన్నడం లోనూ చిక్కని కవిత్వం చెప్పినవాడు ముఖ్యంగా ‘’కళాపూర్ణోదయ౦ ‘’ను ఔపోసన పట్టిన’’చుళికీకృత సకల కళాపూర్ణోదయుడు, అభినవ గాన గంధర్వుడు శ్రీ నల్లూరి బసవలింగం గారి మరణం బాధాకరం .ఒక మంచి సాహితీ మిత్రుని కోల్పోయాను .

  సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-6-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.