కృష్ణాజిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం
అడ్డాడ కు రాకముందు మేడూరు లో పని చేశానని ,అక్కడ నూజి వీడు డివిజన్ ఉప విద్యాశాఖాదికారిణి జూలై లోనే పాఠ శాల వార్షిక తనిఖీ చేశారని ,అక్కడ అన్ని రంగాలలో అభివృద్ధి ,శిక్షణ, క్రమశిక్షణలకు ఆమె ఎంతో సంతృప్తి చెందారని ఇదివరకే మీకు తెలియ జేశాను .చివరలో ఆమె నన్ను ఒంటరిగా పిలిచి ‘ హెడ్ మాస్టారూ ! మీ స్కూల్ ప్రోగ్రెస్, మీరు చూపిన చొరవ , బడి తెరచిన రెండు నెలలోనే చూపిన అభి వృద్ధి ,గతఏడాది మీరు సాధించిన ప్రగతి చూసి చాలా సంతోషం కలిగింది .నేను పశ్చిమ గోదావరి నుంచి ఈ జిల్లాకు వచ్చాను .అక్కడ ఎక్కడా ఇలాంటి మోడల్ స్కూల్ నాకు కనపడలేదు .స్టాఫ్ అందరి సహకారం, గ్రామస్తుల ,కమిటీ వాళ్ల సహాయం తో మీరు సాధించిన ప్రగతి అభినందనీయం .ఈ సంవత్సరం జిల్లాస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డ్ కు నేను మిమ్మల్ని ప్రత్యేకం గా రికమెండ్ చేస్తాను .అప్లికేషన్ ఫిలప్ చేసి పంపండి. అంతే మిగతాది నేను చూసుకొంటాను ‘’అని మరీ మరీ చెప్పారు .నేను వెంటనే ‘’అమ్మా !ఈ అప్లికేషన్ పెట్టటం వగైరాలు నాకు నచ్చని పని .వీటికి పైరవీలు ఉంటాయని అంటారు .నేను అలా ‘’పాకలేను’’ .నాకన్నా సీనియర్స్ ,అర్హులు ఇంకా చాలా మంది ఉన్నారు. వారికిస్తే నాకు ఇచ్చినట్లే ‘’అన్నాను .దానికి ఆవిడ ‘వారి సంగతి తర్వాత ఆలోచిద్దాం .ఈ ఏడాది మొదటి ఇన్స్పెక్షన్ మీ స్కూల్ లోనే చేశాను .బాగా సంతృప్తి చెందాను .దానికి తగినట్లు గా మీకు అవార్డ్ ఇప్పించాల్సిన బాధ్యతనాది .నేను ఒక్కదాన్ని మాత్రమె ఇంప్రెస్ కాలేదు, పానల్ గా వక్చిన వార౦దరిదీ అదే మాట .నూజివీడులోకూడా చాలామంది టీచర్లు, హెడ్ మాస్టర్లు మీ గురించి మంచి అభిప్రాయం తో ఉన్నారు .మీకు ఇప్పించకపోతే మీకు నేను అన్యాయం చేసిన దాన్ని అవుతాను .నేనే అప్లికేషన్ మీకు అందేట్లు చేస్తా .పూర్తి చేసి మా ఆఫీస్ కు సమయం లోపల అందజేయండి ‘’అని మరీ మరీ చెప్పారు .ఇదంతా రహస్యంగా నే ఉంచాం .సరేనని ధన్యవాదాలు చెప్పాను .
నూజివీడు హైస్కూల్ లో శ్రీ విష్ణుశర్మ గారు అనే సోషల్ మాస్టారు ఉన్నారు .ఆయన ఇంగ్లిష్ లో మహా దిట్ట .ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ క్లాసెస్ నిర్వహించటానికి ఆయనను డిపార్ట్మెంట్ బాగా వినియోగించుకొంటుది. సమర్ధుడు కనుక జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం లోనూ ఆయనకు పలుకుబడి హెచ్చు .ఇక నూజివీడు ఉపవిద్యాశాఖ కార్యాయం లోనూ ఆయనకు తెలీకుండా ఏదీ జరగది వినికిడి .ఒకరోజు ఆయన ఎవరిద్వారానో నాకు పురస్కారానికి పెట్టాల్సిన అప్లికేషన్ ఫారం పంపించి ,త్వరగా పూర్తి చేసి నూజివీడు వచ్చి స్వయంగా తనను కలిసి ఇమ్మని కబురు చేశారు .ఇదంతా నాకు కొత్త .దీనికి వ్యతిరేకిని కూడా .సమర్ధతను వాళ్ళే గుర్తించి అవార్డ్ ఇవ్వాలని నా సిద్ధాంతం .కానీ సిద్ధాంతానికీ ఆచరణకు ఆమడ దూరం కదా .అన్ని వ్యవహారాల్లోనూ ఇంతే .నాకు పంపిన అప్లికేషన్ నేను పూర్తి చేసి నూజివీడు వెళ్లాను .అప్పటికి ఇంకా మాఇంట్లో ఫోన్ సౌకర్యం లేదు .అక్కడ ఆయన ఇల్లు కనుక్కుని వెళ్లేసరికి ఆయన ఇంట్లో లేరు .ఆయన మేనమామ గారు శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు అనే రిటైర్డ్ సోషల్ మాస్టారు ,ఇంగ్లిష్ లెక్చరర్ ,జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ శర్మగారింట్లో ఉన్నారు .ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించి వచ్చిన పని తెలుసుకొని శర్మగారు ఎక్కడికో బయటికి వెళ్ళారని తప్పక వస్తారని వచ్చేదాకా ఉండమని కోరారు .టిఫిన్ కాఫీ మర్యాద జరిగింది .వెంకటేశ్వరావు గారిని చాలాఏళ్ళ తర్వాత ఇదే చూడటం .ఉయ్యూరులో బాలభారతి ప్రారంభానికి శ్రీ వంగల కృష్ణ దత్తు దత్తుగారింటికి వచ్చినప్పుడు చూడటమే .వారి గురించి బాగా తెలుసు .రేడియోలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు .సౌజన్యం మూర్తీభావి౦చినవారు .కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాం .ఇంతలో రాత్రి 8 తర్వాత విష్ణు శర్మగారు వచ్చారు .నన్ను చూసి కౌగలించుకొని ఆత్మీయ పరామర్శ చేశారు వారికి అప్లికేషన్ ఇచ్చాను .’’ప్రసాద్ గారూ!మేడం గారు మీరంటే అత్యంత అభిమానం తో ఉన్నారు .మీకు రావటం లో ఎలాంటి ఇబ్బందీ ఉండదు .నావంతు ప్రయత్నం నేను చేస్తాను ‘’అని చెప్పారు .భోజనంచేసి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్ళమని మరీ మరీ కోరారు .నేను రాత్రిపూట ఎక్కడా ఉండను అర్ధరాతయినా అపరాత్రి అయినా ఇంటికి చేరాల్సిందే అని చెప్పి ధన్యవాదాలు తెలిపి బయటపడి బెజవాడ మీదుగా ఉయ్యూరు చేరే సరికి రాత్రి 11 దాటింది .ఇక ఈ విషయం మర్చేపోయాను .
సెప్టెంబర్ 5 దిన పత్రికలో నాకు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రకటించారు .నాతోపాటు కొంతమంది ప్రదానోపాధ్యాయులకు ,బి.ఎడ్, సెకండరీ తెలుగుపండిట్ లకూ ఇచ్చారు .ఉదయం స్కూల్ కు వెళ్ళగానే ఉపాధ్యాయులు విద్యార్ధులూ హర్షాతి రేకంతో నాకు అభినందనలు తెలిపారు .అందరికి ధన్యవాదాలు చెప్పాను .స్టాఫ్ సెక్రటరి వెంటనే డ్రిల్ మాస్టారు తో అసెంబ్లీ ఏర్పాటు చేసి,నాతో పతాకావిష్కరణ చేయించి విద్యార్ధులచే సాల్యూట్ చేయించారు .నేనేదో కొద్ది సేపు మాట్లాడి కృతజ్ఞతలు తెలిపాను .
తర్వాత స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయమని సెక్రటరి కోరితే ఏర్పాటు చేశాను .అప్పటికప్పుడు గుమాస్తా అంజిరెడ్డి నిగుడివాడ పంపించి స్వీటు హాట్ ఖరీదైన మంచి శాలువా తెప్పించారు .హోటల్ నుంచి టీ వచ్చింది .అందరూ ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడి శుభా కాంక్షలు తెలియ జేశారు .నేనూ ఉచిత రీతిలో కృతజ్ఞతలు చెప్పాను .ఆతర్వాత ప్రతి సెక్షన్ వాళ్ళూ నన్ను ఆహ్వానించి దండలు వేసి చాక్లెట్స్ పెన్నులు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు .ఒక రకంగా పులకి౦చి పోయాను .నన్ను తమ అభిమానం గౌరవాలతో ఉక్కిరి బిక్కిరి చేశారు .జీవితం లో మరచి పోలేని సంఘటన ఇది .ఈసన్మానం నిజంగా మేడూరు హై స్కూల్ లో నేను సాధించిన దానికి గుర్తింపు .కాని ఇక్కడ వీళ్ళు అంతా తమ అడ్డాడ హై స్కూల్ కు దక్కిన అరుదైన గౌరవం గా భావించారు .నూజి వీడు ఉపవిద్యాశాఖాదికారిణి గారు తాము అన్నమాట నిలబెట్టుకుని ,నాకు పురస్కారం లభించేట్లు చేశారు .వారి సౌజన్యానికి కృతజ్ఞతలు .తర్వాత ఆమె మళ్ళీ ఏలూరు వెళ్లి పోయినట్లు విన్నాను .విష్ణుశర్మ గారి తోడ్పాటుకూ కృతజ్ఞతలు .ఇదే నేను పొందిన మొట్టమొదటి ప్రభుత్వ పురస్కారం .
కామన్ హాల్ లో మీటింగ్ పెట్టి కమిటీ ప్రెసిడెంట్ శ్రీ అడుసుమిల్లి రామ బ్రహ్మం గారిని ఆహ్వానించి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిపాం .నాకు చిరస్మరణీయ సత్కారం చేశారు అందరూకలిసి .అందరి ముఖాలలో ఆనందం ప్రస్పుటంగా కనిపించింది .అడ్డాడలో చేరిన నెలరోజులలోపలనే నాకుఈ పురస్కారం రావటం తో, ఇదే అక్కడ మొదటి ఉపాధ్యాయ దినోత్సవం అయింది. అంటే మొదటి సత్కారం నాకే జరిగింది .ఆ తర్వాతే ఇంతకూ ముందు రాసిన కార్యక్రమాలన్నీ జరిగాయి .ముందే నా డబ్బా నేను కొట్టుకోవటం ఇష్టం లేక చాలా ఎపిసోడ్ లతర్వాత వినమ్రంగా ఈ ఉదంతాన్ని ఇప్పుడు రాశాను . పురస్కారం ఈ స్కూల్ లో లభించినందుకు ఆస్కూల్ కూ గొప్ప అనిపించింది .ఎవరికి వాళ్ళు తమకే వచ్చినంత సంబర పడ్డారు .మర్చిపోదామన్నా మరువలేని సంఘటన, తీపి గుర్తు ఇది .ఈ ఆనంద సమయం లో బడిని అయిదు పీరియడ్లు మాత్రమే జరిపాం .
లెక్కలమేస్టారు రాజుగారు బందరులో అందజేసే పురస్కారానికి తాను కూడా వస్తానని తన టి .వి .ఎస్ .పై బందరు వెడదామని అన్నారు. సరేనని బయల్దేరాం .చేరేసరికి సాయంత్రం నాలుగు దాటింది .ఎక్కడో హోటల్ లో కాఫీ టిఫిన్ లు లాగించి పురస్కార ప్రదేశానికి చేరుకున్నాం .ఏ స్కూల్ లో జరిగిందో గుర్తు లేదు .ఏర్పాట్లు ఘనం గా చేశారు. విద్యార్దులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించారు .ఆతర్వాత ఉపన్యాసాలు .అప్పటి డి.యి. వో. గారి పేరుకూడా నాకు జ్ఞాపకం లేదు .ముందు ప్రధానొపాధ్యాయు లకు ఆతర్వాత బి ఎడ్ లకూ ఆతర్వాత మిగిలిన వారికీ చేసినట్లు గుర్తు .పుష్పహారం ,శాలువా సర్టిఫికేట్ లతో జిల్లా విద్యాశాఖాదిగారు అందరినీ సత్కరించారని జ్ఞాపకం . జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు కూడా వచ్చే ఉంటారని అనుకొంటున్నా .కార్యక్రమం చాలా పకడ్బందీ గా గ్రాండ్ గా జరిగింది .అంతా అయ్యేసరికి రాత్రి 9 దాటి ఉంటుంది .నన్ను బస్ స్టాండ్ లో ది౦పమని రాజుగారికి చెప్పి ,అక్కడ బస్ ఎక్కి ఉయ్యూరు చేరేసరికి రాత్రి 11 అయి ఉంటుంది . మర్నాడు నేను పురస్కారం అందుకున్న సందర్భంగా స్టాఫ్ కు మంచి టీపార్టీ ఇచ్చాను .విద్యార్ధులకు బిస్కెట్స్ చాకోలేట్స్ ఇచ్చి వారు చూపిన ఆదరాభిమానాలకు ప్రతిస్పందన తెలియజేశా .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-18 –ఉయ్యూరు .