నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం

నాదారి తీరు -115

బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం

అడ్డాడ హయ్యర్ సెకండరీ లో పనిచేసి  ఇక్కడి విద్యార్ధుల అభ్యున్నతికై అవిరళ కృషి చేసి ,ఇంగ్లీష్ లో ఎం .ఏ .చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా సేవలందించి రిటైరై నూజివీడు కేంద్రంగా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి’’మహాత్ములు నడచిన బాటలో ‘’అనే ఆత్మకథ ను వినమ్రంగా రచించిన బాలసాహిత్యం లో యెనలేని కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ ముదునూరు వెంకటేశ్వరావు గారు .వారి ప్రభావాన్ని ఇప్పటికీ అడ్డాడ జనం చెప్పుకుంటారు .అలాంటి వారిని ఆహ్వానించి స్కూల్ తరఫున సత్క రిస్తే బాగుంటుంది అని పించి౦దినాకు .స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరి ఆమోదం కోరాను.తప్పని సరిగా చేయాల్సిందే నని అభిప్రాయం వెలిబుచ్చారు .విద్యార్ధులకూ ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలియ జేస్తే వాళ్ళూ అంగీకరించారు .

ఆయన నూజి వీడు లో ఉంటున్నారు .మా బావమరది ఆనంద్ ఏలూరు స్టేట్ బాంక్ లో పని చేస్తున్నాడు .ఇద్దరికీ మంచి అనుబంధం ఉన్నది .కనుక ఆయన్ను తీసుకు వచ్చే బాధ్యత మా వాడి పై పెట్టాను .సరే అన్నాడు .అప్పుడు మరో ఆలోచన నా మనసులో మెదిలింది.వాడు గొప్ప పెయింటర్ కదా  వాడి తో వాడు గీసిన చిత్రాల ఆర్ట్ ఎక్సి బిషన్ ఏర్పాటు చేసి ,పెద్దతరగతి పిల్లలో డ్రాయింగ్ పెయింటింగ్ లో ఆసక్తి కలిగిస్తే అతని రాకసార్ధకమవుతుంది కదా అని పించి అందరి అంగీకారం తీసుకుని ఈ కార్యక్రమం అంతా ఒక స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏర్పాటు చేశాం .ఏ సంవత్సరం అన్నది గుర్తు లేదు .వాళ్ళిద్దరికీ ముందే తెలిపాం వారూ బాగుందని అన్నారు

ఆర్ట్ ఎక్సి బిషన్  ,డిమాన్స్ట్రేషన్ లెసన్

ఆనంద్  ,ముదునూరువారిని స్కూటర్ పై అడ్డాడ తీసుకు వచ్చాడు .రాగానే స్టాఫ్ అందర్నీ పరిచయం చేసిఅసెంబ్లీ ఏర్పాటు చేశాం .ముఖ్య అతిధిగా వచ్చిన ముదునూరి వారితో పతాకావిష్కరణ చేయించి  విద్యార్ధులచే వారికి గౌరవ వందనం చేయి౦చి  విద్యార్ధులకు ప్రేరణాత్మకమైన ప్రసంగం చేయించాం , తరువాత స్టాఫ్ అందరు వారిద్దరితో కలిసి కాఫీ టిఫిన్లు చేశారు .

తర్వాత సైన్స్ రూమ్ లో మా వాడు వెంట తెచ్చిన తాను పెయింట్ చేసిన చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయించాం .విద్యార్ధులు ఆసక్తిగా అన్నీ చూసి చిత్రలేఖనం పై అభి రుచి ఏర్పరచుకున్నారు .ఆతర్వాత అక్కడే అతనితో ఎంత తేలికగా డ్రాయింగ్ గీయవచ్చునో, యెంత సులభంగా చిత్రాలు చిత్రి౦చవచ్చునో  బోర్డ్ మీద గీస్తూ ,పిల్లలను ప్రశ్నిస్తూ ,అడిగిన వాటికి చక్కని సమాధానాలు చెబుతూ బాగా బోధించాడు .పిల్లలందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు .ఏదో మహా విద్య నేర్చుకున్నాం అనే ఆనందం వాళ్ల ముఖాలలో ప్రస్పుటంగా కనిపించింది .అందరూ మావాడిని అభినందించి మెచ్చుకున్నారు .ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులూ పాల్గొని సంతృప్తి చెందారు .

ముదునూరు వారికి సత్కారం

క్రాఫ్ట్ రూమ్ అనే కామన్ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేశాం .దీనిని విద్యార్ధులే ఉపాధ్యాయుల సూచనలతో చక్కగా నిర్వహించారు .శ్రీ ముదునూరువారు ముందుగా తనకు ఈ పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ,తర్వాత భారత దేశం స్వాతంత్రం సాధించటానికి పడిన పాట్లు ,పొందిన అవమానాలు ,మొక్కవోని మహాత్ముని ప్రేరణ ,నాయకత్వం తో సాధించిన విధానం అంతా చాలా నాటకీయంగా స్వీయ అనుభవాన్ని జోడించి ప్రసంగించారు తర్వాత విద్యార్ధులు నవభారత నిర్మాణం లో నిర్వహించాల్సిన పాత్ర గురించి వాళ్లకు అర్ధమైన భాషలో ప్రేరణాత్మకంగా మాట్లాడి విద్యార్ధుల హృదయాలను ఆకర్షించారు .ఆయన ప్రసంగం లో పాట, పద్యం, గీతం, గేయం, నాటకం అన్నిటిని సమపాళ్ళలో రంగరించారు .పిల్లలు మహా మురిసి పోయారు .ఒకరకంగా ‘’హి కాప్టివేటేడ్  ది ఆడియెన్స్ ‘’.వారి ప్రసంగానికి ముందు కొందరు విద్యార్ధినీ విద్యార్ధులు , ఉపాధ్యాయులూ మాట్లాడారు .అంతకుముందు విద్యార్ధినీ విద్యార్ధులు దేశభక్తి గీతాలను ఆలపించి కార్యక్రమానికి మంచి నేపధ్యం కలిగించటం తో ముదునూరు వారి ప్రసంగానికి  మార్గం సుగమం  అయింది ..

పిమ్మట ముదునూరు వారిని ప్రత్యేక ఆసనం పై కూర్చోబెట్టి ,అన్ని తరగతుల విద్యార్ధి నాయకులతో  స్కూల్ ప్యూపిల్ లీడర్ లతో పుష్పగుచ్చాలు ఇప్పించాం .తర్వాత స్టాఫ్ సెక్రెటరి,  ఫస్ట్ అసిస్టెంట్  నేనూ ,కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రామబ్రహ్మ౦ గారి తో పుష్పహారం వేయించి,  శాలువా కప్పి గంధం పూయించి పన్నీరు చల్లి  కొంత నగదు కూడా తాంబూలం లో పెట్టి ఘన సత్కారం చేశాం .అలాగే మా బావమరది ఆనంద్ ను కూడా సత్కరించి గౌరవించాం.ఇద్దరు పరమానంద భరితులయ్యారు .తాను పని చేసిన  స్కూల్ లో ఇంతటి ఘన సన్మానం తమకు జరిపించినదుకు  ప్రధానొపాధ్యాయుడి నీ ,ఉపాధ్యాయ బృందాన్ని ,విద్యార్ధి గణాన్నీ అభినందించారు శ్రీ వెంకటేశ్వరరావు గారు .ఇది చిరస్మరణీయం అన్నారు .ఆనంద్ మాట్లాడుతూ విద్యార్ధులకు డ్రాయింగ్  చిత్ర లేఖనం లలో ఆసక్తి కలిగించే ఆలోచన రావటం దానినిఆచారణలో పెట్టటం దానిలో తనను భాగస్వామిని చేయటం మరువరాని విషయం అనీ విద్యార్ధుల క్రమ శిక్షణ ,వారు నిర్వహించిన పాత్ర , నేర్చు కోవటానికి చూపిన శ్రద్ధాసక్తులు మెచ్చదగినవని అన్నాడు .ఇందుకు ఇక్కడి విద్యాకుటుంబం మొత్తాన్ని అభిన౦దించాలి అన్నాడు .

నేను మాట్లాడుతూ ఈ పాఠశాల లో ఏదైనా ఒక కార్యక్రమం తలబెడితే దాన్ని దిగ్విజయం చేయటానికి అందరూ బాగా కృషి చేస్తారని చక్కని సమన్వయము ఉండటం వలననే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని ,అందరి సహకారం మరువలేనిదని ముఖ్యంగా లేడీ టీచర్లు బాగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని ,కమిటీ సహకారం కూడా గొప్పగా ఉంటుందని అందరికీ ధన్యవాదాలు తెలియ జేశాను .

తర్వాత ఆనంద్ ,ముదునూరు వారు నూజి వీడు బయల్దేరి వెళ్ళారు .మేమందరం ఇళ్ళకు చేరుకున్నాం .

ముదునూరు వారికి ఉయ్యూరు లో సరసభారతి సన్మానం

ఉయ్యూరు లో 24-11-2009 నసరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థను నా అధ్యక్షతన  ఏర్పాటు చేసి, మొదటి కార్యక్రమం గా శ్రీమతి సింగరాజు కల్యాణి గారి చే’’సంగీత విభావరి ‘’.నిర్వహించాం .29 వ  కార్యక్రమగా 27-9-20 11 మంగళవారం శ్రీసువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో బాల సాహిత్య చక్రవర్తి , 88 ఏళ్ళ ముదుసలి శ్రీ ముదునూరు వేంకటేశ్వర రావు గారిని సన్మా నించాం.  మా బావమరది ఆనంద్ తో వీరిని సభకు పరిచయం చేయించాం .సరస్వతీ పుత్రా శ్రీ నున్న అన్జారావు ,బాలసాహిత్యం లో కృషి చేసన శ్రీమతి భమిడి పాటి బాలా త్రిపుర సుందరి  ,స్థానిక అమరవాణి హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పి.వి .నాగరాజు ఆత్మీయ అతిధులు .వివిధ పాథశాల విద్యార్ధులకు ‘’పద్య మకరందం ‘’పోటీలు నిర్వహించి గెలుపొందినవారికి ముదునూరు వారితో బహుమతులిప్పించాం .ఈబహుమతులకు స్పాన్సర్  ప్రముఖ కవయిత్రి ,కథా రచయిత్రి శ్రీమతి కోపూరి పుష్పాదేవి .

ముందుగా శ్రీ వెంకటేశ్వరావు గారిని అర్చకులతో ఆలయ మర్యాదతో సత్కరింప జేశాం,తర్వాత సరసభారతి చందన తాంబూలాలు  నూతన వస్త్రాలు శాలువా పుష్పహారం  నగదు కానుక లతో ఘనంగా సత్కరించాం .అలాగే ఆనంద్ కు కూడా చేశాం .ఇద్దరూ హైదరాబాద్ నుంచి ఉదయమే వచ్చారు .మా ఇంట్లో భోజనాదికాలు ఏర్పాటు చేయించాం .ముదునూరు వారు పొందిన ఆనందం వర్ణనాతీతం .తమ ఆనందాను భూతిని కనుల చేమర్పు తో గొప్పగా స్పందించి చెప్పారు .మాకూ ఇదొక మధురస్మృతి గా మిగిలింది .రాత్రికి ఇద్దరూ హైదరాబాద్ వెళ్లి పోయారు . ఆతర్వాత చాలాకాలం వారితో ఫోన్ సంభాషణ చేశాను.  వారి పుస్తకాలు నాకు పంపేవారు .సరసభారతి పుస్తకాలు వారికి పంపేవాడిని .

ఆరేళ్ళ క్రితం మా బావమరది ఆనంద్ కుమార్తె స్పందన వివాహం హైదరాబాద్లో జరిగితే వనస్థలి పురం లో ఉన్న  వెంకటేశ్వరావు గారిని కారులో వివాహ వేదికను నేనే వెళ్లి తీసుకు వచ్చాను .ఆశీస్సులు కానుక అందించి  వారు వారబ్బాయి తో తిరిగి కారులో వెళ్లి పోయారు .అదే చివరి సారి చూడటం .ఆతర్వాత కొద్దికాలం ఫోన్లో మాట్లాడుకొన్నాం  నాలుగేళ్ళనుంచి అదీ లేదు .ఇప్పటికి వారికి 96 సంవత్సరాల వయసు ఉంటుంది .ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకొంటారు .వారు నాకు అందజేసిన ‘’మహాత్ములు నడిచిన బాటలో ‘’అనే ఆత్మగ్రంధం చదివి నాస్పందనను నెట్ లో ‘’ముదిమి లోనూ  యవ్వనోత్సాహి-శ్రీముదునూరు వెంకటేశ్వరావు  ‘’  అనే శీర్షికతో 6 ఎపిసోడ్లు రాసి అందరికీ పంపి ప్రింట్ అవుట్ తీసి వారికి పంపిస్తే మహదానందం పొంది వెంటనే ఫోన్లో నన్ను అభినందించిన సహృదయ మూర్తి .అందులో మొదటి భాగం లో ఉన్న మొదటి పేరాలు మీకోసం –

‘’కృష్ణా జిల్లా ముదునూరు గ్రామస్తులు ,బాలసాహిత్యం లో దశాబ్దాలపాటు కృషి చేసి ,అంతులేని బాలసాహిత్యాన్ని సృష్టించి,ఊరూరా ‘’బాలభారతి ‘’స్థాపించి ,ఆకాశవాణి బాలకార్యక్రమాలను రెండు దశాబ్దాలు నిర్వహించి ,ఆంగ్ల అధ్యాపకులుగా శాఖాధిపతి గా సేవలందించి ,ఆంగ్ల –తెలుగు నిఘంటువును అసహాయ శూరులుగా తానొక్కరే నిర్మించి ,తన స్వీయ చరిత్రను చారిత్రిక నేపధ్యంగా రచించి ,బహు గ్రంథ కర్తలుగా ప్రసిద్ధి చెంది ,సమాజ సేవలో ధన్యులైన ‘’బాల సాహిత్య చక్రవర్తి ‘’బిరుదాంకితులు శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారు –  88 ఏళ్ళ  వృద్ధుడు .వృద్ధాప్యం రెండో బాల్యం అన్నారు కదా .అందుకని బాలుడే .అయితే ,ఆయన నిత్య జీవితం క్రియా  శీలత్వం ,సామాజిక సేవ ,నిరంతర పఠనం ,రోజుకు  కనీసం పన్నెండు గంటల రచనా వ్యాసంగం ,ఈ వృద్ధాప్యం లో,గమనిస్తే ,ఆయన నిత్య యౌవనుడు గా కని పిస్తారు .ముఖం పై ముడుతలు వచ్చినా ,కళ్ళు తెల్లబడు తున్నా,అందులో విజ్ఞాన జ్యోతి ప్రకాశించటం ,ప్రసరించటం చూస్తాం .ఒక రాజకీయ నాయకుడో ,సంఘ సంస్కర్తో ,సామాజిక కార్య కార్తో ,ఉత్తమ ఉపాధ్యాయుడో,నిర్వహించ వలసిన కార్య క్రమాలను అన్నిటినీ ,తానొక్కడే ,కొద్ది మంది సహాయం తో,నిర్వహించిన  ,అనుక్షణ కార్య కర్త ,.ఆ నిర్వహణ లో అలుపు లేదు ,విశ్రాంతి లేదు .అకుంఠిత దీక్ష ,సమాజ సేవా తపన ఉత్తమ బోధ నంది౦చాలన్న ఆరాటం ,తన చుట్టూ వున్న సమాజం తన తో పాటు అన్ని రంగాల్లో అగ్రగామి గాఉండాలన్న   ఆకాంక్ష ,సంపూర్ణ వికాసం తో ,జీవితాలు వెలగా లన్న దృఢ సంకల్పం ఆయన్ను ,ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకొని నిలబడేట్లు చేసింది ..సమాజం లో అన్ని వర్గాలు ,కులాలు ,ఆబాల వృద్ధులు తన వాళ్ళే అనే విశాల దృక్పధం ,ఆయన్ను అందరి కంటే అగ్రేసరుడిని చేసింది .ఆయన సాధించిన విజయాలు ఇన్నో ,అన్నో కావు .ఎక్కడ ఏ పరిస్థితులలో సమాజానికి తాను అవసరమైతే అక్కడ ఆయన ప్రత్యక్షం .నీతికి ,నిర్భీతికి,పేరుగా నిలిచి,వ్యక్తిత్వం తో ,జీవితాన్ని పండించుకొని ,”బహుజన హితాయ -బహుజన సుఖాయ ”గా జీవితం గడుపుతూ ,అందరిని ప్రేమ ,ఆప్యాయత ,మమతాను రాగాల తో ,తన వాళ్ళను చేసు కోని ,తన వాక్కే వేద వాక్కు గా అందరు భావించే స్ఫూర్తిని కలుగ జేసి సకల కళా రహస్యాలను అవగాహన చేసుకొని,ఇతరులకు తెలియ జెప్పి ,పెద్దన్నగా గుర్తింప బడి ,తాను చేసిన దేదో ,మహత్కార్యం అనీ ,సమాజ సేవ అనీ భావించక ,అదొక మానవ ధర్మంగా ,కనీస విధిగా భావించి ,తన మార్గాన తాను నడుస్తూ ,ప్రేరణ పొందిన వారిని తనతో కలుపు కొంటు ,ద్వేషం ,అసూయ ,అహంకారం కోపతాపాలకు ,అతీతం గా ,అజాత శత్రుత్వం తో ,వ్యవహరిస్తూ ,తాను నమ్మిన ”రాముని ”బంటు గా వ్యవహరిస్తూ ,కుటుంబానికీ ,గ్రామానికీ ,పరిసర ప్రదేశాలవారికీ ,తలలో నాలుక గా నడుస్తూ ,పెద్దరికాన్ని నిల బెట్టు కుంటూ ,ఆదర్శం లో ,ఏమాత్రం అటు ఇటు లేక నవ్య ,సవ్య పథగామి గా వుంటూ ,బాల సాహిత్యసేవ లో ధన్యులై ,యువకులకు  ఉత్చాహ పాత్రులై ,తోటి ఉపాధ్యాయులకు ఆదర్శ మూర్తి యై ,విశ్రాంత ఉపాధ్యాయులైనా ,అవిశ్రాంత కృషి చేస్తున్న వారు,కర్మ యోగి ,క్రియా శీలి ,”బాల సాహిత్య చక్ర వర్తి ,మాన్యులు శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు .

శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారిది ఓకే ప్రత్యేక  స్కూల్ అఫ్  థాట్ .ఆయన ఒక విశ్వ విద్యాలయం .knowledge pool . జ్ఞాన ఖని .విశుద్ధ మనస్కులు .నిరామయ జీవి .నిర పేక్ష కార్య శూరుడు .ఆయనజీవితాన్ని   అర్ధం చేసు కోవ టానికి,ఆయన వివిధ దశల్లో చేబట్టిన కార్య క్రమాలనుపరామర్శించటానికి ,  ,ఆదర్శ శిఖరా రోహణ౦  చేయ టానికీ ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే .ఆయన రచనా శైలి ,నిరాడంబరం .,మెత్తని పూల మీద నడుస్తున్నట్లుంటుంది . .ఏది చెప్పినా సుతి మెత్త గా,సూటిగా మనసుకు తాకేట్లు చెప్పటం ఆయన ప్రత్యేకత .పదాడంబరం వుండదు .ఎక్కువ తక్కువలుండవు .అతిశయోక్తులకు దూరం .యదార్ధ వాది-కాని లోక విరోధి మాత్రం కాక పోవట౦ఆయన  ప్రత్యేకత .అదే ఆయన విశిష్ట వ్యక్తిత్వం .ఆయన కార్య క్రమాలను,,జీవితం తో అనుసంధానం చేస్తూ ,వివిధ దశల లో వింగడించి తెలుసు కొందాం’’

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 —11 -11 .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-18 –ఉయ్యూరు

— 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.