కిరాతార్జునీయం లో అర్జునుడు

కిరాతార్జునీయం లో అర్జునుడు -1

కావ్య నాయకుడైన అర్జున పాత్ర చిత్రణలో  భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న  దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌపది .అందులో అతడు త్వరలో ఇంద్రుని అనుగ్రహం పొందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం ‘’అనే పదాన్ని సార్ధకంగా ప్రయోగించి తనకు శబ్డంపైగల సాధికారతను తెలియ జేశా డని ఆచార్య సార్వభౌములంటారు .దీనికి మహావ్యాఖ్యాత మల్లినాద సూరి ‘’కుప్యాదన్య దకుప్యం ,హేమరూపాత్మకం ‘’అని వివరణ ఇవ్వకపోతే అర్ధం ఎవరికీ సులభంగా తెలిసేదికాదని వారన్నారు –

‘’విజిత్య యః ప్రాజ్యమయ చ్చదుత్తరాన్-కురూనకుప్యం వసు వాసవోపమః

స వల్కవాసాంసి తవాధునా హరన్ –కరోతి మన్యుం న కథం ధను౦జయః ‘’

వ్యాసమహర్షి తన మంత్రోపదేశానికి అర్హత కలవాడు ,కఠోరమైన తపస్సు చేయాల్సినవాడు  యుద్ధం లో పితామహ, ద్రోణాదులను జయించే సామర్ధ్యం కలవాడు అర్జునుడే అని గుర్తించి  ధర్మరాజుతో  ఇలా అంటాడు –

‘’యయా సమాసాధిత సాధనేన –సుదుశ్చ రామా చరతా తపస్యాం

ఏతే దురావం సమవాప్య వీర్య –మున్మీలితారః కపి కేతనేన ‘’

ఇక్కడ కపి కేతన శబ్దం సాభిప్రాయంగా కవి ప్రయోగించాడు. రామరావణ యుద్ధం లో సర్వ రాక్షససంహారకారకుడు హనుమంతుడు .అతడే ‘’జెండాపై కపి రాజు ‘’గా ఇప్పుడు అర్జునుని జెండా పై ఉండబోతున్నాడని సూచ్యార్ధం .కనుక అర్జునుడికి ఎదురు అనేది ఉండదని భావం .విద్యను ఉపదేశించేటప్పుడు కూడా ‘’యోగ్య తమాయ తస్మై వితతార ‘అంటాడు మహర్షి .అంటే ఆతడు యోగ్యతముడు అని తేల్చి చెప్పాడన్నమాట .

సరే వ్యాసర్షి ఉపదేశంతో  తపస్సుకు బయల్దేరాడు ధనుంజయుడు .ఏవైనా ఆట౦కా లేర్పడి కర్రాబుర్రా పారేసి చటుక్కున తిరిగొస్తాడేమో అనే ముందు చూపుతో బయల్దేరటానికి ముందే   తాను పూర్వం కౌరవులవలన పొందిన పరాభవాలనన్నిటినీ ఏకరువు పెట్టి౦ది .సహజంగానే సౌమ్యుడైన అతడు ఇప్పుడు భయంకరమైన శరీరం ధరించి బయల్దేరాడని భారవి వర్ణన .అప్పుడు అతడు ‘’క్రియా రూపం పొందిన అభిచారిక మంత్రం ‘’లాగా భీషణ రూపుడైనాడనివర్ణించాడు –‘’బభార రమ్యోపి వపుస్స భీషణం గతః క్రియాం మంత్ర ఇవాభి చారికీం ‘’అని ప్రత్యక్షం చేస్తాడు .సహజంగా ప్రకృతి ప్రేమికుడైన అతడుఇంద్ర కీలద్రికి వెళ్ళే  దారిలో నీటి జాడలలో  చేపల గంతులు ,ఆలమందల గమనం , గోపకుల జీవన విధానం ,పర్వత శోభ దర్శించి పులకించి పోతాడు .

కీలాద్రి చేరి తాను దేనికోసం వచ్చాడో ఆపని అంటే ఘోర తపస్సులో మునిగిపోతాడు .యోగ్యతముడైన అతడు తపోనిస్టలో  ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు భారవి –

‘’శిరసా హరిన్మణినిభః స వహన్ –కృత జన్మ నోభిష వణేన జటాః

ఉపమాం యయా వరుణ దీధితిభిః-పరి మృస్ట మూర్ధని తమాలతరౌ ‘’

భావం –

మరకత మణి  కాంతి తో సమానమైన కా౦తి కల అర్జునుడు నిత్యస్నానం వలన అతని శిరోజాలు సంస్కారం లేక జడలు కట్టేసి ఎర్రగా  మారిపోయాయి .శిరస్సుపై యెర్రని కాంతులు వ్యాపించటం వలన అతడు తమాల వృక్షం లాగా భాసిస్తున్నాడు .యధాప్రకారం ఎవరు తపస్సు చేస్తున్నా భంగం కలిగించే ఇంద్రుడు దేవకా౦తలను ప్రయోగించగా వాళ్ళు హావభావ శృంగారాలతో రెచ్చ గొట్టే ప్రయత్నం చేసి అతని  జితే౦ద్రి యత్వ౦ ముందు  పరాభవం పొందారు .అంతే కాదు చివరికి వాళ్ళే కామోద్రిక్తలైపోయారట .దీనినే భారవి ‘’మదన ముప పదే స ఏవ తాసాం ‘’అని అత్యద్భుతంగా వర్ణించి చెప్పాడు .అంటే సీన్ రివర్స్ అయిందన్నమాట .కనుక వ్యాసోపదేశం , ద్రౌపది హెచ్చరిక సార్ధకమైనాయని కవి వాక్కు .

కొడుకు తపస్సుకు మెచ్చి ఇంద్రుడే ముసలి ముని వేషం లో దిగివచ్చితపస్సు చాలించమంటాడు .చలించని అతని మనమెరిగి ,పరమేశ్వరారాధనకు ప్రోత్స హిస్తాడు .

చివరి పరీక్ష లో మూకాసురుడు భయంకర వరాహ రూపం అవక్ర పరాక్రమం తో  అర్జునుని చంపటానికి రావటం ,అతడు అనేకరకాలుగా ఆలోచించి చివరకు ‘’కురు తాత తపా౦స్య మార్గ దాయీ విజయా యేత్యల మన్వశాన్మునిర్మాం ‘’అని స్మరించి బాణం ప్రయోగించి పందిని చంపటానికి నిశ్చయించాడు .ఆ భీకర భయంకర ధనుంజయ రూపాన్ని కిరాత వేషంలో ఉన్న శివుడు చూసి ఆశ్చర్యపోతాడు .దీన్ని భారవికవి పరమాద్భుతంగా ఇలా చెప్పాడు –

‘’దదృశే థ  సవిస్మయం శివేన –స్థిర పూర్ణాయుత  చాప మండలస్థః

రచితస్తి సృణా౦ పురాంవిధాతుం –వధ మాత్మేన భయానకః పరేషాం ‘’

నిజానికి శివుడు తనంతటి వాళ్ళతోనే యుద్ధం చేస్తాడుకాని అల్పులతో యుద్ధం చేయడు .కనుక అర్జునుడికి త్రిపురాసుర సంహారం నాటి పరమేశ్వరుడుగా గోచరించాడు .కనుక సరి యోధుల మధ్య యద్ధం జరగబోతోంది .అతడి రుద్రత్వం భావి కురుక్షేత్ర సంగ్రామం లో కూడా కనిపిస్తుందని పిండితార్ధంగా పండిత ఆచార్య సార్వభౌముల వాక్కు .తరువాత ఏం జరగబోతోందో తర్వాతే తెలుసుకుందాం .

ఆధారం –భారవి భారతి –ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

 

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-6-18 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.