మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1
బహుశా నాకు గుర్తున్నంత వరకు మూర్తిగారిని మొదటిసారిగా హైదరాబాద్ లో శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికానుంచి వచ్చి బాపు –రమణ ల స్నేహ షష్టి పూర్తి నీ, రెండు రోజులు నిర్వహించిన ప్రపంచ తెలుగు సభలలో చూశాను .నేను తీస్తున్న ఫోటోలు చూసి తన ఫోటోకూడా తీయమంటే తీయగా ఫోటో కాపీలు పంపమని అడ్రస్ ఇవ్వగా భీమవరం పంపిన జ్ఞాపక౦ . ఇదంతా సుమారు పదేళ్ళ క్రితం సంగతి .కృష్ణాజిల్లా రచయితల సంఘం జరిపిన అనేకానేక కార్యక్రమాలలో నేను అతిధులను వేదికపైకి కఆహ్వానించటం ,లేక అతిధులను సభకు పరిచయం చేయమంటే చేయటం చేశాను .మూర్తిగారు ఆసభలలో పాల్గొనే ఉంటారు కానీ నేను గుర్తు పట్టి ఉండలేక పోవచ్చు .వారు ప్రముఖంగా ఉపన్యాసాలు చేసీ ఉండవచ్చు .కాని నాకు గుర్తు లేక పోయి ఉండవచ్చు .కానీ అదే సంఘం 20 17 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా శ్రీకాకుళం శ్రీ ఆంద్ర మహావిష్ణువు ప్రాంగణం లో జరిపిన ‘’పద్య బ్రహ్మోత్సవాలు ‘’లో మూర్తిగారు నా దగ్గరకొచ్చి ‘’ప్రసాద్ గారూ !నేను మీ బ్లాగ్ ను చాలా ఆసక్తిగా చదువుతాను ‘’అని అంటే అందరూ చెప్పెమాటే గా అని ‘’లైట్ ‘’తీసుకున్నాను .మళ్ళీ 2018 లో అక్కడే జరిగిన ‘’తెలుగు సదస్సు ‘’లో మళ్ళీ వారిని శ్రీ వసుధ బసవేశ్వరరావు గారు పరిచయం చేశారు .మూర్తిగారిద్వారా మంచికవి ‘’మంకు శ్రీను గారికి సరసభారతి పుస్తకాలు అందజేశాను .20 17 డిసెంబర్ 24 న గుంటూరు జిల్లా రేపల్లె లో ఆవిష్కరింపబడిన రెండు ఉద్గ్రంధాలు శ్రీ మ౦డలి బుద్ధప్రసాద్ ,శ్రీ డి విజయభాస్కర్ గార్లకు అందజేశాను. అంతకు ముందు మూర్తిగారు నా చేతిలోనుంచి వాటిని తీసుకొని ‘’చూసి మంచి ప్రయత్నం బాగున్నాయి .మీబ్లాగ్ కు రెగ్యులర్ ఫాలోయర్ ను నేను ‘’అన్నా ,అదీ నాకు మామూలే అనిపించి పట్టించుకోలేదు .ఉయ్యూరులో జరిగే ఆ రెండు సంవత్సరాల కవి సమ్మేళనానికి అందరితోపాటు వారికీ ఆహ్వానం ఇచ్చానేమో కాని ప్రత్యేకంగా ఆహ్వాని౦చనూ లేదు . కారణం ఆయన నాలాగా ఎక్స్పోజ్ ఆయె రకం కాదు .’’నాడబ్బా నేను కొట్టుకున్నాను ‘’.నాచేష్టలకు ఆయన నవ్వుకొని ఉంటారని పిస్తోంది .
జూన్ 10 ఆదివారం విజయవాడ టాగూర్ లైబ్రరీలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యం లో ‘’ఆంద్ర ప్రదేశ్ ‘’పై జరిగిన ‘’ఏక దిన కవి సమ్మేళనం ‘’లో మరలా మూర్తిగారిని చూశాను. మన ‘’వసుధైక కుటుంబం ‘’కవితా సంకలనం ఇచ్చాను .ఆయన ‘’ముద్దోస్తున్నావోయ్ గోపాలం ‘’అనే తమ కథా సంపుటి నాకు ఇచ్చారు .అంతే తప్ప ఒక్కమాట కూడా’’ లయన్ బందా’’ గారన్నట్లు ‘’తద్దినం ‘’(అంటే ఆ రోజు )నాడు అస్సలు మాట్లాడుకోలేదు ఇద్దరం .
సోమవారం వారికి ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘’పంపాను .రెండుమూడు రోజులతర్వాత మూర్తిగారు 1-‘’గోదారమ్మా దండాలమ్మా ‘’అనే స్వీయ దీర్గకవిత పుస్తకం 2-జలవాణి ౩-నాదేశంకవితా సంకలనాలు 4-స్వీయ కధలు ‘’తుంగ చాప ‘’సంపుటి 5-తెలుగు కధానిక 20 16 సంకలనం ఆత్మీయంగా పంపారు .అంటే నేను పంపిన రెండు పుస్తకాలకు నాలుగు పుస్తకాలు బోనస్ గా వచ్చాయన్నమాట .’’గోపాలం ‘’ను సోమవారం నుండే చదివటం ప్రారంభించి మిగతా నాలుగూ నిన్నా ఇవాళ పూర్తి చేశాను .అప్పుడు అనిపించింది ‘మూర్తి గారిలో ‘’నాకు తెలియని అపరిచితుడు ‘’ఉన్నాడు అని .చాలా ఆనందం వేసింది .నిండు కుండ తొణకదు’’అని పెద్దలు ఎందుకన్నారో నాకు అర్ధమయింది .ఆయనకున్న విషయపరిజ్ఞానం ,సాహితీ మూర్తిమత్వం ,స్నేహశీలత ,మానవత్వం పై మమత వెలకట్టలేనివి అని తెలిసింది ఆయన ఒక విశ్వ విద్యాలయం .ఆయన చేస్తున్న అపార సాహితీసేవ నిరుపమానమైనది .ప్రముఖులతో ఆయనకున్న గాఢ పరిచయాలు ఆయన రాసిన,ప్రచురించిన పుస్తకాలు ,ఎందరెందరో సాహితీ ప్రియులకు చేసిన సన్మాన సత్కారాలు ,పొందిన బిరుదులూ చూస్తే ఆయన సాహితీ విరాట్ స్వరూపం నాకు అవగతమైంది .సాహితీ బంధువులకు మూర్తిగారిని పరిచయం చేయటం అంటే కొండను అద్దం లో చూపటమే .నేను వారి వ్యక్తిత్వ ఆవిష్కరణకు ఏమాత్రమూ తగిన వాడిని కాను అని వినమ్రంగా తెలియ జేసుకొంటూ ,వారి పుస్తకాల ద్వారా నాకు లభించిన నేను తెలుసుకున్న విషయాలను మీకు అందజేసి వారి బహుముఖ శేముషిని తెలియబరచే చిరు ప్రయత్నం చేస్తున్నాను .
పుట్టుక ఎదుగుదల
మూర్తి గారు అంటే శ్రీ మలపాక రామవెంకట సత్యనారాయణ మూర్తి .అందరికి ఎం .ఆర్ .వి .సత్యనారాయణ మూర్తి గా పరిచయం. శ్రీ మలపాక సుబ్రహ్మణ్యం శ్రీమతి యజ్నమ్మ దంపతులకు 30-9-1951 ప .గో. జి .పెనుగొండలో జన్మించారు .పెనుగొండశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు జన్మించిన పవిత్ర క్షేత్రం .మూర్తిగారు విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసి రిటైరయ్యారు .శ్రీ మతి రాజేశ్వరిని వివాహమాడి ఏకైక కుమార్తె రమ్య గాయత్రికి జన్మనిచ్చారు కవి ,రచయిత మాత్రమేకాదు గొప్ప గాయకుడు కూడా.వ్యాఖ్యాత ,నటుడు, దర్శకుడు అదనపు అర్హతలు .రేడియో ,టి.వి.ఆర్టిస్ట్ గా సుప్రసిద్ధులు.
సాహితీ మూర్తిమత్వం
ఇప్పటిదాకా 200 కథలు ,300 కవితలు ,20 నాటికలు ,20 గేయాలు ,20 వ్యాసాలూ రాసిన సాహితీ స్రష్ట .
వీరి స్వంత రచనలలో –అక్షర దీపాలు గేయ సంపుటి ,అక్షర భారతం సమైక్య భారత్ నాటికలు ,అమ్మకోరిక ,పెళ్లి చూపులు ,ఆమే గెలిచింది,తూరుపు వెళ్ళే రైలు ,తుంగ చాప ,నందిని –నందివర్ధనాలు మూడో కొడుకు ,మా వూరి కోరిక ,కథా ,సంపుటులు ,ఆశ ,అమ్మే జీవనవేదం , వెన్నెలవాన ,కవితా సంపుటులు ,కాగితప్పడవలు నానీలు ,, అక్షరం నామార్గ దర్శి ,మినీకవితా సంపుటి , గోదారమ్మా దండాలమ్మా-దీర్ఘ కవిత .
స్వీయ సంపాదకత్వం లో అభినందనం ,నీరాజనం ,ప్రత్యేక సంచికలు ,స్పందన ,ముత్యాలసరం ,నేటి ప్రపంచం ,హరివిల్లు ,మొదలైన కవితా కదల సంకలనాలు సంపుటులు వెలువరించారు పశ్చిమ గోదావరి జిల్లాస్వాతంత్రోద్యమ చరిత్ర పై సమగ్ర పరిశోధన గ్రంథం రాశారు . ఆంగ్లం లో ‘’వాయిస్ ఆఫ్ వాటర్ ‘’కవితా సంకలనం తోపాటు 20 14 నుండి ప్రతి సంవత్సరం ‘’తెలుగు కధానిక ‘’సంకలనాన్ని తెస్తున్నారు .అంటే మూర్తి గారు స్పృశించి సువర్ణమయం చేయని సాహితీ ప్రక్రియలేదు ‘.
రమ్య సాహితీమూర్తి
తాము జన్మించి వర్ధిల్లిన పెనుగొండ లోనే ‘’రమ్య సాహితీ సమితి ‘’అనే సాహిత్య సంస్థ ను నెలకొల్పి వ్యవస్ధాపక అధ్యక్షులుగా తీర్చి దిద్దుతున్నారు . ఈసంస్థ ద్వారా ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పుస్తక ప్రచురణ చేస్తూ ,పెనుగొండకు ‘’సాహిత్య అండ ‘’గాభాసిస్తున్నారు . మూర్తిగారు ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ఉపాధ్యక్షులు .పెనుగొండ సీనియర్ సిటిజెన్ వెల్ ఫేర్ సంఘ కార్యదర్శి కూడా .
పురస్కారమూర్తి
మూర్తి గారి ప్రతిభకు తగిన పురస్కారాలెన్నో అందుకున్నారు .అందులో ముఖ్యమైనవి –గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం ,ప.గొ జి ఉగాది పురస్కారం ,తుంగ చాప కదా సంపుటికి అమెరికా వంగూరి ఫౌండేషన్ పురస్కారం ,గీతం పురస్కారం ,నవ్యరాగ మాసపత్రిక పురస్కారం ,హాస్య లఘు నాటిక కు ‘’మళ్ళ జగన్నాధం స్మారక పురస్కారం వంటివెన్నో ఉన్నాయి ‘.
బిరుదమూర్తి
మూర్తిగారి ని వరించిన బిరుదులెన్నో సార్ధకం చెందాయి -అందులో ప్రముఖమైనవి –సాహిత్య రత్న ,ఆంద్ర రత్నం ,ఆంద్ర దేశం లోని వివిధ సాహితీ సంస్థలు మూర్తి గారిని ఆహ్వానించి గౌరవించి పురస్కారాల౦దించాయి ‘’ఉత్తమకవి ‘’పురస్కార గ్రహీత .
విస్తృత సాహితీ మూర్తి
వీరి సాహితీ వ్యాసంగం బహు విస్త్రుతమైనది .వందకు పైగా కవి సమ్మేళనాలు ,పది శతాధిక కవి సమ్మేళనాలు ,మూడు అంతర్జాతీయ కవిసమ్మేళనాలలో తమ కవితాగానం వినిపించిన కవి వరేణ్యులు మూర్తిగారు .ఆకాశవాణిలో 30 ప్రసంగాలు చేశారు .30 కదానికలకు ,30 నాటికలకు గాత్ర ధారణ చేశారు .వీరు నటించిన ‘’అన్వేషణ ‘’రేడియో నాటకం జాతీయ స్థాయిలో మూడవ స్థానం పొందింది .వీరికవితలు ఆంగ్లం ,ఉర్దూ హిందీ భాషలలోకి ,కధలు ఆంగ్ల ,కన్నడ భాషలలోకి అనువాదం పొందాయి . కనుక మూర్తిగారు ‘’సాహితీ విశ్వమూర్తి ‘’.శ్రీ విహారి అన్నట్లు ‘’అక్షర తపస్వి ‘’.
మూర్తిగారి పుస్తక విశేషాలను తరువాత తెలియ జేస్తాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-6-18 –ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
Attachments area