’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2
మూర్తి గారి జీవిత విశేషాలు వారి సాహితీ సేద్యం తెలుసుకున్నాం .ఇప్పుడు వారు పంపిన కవితలలోని సారం అందుకుందాం –
1-గోదారమ్మా దండాలమ్మా –దీర్ఘ కవిత
శ్రీ సత్యనారాయణ మూర్తి గారు రాసిన సుదీర్ఘ కవిత ఇది .గోదారి వంతెన ప్రక్క తల్లి గోదారికి మూర్తి గారు భక్తి ప్రపత్తులతో వందనమాచరిస్తున్న ముఖ చిత్రం చూడముచ్చటగా ఉన్నది .దీనిని పెనుగొండ పురాధీశ్వరుడు శ్రీ నగరేశ్వర స్వామి ,జగన్మాత శ్రీ మహిషాసుర మర్ధనీఅమ్మవార్ల పాదపద్మాలకు సభక్తికంగా సమర్పించారు .గోదారి పులకించి ప్రవహించిన ప్రదేశాలన్నిటినీ ఈ కవితలో చిరస్మరణీయం చేశారు .ఆమె ‘’జ్ఞాన మోక్ష ప్రదాత ‘’అన్నారు .గోదావరీ తీరం లో జన్మించి తమ సృజనతో జీవితాలను సార్ధకం చేసుకున్నవారందరినీ స్మరించారు .తాము చిన్నతనం లో మొదటి సారి గోదావరిలో చేసిన స్నానం గుర్తు తెచ్చుకున్నారు .’’అమృతం లాంటి నీ నీళ్ళు –గ్రుక్కెడు త్రాగగానే గుండె నిండా హుషారొచ్చేది’’అని కీర్తించారు .’’నీ చల్లని గాలి మాకు ఉచ్చ్వాస నిశ్వాసాలు – నీ జలధారలు –మా జీవదారలు –కలలో ఇలలో నీవై మా దేవతవు ‘’అని ప్రపత్తి గా పరవశం పొందారు .ఇందులోని ప్రతికవితా పంక్తీ గుండె లోతుల్లోంచి పెల్లుబికింది కనుక గోదారి అంత కమనీయంగా స్వచ్చంగా ,పవిత్రంగా ఉన్నది .
2-జలవాణి
108 మంది ప్రసిద్ధ కవుల కవితలను ఆహ్వానించి ‘’జలవాణి ‘’గా సంకలనంచేసి అందించారు మూర్తి గారు ..దీనికి స్వర్గీయ అద్దేపల్లి రామమోహనరావు గారు సందర్భానికి తగిన అమూల్య మైన పీఠిక రాసి జలవాణికి మరింత శోభ చేకూర్చారు .ఇందులోని కవిత్వమంతా అమరవాణిగా ఉన్నదని చెప్పాలి .నాకు నచ్చిన కొందరి కవితా పంక్తుల్ని స్ప్రుశిస్తాను- జలం జీవాలకు చుక్కానికావాలి గాని .-జీవిత నౌకకు చిరిగిన తెర చాప కాకూడదు ‘’అన్నారు ‘’దాహార్తి ‘’లోశ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు –కావేరీ జలతగాదాను పురస్కరించి .’’సశ్రీ –‘తన సహజ ధోరణిలో ‘’స్వార్ధపు బైర్లు కమ్మిన కళ్ళని పీకి –ఎదుటి వాళ్ల బాధల్ని కడిగే –కన్నీళ్ళయి ప్రవహిద్దాం ‘’అన్నాడు .’’నీటి గుప్పిట్లో దాగున్న –జీవరహస్యాన్ని బతికిద్దాం –నీటి గొంతుక ఆలపించే –ఆర్త నాదాన్ని అర్ధం చేసుకొందాం ‘’అన్నాడు కొండ్రెడ్డి కవితాత్మకంగా .’’లంకె బిందేల్ని చూసినవాడికి దాహం తీరు తు౦దేమోకాని ధనదాహం తీరుతుందా ?’’అని ప్రశ్నించాడు చెన్నై శ్రీ ఉప్పలధడియం వేంకటేశ్వర .’’నీరుంటేనే నేను –నేను౦టేనే ఈ దేశం –ఉదకం రక్షంతు రక్షితః ‘’అని వీరభద్రమూర్తి ‘’జలసూక్తం ‘’చెప్పాడు .’’చిల్లరేస్తే చిలకరించే నవ్వుల్నికొనుక్కునే కళ’’పక్షులకేం తెలుస్తుందని మన అస్తిత్వాన్నిప్రశ్నించాడు పెరుగు రాధాకృష్ణ .’’తప్పంతా వర్షం దేగా –ఉన్న కాస్త బడ్జెట్టు –మంత్రుల్ని దాటి –సేక్రటరీలను ఆఫీసర్లను ,ఉద్యోగస్తులను కాంట్రాక్టర్లను దాటి –మేఘం దాకా చేరలేకపోయిందని ‘’చమత్కరించాడు ఈతకోట సుబ్బారావు .
నీరు లో కన్నీరు కూడా భాగమేగా .దీనినీ గొప్పగా వర్ణించి కన్నీరు తెప్పించిన కవితలున్నాయి .నీటి పొడుపు ,యాజమాన్యం ,కలుషితంకాకుండా చూడటం ,సుజలధార అందరికీ అందుబాటులో తేవటం ,నీటి వ్యాపారాలు ,నీటి తగాదాలు ,’’పానీపట్టు యుద్ధాలు ‘’,అదృశ్యమైపోతున్న చెరువులు నదులు గురించి తీవ్ర ఆందోళన చెంది కవిత్వం రాశారు .ఇందులో అన్ని ప్రాంతాలకు చెందిన కవులు జలదారలాంటి కవితలు రాసి సమస్యలను ఏకరువు పెట్టి ,పరిష్కారానికి మార్గాలూ సూచించారు .జలఖడ్గం విరుచుకు పడి జీవితాలను అతలాకుతలం చేయటమూ వర్ణించారు .ఒక్కొక్కరిది ఒక్కో అనుభూతి .ఇలా జలం పై అద్భుత కవితా వృష్టి కురిపించి ‘’జలవాణి’’వినిపించిన మూర్తిగారి ఆలోచన ,అనుసరణ ,ఆవిష్కరణ యెంత మెచ్చినా తీరనిదే .
౩- నాదేశం
భారత దేశ ప్రధమ స్వాతంత్ర్య సమరం 1857 లో జరిగింది .మనకు స్వతంత్రం 1947 లో వచ్చింది .2007 కు తొలి స్వాతంత్ర సమరానికి 150 ఏళ్ళు అయిన సందర్భంగా మూర్తిగారు తమ‘’రమ్య భారతీ సమితి ‘’ఆధ్వర్యం లో ‘’నాదేశం ‘’కవితా సంకలనం తెచ్చి మాతృదేశ ఋణం తీర్చారు .దేశభక్తికే ప్రాధాన్యత కలిపించిన 30 కవితలివి .దీనికి శ్రీ ఆర్ వి ఎస్ ముందుమాట రాసి చైతన్యం కలిగించారు .మొదటికవిత ‘’కాలాన్ని కలిపే అగ్నిసూత్రం ‘’ను ప్రముఖ కవి విమర్శకులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు .’’స్వాతంత్ర్యం బోదె లోంచి –బానిసత్వపు చెట్టు-ఎందుకు శాఖోప శాఖలుగా పెరుగు పోతోంది ?’’అని ప్రశ్నించారు .20 07 లోకి 1857 ను ఆవాహన చేయమని కోరారు .’’చల్లని మంటల్లో హింస దహించుకు పోవాలని –భారతీయత స్వాతంత్ర్య పతాకమై ఎగరాలనీ ‘’ ఆకాంక్షించారు జ్ఞానవయో వృద్ధులు అద్దేపల్లి .’’నీ జండా నువ్వు ఊపుకుంటూ సాగిపోమ్మన్నాడు రసరాజు . సబర్మతీ యతిని స్మరిస్తూ చిల్లర భవానీదేవి ‘’బుద్ధుని మహాభి నిష్క్రమణ లా’’మరలరాని యతివై సబర్మతి విడిచావు-‘’అని మహాత్ముని స్మరిస్తూ దాన్ని గుర్తుంచుకొని జాతికెక్కిన విదేశీ రక్తం విరిగిపోయేట్లు చేసుకోమని ‘’నవనాడుల్లో నవ్యస్పూర్తి నెలకొల్పుకో ‘’మని సందేశమిచ్చారు .’’స్వాతంత్ర్యాన్ని ఎలా చేజార్చుకున్నామో ఆలోచించమని హితవు చెబుతూ ‘’మనమట్టికి మన భాష నేర్పు కుందాం ‘’ అని తక్షణ కర్తవ్య బోధ చేశారు డా కొండ్రెడ్డి .స్వాతంత్ర్య పోరాటం లో వాడపల్లి నిర్వహించిన పాత్ర కళ్ళకు కట్టించి ‘’వాడపల్లి లో బ్రిటిష్ బలగం చిక్కి చొంగను కార్చుకుంది’’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ఎస్ ఆర్ పృథ్వి .’’మనిషిని నేల వెలివేసే పరిస్థితి తెచ్చుకున్నది మనం కాదా ?అన్నాడు చిమ్మపూడి –‘’జాతీయత ఒకతపస్సు –త్యాగ నిరతి ఉషస్సు ‘’అనీ చెప్పాడు .
‘’భారత జన సముద్రం లో ఉద్భవించిన –సునామీ తాకిడికి –ఆంగ్ల సైన్యాలు అతలాకుతలమైనాయి ‘’అని నాటి ప్రభంజనాన్ని నేటి సునామీతో సందర్భోచితంగా పోల్చారు మాధవీ సనారా .హింసా వాదుల్ని నిలదీయాలని కోరుతూ ‘’ఈ పచ్చని పూదోటపై –కన్నెర్ర జేసె వెన్ను పోటుదారులకు –పెద్ద పులిగా దర్శనమివ్వాలి ‘’అని కోరాడు గుండాన జోగారావు .’’దేశాన్ని జిల్లాలవారీగా అమ్మబడును ‘’అని సెటైర్ చిలికాడు వై శ్రీరాములు .’’మానవత్వం మతంగా మారి-ఐకమత్యం ఊపిరి గా రూపు దాల్చి –సమానత్వం ఇంటి తోరణాలై –మమతానురాగాల గీతికలతో –ప్రతి ఇల్లూ స్వాగతం పలకాలి ‘’అని సంప్రదాయ బద్ధంగా ఆలోచించారు శ్రీ మూర్తిగారు .’’క్విట్ ఇండియా ‘’అంటూ ఉగ్రవాదుల్ని తరిమికొట్టటానికి బాపు మళ్ళీ పుట్టాలన్నాడు కెవి రమణారెడ్డి .’’నామానాన నేను హాయిగా బతుకుతున్నాను –ఏ సమస్యా లేకుండా –ఎవరికీ సమస్య కాకుండా ‘’అని నేటి వేదాంతం ఒలకబోశారు డా ఉప్పలధడియం .మరోకోణం లో చూసిన ఈతకోట సుబ్బారావు –‘’నిరుద్యోగం మనిషి నీడై పోయింది –మొరవినే వాడు బ్రహ్మ శిల’’అంటూ నిట్టూర్చాడు –‘’మాచుట్టూ అమెరికా డాలర్లవల –అరబ్బు దీనార్ల కంచే –ఇక్కడెక్కడా బతుకు శ్వాస అందడం లేదు –మా గాలి విదేశాల్లో వీస్తుంది ‘’అని మన చేతకాని తనానికి ,పరాయీ భావనకు చివాట్లు పెట్టాడు .మువ్వన్నెల జండా కు మోకరిద్దాం ‘’అని ఒకరంటే ఈ దివ్య ధాత్రిఅని ,బంగారు దేశం అని మరొకరు పొగిడితే కన్నీటి జెండాను ఎజెండా చేశాడు సరికొండ .చలపాక కు ‘’తెగిన గాలిపటం ‘’కనిపించింది .
ఎంతో స్పూర్తిగా ఈ సంకలనం’’నాదేశం ‘’ తెచ్చి మూర్తిగారు మరొక్కమారు మాతృభూమి ఋణం తీర్చుకునే అవకాశం కవులకేకాక చదువరులకూ కలిపించారు .
తర్వాత కథానిక లోకి ప్రవేశిద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-18 –ఉయ్యూరు
‘’
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797