డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1

కొన్ని పరిచయాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి .వాటితో ఏర్పడిన బంధం స్పూర్తి నిస్తాయి .ఇదిగో అలాంటి అరుదైన సాహితీ బంధమే డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారితో కిందటి డిసెంబర్ 24 గుంటూరు జిల్లా రేపల్లెలో సరస భారతి ‘’గ్రంథ ద్వయం ‘’ఆవిష్కరణ సందర్భంగా ఏర్పడింది .వారూ మా అతిధులు అవటం వారి సమక్షం లో కవి సమ్మేళనం నిర్వహించటం వారు ప్రేరణ పూర్వక ప్రసంగం చేసి తమ అద్భుత కంఠం తో తాము రాసిన పద్యాలు వినిపించి వీనుల విందు చేయటంజరిగింది .వేదికపైననే వారు నాకు తమ రచన ‘’ ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’’అందజేయటం నేను చదివి తప్పక నాభావం తెలియజేస్తానని చెప్పటం జరిగిది .వారు ‘’మీరూ ఆంజనేయస్వామి పైనా రాశారని తెలుస్తోంది .మీ పుస్తకాలు పంపండి ‘’అనటం,నేను మర్నాడే వారికి పంపటం జరగటం అందినట్లు వారు ఫోన్ చేసి చెప్పటం వెంటనే వారి 1-శ్రీ కసాపురాన్జనేయ మహాత్మ్యం అనే పద్యకావ్యం 2- శ్రీ ఆంజనేయ విజయం అనే బృహత్ వచన గ్రంథం పంపారు .రాయవిజయం అప్పుడే మొదలు పెట్టి 6-3-18 కి పూర్తి చేశాను .తర్వాత వీలుని బట్టి మిగిలిన రెండూ చదివి నిన్ననే పూర్తి  చేశాను .వెంటనే వారికి నిన్న నే ఒక కార్డ్ రాసి నా ఆనందాన్ని వ్యక్తం చేశాను .అనంతపురం జిల్లాలోని శ్రీ కసాపుర ఆంజనేయ మహాత్మ్యం లోని కథ ను ‘’స్వామి’’ కలలో వినిపించటం వలన ప్రభావితులై కవి గారు రాసినట్లు చెప్పుకున్నారు .తనకూ అలాంటి అనుభవాలే జరిగాయని సమర్ధించారు శ్రీ శ్రీ కుర్తాళం పీఠాదిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ).కథమనకు చాలా కొత్తగా ఉంటుంది .ప్రతి అధ్యాయం లో ముందు వచనం లో కథ వివరించి తర్వాత దాన్ని పద్యాలలో అందంగా రాశారు .ఒకరకంగా విన్నదీ కన్నదీ అయినదానికీ పౌరాణిక నేపధ్యం అద్ది స్వపోల కల్పితం చేశారన్నమాట . కనుక ఇబ్బంది లేదు .మూడవది అయిన శ్రీ ఆంజనేయ విజయం అంతా 716  పేజీల హనుమ లీలామృతమే .భక్తీ ,ప్రపత్తీ కలబోసిన ఉద్గ్రంథాలవి .వీటిని చదివే అదృష్టం కలిగించారు వృషాద్రిపతి గారు .జననాంతర సౌహృదం అంటే ఇదే నెమో .

కవి పరిచయం –1-ఉపనిషద్వాణి 7 భాగాల 12 ఉపనిషత్తులకు శంకర భాష్య వ్యాఖ్యానం తో పద్యానువాదం 2-శ్రీ పద్మావతీ శ్రీనివాసీయం –పద్య ప్రబంధం 3-హరి హరాత్మక విజయం -1200 పద్యాల ప్రబంధం 4-తపస్సిద్ధి –పద్యకావ్యం 5-సోమనాద్రి –పద్యకావ్యం 6- భారత జ్యోతి –శ్రీ పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర పద్యకావ్యం 7-విశ్వ గాయత్రి 8-లలితాస్తవం   9-గుంటూరు పురస్త బృందావన వేంకటేశ్వర స్తవం,10-కన్నెవాగు 11-కసాపుర క్షేత్ర మాహాత్మ్యం 12-రాణి దుర్గావతి(చారిత్రిక పద్యకావ్యం ) 13- రఘునాధ విజయం 14-శ్రీ బాలకృష్ణ లీలా విలాసం 15-భావమందాకిని ఖండకావ్యం 16-విరిదండ –పద్య సంకలనం 17- వేంకటేశ్వర శతకం 18-కసాపుర ఆంజనేయ శతకం 19-భ్రామరీ శతకం 20- మాల్యాద్రి నృసింహ శతకం 21- రేపల్లె వీరాంజనేయ శతకం 22-కన్యకా విజయం ,23 –జ్ఞానతరంగాలు 24-విదురనీతి సారం 25-శ్రీ కృష్ణ రాయ విజయం 26-క్రిష్ణవేణీ పుష్కరావిష్కారం (వచన రచనలు )27-ప్రతిజ్ఞార్జునీయం 28-దాన రాధేయ (నాటకాలు )29- నీలాసున్దరీ పరిణయం అనే కూచిమంచి తిమ్మకవి కావ్యానికి ‘’సుగంధి ‘’అనే తొట్టతొలి వ్యాఖ్యానం 30-అచ్చతెలుగు రామాయణం కు ‘’మలయ సమీర ‘’వ్యాఖ్య 31-(చంద్ర హాస విజయం ,సాయీ విజయం ,స్వామి అయ్యప్ప ,మహిషాసుర పర్దిని ,మదాలస ,నరనారాయణ విజయం ,కిరాతార్జునీయం ,విశ్వనాధ నాయకుడు ,మోషే విజయం మొదలైన 8 అముద్రితాలు )

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి స్వర్ణపతకం తో తెలుగు ఎం. ఏ. ,  ఆంద్రోపన్యాసకులు,పదవీ విరమణ అనంతరం రేపల్లెలో స్థిరవాసం  .శ్రీ ప్రసాదరాయ కులపతి గారి అంతేవాసి.ఎన్నెన్నో భువనవిజయాలు ,అష్టావధానాలు ,భారతం పై తుదితీర్పు వంటి వాటిలో అద్వితీయ నటన చేసినవారు .

శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం

దాదాపు 1129  పద్యాలతో రెండు భాగాలు -1-విజయ నగర తరంగిణి పూర్వ రూపం -292 పద్యాలు ,,ద్వితీయాశ్వాసం ఉత్తరరంగం,173 పద్యాలు ,తృతీయాశ్వాసం ఉత్తరరంగం 659 పద్యాలు ,-ఇవికాక ఇష్టదేవతా స్తుతి, కృతిపతి ,కృతికర్త మొదలైన వివరాలతో పద్యాలు .  ఒకరకంగా చారిత్రిక బృహత్ గ్రంధం అయిన ప్రబంధ పారిజాతం .దీనికి డా.తుమ్మపూడి కోటేశ్వరరావు గారి విపుల వ్యాఖ్యానం మరొక గొప్ప అలంకారం .తుమ్మపూడి వారి వ్యాఖ్యానం లో అందరూ తెలుసుకోదగిన అనర్ఘ రత్న రాసులున్నాయి .వాటిలో ముఖ్యమైనవి ముందుగా మీకు తెలియ జేస్తాను .

‘’ఆకచటతప యాద్యైః సప్తభిః వర్ణ వర్గైః—విరచితముఖ బాహ్వాపాద మధ్యాఖ్య హృత్కా

సకల జగదధీశా శాశ్వతీ  విశ్వ యొనిః-వితరతు పరిశుద్ధం చేతసః శారదావః ‘’

అని ప్రపంచ సార తంత్రం చెబుతోంది .ఏ తల్లి చనుబాలతో  ఈ మహా కావ్యం ఆరంభమౌతోందో ఆమె అక్షర స్వరూపిణి .ఈ అక్షరాపు౦జ౦ ఏ అవయవ రూపమో విపులంగా ప్రపంచసారం తెలియ జేసింది అన్నారు డా చిమ్మపూడి కోటేశ్వరరావు గారు .ఆ మహా సరస్వతినే ఆలంకారికులు –‘’వందే కవీంద్ర వక్త్రేందు లాస్యమందిత నర్తకీం

దేవీం సూక్తి పరిస్పంద సుందరాభన యోజ్వలాం ‘’అని వక్రోక్తి జీవితం చెప్పింది .ఈ కావ్య అవతారిక 54 పద్యాలతో వివృతమైంది .1- సరస్వతీ స్తుతి-నాంది పద్యకృతులు  2-ఇష్ట దేవతాస్తుతి ౩-అంజలి 4- కాలమూర్తి 5 –వంశావతారం 6-పూర్వకవి స్తుతి 7-నాసోదె 8-ఆంద్ర పద్య వ్యధ 9-కుల ప్రసక్తి .ఈ ‘నవకం ‘’ఈ కావ్య ప్రపంచ ప్రతీక .9 సంఖ్య సృష్టికి ప్రతీక .10 వ్యక్త ప్రపంచాతీత సత్పదార్ధం –అదే సరస్వతీ దేవి .ఆమె అవయవ స్వరూపమే అక్షరం .అక్షరమే సృస్టి గా పరిణమించి౦దని తంత్రోక్త విషయం .దీనినే శబ్ద బ్రహ్మ౦ అని వైయాకరణులన్నారు .దీనికి ‘’పరా ‘’వాక్కును కలిపింది కాశ్మీర శివాద్వైతం .ఈమె యేసృష్టి కర్త్రి ,వాగ్దేవి ,ఆద్యాశక్తి ,.ఏదన్నా ఒకే అర్ధం అని గ్రహించాలి .ఈ వాగ్దేవతా స్తుతి ఈ కావ్య తిలకం ‘’అని విశ్లేషించారు తుమ్మపూడి వారు .ఇలాంటి వెన్నో మహా వ్యాఖ్యానాలు చేశారు ఆచార్య తుమ్మపూడి .అవి తెలియ జేసే ప్రయత్నమే ఇదంతా .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-6-18 –ఉయ్యూరు

,

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.