ప్రతిభా త్రిమూర్తుల పరిచయ కార్యక్రమం –సరసభారతి 126 సమావేశం -2(చివరిభాగం )
నిన్నటి వ్యాసం లో జరిగిన సభా కల్లోలం గూర్చి సవివరంగా రాశాను .ఇప్పుడు వక్తల అభిప్రాయ మాలిక ,నేను చెప్పదల్చుకున్నదీ కలిపి తెలియ జేస్తాను .దీనిలో సీమోల్లంఘనం జరిగి ఉండచ్చు .ఆమహానుభావుల వైదుష్య ఆవిష్కరణమే మనం చేస్తున్న ప్రయత్నం కనుక ఇబ్బంది ఉండదనుకొంటా .ఇందులో సింహభాగం రజని గారికే చెందటం సహజం .అక్కడి నుంచే ప్రారంభిస్తా .
1- శ్రీ బాలాంత్రపు రజనీ కాంతారావు గారు
28-1- 1920 లో పిఠాపురం లో జన్మించిన రజనీ కాంతారావు గారి తండ్రిగారు ‘’వెంకట –పార్వతీశ కవులు ‘’అనే జంటకవులలో బాలాంత్రపు వెంకటరావు గారు .వీరి ‘’ఏకాంత సేవ ‘’మణిపూసలాంటి కావ్యం .రజని గారు 6 వ ఏటనే పాటరాసి స్వరం కూర్చి పాడిన ‘’చైల్డ్ ప్రాజెడి.’’ 16 వ ఏట అదే వ్యాసంగంగా బహు రచనలు చేసి ట్యూన్ కట్టి పాడి వినిపించేవారు అంటే అప్పటికే బాల వాగ్గేయకారులన్నమాట.ఏది విన్నా చూసినా మనసుకు పట్టించుకునే తత్త్వం ఉన్న.ఏకసంతాగ్రాహి.ఉత్తరభారత దేశ సంగీతం ,పాశ్చాత్య సంగీతం ,మ్మధ్య ప్రాచ్య అంటే మిడిలీస్ట్ సంగీతాలను ఔపోసనపట్టిన ఘనులు .1941లో మద్రాస్ ఆలిండియా రేడియో లో ఉద్యోగం లో చేరి అహమ్మదాబాద్ ,విజయవాడ ,బెంగళూర్ లలో స్టేషన్ డైరెక్టర్ గా చేశారు .మద్రాస్ ,బెజవాడలలో వారు పనిచేసిన కాలం రేడియోకి శ్రోతలకు స్వర్ణయుగం .ఘంటసాల మాస్టారును రేడియోకి పరిచయం చేసింది రజని గారే .అందుకే మాస్టారి మాస్టర్ పీస్ ‘’భగవద్గీత ‘’ను ఘంటసాలగారు రజని గారి సువర్ణ హస్తాలతోనే ఆవిష్కరింప జేశారు.
రేడియోలో భక్తి రంజని ,ఉషశ్రీ గారి ధర్మసందేహాలు ,కార్మికుల కార్యక్రమం ,వనితావాణి మొదలైన కార్యక్రమాలకు ‘’సిగ్నేచర్ ట్యూన్ ‘’స్వరపరచింది రజని గారే .అన్నమయ్య కీర్తనలకు గొప్ప ప్రాధాన్యం కలిపించారు .సినీ దర్శకుడు మల్లీశ్వరి ఫేం శ్రీ బి యెన్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహిత్యం ఉండేది రజని గారికి .వారి స్వర్గ సీమ సినిమాలో పాడి ఘంటసాల తెరంగేట్రం చేశారు .ప్రముఖ దర్శకుడు ఎల్వి ప్రసాద్ సినిమా ‘’గృహ ప్రవేశం ‘’కు రజని గారు- కథారచయిత, దర్శకుడు శ్రీ త్రిపుర నేని గోపీచంద్ తో కలిసి పని చేశారు .దీనికి ‘’నళినీకా౦తారావు ‘’అనే మారుపేరుతో పాటలు రాశారు .రజని గారి సోదరుడు నళినీ కాంతారావు కూడా గొప్ప రచయితయే .ఇందులో రజని రాసిన పాట’’మై డియర్ తులసమ్మత్తా’’హిట్ అయి ఆంద్ర దేశమంతా మారు మోగి ఆయనకు పెద్ద పేరు తెచ్చింది .ఇందులో పెండ్యాల నాగేశ్వరరావు రజనీ గారికి సహాయ సంగీత దర్శకుడు గా పని చేయటం విశేషం .బిఎన్ గారి ‘’రాజమకుటం ‘’చిత్రం లో ‘’ఊరేది ,పేరేది ఓ చందమామా ‘’పాటకూడా బహుళ ప్రజాదరణ పొందింది .
సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంగళం పల్లి బాలమురళీ కృష్ణ ,నాగయ్య ,రావు బాలసరస్వతి ,ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎస్ రాజేశ్వరరావు ,గళాలన్నీ రజని సంగీత సాహిత్యాలతో రంజిల్లినవే .రజని మార్గ దర్శకత్వం లో రేడియోలో షావుకారు జానకి గొంతు విని బి .యెన్ .ఆమెను విజయా సంస్థకు పరిచయంచేశారు .స్వర్గ సీమ సినిమాలో రజని చేత రెడ్డిగారు ‘’ఓహో పావురమా ‘’పాటరాయించి స్వర కల్పన చేయించారు .నాగయ్య గారి సంగీత దర్శకత్వం లో ఈ పాటను భానుమతి పాడి గొప్ప ప్రచారం తెచ్చింది .ఈ పాట శివాజీ గణశన్ కు చాలా ఇష్టమైన పాటగా జనం చెప్పుకుంటారు .శోభనాచలా వారి ‘’లక్ష్మమ్మకథ’’చిత్రానికి ‘’తారానాద్ ‘’పేరుతొ రజని పాటలు రాసి స్వరపరచారు ఇందులోని ‘’దిగుదిగునాగా ‘’,అటో ఇటో ఎటు పోవుటో,’’చిన్ననాటి స్వప్న సీమ ‘’పాటలు ప్రజలనాలుకలపై చాలాకాలం నర్తించాయి .ఆరోగ్యం బాగులేక రికార్డింగ్ ను ఘంటసాలకు అప్పగించారు రజని .కారణాలేవో తెలీదుకాని సంగీత దర్శకుడుగా ఘంటసాల పేరే వేశారు.
‘’రజని బాణీ అంటే లలిత సంగీత బాణీ ‘’అనేట్లు ఉండేది .పాట రాసి స్వరపరచి పాడేవారిని వాగ్గేయ కారులు అంటారని మనకు తెలుసు .అలాంటి సుప్రసిద్ధ వాగ్గేయకారులు రజనీ గారు .అంతేకాదు ఎంతో శ్రమించి ‘’వాగ్గేయ కార చరిత్ర ‘’రాసి ఋణం తీర్చుకున్నారు రజని .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం ఆయన 41 వ ఏటనే పొందటం మనమందరం గర్వించదగిన విషయం .సృజన పరాకాష్ట గా రజని నిలిచారు .అందుకే శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు రజనిగారిని ‘’పాటల పాదుషా ‘’అని అన్వర్ధంగా అన్నారు .రజనిగారి ఇతర రచనలలో ప్రసిద్ధమైనవి –శతపత్ర సుందరి ,విశ్వ వీణ ,ఏకాంత సేవ , భావ తరంగిణి .రజనీ గారిలో గొప్ప పరిశోధకుడు ఉన్నాడు .ఆయన చూపు బహు సునిశితమైనది .త్యాగయ్యగారి పంచరత్న కృతి ‘’గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర ‘’లో శరభోజీ మహారాజు లలో ‘’తులరాజు ‘’పేరును త్యాగయ్యగారు ధ్వనింప జేశాడని తన పరిశోధనలో వివరించారు .క్షేత్రయ్య పదాలను ఆంగ్లం లోకి అనువదించిన సవ్య సాచి రజని .ఆయన సంగీత వరుసలను ఎవరూ మార్చి పాడలేరు అని వింజమూరి సీతాదేవి అన్నట్లుగా ము౦జులూరి అన్నారు .ఆయన పాటలు శ్రోతలను స్వర లహరిలో విహరి౦చేట్లు చేస్తాయి.హైదరాబాద్ ను ‘’దక్షిణోత్తర మాధురీ సమ్మిళితశర్కరీ ఖండం ‘’అని అత్యంత కవితాత్మకంగా రుచి భరితంగా అనగల నేర్పరి రజని .
అనేక కూచిపూడి యక్షగానాలను పరిష్కరించి రేడియోలో ప్రసారం చేయించారు రజని .కొత్త నృత్య రూపకాలు రచించి నర్తకులకు కొంగు బంగారమే అయ్యారు .’’కొలువైతివా రంగశాయి ‘’అనే’’ దరువు’’ ఆయన స్వకపోలకల్పిత సృజనయేఅన్నారు కృష్ణకుమారి .ఆయన కూర్చిన రూపకాలలో ‘’ఆదికావ్యావతరణం ‘’,కామదహనం ‘’,విశ్వయానం ‘’జాతీయస్థాయిలో సృజనకు గొప్పపేరు తెచ్చిపెట్టాయి .వీనిలో జంత్ర వాద్య సమ్మేళనం జర్మనీ సంగీతకారులు మోజార్ట్ ,సి౦ఫనీ మాంత్రికుడు బీథోవెన్ లను గుర్తుకు తెస్తాయి .సంగీతం రక్తి కట్టించటం లో వీటి పాత్ర ఏమిటో తెలియబరచారు రజని .
నిత్య ప్రయోగ శీలి రజని .ఢిల్లీ మద్రాస్ ఆకాశ వాణి సంగీత బృందాలను కలిపి ‘’ఆంద్ర కల్యాణి ‘’అనే అపురూప పరిశోధనాత్మక కృషి చేశారు .’’కొండ నుంచి కడలి ‘’దాకా సంగీత రూపకం లో శ్రీనాథ ,విశ్వనాథ ,బాపిరాజు, రామదాసు ల పద్యాలు, పాటలు చేర్చి స్వర విన్యాస మాలికగా కూర్చారని ము౦జులూరి అంటారు .
1937-43 లో ‘’పూషా ‘’పేరుతొ అబ్బురపరచే కవితలు రాశారు .వీటిని అబ్బూరి ట్రస్ట్ వారు ‘’ఏటికి ఎదురీత ‘’పేరుతో 1999లో ప్రచురించారు .ఇవన్నీ ఆనాటి వచనకవితకు కొత్తదారి చూపించినవే .’’ఇవి ఒక అనివార్యమైన ఫేజ్ ‘’అన్నారు ఆవంత్స సోమసుందర్.బాలలకోసం ఎన్నో పాటలు రాసి స్వరపరచి పాడి రికార్డ్ చేసి వాళ్లకు అందుబాటులో కి కేసేట్స్ ,సీడీ లుగా తెచ్చారు .’’జేజిమామయ్య ‘’పేరుతో బాలగీతాలెన్నో రాశారు .1978 లో రిటైర్ అయ్యారు రజని .తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కు నాలుగేళ్ళపాటు స్పెషల్ ఆఫీసర్ గా పని చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు .రజని చేసిన అత్యద్భుత సాహసం ఎక్కడో అరుణాచలం లో ముక్కు మూసుకుని ఏకాంతంగా గడుపుతున్న సంచలన రచయిత’’చలం ‘’గారిని శ్రీ శ్రీ తో ఇంటర్వ్యు చేయించి ప్రసారం చేయటం.ఇదొక్కటే చలం పై రేడియో ట్రాక్ గా మిగిలి ఉంది అంటారు కృష్ణకుమారి .’’సారంగదేవ’’పేరుతో రజని ఎందరో కవుల జీవితాలను పరిచయం చేసి వెలుగులోకి తెచ్చారు .
‘’మాదీస్వతంత్ర దేశం మాదీస్వతంత్రజాతి ‘’గేయం రాసిస్వరపరచి టంగుటూరి సూర్యకుమారి గారితో బహుకమ్మగా పాడించి చిరకీర్తి సాధించి పెట్టారు జాతికీ, ఆయనకు ,సూర్యకుమారి గారికీ.రజని చేసిన మరో గోప్పప్రయోగం 1947 ఆగస్ట్ 15 నాడు ఎర్రకోటపై ప్రధమ ప్రధాని నెహ్రు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగం పూర్తి చేయగానే రజని గారు ‘’మోగింది జయభేరి ‘’గీతాన్ని రాసి స్వరపరచి సూర్యకుమారిగారి చేత పాడించి అవ్యవధానంగా ప్రసారం చేయించారు .ఇదొక మైలురాయిగా నిలిచింది .19 56 లో ఆయన ప్రసిద్ధమైన సూర్య స్తుతి ‘’శ్రీ సూర్య నారాయణా మేలుకో –హరి సూర్యనారాయణా మేలుకో ‘’రచించి పాడి ప్రసారం చేశారు .ఘంటసాల భగవద్గీత లాగా ఈ పాట ఆదివారం స్పెషల్ గా వీనుల వి౦దు చేస్తోంది తెలుగు లోగిళ్ళలో .ఉదయభానుని క్రమవికాసం అప్పుడు పొందిన రంగులకు తెలుగుసోబగులుఅద్ది నభూతో అనిపించారు ఆభావుకతకు ఆ నిశిత పరిశీలకు జోహార్లు .విశ్వనాథ ఆవహించాడేమోనని పిస్తుంది అంతకంటే కావాల్సినదేముంది ?ఒక్కమాటలో చెప్పాలంటే ‘’నడిచే పాట రజని ‘’.
శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు
గుంటూరు జిల్లాలో1938లో జన్మించి విజయవాడ లో చదివి విశ్వనాధ అంతేవాసియై లయోలాలో ఆంధ్రోపన్యాసుకులుగా నలభై ఏళ్ళు సేవలందించారు శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు .దాదాపు 200 కథానికలురాశారు . ఒకరకంగా ‘’కృష్ణా జిల్లా సాహిత్య కెరటం ‘’ఆయన .సామాన్యుడికి కూడా అందుబాటులోఉండేట్లు రాయాలన్న తపన ఉన్నవారు .ఎంత ఎత్తుకు ఎదిగినావొదిగి ఉందాలి అన్న అసాధారణ వ్యక్తిత్వం ఆయనది .తెలుగు భాషాతత్వంమూర్తీభవించిన పండితరూపం అంటారు ఆయనను .సాహిత్య అకాడెమీ తోపాటు ఎన్నో పురస్కారాలు పొందిన శేముషీ మూర్ధన్యుడాయన .ఆయన విశ్వనాధ శిష్యుడే అయినా శ్రీ కెవి రమణారెడ్డి గారి ప్రభావతం తో లెఫ్ట్ వైపు ఒరిగారు .నిత్య జీవితం లోని సంఘటనకు స్పందించి రాసినవే ఆయన కథలన్నీ.అందుకే మట్టి గుబాళింపు ఉంటుంది .12 నవలలు రాసిన మహా రచయిత పెద్దిభొట్ల .ఈ నవలలపై శ్రీ గుమ్మా సాంబశివరావు గారు పరిశోధన చేసి డాక్టరేట్ పొందినట్లు నాకు డా పూర్ణచంద్ తెలియ జేశారు .రచనలలో మానవత్వం ప్రతిబి౦బి౦చాలని ,నైతిక విలువలకు స్థానం ఉండాలని కోరుకున్న పిచ్చమహారాజు.ఎప్పుడూ ని౦డా నీళ్ళని చూడని వాడు కృష్ణానది వరదను చూసి తనివితీరా ఆనందం అనుభవించి ,ఆ నీళ్ళలో మునిగి చనిపోవటం గా ‘’నీళ్ళు ‘’కథ రాశారు అని చెప్పారు శ్రీ చంద్ర శేఖరరావు .పెద్దిభోట్లవారి స్వంత గొంతుకతో కధలను చదివించి ,రికార్డ్ చేసి అపురూపంగా భద్రంగా దాచుకొని ఇక్కడ వీలు ఐతే వారి స్వరం వినిపిద్దామని తెచ్చారు కూడా .ఆ అవకాశం నిన్న దక్కకపోవటం మన దురదృష్టం . .ఇంగువ ఎలా వస్తుంది అనే సందేహం తో జీవితాంతం గడిపిన ఒక సందేహి చనిపోయేముందు స్నేహితుడు వస్తే వాడిని కుశల ప్రశ్నలు అడగకుండా ‘’ఇంగువ ఎలా చేస్తారు ‘’అని ప్రశ్నించటం లో చచ్చేదాకా మనిషిలో ‘’ఇంక్విజిటివ్ నేచర్ ‘’ఉండాలి అనే నీతి ఉంది అన్నారు పూర్ణచంద్ .సినిమా చూడాలని మనవడితో ఒకముసలమ్మ పాత దియేటర్ కు వస్తుంది .విశ్రాంతి తర్వాత వచ్చే సన్నివేశం కోసం ఆమె ఆతురతగా ఎదురు చూసింది .తీరా ఆ సన్నివేశం వచ్చే సమయానికి ప్రింట్ నలిగిపోయి మసగబారి కనిపించలేదు .ఉసూరుమన్నది ఆమె ప్రాణం .ఆసన్నివేశం లో ఆమె భర్త ఒక చిన్న వేషం వేశాడు .భర్త చనిపోయి చాలాకాలమైంది తెరమీదనైనా చూసి ఆనందించాలని అనుకున్న ఆమె ఆశ భగ్నమైంది .ఈ మానవ సంబంధాన్నే తీసుకుని ‘’ముసురు ‘’కథ రాశారు సుబ్బరామయ్యగారు అని నేను ‘’కృష్ణా తీరంలో సాహితీ కెరటం ‘’లో ఆయన గురించి రాశాను.
పెద్దిభొట్లవారిని’’ వర్షించే మేఘం ‘’ అన్నారు ప్రముఖ కధారచయిత మధురాంతకం రాజారాం గారి తండ్రికి తగ్గ తనయుడు శ్రీ మధురాంతకం నరేంద్ర .అంతేకాదు ఆయనను ‘’ఆధునిక భవభూతి’’గా కూడా అభివర్ణించారాయన .యదార్ధం అని ఆయన కధలు చదివితే తెలుస్తుంది .పతనమై పోతున్న సమాజ విలువలకు ,తెగి పోతున్న మానవ సంబంధాలకు ఆయన తీవ్రంగా కలత చెందారు .పేద పిల్లలలోని ప్రతిభను ప్రోత్సహించలేని పెద్దల వ్యవస్థపై ఆయన నిప్పులు చెరిగారు .క్రీడలు నేపధ్యంగాఆయన రాసిన కథలు ఆణిముత్యాలే .ఆలోచి౦ప జేసేవే .అలాంటి అరుదైన మానవీయ మూర్తి పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు .తనపుట్టినరోజున ప్రముఖ కథా రచయితను ఎంపిక చేసి సన్మానించిన ఉదాత్త చరితులాయన .అలాంటి అరుదైన సందర్భ౦గానే నేను 20 16 లో బొడ్డపాటి ఆహ్వానం పై వెళ్లి వారికి శాలువాకప్పి సాహితీ ఋణం తీర్చుకున్నాను .అదే చివరి సారి చూడటం .
శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి
తెలుగు సినిమాలకు బెంగాలీ నవలలే దిక్కు గా ఉన్న సమయం లో ఆంద్ర దేశం గొడ్డుపోలేదని సమర్ధులైన మహిళా రచయితలున్నారని రుజువు చేసిన నవ నవలా సామ్రాజ్ఞి శ్రీ మతి యద్దన పూడి సులోచనా రాణి .కృష్ణా జిల్లా కాజలో 2-4-19 40 జన్మించి హైదరాబాద్ లో స్థిరపడి నవలలు పుంఖాను పుంఖంగా రాశారు .దాదాపు నవలన్నీ సినిమాలుగా వచ్చి గొప్ప ట్రెండ్ నే సృస్టించాయి.కనకవర్షం కురిపించాయి. నట నటీమణులకు దర్శక సంగీత దర్శకులకు, నిర్మాతలకు అప్పుడు స్వర్ణయుగమే .ఆమె రాసిందల్లా అచ్చై బంగారమై ఆంద్ర దేశం అంతా సంచలనం సృష్టించింది . అడిగి,ప్రాదేయపడీ రాయించుకొనే స్థితి ఆమె కల్పిచింది .అదొక నవ కెరటం ఉద్ధృతంగా ,ఉవ్వెత్తుగా ఎగసిపడింది. అప్రతిభులను చేసింది మహా మహా మగ రచయితలను .దాసోహం అనిపించాయి ఆ నవలలు . సెక్రటరి ,మీనా,జీవన తరంగాలు ఒక ఊపు ఊపేశాయి. ఎక్కడవిన్నా వాటి గురించి చర్చోపచర్చలే ఆనాడు .అందుకే తిలక్ ‘’నవలలు డూప్లికేట్లు క్వాడ్రూప్లికేట్లు రాసి పారేస్తున్నారు ‘’అన్నాడేమో ?సినీ రంగం లో ట్రెండ్ సెట్టర్ గా నిలబడింది సులోచన .
ఏమైనా సులోచనా రాణి ఒక సంచలనమే సృష్టించింది .రీడబిలిటిపెంచింది మధ్యతరగతి మహిళలలో .ఆ తరగతి స్త్రీ అస్వతంత్రురాలుకాదని తబలా వాయించటానికి అబల కాదనీ సమర్ధురాలని ఆమెకూ చీమూ నెత్తురూ ఉన్నాయని ,అవకాశం వస్తే సత్తా చాటి చెప్పగలదని ఆమె నవలలోని పాత్రలు నిరూపించాయి .దీనితో వారిలో కొత్త చైతన్యం తొణికిసలాడింది .చైతన్యం పెల్లుబికింది .మహిళా వ్యక్తిత్వానికి సి౦హాసనమే వేసింది సులోచనా రాణి .ఇంతకంటే మహిళాభ్యుదయం ఎక్కడుంటుంది ?.స్లోగన్లు పరిష్కారం కాదు కార్యాచరణ ముఖ్యం అని తెలియ జెప్పింది. ఒకరకంగా ఆమె’’ సైలెంట్ విప్లవమే ‘’తెచ్చింది .ఇదికాదనరాని సత్యం .ఆనవలలలోని నాయకులు వంటి వారు తమకు జీవిత భాగస్వామి కావాలని యువతులు ఆశపడ్డారు .
అప్పటిదాకా స్త్రీ బాహ్య సౌందర్యాన్ని మాత్రమె వర్ణించే నవలలు వచ్చాయి వీటికి భిన్నంగా ఆమె వాళ్ల అంతరంగాలను ఆవిష్కరించే నవలలు రాసి ట్రెండ్ సృష్టించారు .నవలలోని నవలలు అంటే స్త్రీమూర్తులు ‘’మకుటంలేని మహా రాణులు’’గా ఉండటం ఆమె తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ .ఇటీవల త్రివిక్రం ,నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘’అ ఆ ‘’సినిమాకు కథ ఆమె దే అవటం ఆమె కాలం కంటే వెనుకబడి లేదు అని తెలియ జేస్తుంది .జీవన పోరాటం నేర్పింది ఆమె .మహిళ స్వయం సిద్ధ కావాలని చెప్పింది తనను తాను తీర్చి దిద్దుకొని ,కుటుంబాన్నీ సమాజాన్నీ తీర్చి దిద్దుకోవాలని హితవు చెప్పింది .వెనకడుగు వేస్తె శాశ్వతంగా వెనకబడి పోతారని మహిళలను హెచ్చరించింది .మానవ సంబంధ ఇతి వృత్తాలుగా ఆమె రాసిన 70 కి పైగా నవలలు ఆడవాళ్ళకు స్పూర్తి నిచ్చాయి .ప్రేరణ కలిగించాయి పథ నిర్దేశం చేశాయి .తెలుగువారి ఆరాధ్య రచయితగా నవనవలా సామ్రాజ్ఞి గా శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి స్థానం శాశ్వతం’
ముక్తాయింపు –ఇంత చిరకీర్తినార్జించిన ఈ ప్రతిభా త్రిమూర్తులకు ప్రభుత్వం పద్మశ్రీ లైనా కనీసం ఇవ్వకపోవటం విడ్డూరం .
. సరిగమలు –జూన్ మొదటి వారం లోనే కాలేజీకి వెళ్లి నేనూ శ్రీగంగాధరరావు గారు రెడ్డితో కలిసి ప్రిన్సిపాల్ గారికి చెప్పి శ్రీ శ్రీనివాస్ సహకారంతో నిన్నటి కార్యక్రమం ఫిక్స్ చేశాం. వారానికి కనీసం రెండుసార్లు అయినా రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొంటూ బానర్ మీద రజని ,పెద్దిభొట్ల ,యద్దనపూడి ల చిత్రాలు వచ్చేట్లు చూడమని ,మాతెలుగు తల్లి పాట పాడే విద్యార్ధినులను చూడమని చెబుతూనే ఉన్నా సరే అంటున్నాడు ఆతను .తీరా నిన్న వెళ్ళే సరికి బానర్ పై త్రిమూర్తులు ఫోటోలులేవు. అసహనంగా ఇది బాగాలేదు అని చెప్పి ‘’కంపు లాబ్ ‘’కు వెళ్లి ఫోటోలు డౌన్ లోడ్ చేసి తెచ్చి అతికించమని చెబితే కాని ఆపని జరగలేదు .ప్రెస్ వాళ్లకు ఇన్విటేషన్స్ ప్రింటౌట్ తీసి పంపమనీ ముందు నుంచి చెబుతూనే ఉన్నాను . .ఇవాళ ఆంద్ర జ్యోతి విలేకరి శ్రీ గోపాలస్వామి కనిపించి ‘’సార్!అంతపెద్దకార్యక్రమం జరిపి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారేమిటి “’?అని అడిగేదాకా వాళ్లకు కాలేజీ వాళ్ళు సమాచారం అందించలేదని అర్ధమైంది .ఇవాళ పొద్దున్న శ్రీమతి ముంజులూరి కృష్ణ కుమారిగారు నిన్నటి నా మెయిల్ కు ఇచ్చిన జవాబు లో ‘’ thanks for ur initiative but to wrong audience.’’అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.
సరసభారతి టెక్నికల్ సలహాదారు శ్రీ వీరమాచనేని గంగాధరరావు గారు నిన్న చేసిన సేవలు మరువలేనివి .మాటలతో ,ధన్యవాదాలతో ఋణం తీర్చుకోలేనివి .మాజీ హిస్టరీ లెక్చరర్ శ్రీ నారాయణ మూర్తిగారు కార్యక్రమ భాగస్వామ్యం లో లేని లోపం బాగా కనిపించింది
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-18 –ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797