’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -3
గోదా దేవిని ముందు స్తుతించాడు కవి .కాని ఆమె కన్నా ముందు తరంవాడు నమ్మాళ్వా రున్నాడు .అయినా గోదాదేవినే ముందు పేర్కొన్నాడు .కారణం పన్నిద్దరాళ్వా ర్లకుముద్దుల కూతురట ఆమె అందుకనిట.అంతే కాదు అ కల్ప వృక్షానికి చిటారు కొమ్మన పూచిన పూవట ఆమె .ఇతర ఆళ్వార్లు నిద్రపోతుంటే ,స్వామి వచ్చి తట్టిలేపితేనే వాళ్ళు లేచారట .కానీ గోదా దేవి తానే నిద్రించే స్వామిని లేపి ‘’స్వామీ !నేను వచ్చాను ‘’అన్న యోగ్యురాలట .అదీ ఆమె విశేషం .అందుకే ఆళ్వార్ కంటే ఈమెనే ముందు స్తుతించారు వృషాద్రిపతి కవి.ఆళ్వార్ల భక్తి సంప్రదాయానికి ఈ తల్లి తత్వ దర్శనం ప్రసాదించటం మరో విశేషం కూడా ,యతీంద్రుల వారి స్తుతి చేసి ఆపేశారు కవి .అంటే గోదా స్తుతి తో ప్రారంభమైన ఆళ్వార్ల సంప్రదాయం భగవన్ రామానుజుల స్తుతి తో సమాప్తమైంది అని విశ్లేషించారు తుమ్మపూడివారు .ఇది ఔచిత్యవంత౦గా ఉన్నదన్నమాట .పూర్వ కవులను స్తుతి౦చటమేకాడు ,వర్తమాన ,భవిష్యత్ కవులకూ కుసుమాంజలి సమర్పించి గౌరవించారు విశాల హృదయుడైన ఈ కవి .
రాయాల్సిన కావ్యం మహా విస్త్రుతమైనది .కలంపట్టుకొంటే భావం రాక ,తగిన శబ్దం తట్టక గిజగిజలాడాడు కవి. ఇలాంటి అనుభవమే తిమ్మనకవికి పారిజాతాపహరణ కావ్యం లో జరిందని చెప్పారు విశ్లేషకులు .ప్రతిభ అంటే శబ్ద స్పురణం .భావానికీ సందర్భానికీ తగినట్లు శబ్దం తన౦తట తాను స్ఫురించాలేతప్ప ప్రయత్నం వలన సాధ్యమయ్యే పనికాదు అది .ఈ విషయం లో ‘’ధ్వన్యాలోకం ‘’కూడా –‘’తదర్ధ వస్తు నిష్య౦దమానా మహితాం కవీనాం ఆలోక సామాన్య మభి వ్యనక్తి ‘’చెప్పినట్లు గుర్తు చేశారు వ్యాఖ్యాత .ఇదంతా దానికోసం తపన .ఇది అశక్తత కాదన్నారు .పదబ౦ధం ,సమాస సంపద ,భావాలు ,సన్నివేశ కల్పన,సరసత అన్నీ ప్రతిభతో జని౦చేవే అని పిండితార్ధం ,పండితార్ధం కూడా .’’ఇది యొక కావ్యమా ?పద బంధ గతి లేదటంచు మిక్కిలి ఈసడించు వాడొకడు ‘’అన్నకవి పద్యం ప్రభావతీ ప్రద్యుమ్నం లో ‘’శబ్ద సంస్కార మెచటను జారగ నీక ,పదమైత్రి అర్ధ సంపదల బొంద ‘’పద్యాన్ని స్పురణకు తెస్తు౦దన్నారు వ్యాఖ్యాత .అసలు ప్రతి వర్తమాన కవి లోనూ ప్రాచీన కవి వాక్య భావ సంపద దోబూచులాడటం సహజం అన్నారు .పురాతన సంపద ఆధారం గానే వర్తమాన కవితా సౌధ నిర్మాణం జరుగుతుందన్న సత్యం చెప్పారు .కవివేరు, స్పురణ వేరు .అందుకే ‘’కవి +త్వం ‘’అన్నారు .కవి వేరు అతనికి తోడుగులాగా ఉన్న సమాజం లోని వ్యక్తి వేరు .ఇదంతా కవికి తెలుసా ?అంటే వాడికీ రహస్యం తెలియదనాలి అన్నారు ఆచార్యశ్రీ .’’పిన్నటనాడే రాయ పృధివీ పతి వృత్తము వింటి భక్తి సంపన్నత ‘’అనే పద్యం చూస్తే రాయలకథ చిన్ననాటి నుండే వింటూ కవి దానిలో ఊరిపోయాడని భావించాలి .’’పద్యాలనడ్డి ని దుడ్డు కర్రతో విరిచేస్తాను’’ అన్న కవి’’ నడ్డి విరిగి చతికిలబడటం’’ ,ఆయన నమ్మిన సిద్ధాంతం దుంప నాశనం అవటం ,ఆయనకాలం లోనే విచిత్ర ఛందోమయ కావ్యాలే రావటం ,’’ఛందశ్శిల్పం ‘’వంటి అద్భుత సిద్ధాంత గ్రంథాలు రావటం జరిగిందని తుమ్మపూడివారు గుర్తు చేశారు ‘’మనిషినీ ,అతని ఊహా వైచిత్రినీ నువ్వు తయారు చేసుకున్న శోధన నాళిక (టెస్ట్ ట్యూబ్ ) లో బంధించలేవు.నువ్వు ప్రమాణం కాదు .అలాంటి సిద్ధాంతాలన్నీ పది లేక ఇరవై ఏళ్ళు తిరక్కుండానే గతించి పోవటం చరిత్ర చాటిన సత్యం ‘’’అని హెచ్చరించారు కూడా . ఈ కవి అందుకే ఇలా అన్నారు –
‘’కాలమొకే విధి సాగదు-వాలాయము మారుచుండు ప్రాతవి యెల్లన్
గ్రాలవు రోతగ గ్రొత్తవి –కాలేవు సమస్తములను ఘనతర శుభముల్ ‘’
‘’మన ఇష్టానిష్టము తో –జనదీ కాలము నెపుడు సాగును స్వేచ్చన్
తనమార్గము తనయదిగా –మనమద్దాని గ్రహించి మనుటొప్పారున్ ‘’.
‘’పద్య విద్య ‘’అనే మాట ఋషి కల్పుని పవిత్రమైన నోట బుట్టినది ‘’అని అందరూ గ్రహించాలి అని హితవు చెప్పారు .
ఈ కావ్యం లో కవి కుల ప్రసక్తి గురించి చర్చించి ,ఈ వింత జాడ్య౦ వలన ద్వేషాగ్ని విజ్రుంభించి సమాజం చిన్నా భిన్నమౌతోందని ,కులం పోవాలి అని నినాదాలు చేస్తూనే దాన్ని రాజకీయనాయకులు పెంచి పోషిస్తున్నారనీ ,దాని ప్రసక్తి రాయల విషయం లో అప్రస్తుతం అని తేల్చారు కవి తాను రాసిన అర్ధవంతమైన పద్యాలలో –
‘’రాయలవారిదేకులమొ వ్రాయ మనంగ నికేమి చెప్పగా –ఆయన సర్వ మానవ నుతార్హుడు నందు తెలుంగు జాతికిన్
మాయని మానికంబు ,జనమండలి వేడెద దక్షిణోర్వికిన్ –బాయక తెల్గు భాషకు నొనర్చిన మేలును జూడుటన్నిటన్’’అని వేడుకొన్నారు కవి .
‘’ఆయన పౌరుషంబు ,సమరాంగణ శౌర్యము ,కావ్య కల్పనా –మేయ విపశ్చితికిన్ బరిణ మించిన పాలన సత్కళాప్రియ
త్వాయత పోషణ౦బు,కవితాద్భుతపోషణ లెల్ల నొక్కటై-రాయలుగా జని౦చెనని రాజిత రీతి నివాళు లేత్తుడీ’’అంటూ కృష్ణరాయల మూర్తిమత్వాన్ని ఆవిష్కరించారు మొవ్వకవి.
కాక తీయ సామ్రాజ్యం విచ్చిన్నం కావటానికి కారణం రెడ్లూ,వెలమలు వేరుకావటమే అని చరిత్ర చెప్పిందీ ,ఈ కావ్యమూ అదేచేప్పింది .వీళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకొని ఉంటె అంతటి కాకతీయ సామ్రాజ్యం విచ్చిన్నమయ్యేది కాదు .పీఠిక లోనే కావ్యవస్తువును నిక్షిప్తం చేశారు కవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-18 –ఉయ్యూరు
—