సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ వెబ్ పత్రిక జులై

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్

గుజరాత్ ను పాలించిన గొప్ప రాజ వంశాలున్నాయి .ప్రసిద్ధులైన రాజులెందరో ఉన్నారు .వారితో పాటు సుపరిపాలన అందించిన శేముషీ మణులైన మహా రాణీలు కూడా ఉండటం విశేషం .అలాంటి వారిలో,,మినాల్ దేవిసు పరిపాలనతో ప్రజా హృదయం చూరగొ౦టే , నాయికీ దేవి మహమ్మద్ ఘోరీని ఓడి౦చి జగద్విఖ్యాతమయ్యారు .ఆ ఇద్దరు మహారాణుల గురించే ఇప్పుడు మనం తెలుసుకొంటున్నాం .

1-న్యాయ ధర్మ రక్షకురాలు -మినాల్ దేవి

క్రీ శ.11 వ శతాబ్దికి చెందిన గుజరాత్ ను పాలించిన మినాల్ దేవి మహారాణి సమర్ధతకు ,న్యాయానికి ,ధర్మానికీ ప్రతీక .ఈమెను ‘’మయనల్లా’’ అనికూడా పిలుస్తారు .కర్నాటక పాలకుడు కాదంబ వంశానికి చెందిన జయకేశి కుమార్తె మినాల్ దేవి .ఈమెను గుజరాత్ లో అనహిల పతన్ వాడా పాలకుడైన చాళుక్యరాజు మొదటి కర్ణ మహారాజు వివాహం చేసుకున్నాడు .కాని విధి వశాత్తు వారిద్దరికీ జన్మించిన సిద్ధరాజ జయసింహుని చిన్నతనం లోనే రాజాకర్ణ మరణించాడు .

రాజ్యానికి వారసుడైన కుమారుని తరఫున రాజమాత మినాల్ దేవి రాజ్యపరిపాలన చేబట్టింది .యవ్వనం రాగానే అతను రాజై, ఎదురులేని చారిత్రాత్మక మహారాజు అనిపించుకున్నాడు . తల్లి ఇచ్చిన శిక్షణ ఫలితమే అది .రాజ శేఖర సూరి అనే కవి రచించిన ‘’ప్రబంధ కోశ ‘’గ్రంధం లో మహారాణీ గొప్పతనాన్ని గురించిన వివరాలెన్నో ఉన్నాయి . యుద్ధ తంత్ర నైపుణ్యం లో రాణి తనకొడుకును అద్వితీయ ప్రతిభా శాలి గా తీర్చి దిద్దింది .రాజరిక వ్యవహారాలన్నీ పూర్తిగా ఆకళింపు చేసుకొని రాజ్యానికి శత్రుభయం లేకుండా చేసింది .ప్రజోపకరమైన ఎన్నో పనులు చేసి ప్రజలకు కన్నతల్లి అనిపించింది .న్యాయం ,ధర్మం ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించింది .ధర్మం కోసం అనుక్షణం తపన పడింది .ప్రజా సంక్షేమమే రాజ్యానికి శ్రీరామ రక్షగా భావించి పరిపాలన సాగించింది .అనేక స్మృతి చిహ్నాలు నెలకొల్పింది . తాగునీటికోసం సాగునీటికోసం అవసరైన ప్రతి చోటా తటాకాలు నిర్మించింది .ప్రముఖ జ్యోతిర్లి౦గ మైన శ్రీ సోమనాథ దేవాలయాన్ని సందర్శించే యాత్రికులపై ఉన్న సుంకం తీసేసింది .

ఆమె పాలనా కాలం లోరెండు పెద్ద ప్రముఖ సరోవరాలను నిర్మించింది .అందులో ఒకటి మినాల్ సరస్సు లేక మున్సార్ సరస్సు.దీనిని వీరం గావ్అనే చోట కట్టించింది .రెండవది అహ్మదాబాద్ లో ధోల్కా లో నిర్మించిన మాల్వా సరస్సు .

మాల్వా సరస్సు నిర్మిస్తుండగాఒక గొప్ప ఆమె ఔదార్యానికి దార్మికతకు పరీక్ష గా ఒక విషయం చోటు చేసుకున్నది .ఆసరస్సు నిర్మించే చోట ఒక పేదరాలి ఇల్లు ఉన్నది .సరస్సు నిర్మాణం లో ఆ ఇల్లు పూర్తిగా పడ గొడితేకాని నిర్మాణం ఆశించిన విధంగా పూర్తికాదు .ఆ ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేస్తే కోరినంత ధనం అందజేస్తానని రాణి కబురు చేసింది ముసలామెకు .దానికి ఆముడుసలి బదులిస్తూ ‘’ఈ సరస్సు వలన నాకు కూడా గొప్ప పేరొస్తుంది ‘’అని చెప్పి బలవంతంగా తన ఇంటిని ఆక్రమిస్తే తాను ఆత్మాహుతి చేసుకొంటానని ప్రకటించింది .మహారాణి కి ఆ ముసలమ్మ ను బలవంతపెట్టి స్వాధీనం చేసుకోవటానికి మనస్కరి౦చ లేదు . ఇప్పటిదాకా తాను సత్య, న్యాయ, ధర్మాలకు ప్రతీకగా కీర్తి పొందింది .అందుకని ముసలమ్మ ఇంటి జోలికి వెళ్ళకుండానే సరోవరం పూర్తి చేయించింది మహారాణి .ఈ దృష్టాంతం కావ్యాలలో గ్రంథాలలో విశేషంగా కీర్తింపబడి, రాణి ఔదార్యాన్నిన్యాయ నిర్వహణను ప్రపంచానికి చాటి చెప్పారు కవులు .ఈ సందర్భం గా గుజరాత్ లో ఒక సామెత వాడుకలోకి వచ్చింది –‘’న్యాయధర్మాలను చూడాలని అనుకొంటే ధోల్కా వెళ్లి మాల్వా సరస్సును చూడు ‘’ .సరస్సు ఆకారం బాగుండాలంటే ముసలమ్మ ఇంటిని స్వాధీనం చేసుకొని చక్కగా కట్టాలి .కాని ధర్మ న్యాయాలను పరిరక్షించే రాణి సరస్సు ఆకారానికంటే ఆ ముసలమ్మ సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చింది .

మీనాల్ దేవి మహారాణి గొప్పతనం ,మంచితనం, వివేకం ఔదార్యం ,న్యాయ ధర్మాల గురించి అనేక గ్రంధాలలో వర్ణించబడి ఉంది .’’ముద్రిత కుముద చంద్ర ప్రకరణ ‘’అనే సంస్కృత నాటకం లో మరొక విషయం పేర్కొనబడింది .గుజరాత్ లోని జైన మత శాఖలైన దిగంబర ,శ్వేతాంబర జైనులమధ్య ‘’స్త్రీలకు నిర్వాణం లభిస్తుందా ?’’ .అనే అంశంపై గొప్ప ధర్మ సందేహం కలిగింది .శ్వేతాంబరులు ‘’సత్వ గుణ సంపన్నులైన మహిళలు తప్పక నిర్వాణం అంటే ముక్తి పొందుతారు ‘’అని వాదించారు .దీనికి ఉదాహరణగా రామాయణం లోని సీతాదేవి ,ప్రస్తుతం తమ పాలకుడైన సిద్ధరాజ జయసింహ మహారాజు తల్లి అయిన రాజమాత మీనాల్ దేవి అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు .అదీ చరిత్రలో మీనాల్ దేవి మహారాణికి ఉన్న విశిష్ట స్థానం .

2-మహమ్మద్ ఘోరీని ఓడించిన -నాయకీ దేవి

ఝాన్సీ లక్ష్మీ బాయ్ చూపిన పోరాటపటిమ అందరకు తెలుసు .ఇది చరిత్రలో సువర్ణా ధ్యాయంగా రాయబడింది .కాని ఘోరీ మహమ్మద్ తో ఢీకొని ఓడించిన నాయకీ దేవి గురించి పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి .అజయపాల మహారాజు తర్వాత రాజైన బాల మూల రాజు లేక రెండవ మూలరాజు తల్లి నాయకీ దేవి గోవా కాదంబ మహా మండలేశ్వరుడైన పెర్మడి లేక శివ చిత్తుని కుమార్తె .రెండవ భీమరాజు మరణానంతరం మూలరాజు సోదరుడు రాజయ్యాడు .మూలరాజు మూడేళ్ళు మాత్రమే రాజ్య పాలన చేశాడు .కాని ఈ బాల రాజు ఆ స్వల్పకాలం లోనే ఒక ముస్లిం సైన్యాన్ని జయించాడు .అందుకని ఇతడు ‘’ప్రభూత దుర్జయ గర్జనకాధి రాజు ‘’అనీ ‘’మ్లేచ్చతమో మేచయచ్చాన్న మహీవలయ ప్రద్యోతన వలార్క ‘’అని కీర్తి౦పబడినాడు . బాలరాజు సాధించిన ఈ విజయాన్ని బాల చంద్ర ,అరిసింహ కవులు తమకావ్యాలలో గొప్పగా వర్ణించారు .

ఇంత కంటే వీర రస ప్రధానంగా జైనకవి మేరుతుంగ తనకావ్యం ‘’ప్రబంధ చింతామణి ‘’లో వర్ణించి చెప్పాడు .రాణి నాయకీ దేవి పసిపిల్లాడైన మూలరాజును ఒడిలో వేసుకొని చాళుక్య సైన్యానికి నాయకత్వం వహించి మౌంట్ ఆబూ వద్ద ఉన్న గదరార ఘట్ట రణరంగం లో మ్లేచ్చరాజుతో స్వయంగా పోరాడి గెలిచింది .ఆ సమయం లో దట్టంగా ఆకాశమంతా పరచుకున్న మబ్బులు ,విపరీతమైన కుండపోత వర్షం ఆమె విజయానికి తోడ్పడినట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆమె చేతిలో ఓడిపోయిన ఆ ముస్లిం రాజెవరో చారిత్రకులు చెప్పలేక పోయారు .ఫోర్బ్స్ ,బూలర్ ,జాక్సన్ వంటి పరిశోధకులు ‘’మూజుద్దీన్ మొహమ్మద్ బిన్ సం’’అని తేల్చారు .ఈ తిరకాసు ఎందుకు ఆ ఓడిపోయిన ముస్లిం రాజు ‘’మహమ్మద్ ఘోరి ‘’యే..సైన్యమంతా నశించి అయిదారుగురు అంగ రక్షకులతో ఘోరీ పలాయనం చిత్త గించాడు .ఈ యుద్ధాన్నే ‘’కసహ్రద యుద్ధం ‘’అంటారు . గర్జనకులు అంటే గజని లో ఉండే వాళ్ళను మూలరాజు జయించినట్లు జయస్తంభం ఉన్నది .దీనిపై ‘’ఇక్కడే ఒక స్త్రీ హమ్మీరులను అంటే అమీర్ లను మూలరాజు పాలనలో ఓడించింది ‘’అని రాయబడి ఉంది .

ఇక్కడ గెలిచి ఉంటె ఘోరీ దక్షిణ రాజపుటాన ,గుజరాత్ మొదలైనవన్నీ ఆక్రమించి ఉండేవాడు .1178 లో జరిగిన ఈ ఓటమితో తన ప్రణాళిక మార్చుకున్నాడు .వెనక్కి వెళ్ళిపోయి మరుసటి ఏడాది కైబర్ కనుమ దాటి పెషావర్ ,లాహోర్ లను వశపరచుకున్నాడు . ఈ యుద్ధం తర్వాత మూలరాజు చనిపోయాడు .నాయకీదేవి కుమార్తె కూర్మదేవి కూడా వీరవనితయే .ఈమె కుతుబుద్దీన్ ఐబక్ ను యుద్ధం లో జయించి చరిత్ర సృష్టించింది .ఇదీ భారతీయ స్త్రీ శక్తి అంటే ..

.13 వశతాబ్దం లో సోలంకి రాజు ల రాజధాని నహర్వాలా వైపుకు ఉచ్హా ముల్తాన్ లమీదుగా దండెత్తివచ్చాడు ఘోరి . .అప్పటి సోలంకి రాజు యువకుడు .అతనివద్ద ఉన్న గజసైన్యం అమోఘమైనది .ఈ గజ సైన్యం ఘోరీ సైన్యాన్ని గజగజ లాడించి నిర్దాక్షిణ్యం గా తొక్కేసి చంపేసి ఘోరీని ఘోరంగా ఓడించింది .ఆశించిన ఫలితం రాక తోకముడిచి మళ్ళీ వెనక్కి వెళ్లి పోయాడు ఘోరీ .

-గబ్బిట దుర్గాప్రసాద్

!~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.