‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -6

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -6

మొవ్వకవి’’ రాయ కావ్యం’’ లో ఆయా వంశాల చివరి దశలను అందంగా ఔచితీయుత౦గా వర్ణించారు .ఆనె గొంది రాజు వీరస్వర్గమలంకరిస్తాడు .అప్పుడు స్వర్గం లో అప్సర గణం ఆహ్వానించింది .తర్వాత కాకతీయ శకమూ ముగిసింది .ఆ పద్యం –

‘’కాల చరిత్రకున్ విలువగట్టి ,శతత్రయ చైత్ర మాధురీ  -బాల రసాల సాలపిక పంచమ స్వర గాన వాహినీ

జాల సుధార సోర్మి వివశత్వ మొనర్చిన కాకతీయ రా-ట్పాలన మంతరించినది పాప విధాత కృతాస్స్య రేఖలన్ .’’

ఇందులో విషాదధ్వని ఉంది .ఆనే గొంది రాజుల పాలన అంతమయినపుడు ఈ విషాదం లేదు .ఇక్కడ విషాదం ఎందుకూ అంటే –కాకతీయ సామ్రాజ్యపతనం కావటమే దక్షిణ దేశం తురుష్క క్రాంతం కావటం .భారతీయత నశించటానికి అదే చివరి ఘట్టం .వసంత ఋతు సౌ౦దర్యం  రసాలం ,పికస్వరం మొదలైన శోభాయమానమైన  వసంతర్తు సౌందర్యం

మాసిపోవటం దుఃఖ కారకం .ఇలా ఘట్టానికి  తగిన ఔచితిని పాటించి  వర్ణించటం కవి ప్రతిభకు నిదర్శనం .చివరి ఆశ్వాసం లో చెప్పిన ఒక వృద్ధురాలి కథ లో కృష్ణరాయలకు విషమిచ్చి చంపమమని నరసనాయకుని పెద్ద భార్య పురమాయిస్తుంది .అ ముసలి రోజూ రాయలకు తనచేత్తో పాలు ఇవ్వటం రివాజు .ఆ రోజు బయటి ప్రపంచం లో దుర్దినం అంటే ముసురు పట్టిన రోజు .ఆమె మనో వ్యధను వర్ణిస్తూ కవి చెప్పిన పద్యం గుండె లోతులను తాకుతుంది –

‘’అని ,లోలో వెత నందుచు –మనమున మదిలేక ,శవము మాదిరి గడుపున్

దినములు కనుగొను చుండగ-ఘనతరమైన దుర్దినంబు కదిసె కడంకన్’’

ఇక్కడ దుర్దశ శబ్దం సాభిప్రాయంగా ప్రయోగించాడు కవి .అది ఆమె మనసులోని  చింతా దుర్దినం అన్నారు తుమ్మపూడి .లోపలి జగత్తే ,మనస్సే బాహ్య జగత్తుగా పరిణమిస్తుందట.’’మతిలో ఎంతో గతిలోనూ అంతే ‘అని తేల్చి చెప్పారు ఆచార్య .

 నగర వర్ణలలో కవి చాలా సూక్ష్మా౦శాలూ దర్శించటం ఆశ్చర్యకర విషయం .ఇదే కవి విశాల పఠన పరిస్ధితికి చెందిన విషయం .పాఠకుడు  కూడా  భావుకుడు కాకపొతే ఆ విషయం గ్రహించలేక జారిపోతుంది .

 వరంగల్లును మహమ్మదీయులు వశం చేసుకున్నాక అక్కడ మసీదు కట్టించారు .దీనికి ఆధారం క్రీడాభిరామం అంటారు తుమ్మపూడి .యుద్ధవర్ణనలను వీర రౌద్ర  రసాత్మకంగా రచించి చరిత్రకు మెరుగులు దిద్దారు .అల్లాఉద్దీన్ ఖిల్జీ -హరిపాల దేవుని రాజ్యం ఆక్రమించినపుడు ఆనేగొందే ఘట్టం ,ద్వారకాసముద్ర ఆక్రమణ ఘట్టాలను భిన్నభిన్న రీతులలో కవి వర్ణించారు .అంటే మొనాటమి తప్పించారన్నమాట .యవనుల క్రూర కృత్యాలను కవి –

‘’అంతి పురంబు జొచ్చి ,తన యంగనలన్ వసివాడ బోని ,పూ –బంతుల గూతులన్ ,దనదు బాంధవ మొప్పిన రాజకా౦తలన్

గొంతులు కోసి చంపి ,మది ఘూర్ణిల వేదన వారి దేహముల్ –సుంతయు గానరాని విధి జొప్పడ జేసెను నగ్నికాహుతిన్ ‘’

స్త్రీలను దారుణంగా చంపిన చోట రౌద్రం కరుణరసం ద్వారా ద్ధ్వనితమఔతు౦ది .-‘’రౌద్రాత్తు కరుణోమతః ‘’అని నాట్య శాస్త్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆచార్యశ్రీ .

’’కలకల లాడు నంతిపురి కమ్రవసంతపు బూలతోటగన్ –జెలగును నింతదాక వికసించెడు పూవుల బల్లవంబులన్, –జలముల లిప్త లోననె శ్మశాన సమబుగ మాసిపోయె,న-గ్గలమగు కాల మాంత్రికుని గారడి కావె ధరిత్రి బంధముల్ ‘’అని నిట్టూర్చారు వేదనా ,వేదాంతం మిళితం చేస్తూ .ఇప్పటిదాకా పూలతోటలాగా అందాలొలికించిన అ౦తిపురి ఒక్కసారిగా నిజంగానే అన్త్యపురి అంటే శ్మశానం గా   మారిపోవటంతో  కరుణ రసానుభూతి కలుగుతుంది .శ్మశానం –పూలతోట రెండూ వ్యతిరేక సంవిదానాలద్వారా అంటే కాంట్రాస్ట్ ద్వారా పరస్పర ఘర్షణ పడటం కనిపించేవిషయం .

  ద్వార సముద్ర౦పై  యవ్వనసేన ఒక్కసారిగాతుఫానులాగా  విరుచుకు పడింది .

‘’ఘోర తుఫాను తాకిడికి గోంపలు, కోళ్ళును  గూళ్ళు బోయి ,దు –ర్వారత గాటి నేల వలె,బాడయి పోయెను ,ఊళ్లు కూళ్ళు ,క-

న్నీరును గూడ నింకి గరుణి౦చెడు నాథుడు లేక ,లేవగా-నేరక ఆస్థి పంజరపు నీడలుగా గ నిపించి రెల్లరున్’’.

  ఈ పద్యం రిఫరెన్స్ 1974 దివిసీమ ఉప్పెన స్పూర్తి కావచ్చు .’’మహనీయ దేవతా గృహ శిల్ప సౌందర్య –మఖిలంబు బాడయ్యె నడగు బట్టి ‘’అంటూ నాశనమైన సంపద స్వరూపాన్ని తెలియజేశారు కవి .’’దిక్కుమాలిన కాలంబు వెక్కి రింతగా  ఉన్నది ‘’అనే ఉపమ చాలా దయనీయ స్థితికి కట్టిన ఫోటో ఫ్రేం .

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-18-ఉయ్యూరు

‘’

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.