నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార

శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు  గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ,పులిచి౦తలప్రాజేక్ట్ స్పెషల్ ఆఫీసర్ . ఉద్యోగరీత్యా జిల్లా అధికారి అయినా  ప్రవ్రుత్తి  రీత్యా కవి, విమర్శకులు .సాహిత్యోపజీవి .1959 మే డేనాడు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం గన్నవరం లో శ్రీ హనుమంతరావు ,శ్రీమతి నాగరత్నమ్మదంపతులకు జన్మించారు .పూనూరులో సెకండరీ విద్య ,చిలకలూరి పేటలో ఉన్నత విద్యా నేర్చారు .ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ప్రైవేట్ గా ఎం .కాం .అందుకున్నారు . ఆంద్ర జ్యోతి దినపత్రిక లో ఉపసంపాదకులుగా చేరి ,గ్రూప్ 2 పరీక్ష పాసై ,ఎం .ఆర్. వో .అయి ,గుడివాడ ఆర్ డి వో గా పదోన్నతి పొంది ప్రస్తుతం పులిచి౦తలప్రాజేక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు .

శ్రీమతి విజయలక్ష్మి ని వివాహమాడి  శ్రీ వశిష్ట ,శ్రీ విశ్వనాథవిరించి లకు జన్మనిచ్చారు .

సోమేపల్లి స్వీయకవిత్వం -1 లోయలోమనిషి మినీ కవితాసంకలనం ,2-తొలకరి చినుకులు –నానీలు ౩-చల్లకవ్వం వచన కవితా సంకలనం 4-రెప్పల చప్పుడు –నానీలు 5-తదేక గీతం –వచన కవితా సంకలనం 6-పచ్చని వెన్నెల –నానీలు రాసి ప్రచురించి ఇప్పుడు 7 వ పుస్తకంగా ‘’మట్టి పొరల్లోంచి ‘’వచన కవితా సంపుటి వెలువరించారు .తమ పేరిట ‘’సోమేపల్లి కథా పురస్కారం ‘’ఏర్పరచి  ,ఆ కథలను 2012 ,20 17 లో  పుస్తకాల  రూపం గా తెచ్చారు .గుంటూరు జిల్లా రచయితల సంఘం ఏర్పరచి అవిరళ కృషితో దాన్ని వ్యాప్తి చేసి అందరి ఏకగ్రీవ అంగీకారం తో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులయ్యారు .అవిశ్రాంత కృషి ,పట్టుదల,  నిర్భీతి ,సరైన ఆలోచన,అవగాహన ,అంకితభావం   వీరి విజయాలకు కారణాలు .

‘’విశిష్ట నానీ ‘’ల కవిగా సోమేపల్లి గుర్తింపుపొందారు. సృజనలో ఆయనది ప్రత్యేక  గొంతు. .వాస్తవికత, స్వభావోక్తి ఆయన కవిత్వ లక్షణాలు .ఆర్తి ,భావుకత ,ఆవేశాలతో లోపలి ,బయటి లోకాలను కలిపే నేర్పు ఆయన ప్రత్యేకత .అచ్చమైన స్వచ్చమైన రైతుబిడ్డ కనుక ఆయనకవిత్వం మట్టిలోంచి అంటే గుండె లోతుల్లోంచి వెలువడుతుంది ‘’అని ‘’నానీల నాయన’’గోపీ కితాబిచ్చారు .ఈ సంపుటిని సాహితీ పోషకులు ,గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు కు అంకితమిచ్చి సాహితీ సౌజన్యం ప్రకటించారు .

కవికి ఉండాల్సిన అంతర్ దర్శనాన్ని గుర్తించి దాన్ని తన కవితలో పొదిగి ‘’నేను నిత్యం నాలోకి ప్రవ హిస్తుంటాను .నిశితంగా పరామర్శించుకుంటాను ‘’అంటూ మానవీయ పలకరింపులు –మనో పేటికలో –జ్ఞాప పకాల దొంతరలై –పరిమళిస్తుంటాయి ‘’ ‘’అన్నారు ‘’నాలో నేను ‘’లో .ఇది అందరికీ అబ్బాల్సిన ముఖ్య లక్షణం .శతాబ్దాల ప్రయాణం లో  శరీరపు  వన్నె తగ్గినా –మనో శ్వాస కొత్తచిగురై పల్ల విస్తూనే ఉంది –మనసెప్పుడూ మానవీయపు మల్లెల చెండే’’అని మనో  సౌందర్యాన్నీ  దాని స్వచ్చతను పరిమళాన్నీ ఆస్వాదించమని కోరారు .రైతు బిడ్డకనుక , రైతే దేశానికి వెన్నెముక కనకా ,వాళ్లకస్టసుఖాలు ఎరిగున్న అధికారీ అవటం వలన ‘’రైతు నిఘంటువు లో –అన్నీ ఉన్నాయి కానీ –పేగు నింపే –గిట్టుబాటు ధరతప్ప ‘’అని అనగలిగారు ‘’వెన్నెముక గోడు ‘’లో .ఇప్పటి కల్చర్ లో ‘’అక్షరాల ఆచూకీ గగన కుసుమమై –అచ్చం –అంకెలే మిగులుతాయేమో నని ‘’కించిత్ భయ్యా పడ్డారు ‘’అంకెలు ‘’లో .మాటల బేహారి –‘’అన్నదాతకీ –వాణిజ్య విహారికీ మధ్య –రాయ ‘’భార ‘’మౌతుంటాడు అంటూ, అతన్ని మోసే భారం తో రైతు క్రుంగి కృశించి పోతున్నాడని అర్ధవంతంగా చెప్పారు .’’వాడు అనుసందాత కాదు –అన్నదాత అడుగుల్ని –శాసించే విధాత మురిగ్గా చెప్పాలంటే రంకు మొగుడు ‘’అయ్యాడని బాధ పడ్డారు .

‘’సుడి గుండం ‘’చుట్టూ నిత్య బతుకు పోరు చేసే వలల మనుసులు సంద్రం లోకి  వేట కెడితే వాళ్ల బతుకు ఎగిసిపడే అలలకు – ఎదు రోడ్డే ఆశల వేట’’అవుతుందనీ ,’’పండుగోప్పా సందువా పడితే –‘’ఆ రోజు పండగే పండగని ,ఆశల వల విసిరి వాళ్ళు ఆశగా చూస్తుంటే ,వాళ్ళపై ఆధార పడ్డ –బుడతలు తీరం ‘’వెం’’ బడి’’ ఉప్పూ కారం తో సిద్ధమై అ౦గ లారుస్తుంటారు ‘’అని నాచురల్ సీన్ మనముందు ఆవిష్కరిస్తారు .వెం’’బడి ‘’మాటలో అదే వాళ్ల బడి ,గుడిఅని అన్యాపదేశంగా చెప్పారు .అలజీవులు కస్టాల సునామీ  తట్టుకు నిలబడుతారు,వృద్ధాప్యం వలలలో చిక్కుకున్నా .వాళ్ల జీవన నౌకమాత్రం చిక్కుల సుడి గుండం చుట్టూ పల్టీలు కొడుతూనే ఉంటుంది ‘’అని వాళ్ల జీవన భాష్యం చెప్పారు .పిల్లలను పసివాళ్ళు అంటాం .వాళ్ళు కవి గారికి ‘’పసిడి ప్రపంచం ‘’గా కనిపించారు .ఆ భావుకత అట్టిది .’’తనపల్లె ఇప్పుడు –వృద్ధ జనాశ్రయం ,నిస్తేజపు నిలయం ‘’గా ఆయనకు దర్శనమిచ్చింది .’’మూడుకాళ్ళతో అత్తపత్తి లా –అడుగులేస్తూ –జవం జీవం పోసే వాళ్ళకోసం –పొలిమేరల్లో –ఆబగా ఎదురు చూస్తూ –కళతప్పి జీవచ్చవంళా సోమ్మసిల్లింది’’ట .అయినా కవి గుండెల్లో చిన్నప్పటి పల్లె చిత్రం ఛిద్రం కాని చిత్రం గా   భద్రంగా నిక్షిప్తమై ఉంది . ‘’జిందగీ అంటే ఏం లేదు భాయ్ –కాష్ అండ్ కారీ –యూజ్ అండ్ త్రో ‘’అని తేలికైన ఈ నాటి నిజాన్ని మూడే మూడు ముక్కల్లో చెప్పిన కవి ‘.’’డాలర్ యవనిక ‘’లో ‘’హార్దిక దీపం –ఆరిపోతోందన్న భయం లేదు ‘’అని ఆవేదన చెంది  మనుషులబుర్రలో –అస్సలు ఖాళీ లేదు –నిండా ఆర్ధిక గణాంకాలే ‘’అని నిట్టూర్చారు నేటి విలువలుడిగిన మనుష్యులను చూసి .

‘ఋణం చిన్నదైనా పెద్దదైనా  ‘’మహావ్రణ మై ‘’బతుకు ను కాల్చి వేస్తుంది ‘’చిటికెడు ఋణం –చేటంత బతుకుని –చక్రవడ్డీ బంధం లో చిరిగేస్తుంది అంటూ ‘’సూక్ష్మ ఋణం రంగుల భ్రమ అనీ ,కసాయి కళ అనీ ,ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టకపోతే –మరణమే దాని వెల అని ’’’’దా’’రుణో’’పనిషత్’’ సెలవిచ్చారు వెంకట సుబ్బయ్యగారు .’’అవయవ దానం చేసే వారందరూ త్యాగానికి ప్రతీకలే ,చిరంజీవులే’’అని శ్లాఘించి సాల్యూట్ చేశారు .తనలో పొంగెడి రక్త కాసారం మాత్రమే కాదని ,స్వేదసముద్రం కూడా నని ‘’’’శ్రమ నా వారసత్వం-శ్రమ నా ఆదర్శం –శ్రమే జీవన సౌందర్యం ‘’అంటూ తన ‘’దృక్పధం ‘’ తెలియజేశారు. ‘’పాదు –నీడ’’కవిత లో మంచి కవిత్వం ప్రవహించి సశ్యశ్యామలం చేసిందని నాకనిపించింది-

‘’మట్టిదీ చెట్టుదీ-చెట్టుదీ చినుకుదీ –చినుకుదీ చేనుదీ  -చేనుదీ మనిషిదీ-గొప్ప హరితాను బంధం ‘’అన్నారు .ఎడం ఎడం గా నాటిన మొక్కలు కూడా ఏపుగా పెరిగి వృక్షాలై కొమ్మలై రెమ్మలై కౌగలించుకొంటాయి.’’మరి మనిషికే౦ రోగమొచ్చింది ఆప్యాయంగా మెలగలేక పోవటానికి?.చివరి పంక్తుల్లో కవితను చిరంజీవి చేసే మహా లక్షణం ఉంది చూడండి –‘’ఇంటికి బదులు –ఇంద్ర భవనమిచ్చినా –చెట్లపాదులే –మనల్ని చిరంజీవులను చేసేది ‘’అని వృక్షనీతి బోధించారు .గిజిగాళ్ళు ,పిచ్చుకలు ,బుల్లి పిట్ట కవి కి బుల్లి ఇంజనీర్లుగా కనిపించారు ఇప్పుడు  శబ్ద కాలుష్యానికి ,  సెల్ ఫోన్  టవర్లకు అవి జనారణ్యం లోకి రాలేక కనుమరుగయ్యాయి .వాటి గూడు నిర్మాణం మహాద్భుతం .వాటి’’ సవసవల’’ సవ్వడి ,కంకుల చుట్టూ మూగే రెక్కల ‘’రెపరెపలు ‘’వినిపించటం లేదని పిట్టలభాషలో  బాధ పడ్డారు కవి. ‘’రేడియేషన్ కిరణాలు –పిట్టల గుండెల్లో –తుపాకీ తూటాలైపేలుతున్నాయని’’మననవనాగరక నాగరకతను చేరిగిపారేశారు.

‘’ఉట్టి’’పై కవిత్వం రాసిన వారెవరూ నాకు కనిపించలేదు .ఆ పని ఈకవి చేశారు –‘’ఐదారు తాళ్ళతో కుండ బరువును మోసే ఉట్టి ‘’ఆయనకు ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది .గొప్పమాట .మనిషికి అందకుండా వేలాడే ఉట్టి-ప్రేమాభిమానాలకు ఎప్పుడూ ప్రతీకే ‘’అనటం బాగుంది .ఇప్పటి మనిషి –‘’వావి వరసలు మరచిన –సంచార మృగం ‘’.దాని పంజా దెబ్బకు బలై పోతున్న జనం ను చూసి ఒక సూచన చేశారు –‘’మనిషిని వెతకాలి –బయట కాదు –మనిషిలోనే వెతకాలి ‘’.ఉప్పు మడులు చేసేవారి బతుకూ దీనమై ‘’నీటి ఉప్పుదనం పై –చెమట చేవ్రాలు చేసి -కొఠారుల్లో –కొలువు దీరుతుంది ‘’అని ఆ ఉప్పు అందరకూ రుచినిస్తే వారికి మాత్రం ‘’చప్పిడి బతుకు ‘’నిచ్చిందని వాపోయారు కవి .ఇక్కడా దళారీల దాస్టీకమే  రాజ్యమేలు తోంది .’’ఉప్పు మడికి-బతుకు బడికి –దళారులే –అనుసంధానం  ‘’అయి  వాళ్ల బతుకులు ఉప్పులేని చప్పిడి బతుకులయ్యాయన్నారు .’’గుండె తడి ‘’తో నేటి కాన్వెంట్ పిల్లల జీవితం వర్ణించారు –‘’ఆటా పాటా కంప్యూటర్ తోనే- టకటకలాడిస్తూ బూట్లూ –ఖరీదైన యూనిఫాం –కళ్ళకి ఓ జోడూ ప్రత్యక్షం ‘’బహుశా ముందు తరాలలో పసిపిల్లలు  కళ్ళ జోడుతోనే పుడతారేమో ?అందుకే ‘’ఈచదువులకు హృదయపు తడి కావాలి –ఈ ఆరాటానికి –వినయమూ విధేయతా –జతకలవాలి ‘’అని మానవీయ కోణం లో చెప్పారు .దేనిలోనైనా శిఖరారోహణం  చేసిన వ్యక్తి అక్కడ ‘’మానవత్వపు పతాక ప్రతిష్టించి –జేగ౦టలు మోగించాలి ‘’అని ఆశిస్తున్నారు .ఇప్పుడు మానవాళి జపించాల్సినమంత్రం ‘’జలం జలం జలం’’అంటారు దాని అవసరం స్వచ్చతా దృష్టిలో పెట్టుకొని. అందుకే ‘’జలో రక్షతి  రక్షితః ‘’అంటూ మరో గీతం లోనూ నినదించారు .ఉపేక్షిస్తే ఇక ‘’ఆక్సిజన్ బాటిల్స్’’ కూడా కొనాల్సి వస్తుంది ‘’అని ముందు హెచ్చరిక జారీ చేశారు కవి .’’నాన్నగారి ‘’లింకుల కర్ర ‘’కు దణ్ణం పెట్టారు కవితలో .అది చేతిలో ఉంటె తనతండ్రి దండధారీ ,న్యాయమూర్తి గా భాసి౦చేవారట .’’ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా –ఊరు గుండెలో పచ్చనిజ్ఞాపకం –రామయ్య పంతులు గుడి’’ఆ సరస్వతీ నిలయానికీ ,అక్కడి సరస్వతీ స్వరూపమైన రామయ్య మాష్టారు గారికీ మొక్కిడి-‘’ఆబడి చరిత్ర –నిరంతర చైతన్య దృశ్యకావ్యం ‘’గా అభి వర్ణించారు శిష్యుడు వెంకటసుబ్బయ్యగారు .ఇప్పటిపల్లె ఆయనకు –‘’శోభ కోల్పోయిన పడుచు –బతుకు పరిమళాలు లుప్తమైపోతున్న అడుసు ‘’గా కనిపించింది .వెదురు తో వేయి రకాల పరికరాలు చేసేవారు ఆనాడు .విసనకర్ర, బుట్ట, చేట జల్లెడ నిచ్చెన వంటి అల్లికలతో జీవితాలు శోభిల్లాయి అప్పుడుశ్రమజీవన సౌన్దర్యాలై .ప్రపంచమంతా మాట్లాడేది ‘’ద్రవ్య భాష ‘’మాత్రమె నని ఆవేదన చెందారుకవి ప్రపంచమార్కేట్ లోమనిషి అమ్మకపు  సరుకు అయిపోయాడని వ్యధ చెందారు .’’జీవితం ఒక సుదీర్ఘ కావ్యం ‘’అన్నారు సోమేపల్లి .జీవితానికి విశ్రాంతి వద్దు విరామమే ముద్దు ‘’అని 25 వ చివరి కవితతో  సంకలనానికి  స్వస్తిపలికారు వెంకటసుబ్బయ్యగారు .

ప్రతి కవితలో ఆలోచనా ,ఆవేదనా, కృతజ్ఞత ,భక్తీ,సామాజికస్పూర్తి ,వివేచనా ,తెలుగుభాషపై అభిమానం ప్రస్పుటంగా కనిపించి మనలో చైతన్యం కలిగిస్తాయి అందరూ చదివి ఆనందించాల్సిన కవితా సంకలనం సోమేపల్లివారి ‘’మట్టి పొరల్లోంచి –‘’ .

భూమి పొరలు చీల్చుకొని పైకి వచ్చి ,రెమ్మా ఆకులతో ప్రకృతికే సౌందర్యం అద్ది , లోపలి కవితలకు అర్ధవంతమైన భావనగా తీర్చి దిద్దబడిన ముఖ చిత్రం ఈ కవితా సంకలనానికే మకుటాయమానంగా ఉండటం మరో ప్రత్యేకత .

మనవి –శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు పంపిన ఈ సంకలనం ఈ ఉదయమే నాకు చేరింది .వెంటనే చదివేశాను .కాదు కాదు చదివించింది .అందుకే ఈ స్పందన .

మీ- దుర్గాప్రసాద్ -11-7-18 –ఉయ్యూరు

 

 

 

‘’

 

 

 

 

 

 

 

  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.