డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1
ఆంజనేయ విజయం అనే కసాపుర క్షేత్రమాహాత్మ్యం కావ్యాన్ని డా శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు రచించారు .దీనికి ఆశీర్వాద శ్రీముఖం అందజేశారు వారి గురువర్యులు ,కుర్తాళం సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములవారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ).స్వామి హనుమయే సాక్షాత్తూ తమకు ఈ కథను అనుగ్రహించారని కవి వాక్కు .తన అనుభవమూ ఇదేనని గురువుగారి తీర్పు . ఈ కథ రామాయణం తో సంవది౦చబడి ఉండటం ఆశ్చర్యకరం అన్నారు మొవ్వ వారు .లోనికి వెడితే అభూతకల్పనగా ,మూఢ విశ్వాసంగా తోచవచ్చునని కాని ఇది నూటికి నూరు శాతం సత్యం సత్యం అని వక్కాణించారు కవి .21 ఖండాలతో 22 వది అయిన కసాపురాజనేయ శతకం తో ఈ కావ్యం వర్ధిల్లింది .ప్రతిఖండం లో వచనం లో ముందు కథ చెప్పి ,తర్వాత దాన్ని కవిత్వీకరించటం విశేషం .చరిత్రే కావాలనుకున్నవారు ఆభాగాలను చదివి కవిత్వం జోలికి వెళ్లనక్కరలేదు .కవిత్వపు హాయి అనుభవి౦చాలనుకున్నవారికి చేతినిండా అమృతోపమాన మైన కవిత్వ విందే .శ్రీ కాకర్ల నాగేశ్వరయ్యగారు గారు మన బ్లాకు ను చదువుతూ ఉంటారు .వారు నిన్న కసాపుర ఆంజనేయ విశేషాలు వ్రాయమని కోరారు .’’దర్శనీయ ఆంజనేయ క్షేత్రాలు ‘’లో ఈ క్షేత్ర విశేషాలు ఇదివరకెప్పుడో రాసేశాను .ఇప్పుడు మొవ్వవారి కావ్య కధను సంక్షేపంగా ఖండాలవారీగా ఖండ శర్కర లా అందించే ప్రయత్నం చేస్తాను .
మనకు తెలిసిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి చరిత్ర
నెట్టి కంటి ఆంజనేయ స్వామిగా కసాపురం ఆంజనేయస్వామి ప్రసిద్ధులు .నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్ను కలవాడు .విజయనగర సామ్రాజ్యం లో కృష్ణ దేవరాయల గురువువ్యాసరాయలవారు 1521 లో హంపీ దగ్గర తుంగభద్రా నదిలో లో స్నానం చేసి ,తాను వొంటికి పూసుకునే గంధం తో తనకు ఎదురుగా ఉన్న శిలమీద శ్రీఆంజనేయ స్వామి రూపం చిత్రించారు .అది నిజరూపం ధరించి నడవటం ప్రారంభించింది .ఇలా అయిదారు సార్లు ఆయన చిత్రం గీయటం అది నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది .చివరికి వ్యాసరాయలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామాల బీజాక్షరాల తో ఒక యంత్రం తయారు చేసి ,దానిలో స్వామి వారి నిజ రూపం చిత్రించారు .కదలలేదు .ఆ రోజు రాత్రి స్వామికలలో కన్పించి చిత్రాలు గీయటమే కాదు తనకొక ఆలయం నిర్మించమని శ్రీ నెట్టికంటి ఆ౦జ నేయస్వామి కోరారు .వ్యాసరాయలవారు ఆ ప్రాంతం లోనే అందరి సహాయ సహకారాలతో 732 ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేశారు .ఇదొక రికార్డ్ . .
ఒకసారి వారు’’ చిప్పగిరి ‘’అనే చోట శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం లో నిద్రిస్తుండగా స్వామి కలలో కన్పించి తాను అతి చిన్నరూపం లో భూమిలో ఉన్నానని బయటికి తీసి ,ఆగమోక్తంగా ప్రతిస్టించమని కోరారు .తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవటం ఎలా అని ప్రశ్నిస్తే ,ఎండిన వేప చెట్టు దగ్గరకు వెడితే అది చిగురించిన చోట తానున్నాను అని చెప్పారట .మర్నాడు శిష్యగణం తో వెతుకులాట ప్రారంభించి ఒక ఎండిన వేప చెట్టు దగ్గరకు చేరగానే అది చివురించింది .అక్కడ భూమిలో త్రవ్వి చూస్తే ఒంటికంటి ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది .దాన్ని బయటికి తీసి ఆగమ విధానంగా ప్రతిష్టించి దేవాలయం కట్టించారు వ్యాసరాయలు. ఈ ఆలయం కసాపురం అనే గ్రామానికి దగ్గరగా ఉండటం తో కసాపురం ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు .నెట్టి కల్లులో ఆవిర్భవించాడు కనుక నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తితో పిలుచుకొంటారు .ఒంటి కంటి తోనే భక్తులకు అనంత సుఖ సంతోషాలను ప్రసాదించే స్వామి .విగ్రహం తూర్పు ముఖంగా ,దక్షిణం వైపు చూస్తూ భక్తుల మొరలాలించేట్లుగా ఉండటం విశేషం .
కసాపురం అనంతపురం జిల్లా గుంతకల్లు కు అయిదు కిలోమీటర్ల దూరం లో, గుత్తి కి 35 కిలో మీటర్లలోనూ ఉంది .ఒక చర్మకారుడు ప్రతి ఏడాదీ ఒక ఏడాది పాటు ఏక భుక్తం ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ ,శ్రీ స్వామివారికి ఒక చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు .మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు ,చిరిగి పోయినట్లు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది .స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రి వేళ విహారం చేస్తారని భక్తుల గాఢ విశ్వాసం. ప్రతి వైశాఖ ,శ్రావణ ,కార్తీక ,మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు సందర్శించి తరిస్తారు .చైత్ర పౌర్ణమినాడు హనుమజ్జయంతి వైభవంగా జరుపుతారు .ఒంటికన్ను హనుమ సకల వర ప్రదాయి .భక్తుల పాలిటి కొంగుబంగారం కసాపుర ఆంజనేయ స్వామి .
రేపటి నుంచి వృషాద్రి పతిగారు రచించిన కసాపుర క్షేత్ర మాహాత్మ్యం లోని విశేషాలను గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-18 –ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797