డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7
తురక రాజులాక్రమించిన ప్రాంతాలలో వారి పైశాచిక పాలన ,చేసిన పాపాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు మొవ్వ వృషాద్రిపతి కవి గారు –
‘’పరమ పతివ్రతా తరుణీ మణీశీల –మహిమ తత్కామాగ్ని మాడిపోయె
మార్కొని నిలచిన మగవారి తలలెల్ల-గ్రామ శృంగార తోరణములయ్యె
మాతృమూర్తులకెల్ల మాఱట యగు నాల –పలలంబు రుచి యయ్యె బాలకంటె
శాస్త్ర సిద్ధాంత చర్చా గోష్టి శాలలు –కైతవ కేళి రంగమ్ములయ్యె
జుట్టుపై బన్ను ,కట్టిన బట్ట పన్ను –బొట్టుపై బన్ను ,మెడ తాళి బొట్టు పన్ను
కట్టకు౦డినచో దలకట్టు పన్ను –కనబడని జుట్టు పన్నును కట్టుటయ్యె’’.
దేశం ఆ పాలన లో యెంత అలమటిం చిందో పై పద్యమే సాక్ష్యం .గుండెలు అవసి పోఏ దీన స్థితి అంటారు ఆచార్య తుమ్మపూడి .ఇక్కడే మన రాష్ట్రము లో 1945 – 47 కాలం లో రజాకార్ల దౌస్ట్యమూ ఇలాగే ఉంది అనీ ,తమతాతగారు ఖమ్మం జిల్లా’’ గార్ల’’ లో సంపాదించుకొన్న ఆస్తి పాస్తులన్నీ ఉన్నపళాన వదిలేసి వచ్చి గుంటూరు జిల్లా ‘’ఈమని ‘’గ్రామం లోతలదాచుకున్నారని గుర్తు చేసుకొన్నారు .’’ఎట స్త్రీ నయనంబుల చిందు బాష్పముల్ ‘’అన్న నానుడి ఆనాటికే ఎంతగా ఆదర్శ౦ గా ఉందో చెప్పారు.
బుక్క రాయల కాలం లో విజయనగర పాలనం ,విరూపాక్ష దేవుని పాద పద్మోపజీవి గా ,ప్రతినిధిగా సాగింది .అప్పుడు –
‘’ప్రతి పౌరుండును రాజ్య రక్షనమునన్ భాగస్ధుడై ,స్వీయ బా –ధ్యతగా బూనుడు,ఎవ్వడో మనల గాపాడంగ రాబోవడ
ర్హత ,శక్తిన్ మనమే సదా మనల రక్షించు కోనెంచి యు –ద్యతమై పోరిన ,సంశయింపక విరూపాక్షుండు తోడయ్యె డున్’’
ప్రతి పౌరుడు రాజ్య రక్షణలో భాగస్వామి అనటం ఈ నాటి వివేకానంద సూక్తి,సందేశాలను జ్ఞప్తికి తెస్తుంది అన్నారు ఆచార్యశ్రీ .
కృష్ణ దేవరాయల రాజనీతిలో ‘’ప్రజలు శరీరం ,రాజు ఆత్మ.ఈ రెండూ అన్యోన్య ఆశ్రితాలు .’’రాజుకు సంతానం ప్రజలు .రాజ్యం అతని గృహం .ఇది ఉత్కృష్ట ఆచరణీయ ధర్మ సూత్రం .
రాయలు తన కావ్యం లో తురుష్కులు మరణించి స్వర్గానికి పోయి ,అక్కడ కూడా చేసిన దుష్క్రుత్యాలు వర్ణించాడు .ఈకవీ అలానే రాశాడు .రాయలు రాజనీతిగా ‘’పరరాజుల స్త్రీలను పుట్టింటి రూఢి నెరపుము’’అన్నాడు .ఇక్కడ కూడా కొడుక్కి రాజు అలానే బోధించాడు . ఇది రాజధర్మం. నీతి కూడా కాదన్నారు తుమ్మపూడి .రాజ ధర్మాన్ని ప్రకృస్టంగా ఆచరించిన వాడు ధర్మరాజు .దీన్ని తిరగేస్తే వచ్చేదే రాజ ధర్మం అని గొప్ప వివరణ ఇచ్చారు .
హరిహర రాయలు రాజయ్యాక అతని ధర్మ శాసనం ప్రవచించిన పది పద్యాలు అతని రాజ్య పాలనా విధానానికి దర్పణంగా నిలిచాయి .ఇది చరిత్ర కావ్యం .శృంగారానికి చోటు ఉండదు .కాని ఈ కవి చోటు కల్పించి ఉత్తమ సంతాన లబ్ధికి ఉత్తమ దాంపత్యం అవసరమని చెప్పాడు .సోరోకిన్ అనే సామాజిక విజ్ఞాన శాస్త్ర వేత్త ‘’ఇప్పుడు ఉత్తమ దాంపత్యం లోపించింది ,అందుకే అనుత్తమ సంతానం వలన విప్లవకారులు వస్తున్నారు ‘’అన్న విషయం జ్ఞాపకం చేశారు విమర్శకులు .
కృష్ణ రాయల జన్మ సందర్భంగా తండ్రి తన ముగ్గురు భార్యల వర్ణన చేశాడు .వారు దశరధుని భార్యలతో సమానం అన్నట్లు ఉంటుంది .కౌసల్యా సుప్రజా రామా లాగా నాగలాంబ కు కృష్ణ రాయలు జన్మించాడని భావం .నాగలాంబ వర్ణన ఆదికవి కౌసల్య వర్ణన పోలి ఉండటం విశేషం .కేవలం స్త్రీ వర్ణన కాదు .నాయకుడు నరసనాయకుడు –
‘’బాలే౦దూదయరేఖ వోలె ,మృదు లావణ్యంబు ధారాంబు ము –జ్మామాలా కైశ్యము ,పద్మ గంథిల వపుః సౌందర్యమున్ ,నేత్రయుక్
హేలా లోలవిలాస విభ్రమ కళా హేవాక సంపత్తి ,సు –శ్రీలం గ్రాలెడు నాగమాంబ ,నులసత్సీ మంతినీ రత్నమున్ ‘’
ఆమె ‘’రాజాన్తఃపుర హర్మ్య దీపకళికారాజిన్ ‘’వెలిగించేదట .అంతఃపురం లో దీపకళికా రాజి వెలుగుతుంటే ,రాకా చంద్రుడు వెన్నెల ఆరబోస్తుంటే నరసనాయకుల ,నాగమాంబ ల సంయోగం జరిగిందట .ఇది శృంగార ఘట్టమే అయినా కవి సూచనమాత్రంగా వర్ణించిన రేఖా చిత్రం గా చూపించటం విశేషం అంటారు ఆచార్య శ్రీ .సంగమ విషయాన్ని వర్ణిస్తూ కవి ‘మణితధ్వనుల్ పొలిచె నస్పస్టంపు రమ్యంబులై ‘’అని వ్యంజనం చేసి వర్ణించటం సొగసైన తీరు .అంటారు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-18 –ఉయ్యూరు
—