డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -8(చివరి భాగం)
‘’అక్షర సరస్వతిని కళామూర్తి ,రసస్వరూపిణిగా అవతరింపజేసిన ఆలంకారిక చక్రవర్తులు ఆనంద వర్ధనుడు , అభినవగుప్తుడు కుంతలాచార్యుడు మొదలైనవారు.ఈ ఆలంకారిక సరస్వతి అభినయాత్మిక .అందుకే కుంతలుడు ఆమెను ‘’లాస్య మందిర నర్తకి గా ,,సూక్తి పరిస్పంద గా సుందరాభినయోజ్వల ‘’గా అభి వర్ణించాడు .కావ్యం ప్రత్యక్షంగా అనుభవించేది కనుక వార్తమానిక సత్యం లేకపోతే తన్మయీ భావం ఉండదు .కనుక కావ్య శబ్దమే అభినయాత్మకం .అదే వక్త్రోక్తి .అదే సూక్తి .అదే స్పందనం .కాశ్మీర శివాద్వైతం లో స్పందం శివుని శక్తిగా చెప్పింది .ఆమె చతుర్విధ వాక్య స్వరూపిణి .చతుర్విధ అభినయ మూర్తి .కావ్య శబ్దం అంటే అదే ‘’అంటారు మహా వ్యాఖ్యాత డా.శ్రీ తుమ్మపూడి కోటేశ్వర రావు గారు కావ్య విమర్శ చేస్తూ .’’కావ్యం లో వర్ణ నాదులు – శబ్దం ,అలంకారం ,ఛందస్సు .సన్ని వేశాల వలన అభినయాత్మకం అవుతోంది .భూతం లోని కథ వర్తమానమై ప్రత్యక్షమౌతోంది .ప్రతి +అక్షం =ప్రత్యక్షం –అంటే కనులకు ఎదురుగా నర్తిస్తోంది అని అర్ధం .ఆనాట్యత ను వక్రత,ద్వని మొదలైన విగా వ్యాఖ్యానించారు .ధ్వనితార్ధం పాఠకునిమనసు లోనిది .వాచ్యార్ధం లోకం .లోకాను కృతి యైన కావ్యం వర్ణనాదుల ద్వారా ధ్వనిత రమణీయం కాకపొతే సుందర అభినయోజ్వల కాదు .ఈ దృష్టి తోనే మొవ్వవారి రాయ విజయ ప్రబంధకావ్యాన్ని విశ్లేషణ చేసుకోవాలి ‘’అనీ అన్నారు .
కావ్యం వర్ణనాత్మకం.వర్ణనం అంటే లౌకిక వస్తువునకు శబ్దాదులు అనే రంగులద్వారా ,రేఖలద్వారా చిత్రించటం ఈ వర్ణన మే ,రంగు రేఖలే లోకం నుంచి కళను వేరు చేసే సామగ్రి అంటారు తుమ్మపూడి .ఈ కావ్యం లో కథ వెయ్యేళ్ళ భారత దేశ చరిత్ర .గజనీ నుండి క్కృష్ణరాయలవరకు వ్యాపించిన కథా వస్తువు .మధునాపంతుల వారి ‘’ఆంద్ర పురాణం’’తర్వాత ఇంతటి బృహత్కథా కావ్యం రాలేదు .రాయలపై చాలాకావ్యాలు వచ్చినా ,అవి ఆయన చరిత్రకే పరిమితం .కాని ఇది ఆ వెయ్యేళ్ళలో భారత దేశం ,సంఘం ,రాజ్యాలు ,రాజులు –వారి స్థితిగతులు –పాలన అన్నిటిని గర్భీకరించుకోన్నకావ్యం అన్నారు ఆచార్యశ్రీ .మొదటి ఆశ్వాసం లో 50 వ పద్యం నుంచి దేశ భౌగోళిక పరిచయం ఉంది .ఆనె గొందే రాజుల పాలన క్రీ.శ.1150 గా చెప్పటం వలన చదువరిలో దేశ ,కాల మర్యాదల అవగాహన కలిగించారు కవి. ఆ నాటి వాతావరణం అర్ధం చేసుకుంటాడు .నగర వర్ణ లలో సాంఘిక స్థితి బాగా వర్ణించారు .కావ్య ప్రారంభ ,అంతాలు ,ఆశ్వాసా౦తాలు కావ్య శిల్పానికి పార్శ్వాలు .ఇవి చక్కగా కథ నొక్కబడి ఉండాలి .మాళవికాగ్ని మిత్రం లో కాళిదాస మహాకవి నాయిక వర్ణన అందమైన శ్లోకం లో చేస్తూ ఆమె నడుము ప్రక్క అందాలను చెబుతూ ‘’పార్శ్వే ప్రమృస్టే యివ’’అన్నాడు .మహా శిల్పి శిల్పానికి అంటే సుర సుందరీ మణుల పార్శ్వాలు మలచటం చూస్తే కాళిదాసు మాటలు జ్ఞాపకమొస్తాయి .కనుక కధ ను పార్శ్వములు ప్రారంభ అంతాలు గా మలచుకో గలిగితే కథన విద్య తెలిసినట్లే ‘’అని తీర్పు ఇచ్చారు .
కావ్యం లో వృక్ష గాభీర్యం ,లతా మార్దవం ఉండాలి .స్త్రీ ,పురుషులలో వారి సహజ లక్షణాలు ఉంటాయి .కాని పురుషకారం లో స్త్రీత్వం గర్భితంగా ఉంటాయి .అంటే ప్రతి వ్యక్తీ అర్ధ నారీశ్వరుడే . ఆధునిక స్త్రీత్వ మనో విజ్ఞాన వేత్తలు దీనినే‘’ANUMA-ANIMUS’’అంటారు ఇందులో స్త్రీత్వం హృదయ సంకేతం .పురుషత్వం మనస్సంకేతం .ఇది అనుభవ స్థానం .ఇది ఆలోచనా కేంద్రం .దీనికే ఆలంకారికులు పురుష శైలి గా ,స్త్రీ మాధుర్యాన్ని సుకుమార శైలిగా చెప్పారు .పాశ్చాత్యులు -మాస్కులైన్ ,ఫెమినైన్ గా గుర్తించారు . ఇవే క్లాసికల్ లిటరరీ స్టైల్స్ అన్నారు ఆచార్యపాదులు .ఈ రెండు అంశాలూ ఉంటటే మహాకావ్యమే అన్నారు .పైన చెప్పిన పార్శ్వ ప్రమృస్టత కావ్యానికి స్త్రీత్వశోభ ను ఆపాదిస్తుంది(లిరిసిజం ) .అదే కనుక లేకపోతే మహాకావ్యాలు పఠన యోగ్యం కావు అని నిష్కర్షగా చెప్పారు .ఈ మహాకావ్యం లో ఎక్కడ చూసినా ఏదో ఒక సొగసు దర్శనమిస్తుంది .అది శాబ్దికం కావచ్చు ,అర్ధ సౌందర్యం కావచ్చు .అంటే శాబ్దికమో ఆర్ధికమో కావచ్చు .
మనపూర్వ మహాకవుల కావ్యాలు మనకు ఆయుస్సు ,ఆరోగ్యం ఇచ్చేవే అని మన నమ్మకం .నన్నయగారు ‘’ఆయురర్ధులకు దీర్ఘాయుర వాప్తి యుడువ ‘’అని ఊరికే అనలేదు .సరస్వతీ ఉపాసకులకు తెలుసు దీని సత్యం .పద్యకవులు అందునా మహా కావ్యకవులు అరుదౌతున్న ఈకాలం లో ఇంతటి బృహత్తర కావ్యం వ్రాసిన సాహితీ వాచస్పతి ,ఉపన్యాస చతురానన ‘’డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు ధన్యులు అన్నారు కోటేశ్వరార్య .’’ఈకావ్యం ఒక వైష్ణవ ధనుస్సు .వినగలిగితే దాని సి౦జాన ధ్వనుల్లో ప్రణవనాదమైన ఓంకారం వినిపిస్తుంది .అది ధర్మ ప్రబోధ ,దేశభక్తి ప్రబోధకంగా జగద్రక్షణ కారకం . ఈ కావ్యం ఆపని చేస్తుంది .కవి సూక్తులు అవధరించిన పాఠకులూ ధన్యులే ‘’అని ఈ కావ్యానికి రాసిన సమీక్షకు స్వస్తి పలికారు ఆచార్య డా శ్రీ తుమ్మపూడి కోటేశ్వరావు గారు .
సమాప్తం
ఆధారం –సాహితీ వాచస్పతి ,ఉపన్యాస చతురానన డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు రచించిన ’’శ్రీ కృష్ణ దేవ రాయవిజయ ప్రబంధం ‘’లో ఆచార్య శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు గారు రాసిన సాధికార సమీక్ష .
మనవి –నేనేదో ఈ ప్రబంధం లోని విషయాలను మీకు తెలియబరచాలని ఉవ్విళ్ళూరి మొదలు పెట్టాను .కానీ తుమ్మపూడి వారి సమీక్ష రెండు మూడు సార్లు చదివి మనసుకు పట్టించుకున్నాక ,ఇక నేను రాయవలసి౦దేమీ లేదని, అంతా విస్పష్టంగా వారే ప్రవచి౦చా రని అవగతమైంది .అందుకే వారి మాటలూ ,వాక్యాలే దాదాపు యధా తధంగా ,అంటే డు, ము,వు,లు చేర్చి తెలుగు మాటలు తయారు చేసినట్లు ఇందులో రాశాను . నాకు తెలియని ఎన్నో విషయాలు వారి సమీక్ష వలన తెలుసుకున్నాను . మీకూ వాటిని అందించాలనే ఆరాటమే ఈ రచన. మన్నించగలరు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-18 –ఉయ్యూరు
—