డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-7

7-విజయఖండం

హనుమ కస్వాదిమునులకు రామాయణ  వృత్తాంతం  చెబుతూ ‘’కాలనేమి నా రాక కోసం ద్రోణ పర్వతాశ్రమం లో ఎదురు చూస్తున్నాడు .మహర్షికదా దర్శించి పోదాం అనుకోని ఎదుట నిలచి నమస్కారభంగిమలో చాలా సేపు ఉన్నా .ఆతడు కనులు తెరవలేదు .చివరికి ధ్యాన సమాధినుండి లేచి నన్ను చూసి ,చనిపోయిన వాళ్ళను బ్రతికించే మంత్రం నా దగ్గర ఉంది .ఈ ఉద్యానం లో విహరిస్తూ హాయిగా ఫలాలను ఆరగించు ‘’అన్నాడు .అప్పుడు నేను ‘’లక్ష్మణస్వామి ప్రాణాలు అపాయం లో ఉన్నాయి ఇక్కడ విహరిస్తూ కూర్చోలేను .కానీ దాహంగా ఉంది .సరోవరం దారి చూపిస్తే దప్పిక తీర్చుకుంటా ‘’అన్నాను .నేను బోల్తాపడ్డానని నమ్మి ,కపటపు నవ్వుతో ‘’నా కమండలం లో  అమృతజలం ఉంది తాగు ‘’అన్నాడు .’’నా దాహానికి ఈ నీళ్ళు చాలవు ‘’అన్నాను .అతడు ‘’ఇది అక్షయ కమండలం .ఎంతకావాలంటే అంత నీరు వస్తుంది ‘’అన్నాడు .నేను కమండలం నీరు పవిత్రమైనది దాన్ని ఎంగిలి చేయటం భావ్యం కాదు .కొలను చూపించండి ‘’అన్నాను .దొంగముని సంతోషం తో ‘’దగ్గరలోనే దుగ్దాబ్ది అనే సరోవరం  ఉంది. ఒకప్పుడొక మహర్షి దీన్ని సృష్టించి దానిలోనే నిలబడి తపస్సు చేస్తుంటే జలజంతువులు అల్లకల్లోలం చేసి ధ్యానభంగం చేస్తుంటే ‘’మానవులు రెండుకళ్ళూ మూసుకుని చేతులు కట్టుకొని ,జంతువుల్లాగా   మౌనంగా నీళ్ళు తాగాలి ‘’అని శాసించాడు .అని నాకు చెప్పి ఒక శిష్యుడిని నా వెంట పంపాడు .నేను ఆ సరోవరం లో కళ్ళు మూసుకొని ,చేతులు వక్షస్తలానికి  ఆనించి ,జంతువులాగావంగి నీళ్ళు తాగుతుంటే ,అకస్మాత్తుగా ఒకమొసలి నా కాళ్ళు గట్టిగా పట్టేసింది .కళ్ళు తెరచి తోకతో చాచి కొట్టాను .అది వెనకడుగు వేయక మరింత గట్టిగా పట్టుకొన్నది .నా శరీరాన్ని మేరు పర్వతంలాగా పెంచి  గోళ్ళతో దాన్ని చీల్చే ప్రయత్నం చేశా .అవి దాని శరీరం లోకి చొచ్చుకు పోనేలేదు .క్రమంగా దాని బలం పెరుగుతోంది . వెంటనే రామ లక్ష్మణులను స్మరించి నమస్కరించా .శరీరాన్ని అంగుస్ట మాత్రంగా ఒక్కసారి తగ్గించేసి దాని నోట్లోంచి కడుపులో దూరి ,అక్కడ శరీరాన్ని పెంచి గోళ్ళతో నరాలు తెంచి ,ఉండగా చుట్టి దాని గొంతు లో నొక్కేశా .ఊపిరాడక రక్తం కట్టుకొని చచ్చింది .దాని దేహం నుంచి మేఘమండలం లోంచి వచ్చే బాలభాస్కరునిలాగా నేను బయటికి వచ్చాను .

‘’ఒక గండం గడచి౦ది కదా అనుకొంటే ,వెంటనే అక్కడే మెరుపుతీగలాంటి అందమైన అమ్మాయి ప్రత్యక్షమై నాకు నమస్కరించి’’మహానుభావా ! నీ ఋణం  తీర్చుకోలేనిది .నేనొక అప్సరసను .ఒక ముని ఇచ్చిన శాపానికి నక్రం గా మారాను .నీవలన శాప విమోచనం జరిగింది .నిన్ను పంపినవాడు మునికాదు.నీకు ఆటంకం కలిగించాలని రావణుడు పంపిన కాలనేమి రాక్షసుడు .వీడిని చంపి ద్రోణాద్రికి వెళ్లి అనుకున్నది సాధించు ‘’అన్నది .ఆశ్చరాభరితుడనైన నేను ఆమె ను మొసలి రూపం ఎందుకు వచ్చిందని అడిగాను .ఆమె ‘’నా పేరు దాన్యమాలి. అప్సరసను .ఒకసారి మునీంద్రులు కొందరు నా నాట్యప్రదర్శన చూడాలని అనుకోని బ్రహ్మ సభలో నేను నాట్యం చేస్తుంటే వాళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తూ బాగా ఆనందించారు .అక్కడే ఉన్న భరతముని కూడా నన్ను మెచ్చుకున్నాడు .బ్రహ్మ కూడా ఎంతో సంతోషించి ఒక దివ్య విమానం సృష్టించి నాకు బహుమతిగా ఇచ్చాడు .దానిలో లోకాలన్నీ తిరిగాను .ఒకసారి మనోజ్ఞమైన ఈ సరోవరాన్ని చూసి స్నానించి అప్పటి నుండి వీలైనప్పుడల్లా వచ్చి స్నానం చేసేదాన్ని .

ఒకసారి అలాగే వచ్చి జలకాలాటలు ఆడుతుంటే ఒకమహర్షి రాగా భక్తితో నమస్కరించా .ఆయన తాను శాండిల్యమహర్షి నని ,ఇక్కడే పది వేల ఏళ్ళు  తీవ్ర తపస్సు చేశానని ,తపస్సులో ఉన్నప్పుడు ఆయనకు నారూపం కనిపించిందని ,అప్పటినుంచి నాపై కోర్కె పెంచుకోన్నానని ,తన కోర్కె తీర్చాల్సిందే నంటూ దగ్గరకు వచ్చాడు .నేను ఆయనకు పరిపరివిధాల నచ్చ చెప్పే ప్రయత్నం చేసి వారించాను .కాని ఆముని నన్ను వదిలేట్టు లేడు అని గ్రహించి ఉపాయం తట్టి నేను రుతుమతిని .నాల్గు రోజులయ్యాక ఆయన కోర్కె తీరుస్తానని చెప్పి బయట పడ్డాను .

అక్కడినుండి గంధమాదన పర్వతం చేరి దాని సౌందర్యానికి ఆకర్షితురాలనై సంచరిస్త్తుంటే ,ఒక భయంకర రాక్షసుడు వచ్చి తాను నా సౌందర్యానికి గులాం అయ్యానని నన్ను బలాత్కారించటానికి దగ్గరకు రాగా నేను అబలను అని ,బలాత్కారం పాపహేతువు అనీ చెప్పగా వాడు ‘’పెళ్ళికాక ముందు స్త్రీలందరూ పరాయి వాళ్ళేకదా ‘’అంటూ మీదమీదకు రాగానేను శా౦డిల్యమహర్షికి రుతుస్నాతయై వస్తానని మాట ఇచ్చానని ,నేను వెళ్ళకపోతే ఆయన శపిస్తాడని చెప్పా .కాని ఆ రాక్షసుడు నామాటలను పెడచెవిని పెట్టి నా మీద పడి నాదేహాన్ని అల్లకల్లోలం చేశాడు .అంతే సద్యోగర్భం గా ఒక భీకరాకారుడు  కొడుకు గా పుట్టగా వాడికి ‘’అతికాయుడు ‘’అనే పేరు పెట్టి ,వాడిని ఆరాక్షసుడు తనవెంట తీసుకు పోయాడు.నన్ను దోచుకున్నవాడు రావణాసురుడు అని తెలిసింది . ‘’అని చెప్పింది .’’దాన్యమాలిని కి నేను’’ అతికాయుడిని లక్ష్మణుడు యుద్ధం లో చంపాడు ‘’అని చెప్పగా ఆమె వాడిని ఎప్పుడూ కొడుకుగా భావించలేదని అన్నది .సమయం చాలదు చెప్పాల్సింది ఏదైనా ఉంటె త్వరగా చెప్పమని ఆమెను కోరాను .ఆమె ‘’ఆ రాక్షసుడు వెళ్ళిపోయాక మ్రాన్పడి  కొన్ని రోజులు ఉండిపోయాను   . ఆ తర్వాత ముని దగ్గరకు వెళ్ళాలని భావించి విమానం లో అతని వద్దకు వెళ్లాను.అతడు నేను చీకటి తప్పు చేశానని నిందించి ,నాల్గు రోజులలో రుతుస్నాతగా వస్తానని చెప్పి చాలాకాలానికి వచ్చినందుకు కోపించి ఈ సరోవరం లో నక్రాకృతి పొంది ఉండిపొమ్మని శపించాడు .

అప్పుడు నేను శాండిల్య మహర్షి పాదాలపై పడి రావణుడు నాకు చేసిన దురన్యాయమంతా వివరించి చెప్పి క్షమించమని ప్రార్ధించా .మునిమనస్సు కరిగి ‘’రామ కార్యార్ధం పవన సుత హనుమానుడు ఇక్కడికి వస్తాడు .మారుతి వలన నీ శాపం తీరుతుంది ‘’అని చెప్పి’’ఒరేరావణా !నీమీద అనురాగం లేని స్త్రీని నువ్వు బలాత్కరించిన మరుక్షణం లో నీతల వేయి వ్రక్కలై నేల రాలుతుంది .రామ రావణ సంగ్రామం లో నువ్వు బంధు మిత్ర సపరివారంగా నశిస్తావు ‘’అని శపించింది  అని హనుమ కస్వాది మహర్షులకు చెప్పాడు.

కొనసాగిస్తూ మారుతి ‘’నేను ఏమీ తెలీనట్లు కపట ముని దగ్గరకు వెళ్లి నిలబడ్డాను .వాడు మాయమాటలతో ఇప్పుడు ద్రోణాద్రికి  వెళ్లి మూలికలను తీసుకొని లంకకు వెళ్ళే సమయం లేదని ,బ్రహ్మ తనకు మృత సంజీవని మంత్రమిచ్చాడని ,దాన్ని అర్హుడికి ఇవ్వాలని ఎదురు చూస్తున్నానని గురు దక్షిణ చెల్లించి మంత్రాన్ని పొందమని చెప్పాడు .నేను వెంటనే ‘’ఇదే రా గురుదక్షిణ’’ అంటూ వాడిని ముష్టి ఘాతాలతో చావబాది కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి సముద్రమధ్యం లోకి విసిరేశా .కాని వాడు రసాతలందాకా మునిగిపోయి మళ్ళీ వచ్చి నామీద పడ్డాడు .నేను భీకరంగా ఒక పిడి గుద్దు గుద్దగా వాడు మాయమయ్యాడు .ఇంతలో సుగ్రీవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ‘’మిత్రమా!యుద్ధం లో రావణుడు చచ్చాడు ,లక్ష్మణుడు మూర్చనుంచి తేరుకున్నాడు  .శ్రీరాముడు త్వరగా నిన్ను తీసుకు రమ్మన్నాడు’’అని చెప్పాడు .ఇదివరకెన్నడూ అతడు నన్ను మిత్రమా అని సంబోధించలేదు  .ఆశ్చర్యమేసి౦ది నాకు .ఇదీ మాయలో భాగమే అని గ్రహించి ‘’నీ కాలి  వ్రేలోకటి తెగి౦ది కదా. అయిదు వ్రేళ్ళూఎలావచ్చాయి ?’’అని అడిగి తే ‘’రామానుగ్రహం వల్ల ‘’అన్నాడు వాడు. అనుమానం మరింత బలపడి ,వాడిని ఒక్కతాపు తన్నాను కాలితో .వాడు చిరునామాలేకుండా పారిపోయాడు .ఇంతలో సింహరూపం లో వచ్చి నాపై దూకాడు .నేను నాపద్ధతి ప్రకారం బొటన వ్రేలు అంత అయి దాని కడుపులో దూరి శరీరం పెంచి చీల్చేశాను .పీడావిరగడ అయి౦ద నుకొంటే కాలనేమి రూపం లో వాడు నాపై కలయబడ్డాడు .నేను శ్రీరాముని స్మరించి వాడి రెండుకాళ్ళు పట్టి వెయ్యి సార్లు గిరగిరా తిప్పి విసిరేస్తే వాడు సముద్రం లో పడ్డాడు .కాసేపు చూసి ఇక వాడు రాడని గ్రహించి ద్రోణాద్రికి వెళ్లి దాన్ని పెకలించి తీసుకొని వచ్చి సౌమిత్రిని కాపాడి రాముడికి ఊరట కలిగించాను . మిగిలినకథ మీకు తెలిసిందే .మళ్ళీ చెప్పాల్సిన పని లేదు .ఇక ఇప్పుడు మునులారా మీమీ పూర్వ జన్మ వృత్తాంతాలను మీకు వివరిస్తాను ‘’అని ఆంజనేయుడు కస్వాది మునీశ్వరులతో అన్నాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-7-18 –ఉయ్యూరు

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.