డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం )

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-8(చివరిభాగం )

8-ప్రతిష్టాఖండం ‘’

కస్వాది మహర్షులతో శ్రీ ఆంజనేయస్వామి ‘’ప్రతి దానికీ ఒక కారణం ఉంటుంది .ఒక్కోసారి చాలాకారణాలూ ఉండవచ్చు.పూర్వజన్మ ఫలితంగా అవి జరుగూ ఉంటాయని మనకు తెలుసు .అప్పటి దాన్యమాలి యే ఇప్పటి ‘’విశాల ‘’ .నాటి శాండిల్య మహర్షి నేటి ‘’ధర్మమేథి ‘’.అప్పటికాలనేమి నామీద పగతో ‘’మాయా పర్ణాశనుడు ‘’మాయా ధర్మమేథి’’ మరియు మాయావానరం గా పుట్టాడు .కపటవేషం లో ఉన్న కాలనేమి శిష్యుడే అసలు పర్ణాశనుడు .రామ బాణం తో చనిపోయిన మాయామృగమైన మారీచుడే నేటి కస్వమహర్షి .దండకారణ్యం లో శ్రీరాముని సేవించిన మునులే ఇక్కడి ముని శ్రేస్టులు.గా జన్మించారు .విశాలను రక్షించి,ధర్మమేథిని కిరాతకుల గుహ నుంచి తప్పించిన  వానరం నేనే. నాటి జా౦బవంతుడే  ఇప్పుడు నాతో వచ్చిన భల్లూకం .’’అని చెప్పగానే కస్వాది మహర్షులు హనుమ పాదాలపై మోకరిల్లి ‘’మా పాపాలు పోగొట్టి మమ్మల్ని రక్షించావు మహాత్మా !అయినా సంసారకూపం లో పడి గిలగిలా కొట్టుకొంటున్నాము .మా అజ్ఞానాన్ని మన్నించి నువ్వు ఇక్కడే అర్చామూర్తిగా వెలసి మా అందరికి మార్గ దర్శనం చేస్తూ ఉండు .నువ్వు అవతరించిన ఈ క్షేత్రం  నాపేరురుమీదుగా ’ ‘’కస్వపురం ‘’ లేక కసాపురంగా ప్రసిద్ధి చెందుతుంది ‘’అని ప్రార్ధించాడు .

భక్తజన సులభుడు  కనుక  స్వామి వెంటనే అంగీకరించి ‘’మహర్షులారా !ఇక్కడే కసాపురం లో అర్చారూపంగా స్వయంభు గా వెలసి మీ పాపాలు పోగొడుతూ ,మీకు మేలుకలిగిస్తూ మీ కోర్కెలు తీరుస్తాను .ప్రహ్లాదుని అంశతో వ్యాసరాయలు జన్మించి వందలాది ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు కట్టించి ఈ భూమిపై వెయ్యేళ్ళు జీవిస్తాడు .ఆయనే మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిస్తాడు .విజయనగర సామ్రాజ్య యశో విభూషణుడు శ్రీ కృష్ణ దేవరాయల కు అక్షరాభ్యాసం చేస్తాడు .తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తపస్సు చేస్తూ రామభక్తి ప్రబోధిస్తూ ,హైందవ ధర్మ వ్యాప్తి చేస్తూ చిరకీర్తి నార్జిస్తాడు .దేశంనాలుగు మూలలా పర్యటించి ,ఎన్నో విగ్రహాలుప్రతిస్ట చేసి , ఆలయనిర్మాణం చేస్తాడు .రాయలసీమలోని శిల్పగిరి అనే చిప్పగిరిలో నేనెక్కడో భూమిలో దాగి ఉంటె ఎండిన వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని  గుర్తించమని చెప్పగా , వెతుకుతూ వేలకొద్దీవేపపుల్లలు నముల్తూ ,అక్కడ పాతి పెడుతూ  ఇక్కడికి వచ్చి ,నిట్టనిలువుగా చీలి ఉన్న పెద్ద బండరాయి వద్ద వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని భూమి నుంచి బయటకు తీయించి ఆంజనేయ ఆలయాన్ని కడు వైభవంగా  బహు సుందరంగా నిర్మించి జన్మ ధన్యం చేసుకొంటాడు . చీలిన రాయి దగ్గర నిర్మించటం చేత దీనికి ‘’నెట్టికల్లు ‘’అనే పేరు కూడా వస్తుంది .పూజారులను, మంగళ వాద్యాలను ,నిత్య ధూప నైవేద్యాలకు ఏర్పరచి నిత్య శోభతో ఆలయం వర్దిల్లేట్లు చేస్తాడు  .శ్రావణమాసం లో ఈఆలయ ప్రాంగణం లో నిద్రించిన వారికి నేను స్వప్న దర్శనం కలిగించి ,వాళ్ల కోరికలు  తీరేదీ ,లేనిదీ తెలియ జెపుతాను .మిగిలిన కాలాలలో మూడు  రాత్రులు  ఇక్కడ నిద్ర చేసే వారి కలో కనిపించి వారి కోరికలను నెరవేరుస్తాను .భూత ప్రేత పిశాచాది బాధలను నివారిస్తాను .ఆది వ్యాదులన్నిటినీ పోగోడతాను .ఆలయ సమీపం లోఉన్న పుష్కరిణి లో స్నాని౦చినవారికి తాపాలన్నీ దూరం  అవుతాయి  .మనసులో కోరికలతో వచ్చేవారికి కొంగు బంగారమై ఉంటాను .పెద్ద పెద్ద చెప్పులు కుట్టించి గోపురం పైన ఉంచిన వారికి ఎన్నడూ మంచే జరుగుతుంది  . వాటిని ధరించి నేను భూమినాల్గు దిశలా తిరుగుతాను .నా ఈ కసాపుర క్షేత్ర మాహాత్మ్యాన్ని రాసిన , భక్తితో పఠించిన, ఉపన్యసించిన స్తుతించిన వారందరికీ సర్వ  శుభాలు సకల దిక్కులా దిగ్విజయం కలుగ జేస్తాను ‘’అంటూ శ్రీ ఆంజనేయస్వామి మునులకు వివరించి అంతర్ధానమయ్యాడు .

ఇప్పుడు కవిగారు చివరలో రాసిన ‘’శ్రీ కసాపురా౦జనేయ శతకం  ‘’లో మచ్చుకి మొదటి చివరిపద్యాలు –

1-సీ-శ్రీరామ పాద రాజీవ చంచద్భ్రు౦గ –బ్రహ్మ చర్య వ్రత ప్రధిత సంగ

సర్వ రాక్షస నాగ సంఘాత హర్యక్ష –లక్షణ ప్రాణద లక్ష్య దక్ష

అబ్ధి లంఘన ఘన వ్యాసంగ విఖ్యాత –స్వామి కార్యాసక్తి ధామ చేత

ధర్మజానుజ భుజాదర్ప హర క్షాత్ర –సుకవి పండిత ముని స్తోత్ర పాత్ర

పావనాకార,రణధీర ,భవ విదూర –శత సహస్రార్క తేజ ,కేసరి తనూజ

తరళ దరహాస ,శ్రీ కసాపుర నివాస –అఖిల భక్తావన ధ్యేయ ఆంజనేయ ‘’.

108-సీ-శ్రీరామ భక్తాయ ,శ్రిత జనాధారాయ –వాయుపుత్రాయ ,తుభ్యం నమోస్తు

కలిదోష హరాయ ,కరుణా సముద్రాయ –పటు శరీరాయ ,తుభ్యం నమోస్తు

సమర హంవీరాయ ,యమరారి దళితాయ-బలశోభితాయ, తుభ్యం నమోస్తు

వనచర ముఖ్యాయ ,వనజాత నేత్రాయ –పవన వేగాయ, తుభ్యం నమోస్తు

అవనిజా ప్రాణదాయ ,తుభ్యం నమోస్తు –శత సహస్రార్క తేజాయ ,కేసరి తనూజ

తరళ దరహాసాయ ,శ్రీ కసాపుర నివాసాయ –అఖిల భక్తావన ధ్యేయ ,ఆంజనేయ ‘’.

సమాప్తం

కొసమెరుపు –ఈ చివరి భాగం రాస్తుండగా ఇప్పుడే రేపల్లె నుంచి సాహితీ వాచస్పతి ఉపన్యాస చతురానన,కసాపుర క్షేత్ర మాహాత్మ్యం కవి , డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు ఫోన్ చేసి  నేను సోమవారం వారికి పంపిన 1-షార్లెట్ సాహితీ మైత్రీబంధం ,2-వసుదైకకుటుంబం పుస్తకాలు ఇప్పుడే అందాయని,ధన్యవాదాలనీ , ,చదివి మళ్ళీ ఫోన్ చేసి చెబుతానని ,నా సాహితీ వ్యాసంగం వైవిధ్య౦గా ఉన్నదని మెచ్చారు .నేను వెంటనే వారితో ‘’మీ కృష్ణ రాయ విజయ ప్రబంధం ‘’పై తుమ్మపూడి వారి సమీక్షను అంతర్జాలంలో రాసి అందరికీ తెలియ జేశాను .మీ కసాపుర క్షేత్ర మాహాత్మ్యం చివరి ఎపిసోడ్ రాస్తుండగా మీరు ఫోన్ చేయటం నాకు మహద్భాగ్యంగా ఉంది .హనుమ మనిద్దరికీ ఇలా సాహితీ బాంధవ్యం కలిగించాడు .ధన్యోహం ‘ మాశ్రీమతి మీ  ‘’విజయా౦జ నేయం’’శ్రద్ధగా నిత్యం పఠిస్తోంది .’’ అన్నాను .వారు చాలా సంతోషిస్తూ ‘’రాయ ప్రబంధం ద్వితీయ భాగం ‘’కూడా పూర్తయింది అచ్చులో ఉంది .రాగానే మీకు తప్పక పంపుతాను ‘’అని తమ పెద్దమనసు ను ఆవిష్కరించారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-18 –ఉయ్యూరు .

 

 

— 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.