తొలి ఏకాదశి (శయన ఏకాదశి )

తొలి ఏకాదశి (శయన ఏకాదశి )

ప్రతినెలా రెండు సార్లు ఏకాదశి వస్తుంది .కాని కొన్ని ఏకాదశి తిదులకే ప్రత్యేక గుర్తింపు ఉండి.  .అందులో మొదటిది ఆషాఢ శుద్ధ ఏకాదశి .దీనినే ప్రధమ ,లేక తొలి ఏకాదశి అంటారు .శ్రీ మహా విష్ణువు ఈ రోజు క్షీర సాగరం పై శేష తల్పం పైన యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు .అందుకని దీనికి’’ శయన ఏకాదశి’’ అనే పేరొచ్చింది .యోగ నిద్రకు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటాడు .స్వామికి ఏ రకమైన భంగం రాకుండా భక్తులు మంచి నీరు మాత్రమే తాగి  కఠిన ఉపవాసం చేసి,విష్ణునామ సంకీర్తనలతో పవిత్రం గా కాలక్షేపం చేస్తారు .అందుకే దీన్ని జలఏకాదశి అనీ అంటారు .దీనికే మహా ఏకాదశి ,పద్మ ఏకాదశి ,,దేవ శయన ఏకాదశి ,దేవపోధి ఏకాదశీ అనే పేర్లుకూడా ఉన్నాయి .తమిళదేశం లో ఆషాఢ ఏకాదశిని ‘’ఆడి’’.అంటారు .మనకు  ఆషాఢ మాసం పెళ్లిళ్లకు, నవదంపతుల కాపురాలకు నిషిద్ధం. అయితే తమిళులకు ఈ మాసం అత్యంత పవిత్రమైనది .ఆడి ఉత్సవాలు రంగ రంగ వైభవంగా వాళ్ళు నిర్వహిస్తారు .ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణదిశకు వాలినట్లు కనిపిస్తాడు . రెండోది పరివర్తన ఏకాదశి .మూడవది ఉత్దాన ఏకాదశి .ఇవికాక ఇంకా భీష్మ ఏకాదశి ,వైకుంఠ ఏకాదశి ముఖ్యమైనవి .

భవిష్య పురాణం లో శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు శయన ఏకాదశి విశేషాలను చెప్పినట్లున్నది అంతకు ముందు దీనినే బ్రహ్మ ,మాంధాత చక్రవర్తి చెప్పారు .మాంధాత చక్రవర్తి పాలనలో ఒకసారి వర్షాలు కురవక పంటలు పండక ,తీవ్ర అనావృస్టి తోభయంకరమైన కరువు వచ్చింది .ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణం ఏమిటో దీనికి పరిష్కార మేమిటో ,దేవతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధంకాక దిగులు చెందాడు .అప్పుడు ఆంగీరస మహర్షి వచ్చి విష్ణు ప్రీతికరమైన  ‘’దేవ శయన ఏకాదశి వ్రతం ‘’శ్రద్ధగా చేయమని చెప్పాడు .మాంధాత అలానే ఈ వ్రతం చేశాడు .విపరీతంగా వర్షాలు కురిసి పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండి కరువు దూరమైంది .

ఏకాదశి నాడు ప్రత్యేకంగా  శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన పేలాలను(సేసలు ) దంచి పిండి చేసి  దానికి  బెల్లం కలిపి నైవేద్యం పెడతారు .మహారుచిగా ఉంటుంది .పూర్వం మంగలాలలో ఇసుక వేసి వేడి చేసిదానిపై వడ్లు పోసి ,కర్రతో కలియబెడుతూ వరి పేలాలు తయారు చేసేవారు  .అవి భలే రుచిగా ఉండేవి .మా అమ్మ వృద్ధాప్యం దాకా ఇలానే చేసి పేలపిండి నైవేద్యం పెట్టేది .ఇప్పుడు అంత సీను పెట్టలేక మొక్కజొన్న గింజల ను వేయించి చేసిన ‘’పాప్ కార్న్ ‘’నే ‘’పాపహరం ‘’అని భావించి  నైవేద్యం పెడుతున్నారు .ఓపికున్నవాళ్ళు వీటినే పిండి చేసి బెల్లంకలిపి నైవేద్యం పెడుతున్నారు .

మా ఉయ్యూరులో రావి చెట్టు ఎదురుగా రాచపూడి నాగరాజు అనే వైశ్య ప్రముఖుని పచారీ దుకాణం ఉంది .అతని అమ్మకాలు రికార్డ్ స్థాయిలో ఉంటాయి .ప్రతి ఏడాదీ అయ్యప్పదీక్ష తో మాల వేసి శబరిమలై వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేస్తాడు .అయ్యప్ప దీక్ష చేసే భక్తులకు కావలసిన సకల సామగ్రి అతని కొట్లో దొరుకుతుంది .అయితే అతడు ప్రతి తొలి ఏకాదశికి వారం పది రోజులముందు రావి  చెట్టుకింద  పేలాలు వేయించే పొయ్యి ఏర్పాటు చేసి తానొక్కడే ప్రతి రోజు ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు మొక్క జొన్న గింజలతో పేలాలు వేయించి పాకెట్స్ లో నింపి పాకెట్ పది రూపాయలకు అమ్ముతాడు .అమ్మకానికి ఎవరినో ఒకరిని సహాయంగా పెట్టుకుంటాడు అంతే .విసుగు విరామం లేకుండా ఇంతపని అతనొక్కడే చేయాల్సిన అవసరమో అతనికి లేనే లేదు   .ఎవరితోనైనా చేయించవచ్చు .అది పుణ్యమో పురుషార్ధమో గా భావించి ఇంతగా కష్టపడటం మాకు ఆశ్చర్యమేస్తుంది .

తొలి ఏకాదశినాడు విష్ణు సహస్రనామ పారాయణతో గృహాలకు,  దేవాలయాలకు పవిత్ర శోభ  తెస్తారు . .వైష్ణవాలయాలలో స్వామికి పవళింపు సేవ నిర్వహిస్తారు .గృహాలలో తులసికోట దగ్గర పద్మం ముగ్గు వేసి ,దీపాలు వెలిగించి పళ్ళు నైవేద్యం పెడతారు .పూర్వం  రుక్మా౦గదుడు, అంబరీషుడు ఈ వ్రతాన్ని పాటించి ప్రజలందరి చేత ఆచరి౦పజేశారు .

పండరీ పుర మహా యాత్ర

మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం షోలాపూర్ జిల్లా లోని చంద్ర భాగా నదీ తీరం లో వెలసిన భక్తవరదుడు శ్రీ పాండురంగ విఠలుడు .విఠ్ అంటే ఇటుక రాయి .భక్త పుండరీకుని చూడటానికి పాండురంగస్వామి స్వయంగా  వస్తే, తాను కుటీరం లో తలిదండ్రుల పాదసేవలో ఉన్నానని,  బయట ఇటుకపై కూర్చోమని చెప్పాడు .అక్కడ వెలసిన స్వామినే పాండురంగ విఠలుడు అంటారు .ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు లక్షలాది భక్తజనం పండరీ పురానికి మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడికి పెద్ద ఊరేగింపుగా ,యాత్రగా వస్తారు .కొందరు పల్లకీలతో పాండురంగని భక్తుల చిత్రపటాలను పెట్టి ఊరేగింపుగా వస్తారు . అలందీనుండి సంత్ జ్ఞానేశ్వర్ ,నార్సీ నుండి స౦త్ నాం దేవ్ ,దేహూ  నుండి భక్త తుకారాం ,పైఠాన్ నుంచి సంత్ ఏకనాథ్,త్ర్యయంబకేశ్వర్ నుంచి సంత్ నివృత్తినాథ్,,ముక్తానగర్ నుంచి సంత్ ముక్తాబాయ్ ,సస్వద్ నుంచి సోపాన్ ,షేగాం నుంచి సంత్ గజానన్ మహారాజ్ ,చిత్రపటాలను అందంగా అలంకరించిన పల్లకీలలో ఉంచి అత్యంత భక్తి శ్రద్దలతో  ఊరేగింపుగా, సంత్ తుకారాం ,సంత్ జ్ఞానేశ్వర్ లు రచించిన అభంగాలు సుస్వరంగా భక్తి  పారవశ్య౦గా గానం చేస్తూ పండరీ పురం చేరుతారు .ఈ పవిత్ర యాత్రికులను ‘’వర్కారీలు ‘’అంటారు .ఈ యాత్రను ‘’పంధార్ పూర్ ఆషాఢీ ఏకాదశి వారి యాత్ర ‘’అంటారు .,వీరంతా చంద్రభాగా నదిలో పవిత్ర స్నానాలు చేసి , శ్రీ పాండురంగ విభుని దర్శించి  తరిస్తారు .ఆలయం లో అనుక్షణం పాండురంగ  భజనలు జరుగుతూనే ఉంటాయి .

పరివర్తన ఏకాదశి

యోగ నిద్రలోఎడమవైపుకు తిరిగి పడుకుని ఉన్న  శ్రీ మహావిష్ణువు బాద్ర పద శుద్ధ ఏకాదశి నాడు కుడి వైపుకు తిరిగి పడుకుంటాడు .అందుకనే దీనిని ‘’’పరి వర్తన ఏకాదశి ‘’లేక పార్శ్వ్య ఏకాదశి , వామన ఏకాదశి అంటారు .బలి చక్రవర్తిని ఈ రోజే విష్ణుమూర్తి వామనావతారం లో మూడడుగులు దానం అడిగి పాతాళానికి తొక్కేసిన రోజు ఇది .బలి దాన గుణానికి మెచ్చినవిష్ణువు ఆయన కోరికపై విగ్రహరూపం లో అక్కడే ఉండి పోయి ,పరివర్తన ఏకాదశినాడు ఉపవాసమున్నవారి సకల పాపాలు తొలగిస్తానని హామీ ఇచ్చాడు .

ఉత్థాన ఏకాదశి

కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాని ఏకాదశి అంటారు .ఈ రోజు విష్ణుమూర్తి నాలుగు నెలల యోగ నిద్ర చాలించి మేలుకొనే రోజు .అందుకే దీన్ని ‘’ప్రబోధిని ఏకాదశి ‘’లేక దేవూతి ఏకాదశి అంటారు .ఈ రోజు తులసీ దేవిని నల్లని సాలగ్రామ విష్ణు మూర్తికిచ్చి వివాహం చేశారని పురాణకథనం .లక్ష్మీ పూజ ,విష్ణు పూజ విధిగా నిర్వహిస్తారు .పండరిపురం లో ఈ ఏకాదశినుండి కార్తీక పౌర్ణమి వరకు అయిదు రోజుల ఉత్సవం ప్రభుత్వ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రిలేక మంత్రి చేత ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహిస్తారు  .చెరుకు పంట చేతికి వచ్చేసమయం కనుక ఈ ఏకాదశినాడు పొలం లో రైతు పూజ చేసి,  చేయించిన పురోహితుడికి అయిదు చెరకుగడలు దక్షిణగా సమర్పించి  వడ్రంగి, చాకలి ,మంచినీళ్ళు మోసే వానికి  ఐదేసి గడలు కృతజ్ఞతగా ఇచ్చి,  అయిదు గడలు ఇంటికి తీసుకు వెడతాడు రైతు .   ఆ రోజే చెరుకు నరకటం ప్రారంభిస్తారు.

చాతుర్మాస్య దీక్ష

పీఠాధిపతులు, యతులు ,సన్యాసులు  ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష చేస్తారు .అంటే ఏదో ఒక చోటనే ఉండిపోతారు ఈ నాలుగు నెలలు .ఎక్కడికీ ప్రయాణం చేయరు .ఈ కాలం లో వేదప్రవచనాలు,దార్మిక ప్రసంగాలూ చేస్తూ ప్రజలలో భక్తిజ్ఞాన వైరాగ్యాలను బోధిస్తారు .తాము తీవ్రమైన జప తపాలలో గడుపుతారు .మాసం అంటే జ్ఞానం అనే అర్ధం కూడా ఉంది కనుక జ్ఞాన ప్రబోధమే లక్ష్యంగా ఉంటారు .నియమ నిష్టలతో శ్రద్ధగా నిర్వహించే కర్మాను స్టానమే  యజ్ఞం లేక వ్రతం అంటారు .దీన్ని గురించి ఒక విషయం ప్రచారం లో ఉంది .ఒకప్పుడు బ్రహ్మ దేవుడు నిరంతర సృస్టికార్యం వలన అలసిపోయి నిద్రించాడు  ,అప్పుడు దేవతలు ఒక యజ్ఞం చేసి అందులోంచి ఉద్భవించిన హవిస్సు ను బ్రహ్మకు ఇచ్చారు .అది ఔషధంగా పని చేసి ఆయన అలసట పోగొట్టింది .

బ్రహ్మ సృష్టి చేస్తూ ఏకం,ద్వే,త్రీణీ,చత్వారీ అంటూ నాలుగు సార్లు ఆజ్యాన్ని సమర్పించి చివరగా ఒక సమిధకూడా వేశాడు .దీని ఫలితంగా దేవతలు ,రాక్షసులు ,పితరులు ,మానవులు అనే వారిని సృష్టించి వారికి రోమాలు, మాంసము,ఎముకలు ఏర్పాటు చేశాడు .ఈ నాలుగు రకాల జీవులలో జ్ఞానాన్ని ఉద్దీపింప జేయటమే చాతుర్మాస్య దీక్ష లక్ష్యం అని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది .ఉపనిషత్తు లో చతుర్ముఖ బ్రహ్మ లక్ష్మి తో కలసి సృష్టి చేశాడని ,చతుః మా అంటే నాలుగు లక్ష్ములు అనీ కనుక నాలుగు లక్ష్ములను ముఖాలుగా చేసుకొని నాలుగు వేదాలు చెప్పాడని ,వేద విద్యనే శ్రీ విద్య అంటారని అందుకే ఈనాలుగు నెలలూ  వేదాలను పూజిస్తూ అధ్యయన, అధ్యాపనం చేయాలని చెప్పింది .ఈ దీక్షలో ఆహార నియమాలు విధిగా పాటించాలి .‘’ఆహార శుద్దే సత్వం శుద్ధిః, సత్వ శుద్ధే ధృవాన్మతిః’’ కనుక సాత్వికాహారం తింటే మనస్సు సాత్వికమై శక్తినీ ఆరోగ్యాన్ని ఆయుస్సు నూ ,సుఖ సంతోషాలను ఇస్తుంది .’’ధర్మార్ధ కామ మోక్షాణాం ఆరోగ్య మూలముత్తమం ‘’అని చరక సంహిత చెప్పింది .కనుక ఈ వ్రతం వ్యాధి నివారకమేకాక ఇహం లో సుఖ౦  ,పరం లో మోక్షం ప్రసాదిస్తుందని చెబుతోంది .ఈ వ్రత దీక్షలో ఉన్నవారు శ్రావణమాసం లో కూరగాయలు ,భాద్రపదం లో పెరుగు ,ఆశ్వయుజం లో పాలు ,పాలపదార్ధాలు ,కార్తీకంలో రెండు బద్దలున్న పప్పుతో చేసిన పదార్ధాలు  విసర్జించాలి .ఆరోగ్య రీత్యా కూడా దీనికి బలమైన శాస్త్రీయ కారణమూ ఉంది .ఋతువులు మారే సమయం కనుక వ్యాధులు ప్రబలుతాయి .ఋతువుల సంధికాలాలను  ‘’యమ ద్రంస్ట్రలు’’అంటారు .శాస్త్ర రీత్యా ఆషాఢ మాసంలో కామోద్దీపన ఎక్కువగా ఉంటుంది .కనుక నూతన దంపతులపై దీని ప్రభావం పడకుండా భార్యాభర్తలను ఈ నెలలో వేరువేరుగా ఉంచుతారు .

ఈ నాలుగు నెలలలో వినాయక చవితి వంటి ఎన్నో పండుగలు పబ్బాలు నోములు వ్రతాలు ,మహళాయపక్షం ,శరన్నవరాత్రులు ,కార్తీక మాస శివాభిషేకాలు తో భక్తి  సందడే సందడి .

రేపు 23-7-18 సోమవారం తొలి ఏకాదశి (శయన ఏకాదశి )శుభాకాంక్షలతో

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-18 –ఉయ్యూరు

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.