శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు
స్వామీ !
ఏమీ !
నాధా!
ఏమిటి బాధ ?
తమరు ఈ రాత్రినుంచి శయ్యాక్రా౦తు లవుతారు కదా !
అవును ఇదేమీ కొత్తకాదే.ప్రతి ఏడూ జరిగే ముచ్చటే గా !
మీకు ముచ్చటే .మాకు చెమటలు పోస్తాయి ఆ నాలుగు నెలలూ
దేనికి ?
ఎవరైనా అధికారి ఊరికి వెడితే తనబాధ్యత తన తర్వాత అధికారికి అప్పగించి వెళ్ళటం లోక రివాజు .
ఓహో అలాగా !
మరి తమరు ఏకంగా నాలుగు నెలలు నిద్రకు ఉపక్రమి౦చ బోతున్నారాయే .మధ్యలో రెండు నెలలతర్వాత కాస్త మరోపక్కకు ఒత్తిగిలి పరుంటారే కాని మెలకువ తెచ్చుకోరుకదా ఆ నాలుగు మాసాలూ పూర్తయ్యేదాకా !
అవును నిజమే ఇందులో వి౦త కాని విడ్డూరం కానీ ఏమీ లేవే!
మీకు అలా అనిపించవచ్చు .కాని లోకానికి అది తగనిదిగాఅనిపిస్తుందేమో .స్థితి కారకులే నిశ్చింతగా నిద్రిస్తుంటే లోక పాలన ఏమైపోవాలి స్వామీ ?ఎవరికైనా ఈ నాలుగు నెలలూ బాధ్యత నప్పగించి హాయిగా పడుకోండి కాదన్నది ఎవరు ?
సరే నీ ఉపాయం బాగానే ఉంది .నువ్వే సలహా చెప్పుఎవరికిస్తే బాగుంటుందో ?
నన్ను ఎందుకు ఇందులోకి లాగుతారు బాబూ ! మీ ఏర్పాటేదో మీరే చేసుకోండి .నేనేదైనా చెబితే ఆడపెత్తనం అంటారేమో లోకులు .అయినా మనవాళ్ళలో ఎవరికైనా ఒకరికి అప్పగించండి .మీ మిత్రుడూ మా అన్నయ్య శివుడున్నాడు కదా .ఆయనకు అప్పగిస్తే ?
భలే సలహా ఇచ్చావు సాధ్వీ .పుట్టి౦టి వాళ్ళను బాగానే వెనకేసుకొచ్చావు .
ఈసోడ్డు వేస్తారని ముందే అనుకున్నా .కాని గమ్మున మీలాగా ఉండలేను కదా .శివన్నయ్య కిస్తే ఏం ?
ఏమీ లేదు కానీ అసలే భోళాశంకరుడు .ఎవరికే వరాలిచ్చి ప్రాణం మీదకు తెస్తాడేమో నని భయం కానీ—
కానీ లేదు దమ్మిడీ లేదు ఇంకా ఆలోచన ఎందుకు స్వామీ !ఎప్పుడో ఏదో చేశాడనిఇప్పుడు దెప్పుడా ? అప్పుడు అలా జరగాలి కనుక జరిగి ఉండచ్చు. ఆయనది దోషం కాకపోవచ్చు కదా .
నీమాటే నమ్ముదాం .కాని ఆయన ఎప్పుడూ లయకారుడు గానే గుర్తింపు పొందాడు .ఇప్పుడు స్థితి కారక బాధ్యత అప్పగిస్తే నేను నిద్ర లేచేసరికి జనక్షయం ?
శుభం పలకమంటే సామెత చెప్పినట్లు ఈ విపరీతమేమిటండీ.మా అన్నయ్యకు ఇవ్వాలని లేదని సూటిగా చెప్పలేక ఈ డొంక తిరుగుళ్ళు ఎందుకు హరీ !
సిరీ !నా మనసు బాగానే అర్ధం చేసుకున్నావ్ –వేరొకరి పేరు చెప్పు ఆలోచించి .
ఇంకెవరున్నారు కమలగర్భ జనకా? మనబ్బాయి బ్రహ్మకు అప్పగించండి సంకోచం దేనికి ?
సంకోచం కాదు –ఎప్పుడూ అడ్డగోలుగా సృష్టించి పారెయ్యటం ,వాళ్ళు నామీద పడిఏ డవటం ! అదేగా అతడి నిర్వాకం .పాలన గురించి పట్టించుకున్న వాడుకాదు కదా –
కాలికేస్తే వేలికి , వేలికేస్తే కాలికీ బాగానే బిగిస్త్తున్నారు –యెట్లా మీతోవేగేది ?
చంద్ర సహోదరీ ! దీనికే అంత కోపమా ?వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి నిర్ణయం చేస్తేనే కదా సమన్యాయం జరిగేది ?
అవునను కోండి –మీ సంబోధనలో నాకొక సూచన కనిపించింది –చెప్పనా ?
చెప్పాలనేకదా చంద్రవదనా !
అయితే, మా సోదరుడు మీకు బావమరది ‘’చంద్రన్న’’కు అప్పగించండి కమలదళాయతాక్షా !
భేషైన సూచన .వాడు తారా సందోహం తో ఇరవై ఏడుగురు భార్యలతో సతమతమవుతూ ,ప్రియురాళ్ళ విరహ వేదన కలిగిస్తూ క్షోభ పెడతాడు .వాడికి దీనిమీద దృష్టి పెట్టె తీరిక ఉంటుందనుకొన్నావా ?
బాబోయ్ మదన జనకా !మీ మనసుకు నచ్చిన వాళ్లే వరో నాకెలా తెలుస్తుంది ?నేను చెప్పిన వాళ్ళను చదరంగం లో పావుల్లాగా తీసి పారేస్తున్నారు .ఎలా మీతో ?
అవునూ ఇప్పుడే ఏదో విశేషం వాడావు ..
వాడాను నిజమే .మన మన్మధుడికి బాధ్యత ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి .
బాగానే ఉండచ్చు కానీ –
మళ్ళీ బేడా కానీ కబుర్లు వద్దు .ఏదో తేల్చండి –
వాడు అశరీరుడైతేనే లోకం లో కామాగ్ని చిచ్చు రగిలించి నిద్రలేకుండా చేస్తూ ఉంటాడు .వాడికి శరీరం ఇచ్చి బాధ్యతా చేతికి అప్పగిస్తే నీకూ నాకూ తెలీకుండా ఎందరెందరో సుందరాంగులను కోడళ్ళు గా తెచ్చి కొంప కొల్లేరు చేస్తాడని భయం –అంతే
వీడికీ కట్టబెట్టటం ఇష్టం లేదని మొహమాటం లేకుండా డొంక తిరుగుడుగానైనా నిజం చెప్పారు . ఇక చాలు సంబడం .మీ మనసులోని మాటేమితో నాన్చకుండా సెలవియ్యండి ప్రాణేశ్వరా !
నా అర్ధాంగీ! చివరగా నీ మనసులోని మాటగా చెప్పు. దానికే విలువనిస్తానని నీకు తెలుసుగా !అనగానే లక్ష్మీదేవి ముసిముసి నగవులతో తల ఒకింత కిందికి దించి ,కాలి వ్రేళ్ళను నేలపై రాస్తూ, సిగ్గులొలికిస్తూ, మొహం పైకేత్తకుండా –‘’మాయా మోహ జగన్నాటక సూత్రధారీ మురారీహరీ !నా మనసులో మాటతెలిసే మీరు చెప్పకుండా నాతో చెప్పిస్తున్నారుకదూ.ఆ మాత్రం కనిపెట్ట లేననుకున్నారు కామోసు కామారి మిత్రమా !అయినా సిగ్గు విడిచి నేనే చెప్పేస్తున్నాను మీరు గట్టిగా చెప్పమన్నారుకనుక .ఆర్ధిక శాఖ నా చేతుల్లోనే ఉంది .నేను దయతలిస్తేనే లోకం లో డబ్బూ హోదా వస్తాయి .ఈ రెండూ లేకపోతె దుబ్బుకు కూడా కొరగాడు మానవుడు .మీనిద్రాసమయం లో బాధ్యత అంతా నాకే అప్పగించి నిశ్చింతగా నిద్రించండి .నాలుగు నెలలు కాదు కావాలంటే మరో నాలుగు నెలలు శయని౦చ౦డి మహానుభావా ! మీకు అడ్డేమిటి ?మై హూనా .అయినా మీమనస్సులో ఒక సంకోచం ఉన్నట్లుంది .లక్ష్మి చంచల.ఒక్క చోట నిలవదు అని .ఆ భయమేమీ లేదు .నేను అప్పుడు సర్వం సహా చక్రవర్తిని ..ఎక్కడికీ కాలుపెట్టే అవసరం లేదు .ఇదంతా మీమనసులో ఉంచుకుని నన్ను బయట పెట్టారా ? ‘’అని మొహం పైకెత్తేసరికి శ్రీహరి యోగనిద్రలోకి జారి అరగంటయింది .ఉసూరుమని నిట్టూర్చి ‘’ఈ మాయలాడు అందర్నీ మోసం చేస్తాడనుకున్నాకానీ నన్నూ మాయ చేశాడు మాయావినోది .ఎటూ తేల్చకుండా ఎవరికీ బాధ్యత అప్పగించకుండా హాయిగా శేషతల్పం పై క్షీరసాగరం లో యోగ నిద్రలోకి వెళ్లి పోయారు పరమాత్మ .అయినా నా వెఱ్రి కాని .సర్వలోక రక్షకుడికి ,సర్వలోకాలు తనలోనే ఉంచుకున్నవాడికీ నిద్ర ఏమిటి మన అమాయకత్వం కాని .ఆయనకు జాగ్రత్ స్వప్న సుషుప్తి నిద్రావస్తలు౦ టాయా ?సర్వాతీతుడు స్వామి .నాకూ కాస్త మోహం వ్యామోహం కలిగించి చూడండి ఎలా చిరునవ్వు నవ్వుతూ ఏమీతెలియని అమాయకుడిగా నిదిరిస్తున్నారో నాస్వామి .ఆయనకు ఇక నిద్రాభంగం కలగనీయను .
శయన ఏకాదశి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-18 –ఉయ్యూరు
స్వామి, అమ్మ మీలో ప్రవేశించి శయనఏకాదశి వివరాలు తెలియచేశారు. మీరు చెప్పిన విధానం భలే ఉంది.
ok
2018-07-24 20:05 GMT+05:30 సరసభారతి ఉయ్యూరు :
>