కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -2
ఆహితాగ్ని దిన చర్య
శ్రౌతం నేర్చిన వారు సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటి౦చి ఆహితాగ్నిగా ఉంటారు .త్రేతాగ్నులను అర్చిస్తారు .రోజుకు రె౦డుసార్లు వేడిపాలను అగ్నిహోత్రానికి సమర్పిస్తారు .తర్వాత అగ్ని స్టోమం చేస్తారు .భారత, నేపాల్ దేశాలలో ఉన్న ఆహితాగ్నుల సంఖ్య 626 అయితే అందులో ఆంద్ర ప్రాంతం లోనే 200 మంది ఉన్నట్లు తెలుస్తోంది .శ్రౌత కర్మ విధానం గృహిణి తో చేసే క్లిష్ట విధానం .వీరి భాషకూడా ప్రత్యేకంగా ఉంటుంది .నిత్యకర్మలని, కామ్య కర్మలనే మాటలు వాడుతారు .నిత్యకర్మ విధిగా తాను ఆచరి౦ చాల్సినది .కామ్యకర్మ మనసులో ఉన్న కోర్కె ఫలించటానికి చేసేదిగా భావించవచ్చు .దీన్ని నైమిత్తికం అనీ అంటారు .అంటే జాతకర్మ ,అంత్యక్రియ ,ఆయుర్ వృద్ధి ,ఆరోగ్యాభి వృద్ధి లకోసం చేసేవి .వీటికి ప్రాయశ్చిత్తా లు కూడా చేయాలి .
వేద విహిత కర్మలను చేసేవారిని శ్రౌత లేక యజమాని అంటారు .యజమాని అర్దాంగితో కలిసి ఉదయమే ఔపోసనాగ్నిని ఆధానం చేయాలి .దీనితో త్రేతాగ్నులను అర్చించాలి .ఇంట్లోని ప్ర త్యేక గదిలో పడమర వైపు గుండ్రని గార్హ పత్య అగ్నిఅంటే వంట చేసుకునే అగ్ని ,తూర్పున చతురస్రాకారపు ఆహవనీయ ,దక్షిణాన దక్షిణాగ్ని లను మట్టిముద్దలతో ఏర్పాటు చేసుకొంటారు . ఒకదానికొకటి సంబంధం ఉండేట్లు మధ్యలో వేది ఉంటుంది .వేది అంటే హోమ ద్రవ్యాలు ఉంచే ప్రదేశం .ఈ పవిత్ర అగ్ని హోత్రాలు దంపతులు ప్రత్యేకంగా సంరక్షించు కోనేవి మాత్రమె .కుటుంబం లోని వారు ,సహకరించేవారు మాత్రమేవీటిని చూడటానికి అర్హులు .మిగిలవారెవ్వరికీ ఈ గదిలో ప్రవేశం ఉండదు .దంపతులలో ఒకరు మరణించేదాకా ఇంతే .మరణిస్తే వాటిని తొలగిస్తారు .ఆ ఇంటికి మాత్రమే ఆ అగ్ని హోత్రం ప్రత్యేకం అని భావం .అగ్ని వారికి ప్రత్యక్ష దైవం .
ఆహితాగ్ని భార్యతో ఔపోసనాగ్ని తో నిత్యాగ్ని హోమం చేస్తూ అంటే గార్హపత్యాగ్నిని కొలుస్తాడు.అగ్ని హోత్ర గోవును సూర్యోదయ ,సూర్యాస్తమయ వేళలో పాలు పితికి ,అగ్నికార్యం నిర్వహించి ,నైవేద్యం పెట్టగా మిగిలిన వాటిని ఉదయ ,సాయం వేళల ప్రసాదంగా కుటుంబం అంతా స్వీకరిస్తారు .అగ్ని హోత్రం లో సమిధలు వేయటమూ ఒక పవిత్ర కార్యమే .ఉదయ సాయం సంధ్యలలో సంధ్యావందనం ,అగ్ని హోత్రం వైశ్వ దేవం చేస్తూ దేవతలందరి కి సంతుష్టి కలిగిస్తారు .సాంకేతికంగా వివాహమైన నవ దంపతులు అగ్ని హోత్రి లుగా , ఆ ఇంటి గార్హ పత్యాగ్ని ఆరాధనకు అర్హులవుతారు .గార్హ పత్యాగ్ని తో పాలను వేడి చేసి ఆహవనీయ అగ్నికి సమర్పిస్తారు .దంపతులు ఆధానం తో త్రేతాగ్ని అర్చన చేస్తారు . ఒక్కొక్క దంపతులు తమ జీవితకాలం లో ఇలా అనేక వేలసార్లు చేయటం జరుగుతుంది .ఉదయం సూర్య ,ప్రజాపతి లకు ,సాయంత్రం అగ్ని,ప్రజాపతి లకు హవిస్సులు సమర్పిస్తారు .15 రోజులకొకసారి ‘’దర్శ పూర్ణ మాస ‘’ను ,ఇష్టి ని నిర్వహించి దేవతలకు హవిస్సు సమర్పిస్తారు అగ్నికి సోమకు చేసేదే అగ్ని స్టోమం ,అగ్ని ఇంద్రులకూ ,అగ్నికి ,ప్రజాపతి కి ప్రత్యేకంగా కూడా చేస్తారు .బియ్యపు పిండికి నీళ్లుకలిపి గుడ్రంగా తట్టి గార్హ పత్యాగ్ని లో ఉడికించి కూడా పురొడాశ౦ గా దేవతలకు సమర్పిస్తారు .పాలతో పాటు ఇదీ ప్రసాదంగా భుజిస్తారు .
ఇలా నిత్యం అగ్ని ఆధానం ,అగ్ని హోత్రం పక్షానికోసారి ఇష్టి తోపాటు మిగిలిన నిత్య కార్యాలు చేస్తారు .ఒక ఏడాది దీక్షగా త్రేతాగ్ని హోత్రం చేసిన దంపతులు ఇంట్లోనే కాక బయటకూడా శ్రౌతకర్మలు చేయటానికి అర్హులౌతారు .బయటి దాన్ని అగ్ని క్షేత్రమని ,అక్కడి అగ్ని ని మహా వేది అనీ అంటారు .దీనికి ముందు అగ్ని స్టోమం చేసి అర్హత సాధించాలి .సోమరసం తయారు చేసి అగ్నికి ఆహుతిగా ఇవ్వాలి .పశుబలికూడా ఉండేది కాని ఇప్పుడు అమలు లో లేదు .ముంజ లేక దర్భ తాడు భర్త నడుం చుట్టూ కట్టుకోవాలి. యోక్త్రను భార్య నడుముకు కట్టాలి .అప్పుడు అగ్నిస్టోమం చేయాలి .సోమలత దొరకటం కష్టం కనుక ఇప్పుడు వేర్వేరు లతలను ఉపయోగిస్తున్నారు .సోమలతను గొప్ప అతిధిగా మహారాజుగా భావించి గౌరవంగా స్వాగతం పలుకుతారు .అయిదవ రోజు సవనం చేస్తారు.అంటే తీగను పిండటం చేస్తాడు అధ్వర్యుడు .సామవేదం లోని 12 సూత్రాలను ,12యజుర్వేద మంత్రాలను స్తోత్రంగా గానం చేస్తారు . సోమరసాన్ని వడపోసి మొదట కుండలోను తర్వాత కోయ్యపాత్రలైన చమస్సులలోను పోసి అగ్నికి ఆహుతిస్తారు .తర్వాత సోమరసం త్రాగుతారు .రెండవసారికూడా ఇలానే చేస్తారు .ఇలా అగ్నిస్టోమం పూర్తయ్యాక అవ భ్రుత స్నాన విది ఉంటుంది .దీనితో పూర్తిగా దంపతులు పరమ పవిత్రులౌతారు .ఇదంతా జనన ,మరణాలకు ప్రతీకగా భావిస్తారు.దీన్ని చేసిన దంపతులకు కొత్తపేర్లు పెడతారు .సోమాన్ని అగ్ని హోత్రానికి సమర్పించినందువలన ఆయనను సోమయాజి లేక సోమయాజులు అనీ , ఆమెను సోమిదేవమ్మ అనీ పిలుస్తారు. మొదటినుంచీ ఉన్న పేర్లతో ఇక పిలవనే పిలవరు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-7-18 –ఉయ్యూరు