చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు

1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి

‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ జ్ఞాపక చిహ్నంగా అంటే స్మృతి చిహ్నంగా   ఆయన భార్య రాణి  ఉదయమతి దీన్ని కట్టించింది  .ఆమె కాలం లో మిగిలిపోయిన దాన్ని కొడుకు రాజాకర్ణ పూర్తి  చేశాడు . 1304 కాలపు జైనకవి  ‘’మేరుతంగ సూరి’’ తన ‘’ప్రబంధ చింతామణి ‘’లో దీనిని ఉదాహరించాడు . సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ బావి సరస్వతీ నదికి వచ్చిన వరదలో మట్టిలో పూడుకు పోయి’’మిట్టీమే సోనా ‘’గా మిగిలింది .64 మీటర్ల పొడవు ,20 మీటర్ల వెడల్పు ,27 మీటర్ల లోతుగా ఉన్న ఇది చూడటానికి రాతితో నిర్మించబడిన పెద్ద కోట లా ఉంటుంది .దీనికి అన్నివైపులా ఉన్న స్తంభాలపై భారతీయ చిత్రకళ  అంటే మరు –ఘూర్జర శైలి తాండవం చేస్తుంది .ఏడు అంతస్తుల ఈ బావిలో 500శిల్పాలు ,మరో 800 కళా ఖండాలున్నాయి .వీటిపై దశావతారాలు ,సొల శృంగారం గా ఉన్న 16రకాల  అప్సరసల శిల్పాలు ‘’వావ్! ఇదేం వావ్! ‘’అని పిస్తాయి . ఇంతపెద్ద విశాలమైన ప్రత్యేకమైన కట్టడం అపూర్వం గా భావిస్తారు .ఈ బావిలో కింద చివరి మెట్టువద్ద ఉన్న గేటు నుండి  30 మీటర్ల సొరంగం కూడా మట్టిలో పూడుకు పోయింది .ఈ సొరంగం నుండి వెడితే పఠాన్ వద్ద ఉన్న సిద్ధ పూర్ కు సురక్షితంగా చేరేవారు . ఈ బావి 1980 లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో మళ్ళీ వెలుగు చూసింది .యుద్దాలకాలం లో లేక ఆపదలు సంభవించినపుడు రాజా౦తః పుర స్త్రీలు  ఈ సొరంగం ద్వారా తప్పించుకొని బయటకు వెళ్ళేవారు .50 ఏళ్ళక్రితం వరకూ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండేవి .ఇలాంటి దిగుడుబావులు మంచి నీటికోసమే కాక ఆధ్యాత్మిక చింతనకు , శిల్పకళా వైభవానికిచిహ్నాలు . 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి చోటు దక్కించుకున్నది .2016 లో ‘’క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్ ‘’గా అవార్డ్ పొందింది .అందుకే భారత ప్రభుత్వం కొత్తగా ముద్రిస్తున్నవంద రూపాయల నోటు పై స్థానం పొంది కను విందు చేస్తూ ,చారిత్రిక నిదర్శనం గా దర్శనమిస్తోంది

2-అత్యంత  సుందరమైన రాజస్థాన్ లోని చాంద్ బావోరి దిగుడుబావి

రాజస్థాన్ లో జైపూర్ కు 90 కిలోమీటర్లలో అభనేరి గ్రామం లో  చాంద్ బవోరి దిగుడు బావి అత్యంత సుందరం, విశాలమైనది .800-900 కాలపు నికుంభ వంశరాజు రాజా చంద్ర దీన్ని  నిర్మించాడు .13 అంతస్తులతో ,3,500 మెట్లతో’’ హర్షత్ మాత ‘’దేవాలయానికి ఎదురుగా ఉంటుంది .బాలీవుడ్ సినిమాల షూటింగ్ కేంద్రం గా ప్రసిద్ధమై ,ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయింది .

3-రాజోం కి బావోలి –ఢిల్లీ

వంద చారిత్రాత్మక కట్టడాలున్న మెహ్రౌలీ ఆర్కిలాజికల్ పార్క్ సమీపం లో రాజోం కి బావోలి దిగుడుబావి రాజుల కట్టడం కాదు కాని 1516 లో దౌలత్ ఖాన్ కు చెందిన తాపీ మేస్త్రీలు కట్టినది .అందానికి, శిల్పకళకు పెట్టిందిపేరు .

4-అగ్రసేన్ కి బావోలి-ఢిల్లీ

60 మీటర్లపోడవు,20 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బావి ఢిల్లీ కన్నాట్ ప్లేస్ కు దగ్గరలో ఉంది.10 3 చిన్న రాతి మెట్లుంటాయి .ఎర్రరాయి నిర్మితం .అగ్రసేన మహారాజు మొదట దీన్ని నిర్మిస్తే ,14 వ శతాబ్ది అగర్వాల్ వంశస్తులు పునర్నిర్మించారు .

5- నగర్ సాగర్ కుండ్-బుండి

రాస్తాన్ లో బుండీదగ్గరున్న నగర్ సాగర్ కుండ్  ఎదురెదురు మెట్లతో చోగాన్ గేట్ కు దగ్గర ఉంది .వీటికి జనానా సాగర్ ,గంగా సాగర్ దిగుడు బావులని పేరుండేది .తర్వాత రెండూ కలిపి నగర్ సాగర్ కుండ్ అంటున్నారు .మహారాజా రాం సింగ్ పాలనలో 1871 లోను ,1875 లోనూ మహారాణి చంద్రభాను కుమారి నిర్మించింది

6-అదలాజ్ దిగుడుబావి –అహమ్మదాబాద్

గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ కు సుమారు 20 కిలోమీటర్ల దూరం లో ‘’ఆదలాజ్ ని వావి ‘’ఉన్నది .దీనికి వెనుక విషాద గాధ ఒకటి ఉన్నది .ఈ ప్రాంతపు పాలకుడు దండైదేశ్ దీని నిర్మాణం మొదలు పెట్టగా 1499 లో ఒక ముస్లిం రాజు అతన్ని ఓడించి ,ఆ ప్రాంతాన్ని ఆక్రమించి ధ్వంసం చేశాడు .ముస్లిం రాజు కు ఓడిపోయిన హిందూ రాజు భార్యరాణి పై వ్యామోహం కలిగి కోరిక తెలియజేశాడు .ఆమె తనభర్త మొదలు పెట్టిన బావి ని ఆయన స్మృతి చిహ్నంగా పూర్తిచేస్తే అతడిని వివాహమాడతానని కబురు చేసింది . నమ్మిన ముస్లిం రాజు హిందూ ముస్లిం సంయుక్త శిల్పకళతో ఆ బావిని పూర్తిచేశాడు .బావి పూర్తి అవగానే రాణి అమాంతంగా అందులోకి దూకి మరణించింది .

7- రాణీ జీకి బావోరి –బుండి

రాజస్థాన్ బుండి లో రాణీ జీకి బావోరి అనే దిగుడుబావి గుజరాత్ లోని ప్రసిద్ధ రాణి కి వావ్ లాగా ఉంటుంది .1699 లో రాణి నాధావతి దీన్ని నిర్మించటం వలన ఆ పేరొచ్చింది .బుండీ లో దిగుడుబావులు చాలా ఉండటం చేత దాన్ని’’ దిగుడుబావుల నగరం’’ అంటారు .అక్కడి 50 బావుల్లో రాణి నాధావతి కట్టించినవే 21 ఉండటం విశేషం

8- తూర్ జి కా  ఝల్రా –రాజస్థాన్

1740 లో చారిత్రాత్మక కట్టడంగా నిర్మించబడిన తూర్ జీ కా ఝల్రా ఇటీవలికాలం లో త్రవ్వకాలలో బయట పడింది .స్వచ్చమైన జలం తో మిలమిల మెరిసే చేపలతో సుందరా తిసుందరంగా ఉంటుంది .

9-పన్నా మీనా కా బావోలి-అమేర్

రాజస్థాన్ జైపూర్-అమెర్ రోడ్డుపై అమేర్ లో పన్నా మీనాకా కుండ్ ఎనిమిది అంతస్తుల దిగుడుబావి.16 వ శతాబ్ది కట్టడం .నీటికోసమే కాకుండా,జలకాలాటలకు , ప్రశాంతంగా విశ్రాంతి గా  కూర్చోటానికి ,సమావేశాలు జరుపుకోవటానికి కూడా బాగుంటుంది.

10-లక్కుండి దిగుడుబావి- కర్నాటక

కర్ణాటకలో హంపీకి వెళ్ళే దారిలో లక్కుండి చిన్న గ్రామం .ఇది చాళుక్య దేవాలయాలకు ప్రసిద్ధి . టూరిజం డిపార్ట్ మెంట్ కు దీనిపై దృష్టి పడకపోవటం విడ్డూరం .కాని చరిత్ర ,పురావస్తు అభిమానుల పాలిటి దివ్యవరం ఇది .ఈ ప్రాంతం లో 100 దిగుడు బావులున్నాయి .దేనికదే ప్రత్యేకతతో శోభిస్తుంది .

11-సూర్యకుండ్ –మొధేరా

గుజరాత్ లో మోదేరావద్ద సూర్యకుండ్  దిగుడుబావి సూర్య దేవాలయం సమీపాన ఉంది .పుష్పావతి నది ఒడ్డున భీమదేవ మహారాజు 1026 లో నిర్మించాడు .ఇప్పుడు పురావస్తు శాఖ అధీనం లో ఉంది .రేఖాగణిత శాస్త్రానికి ఇది గొప్ప ఉదాహరణగా భావిస్తారు

12 హంపి పుష్కరిణి –కర్నాటక

చాళుక్య శిల్పకలళావైభవానికి అద్దంపట్టే దిగుడుబావి హంపీ పుష్కరిణి .  15 వశతాబ్ది కట్టడం .రోమన్ శిల్పకళ లో ఎలా నీటిని పారించే తూములు ఉండేవో  అలానే దీన్ని నింపటానికి వ్యవస్థ ఉంది .నల్లరాతికట్టడం .కళ హంగులు లేకుండా అత్యంత సాధారణంగా జ్యామితి ని దృష్టిలో పెట్టుకొని ఉదాహరణగా తీర్చి దిద్దబడిన దిగుడుబావి ఇది .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-7-18- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.