కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -4
కోనసీమలో ఉచ్చస్థితి లో ,స్వర్ణ యుగం గా ఉన్న శ్రౌత కార్యక్రమాలు 1980 నాటికి ప్రాభవం కోల్పోయాయి .కాని దెందుకూరి ,విష్ణు భొట్ల ,వంటి కొన్ని కుటుంబాలు మాత్రమే శ్రౌతాన్ని కొనసాగిస్తున్నాయి .1940లో శ్రీ డొక్కా రామయ్య అనే ధనిక వితరణ శీలి అయిన బ్రాహ్మణుడు వేద పండితులకు శ్రీరామ పురం అగ్రహారాన్ని ఇచ్చిఉండటానికి ఏర్పాటు చేశాడు .అప్పుడు 14 మాత్రమే బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి .ఈశ్వర ,రాధాకృష్ణ ,సూర్య ,అంబిక ,విఘ్నేశ్వరులతో కూడిన ఒక పంచాయతన దేవాలయం ఉండేది ,ఒకే ఒక్క మట్టి ముఖ్యవీది,ఒక చిన్న బడి ,పోస్టాఫీసు ,సుబ్రహ్మణ్య దత్తాత్రేయ మందిరాలు ఉండేవి .కుగ్రామమే అయినా ,వైదిక బ్రాహ్మణులు లౌకిక బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసేవారుకాదు .కనుక వేరు వేరుగా వైదిక ,లౌకిక బ్రాహ్మణులు నివసించేవారు .ఆహితాగ్ని లు ఆహితాగ్నిలు కాని వారింట భోజనం చేసేవారుకాదు వారి ఆడవారు వండినా తినే వారుకాదు . దీనికి దగ్గరలో ప్రధాన రహ దారికి బహుదూరం లో కామేశ్వరి అగ్రహారంలో కొద్దిమ౦ది బ్రాహ్మణులుండేవారు .వేద విధానం ఉచ్చస్థితిలో ఉన్నాకూడా ,త్రేతాగ్నులను అర్చిస్తున్న ఆహిఆగ్నులు, వేదపండితులుతమపిల్లలకు నేర్పుకొంటూ ఈరెండు అగ్రహారాలలో ఉండేవారు .ఈ రెండూ అమలాపురం కాలువకు చెరి ఒకవైపున ఉండేవి .శ్రీరామ పురానికి మైలున్నరదూరం లోఉన్న వ్యాఘ్రేశ్వరం ఒకప్పటి అగ్రహారం .ఇక్కడ ముగ్గురు ఆహితాగ్నులు ఉండేవారు .అంటే అతి సమీపం లో ఉన్న ఈ గ్రామాలలో మొత్తం మీద ఏడుగురు ఆహితాగ్ని లుండేవారు .గోదావరి నదిపై ఉన్న ఇరగవరం బ్రాహ్మణపల్లెలో వేదపండితులు ఎక్కువ .
బ్రహ్మశ్రీ భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి
కోన సీమలోని లోని శ్రీరామపురం అగ్రహార వాసి బ్రాహ్మశ్రీ భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి గారు .వీరిని అందరూ ‘’బాబళ్ళశాస్త్రి గారు ‘’అని పిలుస్తారు .వీరింట్లో మిగిలిన ఆహి తాగ్నిల ఇళ్ళల్లో లాగానే కుక్కలు ,పిల్లులు కనిపించవు .అదొక నియమం వారికి .శ్రౌత కర్మల సందర్భం లో ఇంట్లో కూర్మం అంటే తాబేలు తిరగాలి .అప్పుడు దాన్ని అతిజాగ్రత్తగా కాపాడుకొంటారు .
భమిడిపాటి యజ్ఞేశ్వర సోమయాజి గారు శ్రీ వత్స గోత్రీకులు .1930 లో జన్మించారు .దాదాపు ఇరవై వ శతబ్దం అంతా జీవించారు .బయట అరుగు పై కూర్చుని అందరితో సంభాషించేవారు .తొంభైవ పడికి దగ్గర పడుతున్న కొన్ని నెలలవరకు ఈ వ్యాసంగం సాగింది .భారత దేశం లో 19 ,20 శతాబ్దాలలోని ఆహితగ్ని లలో ఉత్కృష్టమైన వారు గా గణన కెక్కిన మహాను భావులాయన .ఆయన కుటుంబం లో మూల పురుషులు 18 వ శతాబ్దికి చెందిన భమిడిపాటి బ్రహ్మీకృత ఆచార్యులు .వివాహమాడి సంతానం పొందకుండానే సన్యసించిన వారాయన .అదొక గొప్ప విషయంగా ఆనాడు చెప్పుకునేవారు .తండ్రి తరఫు వారిలో వీరభద్ర సోమయాజి ,అచ్యుతరామ సోమయాజులు ,యజ్ఞేశ్వర సోమయాజులు చిన సుబ్రహ్మణ్య సోమయాజి ,ముఖ్యులు . వీరిలో చిన సుబ్రహ్మణ్య సోమయాజులుగారే బాబళ్ళ సోమయాజులగారి తండ్రిగారు .తల్లిగారు ఆకెళ్ళ వేద కుటుంబానికి చెందిన కామేశ్వరి .ఈ అయిదవతరం వారు ఆరవతరానికి జన్మ నిచ్చి ఆరుగురు కుమారులను కన్నారు. ఈ ఆరుగురూ ఆహితాగ్నులే .ఇందులో అయిదుగురు సోమయాజులయ్యారు .ఆరవ ఆయన కూడా అయ్యేవారు కాని అగ్ని స్టోమమ దశలో చనిపోయారు .
బాబళ్ళ గారి ఒకే ఒక కుమారుడు ‘’బుల్లెబ్బాయి ‘’అని పిలువబడే సుబ్రహ్మణ్య సోమయాజి అంతుపట్టని వ్యాధులతో ఇబ్బందిపడి వేదపండితుడు కాకుండానే మరణించి పుత్రశోకం కలిగించగా ,ఇరవై రోజుల ఏకైక కుమార్తెకూడా చనిపోవటం ఆ కుటుంబానికి ఆశినిపాతమైంది .కాని కొడుకు బుల్లెబ్బాయికి సోమశేఖర ,యజ్ఞేశ్వర ప్రసాద్ ఇద్దరు కొడుకులు .సోమశేఖర ను బాబళ్ల గారి చిన్న తమ్ముడికి పెంపుడిచ్చారు .యజ్ఞేశ్వర ప్రసాద్ కు ముగ్గురు అందమైన కూతుళ్ళు .మగసంతానం లేదు .అందుకని బాబళ్ళవారి వంశం ఆగిపోయింది . ఈ ముగ్గురు కుమార్తెలే బ్రాహ్మీ భూతులవారి తొమ్మిదవ తరం వారు .
స్కూల్ టీచర్ అయిన యజ్ఞేశ్వర ప్రసాద్ ,భార్య లక్ష్మి వీధి మొదటి ఇంట్లో ఉంటూ అతిధి అభ్యాగతులకు స్వాగతం పలికి ఆతిధ్యమిచ్చి తృప్తి పడుతున్నారు .1961 లో పుట్టిన బాబళ్ళ వారి మనవడు యజ్ఞేశ్వర వెంకట సత్య సూర్య రామ సుబ్రహ్మణ్య సోమయాజి ఏడవతరం సోమయాజి అవ్వాల్సినవాడు కాలేకపోయాడు .
బాబళ్ళ వారు ముక్కామలలో జన్మించినా ,దగ్గరలోని ఇరుసుమండ గ్ర్రామం లో మేనమామలింట పెరిగారు. బాబళ్ళ వారి భార్య సుందరి ,ఆకెళ్ళ సుబ్బావదానిగారి కుమార్తె .ఆయనకంటే ఆరేళ్ళు చిన్నది .ఇరుసుమండ లో ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు .ఆయన కు తొమ్మిదో ఏటనే తెలుగు రాయటం చదవటం వచ్చేశాయి .ఆమె మూడవ తరగతిలో ఉండగా ఆయనకు 18, ఆవిడకు 12 వ ఏట ఐదురోజుల వివాహం జరిగి 71 ఏళ్ళు దాంపత్య జీవితాన్ని అనుభవించిన జంట అయ్యారు .మొదట్లో ముక్కామలలో కాపురం పెట్టినా, తర్వాత శ్రీరామ పురం చేరారు .
బాబళ్ళ గారి తండ్రి తనకొడుకులకేకాక చాలామందికి విద్యాగురువు .శ్రీరామపురం లో రెండవ ఆహితాగ్నిగా గుర్తింపు పొందినవారుకూడా .అప్పుడు ముక్కామాలలో 20 మంది వేదపండితులు ఉండేవారు .కొందరు సమీప గ్రామాలనుండి తెరచాప పడవ లో కాలువ దాటి ,కొందరు ఫంట్ లలో లేక ఆ ఒడ్డునా, ఈ ఒడ్డునా పాతబడిన కొయ్య స్తంభాలకు కట్టిన తాడును ఆధారంగా వచ్చేవారు ,దువ్వూరి యాజులు అనే ఆయన కపిలేశ్వర పురం నుంచి వచ్చేవాడు. బాబళ్ళ తండ్రి గారు వేదాన్ని వల్లిస్తూ తదేక ధ్యానం లో ఉంటె ,’’పిల్లలమైన మేము ఒంటేలి కని , రెండేళ్ళ కనీ సాకుతో నెమ్మదిగా జారుకొనే వాళ్ళం’’ అని దువ్వూరి గుర్తు చేసుకున్నారు
బాబళ్ల శాస్త్రి దంపతుల ఫోటో జతచేశాను చూడండి .
సశేషం
గురు పూర్ణమి శుభా కాంక్షలతో ..
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-18 –ఉయ్యూరు