కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -5
బాబళ్ళ శాస్త్రి గారు 82 పన్నాలు పూర్తి చేయగానే,తనకు సంక్రమించిన’’ గంగలకుర్రు పొలాలపై అజమాయిషీ చేస్తూ , ,కొద్దిమందికి వేదపాఠాలు చెబుతూ ,తాను తైత్తిరీయ శాఖపై సాధించిన పట్టు ను నిలబెట్టుకొంటూ మరింత ముందుకు సాగారు .వేదం ,శ్రౌతం ,ధర్మ శాస్త్రం, మీమాంస , జ్యోతిషం,వేదాంతం, వ్యాకరణం మొదలైన వాటిపై లోతైన అవగాహన సాధించి తన జ్ఞాన తృష్ణ తీర్చుకున్నారు .అనునిత్యం వీటిని స్పృశిస్తూ అవగాహన పెంచుకున్నారు .వార్ధక్యం లో కూడా ,చెవుడు వచ్చినా కళ్ళు సరిగ్గా కనిపించక పోయినా ,రోజూ ఏదో ఒక తాటాకు గ్రంధాన్ని కంటి సులోచానాలకు రెండుమూడు అంగుళాల దూరం లో ఉంచుకుని పరిశీలించేవారు .అంతటి విజ్ఞాన తృష్ణ ఉండేది .
తమ తండ్రిగారు తన జీవితం లో ఆర్దికబాధలకు గురికాకుండా ఆర్దికసౌకర్యం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొనేవారు .తండ్రిగారితో తన అనుబంధం చాలా గొప్పదని అనేవారు .తన చదువు నిరాటంకంగా సాగాలని తండ్రి కోరేవారు .ప్రతి విషయం పై ఆయనే శ్రద్ధ చూపేవారు .తనకే రకమైన ఇబ్బంది కలిగించలేదు .యవ్వనమంతా ఉయ్యాలలో ఊగుతూ సుఖ సంతోషాలతో గడిపారు .తండ్రిగారి కంటే తక్కువ మంది విద్యార్ధులను చేర్చుకొని వారిపై పూర్తీ అంకితభావం తో బోధించేవారు .గ్రంథ పఠన కాలం లోకూడా నలుగురు విద్యార్ధులు ఇంట్లో ఉండేవారు .తన మనవడు ప్రసాద్ కు కూడా 82 పన్నాలు 19 71 నుండి 19 80 వరకు తొమ్మిదేళ్ళు క్షుణ్ణంగా నేర్పిన గురూత్తములాయన .పరీక్షలకు కట్టకపోయినా ప్రసాద్ 1986 లో దగ్గర స్కూల్ లో స్కూల్ మాస్టర్ అయ్యాడు.తాతగారితో నిత్యం పొలాలకు వెళ్లివచ్చేవాడు .అతని సహాధ్యాయులు చిర్రావూరి రామం ,శ్రీపాద మాణిక్య ,,ప్రభల కృష్ణమూర్తి ,సామవేదం నారాయణ .వీరిలో ఎవరో ఒకరు ప్రసాద్ వెంట తాతగారితో వెళ్ళేవారు .వీరుకాక ఆయనవద్ద నేర్చిన వారు కోనసీమలో చాలామంది వేదపండితులైనారు.పొలాల గట్లమీదో, కొబ్బరి చెట్ల నీడనో కూర్చుని వీరు అధ్యయనం సాగిస్తూ కన్పించేవారు .వీరిని శాస్త్రిగారు పర్యవేక్షిస్తూ ఉండేవారు .మధ్యాహ్న సమయానికి ఇంటికి చేరి ఉదయ పాఠాలను సమీక్షి౦చుకోనేవారు .నాగలిపట్టి భూమిని దున్నగలిగే శాస్త్రిగారు ముసలితనం లో పర్యవేక్షణకే పరిమితమయ్యారు .
వేదపరీక్షలను నిర్దుష్టంగా కఠినంగా జరిపేవారు శాస్త్రి గారు .అందుకే మనవడు ప్రసాద్ పరిషత్ పరీక్షలకు హాజరవ లేదు .శాస్త్రి గారు ,మరికొందరు సహాధ్యాయులైన వేదపండితులు కలిసి తాము కొంత ధనం వేసుకుని, కొంత వితరణ శీలురవద్ద సేకరించి ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు .దీనితో వేదం సంస్కృతం ,శ్రౌతం స్మార్తం ,అపరం ,ఆగమం ,మీమాంస ,వ్యాకరణం మొదలైన విషయాలపై అమలాపురం ,రాజమండ్రి ,మొదలైన చోట్ల లో సభలు జరిపి పరీక్ష లు నిర్వహించి ఉత్తీర్నులైనవారికి పురస్కారాలు అందించారు .1987 వైశాఖమాసం లో వ్యాఘ్రేశ్వర గ్రామం ముందుకు వచ్చి వీటికి పూర్తి సహకారం అందించి ,ఆతిధ్యమిచ్చింది .30 మంది వేదం లో ,నలుగురు స్మార్తం లో ,ఒకరు ఆగమం లో పరీక్షనిచ్చారు. వీరంతా పది నుంచి పన్నెండేళ్ళు కస్టపడి విద్యనేర్చినవారే .రెండు రోజుల పాటు వివిధ శాస్త్రాలలో , ,వేదపారాయణ లో పరీక్షలు నిర్వహించి ,రెండవ రోజు సాయంత్రం ఉత్తీర్ణు లైనవారినీ, ,నిష్ణాతులైన గురువులను ఘనంగా సన్మానించి చిరస్మరణీయం చేశారు .ఉత్తీర్ణులైన విద్యార్ధులకు 150 నుంచి 200 రూపాయలవరకు ప్రోత్సాహక నగదు పారితోషికాలను అందజేశారు .
శాస్త్రిగారికి నడి వయస్సు నాటికి కుటుంబం లో శ్రౌతం ఉత్కృష్ట స్థితిపొంది ,ఆహితాగ్నులు పెరిగి తానుస్వయంగా ఏదీ చేసుకోవాల్సిన అవసరం కలగలేదు .ఆయనకు ఎన్నో చోట్లనుండి ఆహ్వానాలు వచ్చాయి .కాని వెళ్ళటానికి ఇష్టపడలేదు .’’వెళ్ళే ధైర్యం నాకు లేకపోయింది ‘’అని నవ్వుతూ చెప్పేవారు .1959 లో 55 వ ఏడు వచ్చేదాకా నిత్యాగ్ని హోత్రానికి ఆధానం చేసేవారు.ఆరునెలల తర్వాత’’అగ్ని స్టోమం ‘’ మొదటి సోమ క్రతువు చేశారు .దీనినే కోనసీమలో యజ్ఞం అంటారు .దగ్గరలో నేదునూరు గ్రామవాసి ,ఆయన స్నేహితుడు ,వేదం లో విశేషమైన ప్రాభవం ఉన్న లంకా వెంకటరామ శాస్త్రిగారు అధ్వర్యు గా వ్యవహరించారు .లంకావారు కొద్ది రోజుల్లో అగ్ని స్టోమం పూర్తి చేసే ఏర్పాట్లలో ఉన్నారు .శాస్త్రిగారి యజ్ఞం అందరిలో గొప్ప ఉత్సాహం కలిగించి శ్రౌతానికి మహోన్నత దశ అయింది .ఇలా అయిదేళ్ళు గడిపారు..ఆయన గౌరవం విపరీత౦ గాపెరిగి కుటుంబం లో అగ్రహారాలలో కోససీమ అంతా ఆయనకు బ్రహ్మ రధం పట్టింది .’’నా పూర్వీకులు చేసిన దానినే నేనూ కొనసాగిస్తున్నాను అన్న సంతృప్తి నాది ‘’అనే వారాయన .అగ్ని స్టోమం తర్వాత ‘’శ్రావణ పశు ‘’ నిర్వహించారు .1960 లో భాద్ర పదమాసం లో ‘’అరుణ కేతుక ‘’చేశారు .ఇందులోఅగ్ని హోత్రం లో ప్రతీకాత్మక ఇటుకలు , నీటి నైవేద్యం ఉంటాయి,శాస్త్రిగారి పెంపుడు తాబేలు దీనికి సహకరి౦చి౦ది . దీనికి 12 రోజులు మదూకరం ఎత్తాలి .ఎప్పుడో బ్రహ్మ చర్యం లో చేసింది ఇప్పుడు మళ్ళీ చేయటం అన్నమాట .చాతుర్మాస్య ఆహుతులను సమర్పించాలి .కొత్తపంట చేతికి వచ్చే సమయం లో ‘’అగ్రయనం ‘’చేయాలి .ఇలా శాస్త్రి గారు అర్ధా౦గి సుందరి దంపతులు 1990 లో ఆయన 87 వ ఏడు ,ఆమెకు 81 వచ్చేదాకా చేశారు . .1991 లో ఇద్దరూ చెవిటి వారు ఆవటం తోదీన్ని మొట్టమొదటి సారి గా వదిలేశారు.యధావిధిగా నిత్యాగ్ని హోత్రం ఇష్టి చేశారు .
శాస్త్రిగారి ప్రత్యేకత దీర్ఘకాలం నిర్వహించే నక్షత్ర ,లేక పవిత్ర హోమాలలో కనిపిస్తుంది .సాధారణంగా గ్రహశాంతి కోసం నవగ్రహ పూజలుచేసి , దానాలు ఇస్తూ ఉంటారు .శ్రీరామ పురానికి నడక దూరం లోనే శనీశ్వర దేవాలయం మందపల్లి లో ఉంది .హిందువులతోపాటు ముస్లిం లు, క్రిస్తియన్లు కూడా ఈ దేవాలయం దర్శించి శనిబాద నివృత్తి చేసుకొంటారు .శాస్త్రిగారు ఏనాడూ మందపల్లి వెళ్లనూ లేదు లేక మరో చోటనైనా నవగ్రహ పూజ చేయలేదు .శాస్త్రిగారు నలభై రోజుల నక్షత్ర ఇష్టి మాత్రం చేసేవారు .1960 వరకు ఇవి నిరాటంకంగా సాగాయి .అది ఆయన శక్తి పరవళ్ళు తొక్కిన కాలం .ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి .చయనం లో యజమాని దీక్ష తీసుకోకుండా యజ్నవాటిక ఇటుకలు తాకరాదు.తాకితే చేతికి గ్లోవ్స్ లేకుండా ఎలక్ట్రీషియన్ విద్యుత్ప్రవహించే తీగలను ముట్టుకొంటే ఎలా షాక్ తగిలి చస్తాడో అలా అగ్ని దేవుడు దహిస్తాడు అని నమ్మకం .సోమాన్ని అగ్నిలో వ్రేల్చి సోమయాజి అయితే జీవితాన్ని సరైన మార్గం లోఅంటే గాడిలో బండి నడిచినట్లు హాయిగా గడపగలడు.
సశేషం
గురుపౌర్ణమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-7-18 –ఉయ్యూరు