గురు పూర్ణిమ –వ్యాసజయంతి
వ్యాస అష్టోత్తర స్తోత్రం
‘’1-వేద వ్యాసో విష్ణు రూపః పరాశరార్యాస్తపోనిదిః -సత్య సందః ప్రశాంతస్య సత్య వాదీ సుతః
2-కృష్ణ ద్వైపాయనో దాంతో బాదరాయణ సంజ్ఞితః -బ్రహ్మ సూత్ర ప్రథితవాన్ భగవాన్ జ్ఞాన భాస్కరః
3-సర్వ వేదాంత తత్వజ్ఞః సర్వేజనా వేద మూర్తిమాన్-వేద శాఖావ్యసన కృత కృత్యో మహా మునిః
4-మహా బుద్ధిర్మహాసిద్ధిర్మహా శక్తి ర్మహా ధృతిః మహా కర్మా మహా ధర్మా మహా భారత కల్పకః
5-మహా పురాణ కృజ్ఞానీ జ్ఞాన విజ్ఞాన భాజనం -చిరంజీవీ చిదాకారీ శ్చిత్త దోష నివారకః
6-వాశిష్ఠః శక్తి పౌత్రస్య శుకదేవర్గుర్గురుహః -ఆషాఢ పూర్ణిమా పూజ్యా పూర్ణ చంద్ర నిభాననః
7-విశ్వనాథ స్తుతికరో విశ్వజనో జగద్గురుః – జితేన్ద్రియో జితక్రోధో వైరాగ్య నిరతః శుచిః
8-జైమిన్యాది సదాచార్యః సదాచార సదాస్థితః స్థితప్రజ్ఞః స్థిరమతిః సమాధి సంస్ధితారతహః
9-ప్రశాంతిదః ప్రసన్నాత్మా శంకరార్యప్రసాద కృత్ -నారాయణాత్మకః స్తవ్యః సర్వ లోక హితే రతః
10-అఛత్రవదన బ్రహ్మ ద్విభుజ పర కేశవః -అఫాల లోచనశ్శివః పరబ్రహ్మ స్వరూపకః
11- బ్రహ్మణ్యో బ్రహ్మణో బ్రాహ్మీ బ్రహ్మ విద్యా విశారదః -బ్రహ్మాత్మైకత విజ్ఞాతా బ్రహ్మ భూతః సుఖాత్మకః
12-వేదాంగ భాస్కరో విద్వాన్ వేద వేదాంత పారగః -ఉపాంతరతమో నామా వేదాచారో విచారవాన్.
వ్యాసునిపై కొన్ని ప్రత్యేక శ్లోకాలు
1-వేద వ్యాసః స్వాత్మ రూపం సత్య సంధం పరాయణం – శాంతం జితేంద్రియ క్రోధం సా శిష్యం ప్రణమామ్యహం
2-వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌరుష మకల్మషం -పరాశరాత్మజం వ౦దే శుక తాతం తపోనిధిమ్
3-వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే -నమో వై బ్రహ్మ నిధ్యాయ వాసిష్టాయ నమోనమః
4-అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే -సదైక రూప రూపాయ విష్ణవే సర్వ జిష్ణవే
5-వ్యాస స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే -నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే
పరాశర స్తుతి
6-కరుణాతీత చిద్రూపం పరి పూర్ణ పరాయణం – పరమానంద సంతుష్టం పరాశర మొహం శ్రయే
శుక స్తుతి
7-త్రికాలాతీత చిన్మాత్ర ప్రశాంత స్వా0త సంయుతం -వికార ఘోర సంస్కృష్టం శుకం గురు మోహం శ్రయే
శంకరాచార్య స్తుతి
8–శంకా రూపేణ మచ్చిత్తం పంకీకృత మాభూద్యేయా -కింకరీ యస్య సా మాయా శంకరాచార్య మాశ్రయే
భావం -మాయ అందర్నీ కప్పి ఆడిస్తుంది .మనసు బుద్ధిలలో కల్లోలాలు తుఫాన్లు సృష్టిస్తుంది .అలాంటి మాయను కింకరి అంటే సేవకురాలినిగా చేసుకొన్నశంకరాచార్యులు ప్రణామం .
వేద వ్యాస చరిత్ర
నేపాల్ దేశం లో తానాహుజిల్లా ‘’దమౌళీ ‘’లో వ్యాసుడు తపస్సు చేసి బ్రహ్మ సూత్రాలు పురాణాలు వేద విభజన చేసిన గుహ ఉంది. అది గొప్ప యాత్రాస్థలం .విష్ణు మూర్తి యొక్క ‘’కాలావతారం ‘’వ్యాసుడు .చిరంజీవులలో ఒకడు .అద్వైత ఋషిపరంపరలో నాల్గవవాడు .ప్రతి యుగం లో ఒక వ్యాసుడు పుడతాడు .వ్యాసుడు అనేది ఒక అధికారం .ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు లేక బాదరాయణుడు వ్యాసుడయ్యాడు .వ్యాస పరంపరలో 28 వ వాడు .మొదటి ద్వాపరం లో స్వాయంభువు వ్యాసుడు అయ్యాడు .రెండవ ద్వాపరం లో ప్రజాపతి వ్యాసుడు .మూడవదానిలో శుక్రుడు వ్యాసుడు .ఆ తర్వాత వసిష్ఠుడు ,త్రివర్షుడు ,సనద్వాజుడు వగైరా 27 మంది వ్యాసులు అయ్యాక ద్వాపరం లో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అయ్యాడు .
విష్ణు మూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టి నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలను ప్రసరింప జేయాలనుకొన్నప్పుడు విష్ణువు మనసులో తలచుకోగానే ‘’అపాంతర తముడు ‘’జన్మించాడు .పుత్రోత్సాహం తో నారాయణ మూర్తి ‘’వ్యాసా !రా నాయనా !నా మానస పుత్రుడివిగా పుట్టి నాకు ఆనందాన్నిచ్చావు .అన్ని మన్వంతరాలలోనూ ఇలానే జన్మించు .తర్వాత పరాశర కుమారునిగా పుట్టి ,కురురాజుల అధర్మ క్రూర హింసా దౌర్జన్యాలను అదుపు చేసి ,వేదాన్ని వ్యాపకం చెయ్యి .నీకు రాగద్వేష రహితుడైన కొడుకు పుట్టి నిన్ను మించిపోతాడు ‘’అన్నాడు .రాబోయే సూర్య సావర్ణికాలం లో వ్యాసుడు సప్తర్షులలో ఒకడు అవుతాడు . .
కృష్ణ ద్వైపాయన వ్యాస జననం
లోకోద్ధరణకోసం నారాయణుడు కొన్ని ధర్మాలు ఏర్పాటు చేశాడు. కాలక్రమంలో అవి లోపించాయి .బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని దర్శించి ధర్మ పునరుద్ధరణ చేయమని ప్రార్ధించగా మూడవదైన ద్వాపర యుగం లో పరాశార సత్యవతి దంపతులకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడునారాయణుడు వ్యాసభగవానుడుగా అవతరించాడు ..ఒక రోజు వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి తపోధ్యానాలు పూర్తి చేసి ఏకాంతం లో ఆసీనుడై దివ్య దృష్టితో యుగ విశేషాలను తెలుసుకున్నాడు .కాల ప్రభావాన భౌతిక భావనలు అంటే శక్తులు తగ్గుతున్నాయని గ్రహించాడు .శ్రద్ధ బలం ఆయుస్సు తగ్గి దౌర్బల్యం పెరిగి నట్లు గుర్తించాడు .అన్ని వర్ణాలవారికి ఉపయోగ పడేట్లు వైదిక కర్మలను పరీక్షించి యజ్ఞ విస్తరణకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు .పంచమ వేదంగా మహా భారతం రచించాడు .పైలుడికి ఋగ్వేదం ,వైశంపాయుడికి యజుర్వేదం జైమినికి సామం ,సుమంతునికి అదర్వణం ఉపదేశించాడు .ఇతిహాస పురాణం అనే పంచమ వేదం భారతాన్ని రోమ హర్షుడు అనే సూతమునికి చెప్పాడు .వీరంతా తమ శిష్యులకు బోధిస్తే వారు వారి శిష్యులకు ఉపదేశించగా అనేకశాఖలయ్యాయి .
కొంచెం బుద్ధి తక్కువ గా ఉన్నవారికి ఉపాఖ్యాన కథా రూపం గా మహాభారతం రాశాడు దీనిలో ధర్మం సంస్కృతీ మొదలైన విషయాలన్నీ చెప్పాడు వ్యాసుడు .ద్వాపరాంతం లో వచ్చే కలియుగం లోవచ్చేఅనర్దాలు,ఆపద గ్రహించటానికి భారత రచన చేశాడు .అన్ని వర్ణాలవారు జాతులవారు లింగ వయో భేదం లేకుండా ఆచరించదగిన ధర్మాలు ధర్మ సూక్ష్మాలు చిన్న చిన్న కథలలో చెప్పాడు .
దీనితో తృప్తిపడక జ్ఞానులకు పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటానికి 545 బ్రహ్మ సూత్రాలు రాశాడు. దీనికి శంకరాచార్య భాష్యం రాశారు ..అష్టాదశ అంటే 18 పురాణాలు రచించాడు. వేదానికి అంతాలైన ఉపనిషత్తులు రాశాడు.వీటిలో దశోపనిషత్తులకు శంకర భాష్యం ఉంది . అంతా బాగానే ఉంది కానీ సర్వ వ్యాపకుడైన పరమేశ్వరుడి గురించి భక్తి తాత్పర్యాలతో రాయలేక పోయానని చింతి స్తుంటే నారద ముని హితోపదేశం తో శ్రీ విష్ణు లీలామృతమైన శ్రీ మద్ భాగవతం రాశాడు ..దీన్ని పోతనామాత్యుడు మందార మకరంద తుందిలంగా తెలుగులోకి అనువదించాడు .భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రనలనే కవిత్రయం అనువదించారు ..ఇవన్నీ లోక శ్రేయస్సుకోసం రాయబడినవే .భారతం హరివంశం కలిపి 1 లక్షా 25 వేలు ,పురాణాల్లో 5 లక్షల శ్లోకాలు మొత్తం 6 లక్షల 25 వేల శ్లోకాలు రాశాడు భగవాన్ వేదం వ్యాసుడు .. భారతం చివరలో వ్యాసుడు -’’యదాహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి సతత్ క్వచిత్ ‘’ అని ఒక ప్రతిజ్ఞ చేశాడు-అంటే ‘’భారతం లో లేనిది ఎక్కడా ఉండదు -ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు ‘’శాంతి ఆనుశాశానిక స్వర్గా రోహణ పర్వలలో 26 వేల శ్లోకాలలో రాజనీతి,ఆపద్ధర్మాలు ,దాన0 ధర్మం ,మోక్షప్రాప్తి,స్త్రీ ధర్మాలు విడి విడిగా చెప్పాడు .అంటే పాత్రలచేత చెప్పించాడు .భారతం లోని పాత్రలు మనమే. మన ఇళ్లల్లో జరిగే కథయే భారత కధ ..
ఇన్ని ఇన్ని రకాలుగా చెప్పినా పెడ చెవిని పెట్టి వారిని చూసి జాలితో బాధతో వ్యధతో ‘’ఊర్ధ్వ బాహుః విరోమ్యేష నహి కశ్చిత్ శృణోతిమే -పరోపకారాయ పుణ్యాయ ,పాపాయి పర పీడనం ‘’అని చేతు లెత్తి మొక్కాడు -అంటే‘’ఇతరులకు మేలు చేస్తే పుణ్యం -ఇతరులను బాధిస్తే పాపం ‘’అని చేతులు పైకెత్తి నెత్తీ నోరూ మొత్తుకున్నా నా మాట ఎవరూ వినటం లేదే ‘’అని పరితపించాడు ఆ విశాల దయార్ద్ర హృదయుడు వ్యాస భగవానుడు .
భారతం లో వ్యాస పాత్ర
భారత రచన చేయటమేకాక అందులో తానూ పాత్రధారియే వ్యాసుడు .తల్లికిచ్చిన మాటకోసం కురు వంశాన్ని నిలపటానికి పాండవ ధృతరాష్ట్ర విదురులకు జన్మ నిచ్చాడు .అవసరమైనప్పుడు రంగ ప్రవేశం చేసి ధర్మ సూక్ష్మాలు చెప్పాడు అర్జునుడు మత్శ్య యంత్రాన్ని భేదించి ద్రౌపదిని దక్కించుకొంటే ధర్మరాజు ఆమె సోదరులందరికి భార్య అవ్వాలంటే ద్రుపదుడు వ్యాసుడిని తలచుకొంటే వచ్చి ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు అయోనిజ యాజ్ఞ సేనీ కనుక పంచ భర్త్రుక అవటం లో తప్పు లేదని తీర్పు చెప్పాడు .వనవాసం లో పాండవులు కస్టాలు పడుతూ ప్రార్ధిస్తే ‘’మీకే కాదు కస్టాలు మీ ముందు నలమహారాజు దమయంతి ఎన్నో కష్టాలుపడి చివరికి సుఖపడ్డారని ఆ కద చెప్పి ఊరట కలిగిచాడు .అర్జుడిని శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించమని సలహా ఇచ్చాడు .కురుపాండ బలాలను బేరీజు వేసి చెప్పమని గుడ్డిరాజు కోరితే ధర్మ0 కృష్ణ రూపం లో పాండవుల వద్ద ఉంది ధర్మం ఉన్న చోట విజయం తప్పదు అని నిష్కర్షగా చెప్పాడు ..కురుక్షేత్ర సంగ్రామం ముందు వచ్చి ‘’నువ్వు తెచ్చిన యుద్ధం యెంత అనర్ధాన్ని తెస్తోందో చాడాలని ఉంటే కళ్ళు ఇస్తానంటాడు .చేసిన తప్పు తెలుసు కనుక తాను ఆ భీభత్సాన్ని చూసి తట్టుకోలేను అంటే సూతుడికి దివ్య దృష్టి ప్రసాదించి యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం గా చూసి గుడ్డిరాజుకు చెప్పించాడు .
అశ్వత్ధామ కృష్ణార్జునులపై నారాయణాస్త్రం స౦ధించగా వారిద్దరూ దానికి నమస్కరించగానే అది నిర్వీర్యమై పొతే ,కారణం తెలీక జుట్టు పీక్కొని వ్యాసుని స్మరిస్తే వచ్చి ‘’మీ, మీ శివ పూజా ఫలితం ఇది .వాళ్లిద్దరూ పూర్వ జన్మలో శివుడిని మట్టి లింగంగా చేసి ఆరాధిస్తే, నువ్వు విగ్రహ రూపం లో పూజించావు . లింగా రాధన సర్వ శ్రేయస్కరం .అది వారిని కాపాడింది ‘’అని ధర్మ సూక్షం చెప్పాడు .వ్యాసునికి ఆంద్ర దేశానికీ సంబంధం ఉంది .ఏడు రోజులు కాశీలో వ్యాసునికి శిష్యులకు భోజనం దొరక్కపోతే కోపం తో కాశీని శపించాలని సంకల్పించి భిక్షా పాత్రను నేలమీద శతధా భిన్నం అయేట్లు పగలకొడితే ముదుసలి సాధ్వీరూపం లో పార్వతీదేవి వచ్చి విందుకు ఆహ్వానించి కమ్మని భోజనం పెడితే అప్పుడు శివపార్వతులు వారి వద్ద ప్రత్యక్షమవగా శివుడు కోపం తో ‘’పుణ్యరాశి కాశీ పైశాపం పెడతావా పొమ్ము నిర్భాగ్య మా యూరి పొలము విడిచి ‘’అని కాశీనుంచి గెంటేస్తే బ్రతిమాలితే, దక్షిణకాశి దాక్షారామం వెళ్లి భీమేశ్వర సేవలో తరించమని చెబితే విడవ లేక విడవ లేక ద్రాక్షారామ చేరగా అక్కడ అగస్త్య మహర్షి ఊరట కలిగిస్తాడు .బాసర సరస్వతీ ఆలయం మనకు తెలుసు. వ్యాస బాసర అయింది
అలాగే కాశ్మీర్లో ప్రవహించే బియాస్ నది అంటే వ్యాస నది అని అర్ధం . ఇలా ప్రకృతితో మమేక మైనవాడు వ్యాసుడు .
రెండు చిలుకలు సంసార0 చేస్తుంటే ముచ్చటపడి తనకు ఒక కొడుకు కావాలనుకొని హిమాలయాలకు వెళ్లి’’శక్తిని గూర్చి తీవ్ర తపస్సు చెస్తే ,తపోభ0 గానికి వచ్చిన ఘృతాచి అనే అప్సరస చేసిన ప్రయత్నాలు ఫలించక చిలుక రూపం లో వస్తే రేతస్కలనం జరిగి పుట్టిన కుమారుడే శుకమహర్షి .ఆయన మూతి చిలక మూతిలాగా ఉంటుందంటారు .పుట్టగానే సకలశాస్త్రాలు వచ్చేశాయి. జనకమహా రాజు వద్ద బ్రహ్మ విద్య నేర్చాడు . పరీక్షిత్తుకు ఏడు రోజులలో మహా భారత కథ అంతా చెప్పాడు శుకమహర్షి . నిరీహుడు నిస్సంగుడు శుకుడు . తండ్రి పరాశరుని పేర పరాశర సంహిత ఉంది .ఆంజనేయ చరిత్ర అంతా అందులో ఉంటుంది .
ఇంతటి జ్ఞానాన్ని ధర్మాలను నీతులను అక్షరరూపం గా ప్రసాదించిన భారత జాతి వ్యాసభగవానునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు కనీసం వ్యాస పూర్ణిమ నాడైనా ఆ గురుమహారాజు ను స్మరిద్దాం .ఇలాంటి అరుదైన అవకాశం అమెరికాలో షార్లెట్ లో సరసభారతి 104 వ సమావేశంగా వ్యాస జయంతిని తమ ఇంట్లో జరిపించిన రాంకీ ఉషా ద0పతులకు ,ఆసక్తిగా వచ్చి పాల్గొన్న వారందరికీ సరసభారతి ధన్యవాదాలు తెలియ జేసింది .ప్రతి సంవత్సరం మా అమ్మాయి శ్రీమతి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ అవధాని శంకర జయంతి జరుపుతున్నట్లే వ్యాస జయంతి ని గురుపౌర్ణమిగా నిర్వహించాలని ఈ దంపతులను కోరుతున్నాను ‘’
అని చెప్పి ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆచరిస్తూ నిలబెడుతున్న చి అడుసుమిల్లి రామకృష్ణ(రాంకీ ) కు సరసభారతి ఆనందంగా ‘’సంస్కృతీ ప్రదీపక ‘’బిరుదు ప్రదానం చేస్తున్నానని అనగానే అందరు హర్ష ధ్వానాలతో చప్పట్లు మోగించారు .సరసభారతి గ్రంధం ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం ) రాంకీ దంపతులకు మా ద0పతులం కానుకగా అంద జేశాము . మంత్ర పుష్పం తో కార్యక్రమం పూర్తయింది .
27-7-18 శుక్రవారం గురు పౌర్ణమి వ్యాసజయంతి సందర్భంగా సరసభారతి 128 వ సమావేశంగా ఉదయం 8 గంటలకు శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో వ్యాస జయంతి నిర్వహిస్తోంది .వ్యాస అష్టోత్తర పూజ ,విష్ణు సహస్రనామ పూజ నిర్వహించి ,తర్వాత భగవద్గీత ఫేం కుమారి మాది రాజు బిందు వెంకట దత్తశ్రీ చేత భగవద్గీత పారాయణ ,ప్రవచనం చేయిస్తున్నాము .
27-7-18 శుక్రవారం వ్యాసజయంతి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-18 –ఉయ్యూరు
—