కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -6
1962 లో శాస్త్రిగారికి శ్రీరాం పురం లో ఒక ఇళ్లస్థలం ఏర్పాటు చేయబడగా కుటుంబాన్ని ముక్కామల నుంచి ఇక్కడికి మార్చారు .ఆయన మనసులో సప్తగోదావరి ఎప్పుడూ మసలుతూ ఉండేది .కౌశికుడైన విశ్వామిత్రుని వరం గా తలుస్తూ ఉండేవారు ,స్థలం ఇచ్చినవారు ఇల్లు కట్టుకోవటానికి ధనమూ అందజేయటం తో కట్టుకొని అందులో అగ్ని హోత్ర గదినీ ఏర్పాటు చేసుకున్నారు .దాత 15 బస్తాలు పండే ఒక ఎకరం పల్లం భూమిని కూడా ఇచ్చాడు .నిత్యాగ్ని హోత్రులు, ఆహితాగ్ని అవటం, వేద పండితులకు నిరంతరం ఆ దంపతులు అతిధ్యమిస్తూ ఉండటం వలన దాత వీరికి రోడ్డు ప్రక్కనే ఉన్న స్థలం ఇచ్చి అతిధి అభ్యాగతులెవరు ఊళ్లోకి వచ్చినా తెలుసుకొనే వీలు కల్పించాడు .ఏ ఆహితాగ్ని అయినా వేరొక ఆహితాగ్ని ఇంట్లో ఆయన భార్య చేతి వంటతింటాడు .ఆమె ఇచ్చిన ఉదకం పుచ్చుకొంటాడు .అది విధానం .అందుకని ముక్కామల ,సీతారామపురం ,వ్యాఘ్రేశ్వరాలలో వేదసభలు జరిగినప్పుడల్లా వీరంతా శాస్త్రి గారింటికి వచ్చి ఆతిధ్యం పొంది వెళ్ళేవారు .తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులను వేదం విద్యను అమితంగా పోషించింది .వారికి నెలవారీ వేతనం ,స్తైఫ౦డ్ ,పెన్షన్ ,గౌరవ భ్రుతి వగైరాలను కలిపించి వారి జీవితాలలో వెలుగులు నింపింది .ఈ దేవస్థానం చాలాసార్లు శాస్త్రిగారిని వచ్చి వేదపారాయణ చేయమని కనీసం గౌరవ భ్రుతి స్వీకరించమని కోరింది .’’ఆహితాగ్ని వేదాన్ని అమ్ముకోడు ‘అని చెప్పి సున్నితంగా తిరస్కరించేవారాయన .వేద విక్రయం మహా పాపం అని భావించేవారు .కనుక వారెప్పుడూ దాన గ్రహీతగా లేరు .ఎప్పుడూ ‘’అపరిగ్రాహీత ‘’గానే ఉండి పోయారు .తిరుపతి దేవస్తానం పట్టువదలని విక్రమార్కుడి లా వెంటపడుతూనే ఉంది .ఆయన ఇక ఒప్పుకోరు అని గ్రహించి ఆయనను పెన్షన్ ప్లాన్ లో చేర్చి , ఉద్యోగం లేని ఆయన కుమారుడికి బహుమానంగా అందజేసింది .వేద పరీక్షలకు శాస్త్రిగారిని పరీక్షాదికారిగా ఆహ్వానించినా తన విది సంతృప్తికరంగాచేసేవారే కాని దానికిచ్చే భ్రుతిని ఎన్నడూ స్వీకరించని నిస్టా గరిస్టులాయన.తప్పని సరై కనీసం శాలువా అయినా కప్పే భాగ్యం కలిగించమని వేడితే ‘’సరే ఇది దత్తాత్రేయునికి సమర్పణ ‘’అని నవ్వేవారు .తర్వాత దాన్ని వేరొకరికి కప్పి సంతృప్తి పడేవారు .14 వ శతాబ్ది కి చెందిన అద్వైత మత ప్రచారకులు ‘’పంచదశి ‘’వంటి వేదాంత గ్రంథ కర్త విజయనగర సామ్రాజ్య స్థాపనా చారులు శ్రీ విద్యారణ్య స్వామి దేవాలయం కౌశికనదీ తీరం లో ,తమ ఇంటికి అతి సమీపం లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జపతపాలకు అక్కడ అందరికి వసతిగా ఉంటుందని శాస్త్రి గారు భావించి ,చివరకు విద్యారణ్యులవారి గురించి జనాలకు పెద్దగా తెలియదని విరమించుకున్నారు .కాని అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయ స్వామి బహుజన హితుడు అని భావించి ,ఆయన త్రిమూర్తి స్వరూపుడు అవటం తో మొగ్గు చూపారు .కొందరు దత్తాత్రేయుడు వేదం చెప్పిన దేవత కాడు అనగా బోసినవ్వుతో ‘’విష్ణువు గార్హపత్యాగ్నిలో ,శివుడు దక్షిణాగ్ని లో ,బ్రహ్మ ఆహవనీయాగ్నిగా ఉన్నారు ‘’అని బదులు చెప్పారు .ఇంతటి గొప్ప ఆహితాగ్ని ,విశిష్ట వేదపండితులైన శాస్త్రిగారి ‘’అగ్ని హోత్రం గది ‘ని స్థానికు లెవ్వరూ చూడనే లేదు చూసే అవకాశమూ దొరికేదికాదు . 1987 లో ఒక ఉత్సాహవంతుడైన దాత ముందుకు రావటం తో చిన్న దత్తాత్రేయ దేవాలయాన్ని శాస్త్రి గారు విధి విధానంగా నిర్మించి తనకోరిక తీర్చుకున్నారు .దీని చుట్టూ రావి, మర్రి ,వేప ,మేడి వంటి పవిత్ర వృక్షాలు పెంచటానికి స్థలం సేకరించాలనీ అనుకున్నారు .ఈ వృక్షాలను ,దత్తాత్రేయస్వామిని దర్శించే ప్రజలకు మనో భీస్టి కలుగుతుందని అభిప్రాయ పడ్డాడు .
బాబళ్ల శాస్త్రి గారు ముక్కు సూటి మనిషి .స్వేచ్చాజీవి .సంభాషణలో తన విద్యాగర్వంప్రదర్శించరు .చాలా నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పటం ఆయన నైజం .బహు విద్యలలో ఆరితేరిన పండితులు కూడా, బ్రహ్మ చెవుడు తో బాధపడుతున్న శాస్త్రి గారి వద్దకు వచ్చి సందేహ నివృత్తి చేసుకొనేవారు .పంచములు కూడా వారి దర్శనం చేసుకొని తరించేవాళ్ళు .అందుకే స్థానికులు వారిని ‘’మహా పురుషుడు ‘’అన్నారు .ఇలాంటి వారిని ఆంగ్లం లో ‘’క్రాకర్ బారల్ ఫిలాసఫర్స్ ‘’అంటారు . మహాపండితులైనా ,అక్షరం ముక్క రాని వారైనా ఆయనను ఏదైనా దిగితే తక్షణ సమాధానం చెప్పే సంస్కారి .పరులకోసమే తప్ప తనకోసం జీవించని ఉత్తమ పురుషులు శాస్త్రి గారు .
శ్రీరామ పురం లో’’ శాస్త్రిగారి అరుగు’’ వేదపండితులతో, వారి మధ్యఅనేక విషయాలపై చర్చలతో హోరెత్తి పోయేది .ఒక్కోసారి ఆయన అధ్యాపనానికి ఇబ్బందీ కలిగేది .అదొక మినీ సభా ప్రాంగణ౦ గా భాసిం చేది . ఆయన దీనికి సాక్షీభూతంగా ఉంటూ ,ఉద్రేకాలకు వారు లోనుకాకుండా చూస్తూ ,అర్ధవంతమైన సమతుల్యమైన చర్చలుగా మార్చేసేవారు .ఘర్షణ వాతావరణాన్ని నివారించి ప్రశా౦తత కల్గించటం ఆయన నేర్పు .శాస్త్రిగారి అరుగు గురించి విన్నవారికి కృష్ణ శాస్త్రిగారు రచినన ‘’మా అరుగు ‘’గు ర్తుకు రావటం సహజం . శాస్త్రాలలో నిష్ణాతులే అయినా ,కాలానికంటే ముందే ఉండే ఆలోచనా పరులాయన .దేశం లో విస్తరించిన బహు సంస్కృతుల వ్యాప్తిని చూసినవారు .కనుక సహనానికి ప్రతీకగా ఉండేవారు .
శాస్త్రిగారిలో పవిత్రత ,విలువలు ప్రత్యక్షాలు .అప్పటికే అదృశ్యమైన సువర్ణ యుగానికి ఆయన వెలకట్టలేని వారధి .ఆయన క్రోధినామ సంవత్సర మార్గ శిర శుద్ధ చవితి నాడు జన్మిచి ,దుందుభి నామ సంవత్సర జ్యేష్ట శుద్ధ౦లొసు౦దరిగారిని వివాహమాడి నట్లు ప్రసంగవశాత్తు తరచుగా చెప్పేవారు. 19 వశతాబ్దం లో తమ తండ్రి ,గురువులు నడచిన మార్గాన్నే శాశ్వతం చేసే ప్రయత్నం తాను చేశాను అనేవారు .ధర్మవిషయం లో, కర్మకాండ విషయం లో ఆయన చాలా నిక్కచ్చి .ఆధునికతను దీనిలో ప్రవేశించటానికి అంగీకరించని వ్యక్తిత్వం ఆయనది .సాధారణ శ్రౌత విధులకు కట్టుబడే ఉండాలని ,సూత్రప్రాయంగా అంగీకరించేవారు .ఒక్కసారి మాత్రమే లంకా వారి యజ్ఞం లో తన మాట, మార్గం నుంచి కొంచెం ప్రక్కకు జరగాల్సి వచ్చిందని బాధ పడ్డారు. లంకావారి అగ్ని స్టోమం లో చిన్న సదస్యం పాత్ర అంటే 17 వ పురోహితుడిగా, బ్రహ్మకు సహాయకుడిగా ఉండాల్సి వచ్చిందట .
తమ ‘’అపరిగ్రహత్వం ‘’,అనే స్వచ్చంద నియమం వలన కర్మ కాండ లకు వెళ్ళేవారు కాదు .వేదవిద్యాభ్యసనం చేసిన ఏ శిష్యుని నుంచీ ఆయన ఒక్క దమ్మిడీ కూడా దక్షిణగా పుచ్చుకోలేదు .రుత్విజులకిచ్చే దక్షిణ స్వీకరించే వారు కాదు .ఇలా పుచ్చుకుంటే వేద విక్రయం అని వారి గట్టి నమ్మకం .భూమిఎవరైనా దానం ఇస్తే తీసుకోవటానికి, శ్రౌత క్రియలకు దక్షిణ తీసుకోవటానికి తేడా ఉందంటారు .ఋత్విక్కు గా ఉండటానికి కూడా పెద్దగా ఇష్టపడే వారు కాదు .సరైన శిక్షణ లేని వారితో ,సరైన సంబారాలు లేకుండా చేస్తే దాని ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది అంటారు .సంప్రదాయంగా వస్తున్నా వేదం విద్యాభ్యాసం లో కొన్ని తప్పులు జరుగుతాయనీ ,పరీక్షా విధానం సరళతరం చేస్తున్నారని ,గురు ముఖ విద్య కంటే పుస్తకాలతో నేర్చుకోవటం ఆయన అంగీకరించలేదు .దీని వలన క్రియలో పొరబాట్లు జరిగి ,క్రియలకు తగిన మంత్రాలు చెప్పకపోవటం జరిగి చేసే వాడికీ చేయి౦చేవాడికి మాత్రమేకాకుండా విశ్వానికి కూడా అనర్ధం జరుగుతుంది అనేవారు .అందుకే రుత్విజ శిక్షణ పాసైనవారితో కలిసి పని చేయటం ఇష్టం ఉండేదికాదు .వారిలో పరిపూర్ణత ఉంటుందనటం తనకు తెలీని విషయం అనేవారు .చాలా సార్లు సోమభక్షణ లోని ప్రమాదాలపై ఆయన హెచ్చరించేవారు .కాలం లో ఎన్నోమార్పులోస్తున్నాయి .భమిడి పాటి వంశం లోనే అగ్నిస్టో మానికి 18 మంది ఋత్విజులు,సర్వతోముఖానికి తగినంత మంది తయారయ్యారని సంతోషంగా చెప్పేవారు .
ఒకప్పుడు నాలుగు గైదు రోజులు చెసేఉపనయన౦ ఇవాళ కొన్ని గంటల తంతు తో సరిపుచ్చటం ఆయనకు నచ్చని విషయం .అలాంటివాడు ఏ విధంగా బ్రాహ్మణుడు అనిపించుకొంటాడని ప్రశ్నిస్తారు .తన ఆహితాగ్నిగురువు బులుసు సోమయాజులు గారు అని గర్వంగా శాస్త్రిగారు చెప్పుకొంటారు .’’అభిచారం’’ ఎలా చేయాలో ఆయనే దగ్గరుండి నేర్పారని కృతజ్ఞత తెలియ జేస్తారు .నిత్యాగ్ని హోత్ర విధానం లో తనకు ఎన్నో అద్భుత దృశ్యాలు కనపడినాయన్నారు . .ఒక సారి అగ్ని హోత్ర సమయంలో ఒక అద్భుత తేజస్సు హోమం నుండి బయటికి వచ్చి తన కళ్ళ ముందు దర్శనమిచ్చిందని ఇదొక శుభ సూచనగా తాను భావించానని ,తన కోడలు ప్రసవించి మగపిల్లాడికి జన్మ నిచ్చిందని ఆనందంగా చెప్పారు .మరో సారి ఆహవనీయాగ్ని పూజ చేస్తుంటే ఒక చతుర్భుజ పురుషుడు కనిపించాడని ,దీని ఫలితం ఏమిటి అని ఆలోచించగా ,రెండవ మనవడుకూడా త్వరలోనే రాబోతున్నాడని తెలిసిందని ఆ’’వేదపండు’’అయిన ఆహితాగ్నిబాబళ్ళ శాస్త్రిగారనే బ్రహ్మశ్రీ భమిడిపాటి యజ్నేశ్వర సోమయాజులు గారు చెప్పారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-18 –ఉయ్యూరు .
—
—