కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -7
గురువుగా ఋత్విక్కు గా .తితిదే ఆస్థాన పండితునిగా దక్షిణ స్వీకరించని , అర్హులు కాని వారితో సోమరసం తాగని బాబళ్ల శాస్త్రి గారు ఆనాటి వైదిక ఉన్నత బ్రాహ్మణులలో అరుదైన వ్యక్తి .ఆయన౦త వారు ఆయనే .ఆయన తర్వాత వేరెవరూ లేరు అన్నారు వారి ప్రక్కింటి సామవేదం వారు .1993 జూన్ 1 లో తుంటి ఎముకకు గాయమైనప్పటినుంచి మంచం పై దర్భ పరచుకొని పడుకునే వారు .ప్రక్క మంచం పై కేన్సర్ వ్యాధితో చావు బతుకులమధ్య ఉన్న ఒక్కగానొక్క కుమారుడు బుల్లెబ్బాయి పడుకోనేవాడు .శాస్త్రి గారి చేయి ఎప్పుడూ ఆప్యాయంగా అతని మీదనే ఉంచేవారు .కుమారుడికంటే తన ‘’అంత్యేస్టి’’ము౦దు జరిగితే బాగుండుననికోరుకొనేవారు .ఇలా జరిగితే తండ్రి శ్రార్ధం కొడుకు పెట్టే అవకాశం ఉంటుందని వారి భావన. కొడుకు చేతులమీదుగా చనిపోయానన్న సంతృప్తి మిగులుతుందని ఆశ .భగవంతుడు శాస్త్రిగారి కోరిక నెరవేర్చాడు .శాస్త్రిగారు 1993 ఆగస్ట్ 6 న ఉత్తమలోకాలకు వెడితే, 64 ఏళ్ళ కొడుకు ఆరు నెలల తర్వాత1994 జనవరి 1 న చనిపోయాడు .
ఆహితాగ్ని అయిన శాస్త్రిగారు మరణించారు కనుక వారికి ‘’బ్రహ్మ మేధ’’అంతిమ సంస్కారం జరగాలి .ఇది మూడుగంటలు త్రేతాగ్నులతో ఇతర దహన కృత్యాలతో పాటు ,ఎముకలను మళ్ళీ దహనం చేసి ,సోమ యాజులకు చేసే ప్రక్రియగా చేశారు .దీన్ని ‘’పునర్దహనం ‘’అంటారు .దీన్ని ‘’లోష్ట చితి ‘’ పై నిర్వహిస్తారు .శ్రీరామపురం ,నేదునూరు ,వ్యాఘ్రేశ్వర యువ ఆహితాగ్ని లు చూసిన మొదటి ‘’బ్రహ్మ మేధం ‘’.తర్వాత కాలం లో చాలామందికి జరిపారు .దువ్వూరి యాజులుగారి భార్య సూర్య గారికి ,పుల్లెలవారి భార్య కామేశ్వరిగారికీ,బులుసు చయనులు గారికి ,లంకావారికి ఇలాగే చేశారు .ఆహితాగ్ని మరణిస్తే మరణించిన క్షణం నుంచి ‘’అశౌచం ‘’అంటే’’ మైల’’ పాటించరు .బ్రహ్మ మేధం జరినప్పటినుంచి మైల పాటిస్తారు .తాను చనిపొతే పూనాలో ఉన్న తన ప్రియ శిష్యుడు ఆధ్యాత్మిక కుమారుడు చిర్రావూరి రామం వచ్చేదాకా అంత్యక్రియలు చేయవద్దనీ చావు మంచంలో ఉండగానే ఆదేశించారు శాస్త్రి గారు .టెలిగ్రా౦ అందుకొని రైల్లోపడి రాజమండ్రి వచ్చి టాక్సీలో రోజున్నరతర్వాత శ్రీరాంపురం చేరాడురామం . .చిక్కిశల్యమైన శాస్త్రిగారి పార్ధివ దేహాన్ని అగ్ని హోత్రం గదికి వెలుపల మంచు గడ్డలపై ఉంచారు .శాస్త్రీయంగా ,న్యాయబద్ధంగా ఆయన అప్పటికి ఇంకా చనిపోనట్లే లెక్క .
రామం రాగానే మిగిలినవారితోకలిసి శాస్త్రిగారి మండుతున్న ‘’ఆరణి’’ చితులను బయటికి తీసి ,గార్హపత్యాగ్ని లో కలిపి ,ఆహవనీయ ,దక్షినణాగ్నిలో కూడా కలిపి మూడిటిలోను మహాజ్వాల వచ్చేట్లు చేశారు .చివరి ఇష్టి ఇంటిలోనే నిర్వహించి ,ఆయన, భార్యా చివరి రోజులలో చేయలేకపోయిన అగ్నిహోత్రం ఇష్టి ,అగ్రయనాలకు ప్రాయశ్చిత్త హోమాలు చేసి ఈ సమిధలను మూడు కుండల లో గార్హపత్య ,ఆహవనీయ ,దక్షిణాగ్ని లుగా సేకరించారు నాలుగవ కుండ గృహగ్ని ఔపసనాగ్ని లను మూడువైపులా తాళ్ళతో కట్టి ఇంటిబయటకు చేర్చి,కొడుకు బుల్లెబ్బాయి కి ఆసరాగా ఉంటూ ,భార్య సుందరి గారికి కడసారి చూపు కల్పించి , బుల్లెబ్బాయి బతికి ఉన్నాడు కనుక మనవడు మనవడు ప్రసాద్ అంత్యక్రియలలో పాల్గొన రాదుకనుక అతన్ని ఇంటివద్దనే ఉండిపొమ్మని ,స్మశానానికి పార్ధివ దేహాన్ని చేర్చి ,త్రేతాగ్నులను ఆయన దేహం పై ఉంచి ,ఆహవనీయాగ్నిని ఆయన శిరసు క్రింద ఉంచి ,దక్షిణాగ్ని ని, ఛాతీపై కుడివైపున ,గార్హ పత్యాగ్ని ని కుడి తొడవద్దఉంచి కట్టెపుల్లలను కప్పి యధా విధిగా దహనక్రియ పూర్తి చేశారు .మూడుగంటలలో ఆయన దేహం తాను ఇంతకాలం ఆరాధించిన అగ్నికి ఆహుతై, ఆయన పవిత్రాగ్ని దేవునిలో చేరిపోయారు.
బ్రహ్మ మేధ ,పునర్ దహన ,లోష్ట చితి విషయాలు స్థానిక లౌకిక అపర కర్మలు చేయించేవారికి అవగాహన ఉండనివి .ఒకవేళ ఉన్నా వాటిని నిర్దుష్టంగా చేయించే సాహసం చేయలేరు .శాస్త్రిగారి అపరకర్మ అంటే దహనం తర్వాత రోజు నుంచి 12 వ రోజు వరకు నిర్వర్తించాల్సిన వాటిని అమలాపురం లోని ఆకొండి సూర్యనారాయణ గారిని పిలిపించి యధా విధిగా చేయించారు .13 వ రోజు ఆస్తి సంచయనం ,పునర్ దహనం ,లోష్ట చితి ఏర్పాటు లను చిర్రావూరి రామం గారు అనే బాబళ్ళ శాస్త్రి గారి ముఖ్య శిష్యుడు ,ఆయనకు ఆధ్యాత్మిక కుమారుడు ,దువ్వూరి యాజులు ,బులుసు చయనులు గారి సాయం తో పితృ మేధ సూత్రాలతో చేశారు .ఇవి అందరికి అందుబాటులో లేనివి కనుక పుస్తకమే శరణ్యం .ఆయన చితాభస్మాన్ని భద్ర పరచి గంగలో కలపాల్సిన పనే లేదు,కారణం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన కౌశికీనది సమీపం లోనే ఉ౦దికనుక . సపిండీకరణ జరిగిన రెండు వారాల తర్వాత ఇంట్లో ఉన్న ఆయతన మట్టి హోమ గుండాలను చిద్రం చేశారు .అయన ప్రేతాత్మ పితృ రూపం పొందింది .నెలమాసికాలు పెట్టారు .కొడుకు బుల్లెబ్బాయి నాలుగు పెట్టాడు .నాల్గవది పెట్టె రోజు ఉదయమే ఆయన చనిపోయాడు .శాస్త్రి గారి భార్యను వోదార్చటం ఎవరి తరమూకాలేదు .అసలే చెవుడు .ఇప్పుడు కొడుకు మరణం తో ,తాను గుడ్డి దాన్నీ అయ్యానని రోదించింది .ఆమె కూడా జులై లో చనిపోయింది .విధవ అయిన కోడలు సావిత్రి రెండు తరాలు కళ్ళముందే అదృశ్యమవటం జీర్ణించు కోలేకపోయింది .
ఊరిజనం శాస్త్రి గారింటికి ముహూర్తాలకోసం,ధర్మసందేహాలు తీర్చుకోవటానికి రావటం పరిపాటి . ఇప్పుడు మనవడు యజ్ఞేశ్వర ప్రసాద్ ఆ పని చేస్తున్నాడు .ఇతడు తాతగారి వద్ద ఎనభై రెండుపన్నాల తైత్తిరీయం 19 వ ఏటికే నేర్చాడు .తర్వాత లౌకిక విద్యానేర్చి సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .దగ్గర ఊరిలో టీచర్ గా పని చేశాడు .పాలకొల్లు పిల్ల లక్ష్మీ నరస కాంత ను వివాహమాడి వరుసగా అందమైన ముగ్గురు ఆడపిల్లలు రేఖ ,మాధురి ,కల్యాణి లకు తండ్రి అయ్యాడు.దురదృస్టవశాత్తు ఇక ఆమెకు సంతానం కలగదని డాక్టర్లు చెప్పారు .దీనితో’’ బ్రహ్మీ భూత ‘’బాబళ్ళ శాస్త్రిగారి వంశం ఆగిపోవటం విచారకరం .ప్రసాద్ సైన్స్ లెక్కలు సోషల్ ,తెలుగు లను చక్కగా బోధించేవాడు .తెలుగు తప్ప ఆ విద్యలను హూణ విద్యలని ఆకాలం లో అనేవారు .అతడు అమలాపురం లోని గోదావరి మండల వేద పరిషత్ కు కార్యదర్శి .యవ్వనం లో ఋత్విక్కుగా బాగా రాణించాడు .తన పూర్వీకుల శ్రౌతం తమకు అచ్చిరాలేదని భావించాడు .
తన తాతగారు తన తండ్రికంటే పూర్తి అధికారి తనను తీర్చి దిద్దింది ఆయనే అనేవాడు ప్రసాద్ .తాతగారి సలహా ఆనాడు దైవాజ్న గా భావించేవారు .స్మార్తం లో ప్రతి సూక్ష్మ విషయం తాతగారికి తెలుసునని కాని ఎన్నడూ దాన్ని కర్మకాండలకు వాడలేదని అన్నాడు .తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ తరతరాలుగా ఇంటి పురోహితుడు,గా ఉన్న అగ్రహారం లోని ఆహితాగ్ని బులుసు చయనులు గారే చేసేవారని అన్నారు.వేద సభలకు ,పెళ్లిళ్లకు ఉపనయనాలకు వచ్చే ఆహితాగ్ని బ్రాహ్మణులకు ఆహితాగ్ని అవసరం ఉందని గ్రహించి శాస్త్రి గారు ,అర్ధాంగి సుందరిగారు 1970 నుండి 1990 వరకు ఇరవై ఏళ్ళు శ్రావణ ,భాద్రపద మాసాలలో ముక్కామలకు వెళ్లి నలభై రోజులు ఉండి ఆమె చేతిమీదుగా వంట చేయించి ఆహితాగ్ని వేదపండితులకు భోజనాలు పెట్టేవారు .దీన్ని శాస్త్రిగారు ‘’ప్రసాదం ‘’అనేవారు .19 80 లో ఒక విదేశీ ఇక్కడికి విషయాలు తెలుసుకోనాలనే ఆసక్తితో వస్తే, అతనితో శాస్త్రిగారు ‘’మీరు మాలో ఒకరు .మీరు ఇక్కడి వారికంటేమా సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకోవటానికి మిక్కిలి ఉత్సాహం ,ఆసక్తి చూపిస్తున్న సహృదయులు .ఏదో పూర్వ జన్మ వశాత్తు మీరు ఆదేశం లో పుట్టారు .కాని మీరు మా దేశానికి, మా ప్రాంతానికి ,మా సంప్రదాయానికి చెందిన వారే ‘’అని మనస్పూర్తిగా ఆహ్వానించిన గొప్పసంస్కారి శాస్త్రి గారు .
చిర్రావూరి రామం శాస్త్రిగారి అంతేవాసి, ఆత్మీయ సుపుత్రుని వంటి వారు అందుకే శాస్త్రి గారు తన అన్త్యేస్టి ఈయన వచ్చాకనే జరగాలని కోరారు .గురువుగారికి ఇస్టిలో చాలా ఏళ్ళు సహాయకులుగా ఉన్నారు .కలిసి వేదం ,మీమాంస,వ్యాకరణం తర్కం నేర్చారు .ఆయన రాజమండ్రిలో ప్రభుత్వ ఓరిఎంటల్ కాలేజిలో సంసృతం బోధించారు .శాస్త్రిగారి మరణ సమయం లోనూ వారు ఉద్యోగం చేస్తూనే ఉన్నారు .పూనా యూనివర్సిటి లో బోధన చేసినా , నచ్చక వదిలేశారు .వేదాలలో ప్రాచీన విజ్ఞానం ఉందని అంటారు .ఆయనకు ‘’సెంటర్ ఫర్ రిసెర్చ్ ఇన్ ది సైన్సెస్ అఫ్ ఎన్శేంట్ ఇండియా’’ స్థాపించాలని ఉండేది .దీనిద్వారా కుష్టు ,ల్యూకో డేర్మా ,చెవుడు ,పాముకాటు ,జ్వరం ,గుండె జబ్బు ,క్షయ ,తెల్లజుట్టు మొదలైన వాటి నివారణకు మందులు కనిపెట్టాలని ఆయన ఆలోచన .భోపాల్ గాస్ దుర్ఘటనలో కంటి చూపు కోల్పోయిన వారికి కంటి చూపు తెప్పించటానికి ,వేదపండితులచే అక్కడ హోమాలు చేయించారు .
బాబళ్ళ శాస్త్రిగారి మరణం శ్రీరామపురం,నేదునూరు ,వ్యాఘ్రేశ్వరం లలోని నలుగురు ఆహితాగ్నులపై ప్రభావం చూపించింది .భావి తరాలను ప్రభావితం చేసే శాస్త్రి గారు లేకపోవటం పెద్ద లోటే అని ఆ అగాధాన్ని పూడ్చలేమని అనుకున్నారు .శాస్త్రిగారి నిజాయితీ ,సమర్ధత ,ముందుచూపు ,సద్యో స్పందన నిజాన్ని గుర్తించే నైజం ఇతరులెవ్వరిలోను లేనివి, రానివి, రాలేనివికూడా .ఒకసారి శాస్త్రి గారు ఏదో గ్రంధం తిరగేస్తున్న దువ్వూరి యాజులు గారిని చూసి ఏం చేస్తున్నారు ?అని అడిగితె ఆయన ‘’గ్రంధం తిరగేస్తున్నా ‘’అనగానే ‘’ఎందుకా శ్రమ ?మీరే ఒక ఉద్గ్రంధం కదా ‘’అన్నారట .అదీ ఆ మనీషి గొప్పతనం .
మరో ఆహితాగ్ని గురించి తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ – 28-7-18 –ఉయ్యూరు
.
—