కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -12
3- ఆహితాగ్ని – బ్రహ్మశ్రీ బులుసు వ్యాఘ్రేశ్వర చయనులు గారు -2
అనేకమార్గాలలో సంపాదన చేశారు .స్మార్తం లోనేకాక శ్రౌతం లోనూ చేయి తిరిగినవారు .సాధారణంగా ఏదో ఒక దానిలోనే ప్రావీణ్యం ఉంటుంది .రెంటినీ సునాయాసంగా నిర్వహించి సవ్యసాచి అయ్యారు.బాబళ్ళ శాస్త్రి కుటుంబానికి తరతరాలుగా బులుసువారే గృహ పురోహితులు .ఇప్పుడూ అంతే .15 ఏళ్ళకే స్మార్తం లో ప్రవేశించి మూడేళ్ళ తర్వాత పరీక్ష పాసై ,విజ్రుమ్భించారు .అపరకర్మలు చేయి౦చేవారుకాదు.. వేదపాఠశాలలో14 ఏళ్ళు వేదం బోధి౦చారు .అందులో వేదపరీక్షాదికారిగానూ ఉన్నారు .జీవితకాలం లో 60 శ్రౌత కార్యక్రమాలు ,6 పౌండరీకాలు చేయించినట్లు గుర్తు చేసుకున్నారు .దీనికి ఉద్గాతగా ఉండేవారు .1960 కాలం కోనసీమ అంతా బులుసువారి వేద ధ్వనులతో పులకించిపోయింది .50 వ ఏట 1965మాఘమాసం లో అగ్నిస్టోమాన్ని ఆధానాగ్నితో శ్రీరామపురం దేవాలయ ప్రాంగణం లో చేశారు .నాలుగేళ్ల తర్వాత 1969 లో పుట్టినవూరు వ్యాఘ్రేశ్వరం లో ‘’సర్వ ప్రస్త అగ్ని చయనం ‘’చేసి చయనులు అయ్యారు .అదే ఏడాది ఆయన పొరుగునున్న దువ్వూరి యాజులు గారు పొండరీకం చేసి పౌ౦డరీక చయనులయ్యారు .దీనికి బాబళ్ళశాస్త్రిగారు చయనులుగారికి తోడ్పడ్డారు .
వితరణ శీలురైన డొక్కా వారు వీరికి ఒక ఇల్లు ఎకరం పొలం ఇచ్చి శ్రీరామపురానికి ఆహ్వానించారు .కానీ కూతురి పెళ్లి ఖర్చులకు కట్న కానుకలకు పిత్రార్జితమేకాక దీనినీ అమ్మేయాల్సి వచ్చింది .61 ఏళ్ళ వయసులో టిటిడి వారి పారాయణ స్కీం లో చేరి పుట్టిన ఊరిలోని దేవాలయం లో చేసేవారు .78 వ ఏట రిటైరయి ,పెన్షన్ పొందారు .ఆర్ధిక భారం వలన వేద సభలకు వెళ్లి సంభావన పుచ్చుకోనేవారు .కేంద్ర ప్రభుత్వం అగ్ని స్టోమం చేసినవారికి గౌరవ వేతనం ఇచ్చేది .ఆ విషయం వీరికి ఇతర ఆహతాగ్నిలు చెప్పనే లేదు. అది దూరమైపోయింది .
ఎన్నో సంస్థలు ,వ్యక్తులు బులుసు వారిని ఆహ్వానించి సన్మానించాయి .హైదరాబాద్ లో భారతప్రధాని పి.వి. నరసింహారావు గారి చేతులమీదుగా సన్మానం అందుకొని ఆశ్చర్యపోయారు .ఎవ్వరూ ఆయన సాధించిన విజయాలను చెప్పలేదు .ఈ గౌరవ పురస్కారాన్నీ ప్రచారం చేయలేదు .80 ఏళ్ళ వయసులో క్రిక్కిరిసిన బస్సుల్లో పడి 20 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది..ఇది మనకు ‘’స్వర్ణకమలం ‘’సినిమాలో వృద్ధ వేదపండితుడు పడిన బాధ గుర్తుకు తెస్తుంది .ఆనాడు ఇచ్చిన గౌరవ భ్రుతి 35.13 డాలర్లు మాత్రమే .కానీ దీనికే పరమ సంతోషం పొందారు .నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టి రామారావు కూడా బులుసువారిని సత్కరించారు .
బులుసు చయనులుగారు యవ్వనం లో బహు అందంగా ఉండేవారు .ఇతర దేశీయులను ఆప్యాయంగా ఆహ్వాని౦చేవారాయన .1996 ఫిబ్రవరి లో 81 వ ఏట భార్య సుబ్బలక్ష్మిగారితో కలిసి చేసిన అగ్రయనం ,ఏదో ఒక కారణం తో 1995 చలికాలం లో చేయలేకపోయిన అగ్ని కార్యానికి ప్రాయశ్చిత్త విధీ చేశారు .వేదాంతి మాత్రం కాదు .బాబళ్ళ,లంకా ,దువ్వూరి మాత్రం వేదా౦తులే . మృత్యు దేవత ఆయనకు హెచ్చరిక ఇవ్వకుండానే మీద పడింది .కూతురు అల్లుడు ఇంటికి వస్తారని సైకిల్ మీద సరుకులు తెచ్చి ఇంట్లో దించు తుండగా అధిక శ్రమతో హార్ట్ ఎటాక్ వచ్చింది .అందరికీ తెలిసే లోపే ఆయనను మృత్యువు కబళించింది .ఆయన అంత్య క్రియలు అగ్రహారం వెలుపల బ్రహ్మ మేధం ,పునర్ధహన, లోష్ట చయనాలతో పూర్తయ్యాయి .
చయనులు గారి భార్య ‘’14 వ ఏట కాపురానికి వచ్చాను .మొదట్లో ఆయన అంటే భయం గా ఉండేది .ఇద్దరం కలిసి 32 ఏళ్ళు అగ్ని హోత్రం చేసి నన్ను సోమిదేవమ్మ ను చేశారు’’అని గుర్తుకు తెచ్చుకున్నారు .తర్వాత కూతురు దగ్గరకు రాజమండ్రి చేరి, దశావతార స్తోత్రం, విష్ణు ,లలితా సహస్రనామ స్తోత్రం బిగ్గరగా చదువుకుంటూ గడిపారు .భర్త చనిపోయాక చాలాకాలం దాకా తనకు అక్షర జ్ఞానం లేదంటారు .ఆడవారి చదువును భర్త ప్రోత్సహి౦చ లేదన్నారు .ఇతర సోమి దేవమ్మల కూతుళ్ళు తల్లులకు దగ్గరగా ఉంటె ,సోమిదేవమ్మ సుబ్బలక్ష్మిగారి కూతుళ్ళు మాత్రం దూర దూరంగా కోనసీమ అంతా వ్యాపించి ఉన్నారు .
బులుసు చయనులు గారి వంశం మగపిల్లలు లేకుండా ఆగిపోయింది .చయనులుగారి మొదటిభార్యకుమారుడు రామమూర్తి మాతామహుల ఇంటపెరిగి ,స్మార్తం నేర్చాడు అతనికొడుకు కూడాస్మార్తం లో ఉద్దండుడు. వీరివలన బులుసు వంశం కొనసాగింది .బులుసు చయనులుగారు శ్రీరామపురాగ్రహారం లో చనిపోయిన ముగ్గురు ఆహితాగ్నులలో రెండవ వారు .
సశేషం
ప్రస్తుతం ఈ ధారావాహికకు’’ విరామం’’ ఇచ్చి, మళ్ళీ కొన్ని రోజులకు కోనసీమలో ప్రవేశిద్దాం –
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు