హైదరాబాద్ ఇ .సి. ఎల్ .నిర్మాణ శాస్త్రవేత్త డా ఏ. ఎస్. రావు
ఇ.సి .ఎల్. అంటే ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా .హైదరాబద్ లో దీని నిర్మాణ రూప శిల్పి డా.ఏ ఎస్ రావు అని అందరూపిలిచే డా శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు.ఆయన కృషికి,సేవకు కృతజ్ఞతగా వెలసినదే హైదరాబాద్ లోని ఏ. ఎస్. రావు నగర్.
రావు గారు 20-9-1914 న పశ్చిమ గోదావరిజిల్లా మోగల్లు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ అయ్యగారి వెంకటాచలం
బెనారస్ హిందూ యూనివర్సిటిలో బి. ఎస్. సి. ,ఎం. ఎస్. సి .1937 నుండి చదివి ఉత్తీర్ణులై,1947 లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చదివి డిగ్రీ పొందారు ఇండియా వచ్చి 1940- నుంచి ఎనిమిదేళ్ళు బెనారస్ హిందూ యూని వర్సిటి లెక్చరర్ గా పని చేశారు .తర్వాత బొంబాయిలోని టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఫ౦డమెంటల్ రిసెర్చ్ లో రీడర్ గా 1948నుంచి 54 వరకు ఆరేళ్ళు చేశారు .ట్రా౦బే.లోని అటామిక్ ఎనర్జి ఎస్టాబ్లిష్ మెంట్ కు 1954 లో డైరెక్టర్ అయ్యారు .తర్వాత భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్కు 1967 లో డైరెక్టర్ అయ్యారు .ఆతర్వాత హైదరాబాద్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా 1967 నుండి 1978 వరకు 11 ఏళ్ళు పనిచేసి సంస్థ అభి వృద్ధికి యెనలేని కృషి చేశారు .
ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఆంద్ర ప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ సంస్థల ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు చేసిన సమర్ధులు రావు గారు .ఆయన టాటా ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో అయిదేళ్ళు తీవ్ర పరిశోధనలు చేసి హై ఆల్టిట్యూడ్ ల వద్ద కాస్మిక్ కిరణాల అత్యధిక కొలతలను కనిపెట్టారు .ట్రా౦బేలోని రెండు రియాక్టర్ లైన ‘’ అప్సర ,జర్లినా’’ నిర్మాణం ,డిజైనింగ్ ,పర్య వేక్షణ చేసి అవి సమర్ధవంతంగా పని చేయటానికి శక్తి యుక్తులను ధారపోసిన వారు సైంటిస్ట్ రావు గారు .వాటి నియంత్రణ విధానాల రూప శిల్పిగా మంచిపేరు సంపాదించుకొన్నారు .న్యూక్లియర్ విస్ఫోటనాల ప్రభావం వలన పర్యావరణ౦ అణు దార్మికతతో కాలుష్యం కాకుండా దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదే .వీటిలో 1600 కు పైగా ఇంజనీర్లు ,సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు .
డా హోమీ జే భాభాకు అణు శక్తిని మానవ సంక్షేమ సౌభాగ్యాలకు విని యోగించాలనే ప్రగాఢ మైన కోరిక ఉండేది .దీన్ని అమలు చేయటానికి ఒక ప్రణాళిక రచించి , అందుకోసం ఒకకమిటీ ఏర్పాటు చేసి మనదేశం లోనూ ఇతరదేశాలలోను ఉన్న శాస్త్ర వేత్తలను, ఇంజనీర్లను ప్రావీణ్యం ప్రాతిపదిక పై ఎంపిక చేసి సభ్యులను చేశారు .ఆ కమిటీకి ఎంపికైన తొలి భారతీయ శాస్త్ర వేత్త శ్రీ ఏ .ఎస్. రావు గారు .1955 లో సృష్టించిన ‘’అప్సరస ‘’న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్ చేసిన కీర్తి రావు గారిదే .భాభా ,నెహ్రూ లతో రావు గారికి అత్యంత సాన్ని హిత్యం ఉండేది .అందువలన డజనుకు పైగా నోబెల్ ప్రైజు అందుకున్న శాస్త్ర వేత్తలతో రావు గారికి పరిచయభాగ్యం కలిగింది .
1955 లో జెనీవాలో’జరిగిన ’ ఆటం ఫర్ పీస్ ‘’(శాంతికోసం అణువు ) అనే అంతర్జాతీయ సదస్సు లో రావు గారు పాల్గొని ప్రపంచ శాంతిని న్యూక్లియర్ శక్తి తో సాధించవచ్చునని సందిగ్ధ రహితంగా స్పష్టంగా సూటిగా చెప్పి ప్రశంసల౦దుకొన్నారు .సర్ సి. వి. రామన్ స్వయంగా ‘’అప్సర ‘’రియాక్టర్ ను చూసి ,పరీక్షించి రావు గారి వెన్నుతట్టి ప్రశంసలతో ,అభినందనలతో ముంచెత్తారు .రావు గారు అణుఇంధన (న్యూక్లియర్ ఫ్యుయల్ )విభాగం లో డైరెక్టర్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ సలహాదారుగా మానవ విలువలకు ,శాంతి పరిరక్షణకు సేవలు అందించి, సైంటిస్ట్ వృత్తికి సార్ధకత తెచ్చారు .’’అణు మహర్షి ‘’గా అంతర్జాతీయ కీర్తి పొందిన ‘’అణుశాస్త్ర’’ వేత్త రావు గారు .
బెంగుళూరు భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డ్ కు డైరెక్టర్ గా 1958 నుండి 64 వరకు ఆరేళ్ళు మహత్తర సేవ చేశారు .హైదరాబాద్ ఇ.సి .ఎల్. కు మేనేజింగ్ డైరెక్టర్ 1967-6 8 లో పని చేసి ,రిటైరయ్యారు .తర్వాత కూడా కేరళ రాష్ట్ర డెవలప్ మెంట్ కార్పోరేషన్ బోర్డ్ డైరెక్టర్ గా నియమింపబడి అక్కడా తన నిరుపమ కౌశలాన్ని ప్రదర్శించారు .ఎందరెందరో దిగ్దంతులవంటి వారితో అత్యంత సాన్నిహిత్యం ,పరిచయాలు ఉన్నా ఎన్నడూ తన స్వీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోని’’ సై౦టిస్ట్ ఋషి ‘’రావు గారు .బహు నిరాడంబర జీవితం గడిపిన మాననీయులాయన .
తనకున్న విజ్ఞానం, విచక్షణ ,కృషి ,లక్ష్య శుద్ధి,ముందు చూపు , అంకిత భావాలతో వేలాది మంది శాస్త్ర సాంకేతిక వేత్తలకు ఉపాధి కలిగించి ,భారత దేశ పురోగతికి తోడ్పడిన అణకువకల ‘’అణుశాస్త్ర వేత్త ‘’.
రావు గారి పరిశోధనలకు, సేవలకు ఎన్నెన్నో అవార్డులు రివార్డ్ లు అందు కున్నారు .ఆయనకు జాతీయ ఎలెక్ట్రానిక్ కమీషన్ లో గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించారు .పద్మ శ్రీ ని 1960 లో,1972 లో పద్మ భూషణ్ పురస్కారాలు భారత ప్రభుత్వం అందజేసింది .1965 లో శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ పొందారు . ఆంద్ర విశ్వ విద్యాలయం గౌరవ డి. ఎస్. సి.ప్రదానం చేసి సత్కరించింది .1976 లో ఫిక్కి అవార్డ్ ,1977 లో ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అవార్డ్ ,నేషనల్ డిజైన్ అవార్డ్ పొందారు .
టెక్నాలజీ దిగుమతి లేకుండా స్వావలంబన విధానం తో భారత దేశం అభి వృద్ధి చెందాలని రావు గారి సంకల్పం .తన పరిశోధనలద్వారా వైద్య ,పారిశ్రామిక ,వ్యవసాయ రంగాలకు అనన్య సాధ్యమైన కృషి చేశారు .అణుశక్తిని ఔషధ ,వ్యవసాయ రంగాలలో ఉపయోగించటానికి ఆచరణాత్మక కృషి చేసిన మొట్టమొదటి శాస్త్ర వేత్త రావు గారు .హైదరాబాద్ లో ఎలెక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 1-4-1967 లో స్థాపించిన దూర దృష్టి ఉన్న సైంటిస్ట్ ఆయన .స్థానికంగానే టెక్నాలజీ రూపకల్పన చేసి తయారు చేయటానికే దీన్ని ఏర్పాటు చేసి 1978 వరకు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించి, విస్తృత పరచి దాన్ని ప్రజోపకారంగా మలచిన ప్రజ్ఞ ఆయనది .కంప్యూటర్లు, వాటి విడిభాగాలను ఇక్కడే తయారు చేయించారు .ఇ సి. ఐ .ఎల్. ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారు చేసే సంస్థగా మారటానికి ,ప్రపంచం లోనే ప్రఖ్యాత సంస్థగా ఎదగటానికి రూపు రేఖలు తీర్చి దిద్దిన శాస్త్ర సాంకేతిక శిల్పిరావూ జీ .ఆయన కృషి ఫలితమే దేశం లోని భాభా అణుపరిశోధన కేంద్రం లోని హెల్త్ ఫిజిక్స్ డివిజన్ ,రియాక్టర్ కంట్రోల్ డివిజన్ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ లు ఏర్పడి విస్తృత సేవలందిస్తున్నాయి .
రావు గారి ప్రతిభా సామర్ధ్యాలను తెలియజేస్తూ ‘’ద మాన్ విత్ ఎ విజన్’’గ్రంథం ఆయన పేరుమీదనే 1999 లో వెలువడింది .’’ప్రతి సూక్ష విషయాన్నీఒక విశ్వ విద్యాలయం లాగా ఆలోచించే దార్శనికుడైన మేధావి సైంటిస్ట్ ‘’అంటారు ఆయనను .భారత దేశ సాంకేతిక స్వావలంబనకు ఆద్యులైన ఎ.ఎస్ .రావు అనబడే డా.శ్రీ అయ్యగారి సాంబశివరావు గారు తెలుగు వారు అవటం మనకు గర్వకారణం ,అదృష్టం కూడా .రావు గారు 31-10- 2003 న హైదరాబాద్ లో 89 వ ఏట మరణించారు .ఇ.సి.ఎల్. దగ్గరున్న కాలనీకి డా ఏ .ఎస్. రావు నగర్ అనే పేరు ఆయన జీవించి ఉన్నప్పుడే పెట్టి ప్రాతస్మరణీయుని చేశారు .
హైదరాబాద్ ఇసి ఎల్ లో ఎందరెందరో శాస్త్ర సాంకేతికనిపుణులు పని చేశారు .వేద గణిత౦ లో స్పెషలిస్ట్ డా .శ్రీ రేమెళ్ళ అవధాని గారు ఇందులో పని చేశారు .ఇక్కడే సంస్కృత౦, తెలుగులను కంప్యూటర్ లో వాడే విధానాన్ని తమ బృందమే ఆవిష్క రించిందని శ్రీ అవధాని తెలియ జేశారు .నాకు మోపిదేవి హై స్కూల్ లో శిష్యుడు ,నాకు అత్యంత ఆత్మీయ ఆదర్శ ప్రధానోపాధ్యాయులు శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారి తమ్ముడు చి పసుమర్తి భగవంతం ఇక్కడే పని చేస్తున్నట్లు పది నెలల క్రితం ఫోన్ లో మాట్లాడుతూ చెప్పాడు .రావు గారి వటవృక్షం నీడన ఎందరో మేదావులున్నారని అర్ధమవుతోంది .
ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-18 –ఉయ్యూరు
—
Land Line : 08676-232797