ఆచార్యులకే ఆచార్యుడైన ప్రకృతి జన్యు రసాయన శాస్త్రవేత్త –ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు
12-2-1916 పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామం లో శ్రీ లక్కరాజు రామచంద్ర రావు జన్మించారు .తండ్రి శ్రీ వెంకట రామయ్య .ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బి .ఎస్ .సి .ఆనర్స్ ,ఎం .ఎస్. సి. పాసైనారు .1939 లో ఇక్కడే రసాయనిక శాస్త్ర డిమాన్ స్ట్రేటర్ గా ఉద్యోగం ప్రారంభించారు .1943 లో మైక్రో అనలిస్ట్ గా పదోన్నతిపొందారు .1946లో డి .ఎస్. సి .డిగ్రీ పొంది లెక్చరర్ అయి యూని వర్సిటీలోనే రిటైరయ్యారు .
కొన్ని మొక్కలలో వర్ణ ద్రవ్యాల రసాయనిక పరిశీలనం ( కెమికల్ ఇన్వెస్టి గేషన్ ఆఫ్ సం ప్లాంట్ కలరింగ్ మాటర్స్) పై పరిశోధనలు చేశారు .ఈ పరిశోధనలలో చాలా ప్లావోన్ లను ,ప్లావనోవ్ లను గుర్తించారు .ఇవి మొక్కలలో సాఫ్ట్ ఆక్సిడైజేషన్ పొందుతున్నట్లు కనుగొన్నారు .ఆల్కలైన్ పొటాషియం పెర్ సల్ఫేట్ ద్రావణం లో ప్లావోన్ లను కొద్దిగా వేడి చేయటం తో అనేక ప్లావోనోల్ కాంపౌండ్స్ తయారు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చారు .సీమ బంతిపూల (టాజిక్టస్ పాట్యుల)నుంచి వేరు చేసిన ప్లావోనోల్ పాట్యు లెటాన్ యొక్క అణు నిర్మాణం ను నిర్ధారించటానికి చేసిన పరిశోధనలే ఇవన్నీ .ఈ పూలలో పాట్యులెటిన్ యొక్క 7 గ్లైకో సైడ్ గా పాట్యు లెటిన్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు .దీనితో ఆంధ్రా యూని వర్సిటి లో ఆర్గానిక్ కెమిస్ట్రి లో విస్తృత పరిశోధనలు అవకాశం కలిగింది .
రావు గారు ఈయూని వర్సిటి లో 1953-నుంచి పదేళ్ళు 1963 వరకు రీడర్ గా ఉన్న కాలం లోనే ఈ పరిశోధనలు ఊపందుకున్నాయి .ఎనలిటికల్ ,ఇంజనీరింగ్ ,ఆర్గానిక్ ,ఫిజికల్ ,న్యూక్లియర్ కెమిస్ట్రి శాఖలను రావు గారే అభి వృద్ధి చేశారు .ఎంతో మంది పరిశోధక విద్యార్ధులకు స్పూర్తిగా నిలిచి ,అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు మార్గ దర్శకం చేసి వారిని తీర్చి దిద్దిన ఆచార్యులుగా ఘనకీర్తి పొందారు రామచంద్ర రావు గారు .1968 నుంచి 78 వరకు దశాబ్దకాలం రసాయనశాఖ అధిపతిగా ఉన్నారు .తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజి ప్రిన్సిపాల్ గా సేవలందించి రిటైరయ్యారు . వీరి పర్య వేక్షణలో 14 మంది పరిశోధనలు చేసి డాక్టరేట్ పొంది ఆయన కీర్తిని ద్విగుణీకృతం చేశారు .రావు గారు రాసిన 175 పరిశోధనా పత్రాలు జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వెలువడి ఆయన సామర్ధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి .విదేశీ యూనివర్సిటీలు వారికి గౌరవ పదవులిచ్చి గౌరవించాయి .చాల దేశాల లో పర్యటించి అక్కడి యూని వర్సిటీలలో తన పరిశోధనలపై ప్రసంగించి విద్యార్ధి, అధ్యాపకులకు ప్రేరణ, స్పూర్తి కలిగించారు .
1977 లో కృష్ణా జిల్లా నూజి వీడులోని ఆంద్ర యూనివర్సిటి పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ కు రావు గారు స్పెషల్ ఆఫీసర్ గా నియమి౦ప బడ్డారు .తర్వాత ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు .ఇక్కడ కూడా పరిశోధక విద్యార్ధులకు అండ దండగా ఉండి వారికి మార్గ దర్శనం చేశారు ..వారి ‘’ఎక్ ట్రా మ్యూరల్ రిసర్చ్ కమిటీ సభ్యులుగా ఉంటూ ,విజ్ఞాన శాస్త్ర విషయాలు సామాన్యులకు సరళభాషలో అందించటానికి గొప్ప కృషి చేశారు .ప్రకృతి జన్యు రసాయనిక పరిశోధనలో నలభై ఏళ్ళు పని చేసి పండిపోయిన ఆచార్యులు రావు గారు .వారి పరిశోధనా ఫలితాలు అమూల్యమైనవిగా గుర్తింపు పొందాయి .సువిఖ్యాతులైన ప్రొఫెసర్ శ్రీ లక్కరాజు రామ చంద్ర రావు గారిని ‘’ఆచార్యులకే ఆచార్యులు’’ అని కీర్తించారు .డా.సి. వి. రామన్ శిష్యరికం ,డా సూరి భగవంతం సాన్నిహిత్యం రావు గారికి రసాయనిక శాస్త్రం లో నూతన ఆవిష్కరణలకు ఎంతగానో తోడ్పడ్డాయి .
ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు
—