బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ – సూపర్ స్టార్ పైడి జయరాజ్
ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి విలక్షణ హిందీ హీరో అసలుపేరు పైడి పాటి జయరాజ నాయుడు .బాలీవుడ్ లో పైడి జైరాజ్ .వెడల్పైన ముఖం ,కాంతివంతమైన కళ్ళు, చక్కని నటన ఆజానుబాహు స్పురద్రూపం , మంచి వాచకం జైరాజ్ ను హిందీ చిత్రసీమ అందలం ఎక్కించింది .
28-9-1909 లో తెలంగాణా కరీం నగర్ లో జైరాజ్ జన్మించాడు .సరోజినీ నాయుడుకు మేనల్లుడు .ఇతని అన్నలు సుందరరాజ నాయుడు ,దీన దయాళ్ నాయడు .
నిజాం కాలేజిలో డిగ్రీ చదివి,అప్పటికే తెలుగు నాటకాలలో నటించి ప్రతిభ చాటాడు .సినిమాలో నటించాలన్న కోరికఉండేది .ఆ రోజుల్లో సినిమా వ్యాపారం లాభ సాటికాదు అని అందరి అభిప్రాయం . ఆతను తన కోరికను పెద్దలకు చెప్పగా వాళ్ళు వెళ్ళవద్దని ఆంక్ష విధించారు.తన నిశ్చయాన్ని మార్చు కోకుండా జయరాజ్ వారికి చెప్పకుండా 1929 లోఇంట్లోంచి పారిపోయి బొంబాయి చేరాడు .అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ ఇంకా తప్పటడుగులు వేస్తోంది .అప్పటికే బొంబాయి లో ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయ్యేవి .సంపన్న కుటుంబాలకు చెందినవారికి మాత్రమే అప్పుడు అక్కడ సినీ వేషాలు దక్కేవి .ఇంట్లో వాళ్ళు ఇతని సాహసానికి మెచ్చక దాదాపు పాతిక ఏళ్ళు అతని గురించి పట్టించుకోలేదు .ఉత్తర ప్రత్యుత్తరాలే లేవు .ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు .చిన్న చిన్న కూలి పనులు చేశాడు .అన్నిటినీ మనో ధైర్యం తో తట్టుకొని నిలబడ్డాడు .తన ధ్యేయాన్ని నేరవేర్చుకున్నాడు .తొలితరం బాలీ వుడ్ నటుడుగా తెలంగాణా తెలుగు బిడ్డ విజయపతాకాన్ని ఎగర వేసి సూపర్ స్టార్ అయ్యాడు .
బొంబాయిలో డూప్లికేట్ స్టంట్ మాస్టర్ గా ముందు పని చేశాడు .సెట్ లను అమర్చేవాడు .కెమెరా వాళ్లకు సహాయం చేసేవాడు . కాలం కలిసోచ్చి శారదా ఫిలిం కంపెనీ లో చేరి అదే ఏడాది మూకీ చిత్రం ‘’స్టార్ కింగ్ యూత్ ‘’లో 19 వ ఏటనే మొట్టమొదటగా నటించిన అదృష్ట వంతుడు జైరాజ్ .వెంటవెంటనే 11 సైలెంట్ సినిమాలలో నటించాడు. అందులో ‘’ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ‘,మాతృభూమి ,ఆల్ ఫర్ లవర్ ,మహాసాగర్ మోతి,ఫ్లైట్ ఇంటూ డెత్ ,మై హీరో మొదలైనవి ఉన్నాయి .
తెలుగు నాటకానుభవం, మంచి ఆకర్షణతో ఉన్న పర్సనాలిటి జైరాజ్ కు బాగా తోడ్పడి ,అతనిని ఏ మాత్రం సంకోచించకుండా కత్తి వీరులైన ధీరోదాత్త రాజపుత్ర వీరుల ,రాజుల పాత్రలకు ఎంపిక చేసి నటింప జేశారు .1957 లో ‘’అమర్ సింగ్ రాధోడ్’’1859 లో ‘’పృథ్వి చౌహాన్ ‘’1960 లో ‘’మహారాణా ప్రతాప్ ‘’మొదలైన చిత్రాలలో హీరో వేషం వేసి అసలు వారంతా జైరాజ్ లాగానే ఉండేవారా అన్న౦తగా నటించి మెప్పించాడు .ఇవన్నీ సూపర్ హిట్ సాధించాయి .19 47 లో ‘’షాజహాన్ ‘’పాత్రలో గాంభీర్యం ఒలికించాడు .1959 లో ‘’టిప్పు సుల్తాన్ ‘’,1962 లో ‘’హైదరాలి ‘’సినిమాలలో లీడ్ రోల్స్ పోషించి సెభాష్ జైరాజ్ అని పించుకున్నాడు .ఇంతటి వైవిధ్య పాత్రలలో నటించి తనకు సాటిలేరని పించుకొన్నాడు
1947 నాటి ‘’సస్సి పున్నా ‘’,1956 ‘’హాతిం తాయ్ ‘’1963 ‘’చంద్రశేఖర ఆజాద్ ‘’1964 లో ‘’ దుర్గా దాస్ ‘’చిత్రాలు ఆయన కీర్తి కిరీటం లో కలికితు రాళ్ళు . ఆపాత్రలకోసమే ఆయన పుట్టాడా అన్నంత సహజం గా నటించాడు కాదు జీవించాడు .చారిత్రాత్మక, జానపద ,సాంఘిక హీరో పాత్రలలో తనకు సాటి లేరని పించాడు .
ఆ తరం మేటి నటి’’ సురయా ‘’ తో 6 సినిమాలలో19 40 నుండి దశాబ్దం పాటు 1950 వరకు నటించాడు .అందులో 1943 లోని ‘’హుమారిబాత్ ‘’1949 ‘’శింగార్ ‘’,అదే ఏడాది లో ’’అమర్ కహాని ‘’1951నాటి ‘’రాజపుట్ ‘’ ,1952లో రేషం’’చిత్రాలలో సురయా ప్రక్కన హీరో గా నటించారు .ఆ రోజుల్లో ఆ ఇద్దర్నీ ‘’వెండితెర వేల్పులు ‘’గా భావించేవారు .1952 లోనే వచ్చిన ’’లాల్ కున్వార్ ‘’లో సురయా తో సెకండ్ హీరో గా చేశాడు .ఇంతటి నటనానుభవం ఉందికదా అని ‘’ ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఒక కవిత ఆధారం గా నటుడు భారత్ భూషణ్ హీరో గా ‘’ సాగర్ ‘’సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు .అట్టర్ ఫ్లాప్ అయి మళ్ళీ నిర్మాణం జోలికి పోకుండా బుద్ధిగా ఉన్నాడు . అతని నట జీవితంపై ఈ ఫైల్యూర్ ప్రభావం పడలేదు .హీరో గా దూసుకు పోతూనే ఉన్నాడు ,జైత్రయాత్ర సాగిస్తూనే ఉన్నాడు జయ రాజ్ .
ఢిల్లీ కి చెందిన పంజాబీ అమ్మాయి సావిత్రి ని కుటుంబ పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకొన్నాడు .ఈ సంబంధాన్ని నాటి సాటిలేని మేటినటుడు పృధ్వీ రాజకపూర్ తండ్రి ఇరువైపులవారినీ సంప్రదించి కుదిర్చాడు .పృధ్వీ రాజ్ కపూర్ జైరాజ్ కు మంచి మిత్రుడు .అశోక్ కుమార్ తో సాన్నిహిత్యం బాగా ఉండేది .అంతర్జాతీయ సినీ నటులు రాబర్ట్ మోర్లీ ,జోస్ ఫెర్రెర్ లతో కలిసి పని చేసిన హీరో జైరాజ్ . అతడు అతి సునాయాసంగా చాలా భాషలు మాట్లాడే శక్తి సామర్ధ్యాలున్నవాడు .అందుకే భిన్నభాషల సినిమాలలోనూ రాణించాడు .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో అమోఘ పాండిత్యం ఉండేది ఆయనకు ..మేనత్త నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు తో మేనల్లుడు జైరాజ్ చాలా చనువుగా గౌరవంగా ఉండేవాడు ఆమెకూ అతనిపై అభిమానం జాస్తీ గా ఉండేది .జైరాజ్ సినిమా రంగం లోని చెడు పోకడలకు చాలాదూరం గా ఉండేవాడు .భార్యను అమిత ప్రేమతో చూసేవాడు .వాళ్ళది అన్యోన్య, ఆదర్శ దాంపత్యం .ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్ళు పుట్టారు.
1980 లో జైరాజ్ మొట్ట మొదటిగా ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’అవార్డ్ పొందాడు . అంటే అక్కినేనికంటే ముందే ఫాల్కే అవార్డ్ పొందిన తెలుగు బిడ్డడు జైరాజ్ .దురదృష్ట వశాత్తూ ఈ విషయాన్ని మనవాళ్ళు ఎవరూ అప్పుడు ప్రచారంచేయనే లేదు .తెలుగు వాడికి వచ్చిందని గర్వ పడనూ లేదు .గుజరాతీ ,మరాఠీ ,హిందీ లలో మొత్తం 350 కి పైగా సినిమాలలో నటించాడు .హిందూలాల్ యాజ్ఞిక్ ‘’ది ప్రిజనర్ ఆఫ్ జెండా ‘’లో అతనికి మొదటి అవకాశం ఇచ్చాడు .ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది .ఇందులో మాధురి హీరోయిన్ .ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం తో యాజ్ఞిక్ మరినాలుగు సినిమాలలో అవకాశమిచ్చాడు ..అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి హీరో గా రికార్డ్ సృష్టించాడు జై రాజ్ .1930 లో అతని పారితోషికం వంద రూపాయలు .అతని సినిమాలో పైన పేర్కొన్నవికాక సూపర్ హిట్లు సాధించి సూపర్ స్టార్ ను చేసిన సినిమాలలో ‘’షికారి ,మజ్దూర్ ,స్వామి ,పన్నా ,రాజ్ పుటాని,ముంతాజ్ మహల్ ,లాల్ కిలా ఉన్నాయి .స్వామి సినిమా తో దశ తిరిగి రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచారు .ప్రఖ్యాత డ్రీం గర్ల్ దేవికా రాణి సరసన ‘’హమారీ బాత్ ‘’లో నటించాడు .ఇది మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది .మాధురి ,షకీలా ,నటనకే భాష్యం చెప్పిన మీనాకుమారి, శశికళ వంటి టాప్ హీరోయిన్స్ తో కూడా నటించాడు .1950 నుండి 1960 వరకు జైరాజ్ సినీ జీవితం లో స్వర్ణ యుగం .156 చిత్రాలలో హీరోగా , 200 సినిమాలలోవిలన్ , కేరెక్టర్ యాక్టర్ కామెడీ యాక్టర్ గా చేశాడు ..జైరాజ్ 3 సినిమాలకు దర్శకత్వం వహించాడు . .అన్నీ కనకవర్షాలే కురిపించాయి .ప్రతిమా ,సాగర్ . మొహర్ సినిమాలు మూడూ అద్భుత విజయాలు సాధించాయి . సాగర్ ,మొహర్ రెండిటిలో తన శిష్యుడు షమ్మీ కపూర్ కు హీరో గా అవకాశం ఇచ్చాడు జైరాజ్ .సోదరులు రాజ్ కపూర్ ,షమ్మీకపూర్ లు జైరాజ్ ను ‘’పాపాజీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .
జైరాజ్ సుదీర్ఘ సినీ రంగ సేవకు 1980 లో ప్రతిష్టాత్మకమైన ‘’దాదా సాహెబ్ ఫాల్కే ‘’పురస్కారం అందుకున్నాడు ..ఫాల్కే అవార్డ్ అందుకున్న మొట్టమొదటి తెలుగు నట దర్శక నిర్మాత జైరాజ్ గుజరాత్ మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్ ను ఘనంగా సత్కరించాయి . దిలీప్ కుమార్ రెండవ సినిమా’’ప్రతిభ ‘’ కు డైరెక్టర్ జయరాజ్ అంటే మనకు ఆశ్చర్యమేస్తుంది .మధుర సంగీత సృష్టికర్త నౌషాద్ ను వెండి తెరకు పరిచయం చేసింది జైరాజే .1913 లో దాదాసాహెబ్ ఫాల్కే మొదటి సినిమా తీసి రికార్డ్ సృష్టించాడు .జైరాజ్ బాంబే సినీ రంగ ప్రవేశం 1929 లో చేసి ఆయన పేరిట ఉన్న అవార్డ్ ను 1980 లో పొందిన ఘనుడు జైరాజ్ .మన అక్కినేని రామారావు లు సినీ అరంగేట్రం చేయకముందే బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన వాడు జైరాజ్ .ఇంత గోప్పతెలుగు నటుడిని మనవాళ్ళు మరచి పోయి అతని ఆనవాళ్ళు లేకుండా చేయటాని ప్రయత్నించినట్లు కనిపిస్తోందని సినీ విమర్శకులు అంటారు .తెలుగు సినీ చరిత్ర పుస్తకం లో అగ్రస్థానాన ఉండాల్సిన వాడిని ఇంతగా విస్మరించిన జాతి మనది .ఆయన శిలా విగ్రహం, ఆయన పేరిట పారితోషికం కూడా ఇవ్వని గొప్పమనసు మనది . సినీకళాకారుల సంక్షేమం కోసం, మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన మానవతా మూర్తి జైరాజ్ .జాతీయ విపత్తులలో సర్వం కోల్పోయినవారి సహాయార్ధం సంగీత కచేరీలు నిర్వహించి అందజేసేవాడు
.జైరాజ్ చని పోవటానికి ఏడాది ముందే భార్య సావిత్రి కేన్సర్ తో చనిపోయింది.. ఆమె మరణం అతని ఆరోగ్యం పై బాగా ప్రభావం చూపింది .తట్టుకోలేక పోయాడు .ఆతర్వాత అతని మరణం దాకా తండ్రి బాగోగులు కూతురు గీత చూసుకొనేది .భార్యపై మమకారం ,బెంగ లతో జైరాజ్ 11-8-2000 న 91 వ ఏట మరణించాడు .అతని మనవడు అంటే ఈకూతురి కొడుకు ‘’రాజన్ షాహి’’ టి.వి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా మంచి పేరు పొందాడు .ఇతనొక్కడే జై రాజ్ కుటుంబానికి మిగిలిన ఏకైక వారసుడు .మిగిలిన వారంతా చనిపోయారు .
20 18 లో తెలంగాణా ప్రభుత్వం ‘’లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్ ‘’అనే డాక్యుమెంటరి ఫిలిం నిర్మించి ఈతరానికి పరిచయం చేసి,అతని శత జయంతిని ఘనంగా నిర్వహించి ఋణం తీర్చుకొన్నది .
కొసమెరుపు –హీరో,విలన్ ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాలలో నటించి నిర్మాత దర్శకుడిగా ప్రాభవం పొందిన జైరాజ్ యెంత సంపాదించాడో, .డబ్బుతో ఎన్నో బంగళాలు ఇళ్ళూ, స్థలాలుకొన్నాడో , బ్యాంకుల్లో యెంత డబ్బు మూలుగుతోందో ఆయనకే తెలియదు .అంతటి సంపన్నుడు .ఆ తరం లో కుబేరుడే .’’మనీ మేనేజ్’’ మెంట్ పై అసలు దృష్టి పెట్టలేదు సంపాదించింది పధ్ధతి ప్రకారం కొడుకులకు, వారసులకు ఇవ్వ లేకపోయాడు .దీనితో కొడుకు లిద్దరిదీ ఇస్టా రాజ్యమై పోయింది .అందినంత బొక్కేశారు.వ్యసనాలకు బానిసలై ఉన్నదిఅంతా ఊడ్చేశారు .చివరికి మిగిలిన ఒకే ఒక్క ఇల్లు ను కూడా కొడుకు కోడలు ఆక్రమించి ఆయన్ను ఒక చీకటి గదికే పరిమితం చేసి,మానవత్వం మరచి ప్రవర్తించారు .అతనికి కట్టుకోవటానికి సరైన బట్టలే ఉండేవి కావట .తిండీ తిప్పల సంగతి ,ఆరోగ్యం విషయం అస్సలు పట్టించు కోకుండా గాలికి వదిలేశారు ఒకప్పటి ఆసూపర్ స్టార్ జైరాజ్ ను.తప్పని సరి పరిస్థితులలో గత్య౦తరం లేక కూతురు గీత కు ఫోన్ చేస్తే ఆమె వచ్చి ,ఇక్కడి పరిస్తి స్థితులకు బిక్క చచ్చి తండ్రి దీనావస్థ కు పరిష్కారం గా అన్నావదినలను ఇంటినుంచి గెంటేసి ఇంటిని స్వాదీనంచేసుకొని ,విషయాలను చక్క దిద్ది తండ్రి బాగోగులు చూస్తూ ఊరట కల్గించి ,తండ్రి తరఫున వాళ్ళపై కోర్ట్ లో కేసు వేసింది.ఒక రోజు కోర్టు లో జైరాజ్ జడ్జి గారితో ‘’నన్ను నా ఇంట్లో ప్రశాంతంగా మరణించే అవకాశం కల్పించండి ప్లీజ్ ‘’అని దీనంగా వేడుకొన్నాడు .కోర్టు అన్నికోణాల్లో పరిశీలించి జైరాజ్ కు న్యాయం కలిగించి ,ఆ ఇల్లు ఆయన కే చెందుతుందని తీర్పు ఇచ్చింది .ఎంతటి హీరోకు ఎంతటి పరిస్థితి ?దైవ లీలలు చిత్రాలే కానీ మనం కూడా మన విషయాలలో జాగ్రత్తగా ఉండక పొతే ఇలాంటి పరిస్థితులే వస్తాయిఅని అందరూ గుర్తించాలి .అతని జీవితం అందరికీ అన్ని విధాలా గుణ పాఠం .
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-18 –ఉయ్యూరు