కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కేన్సర్  మహమ్మారి సంహారి  డా శ్రీ నోరి దత్తాత్రేయుడు

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు దగ్గరలోని మంటాడ గ్రామం లో డా.శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు 21-10-1947 న స్వతంత్ర భారత దేశం లో జన్మించారు .తండ్రి శ్రీ నోరి సత్యనారాయణగారు టీచర్ .తల్లి గారు శ్రీమతి కనక దుర్గ .చాలా పేద కుటుంబం నోరి వారిది .దత్తత్రేయుడు గారికి అయిదుగురు అన్నదమ్ములు ,అయిదుగురు అక్కచెల్లెళ్ళు .అందరిలో చిన్నవాడు దత్తాత్రేయుడు .5 వ ఏటనే తండ్రిని కోల్పోయిన నిర్భాగ్యుడు . .మచిలీ పట్నం లోతల్లి సంరక్షణలో 7 వ తరగతి వరకు చదివారు . ఆంద్ర జాతీయ కళాశాలలో ప్రీ యూని వర్సిటి ,బి ఎస్ సి పూర్తి  చేసి , .కర్నూలు మెడికల్ కాలేజి లో 1965 నుండి 71 వరకు చదివి ,ఉస్మానియా యూని వర్సిటి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ పొందారు .1976 లో ఎం. డి. అయ్యారు .పెత్తల్లి శ్రీ మతి జొన్నలగడ్డ సుందరమ్మ గారు దొడ్డ ఇల్లాలు .నెల నెలా ఆమె పంపే డబ్బుతోనే నోరివారు చదువ౦తా పూర్తి  చేశారు .పెద్దమ్మ పంపిన డబ్బుకు సార్ధకత చేకూర్చారు . సు౦దరమ్మ గారి చేతి చలవ మహా గొప్పది .ఆమె వల్లనే ప్రపంచానికి ఒక సమర్ధుడైన కాన్సర్ వ్యాధి వైద్యుడు లభించాడు .

 

ఫిబ్రవరి  1972- ఫిబ్రవరి 73వరకు దత్తాత్రేయుడు గారు హైదరాబాద్ గాంధి హాస్పిటల్ లో పని చేశారు .1973  నుంచి 1976 వరకు ఉస్మానియా యూని వర్సిటి అనుబంధ ‘’రేడియం ఇన్ స్టి ట్యూట్ అండ్ కాన్సర్ హాస్పిటల్’’ లో రెసిడెంట్ డాక్టర్ గా ఉన్నారు .ఆయనకు మొదటి నుంచి కాన్సర్ వ్యాధి నివారణోపాయం  కనిపెట్టాలన్న తపన ఉండేది .ఇది అమెరికాలోనే సాధ్యం అని గ్రహించారు .

అమెరికా వెళ్లి కేన్సర్ వ్యాధిపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు .న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్ -కెట్టేరింగ్ కాన్సర్ సెంటర్ లో అధ్యయనం కొనసాగించారు .బ్రాకీ థెరపి విభాగానికి అధ్యక్షులై ,పరిశోధనలు చేశారు .కార్నెల్ నగరం లో రేడియేషన్ ఆంకాలజీ చైర్మన్ గా ఉంటున్నారు .వీరి భార్య శ్రీమతి సుభద్ర కూడా డాక్టర్ .వీరి కుమారుడు సంతోష్ న్యాయవాది .అమ్మాయి  డాక్టర్ .

ఆధునిక కాలం లో కేన్సర్ వ్యాధి వ్యాప్తికి వాతావర ణం లో వస్తున్న మార్పులు ,ముఖ్య కారణాలని డా నోరి పరిశోధనలలో తేలింది.దీనిపై విస్తృత అధ్యనం చేయాల్సిన  అవసరం ఉందని భావించి న్యూయార్క్ ప్రేస్బిటేరియన్ హాస్పిటల్ –విల్ కార్నెల్ మెడికల్  సెంటర్ లో తీవ్ర పరిశోధనలు చేసి ఆ వ్యాధి నివారణకు 27 ఆరోగ్య రక్షణ సౌకర్యాలు కలిగించి , అమెరికా దేశం లో కాన్సర్ బాధితుల పాటి ప్రత్యక్ష దైవం అనిపించారు .అన్ని వసతులు సౌకర్యాలు ఉన్న సమగ్ర కాన్సర్ చికిత్సాలయాలను 10 కేంద్రాలలో నెలకొల్పారు .న్యు యార్క్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ ఆఫ్ క్వీన్స్ లో రేడియేషన్ ఆంకాలజీప్రొఫెసర్ , చైర్మన్ గా చేశారు..క్వీన్స్ కు ఆంకాలజీ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు .

గైనలాజికల్ ,డెంటి ట్యూరినరి, , ధోరాసిక్ అండ్ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ మొదలైన వాటిపై అధిక స్థాయి బ్రాకీ దెరపి లో  కొత్త చికిత్సా పద్ధతులు , అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఆవిష్కరించిన ఘనత నోరి వారిదే .2002 జులై లో అమెరికా వైద్య రంగం లో ఒక భారీ స్థాయి సర్వే జరిపారు.సుమారు రెండున్నర లక్షల ప్రముఖ వైద్యుల కుటుంబాల వద్దకు వెళ్లి  , వాళ్ల ఇళ్ళల్లో ,ఏదైనా  అనారోగ్య సమస్య వస్తే ఏ డాక్టర్ ను సంప్రదిస్తారని అడిగితే ,వారందరూ కాన్సర్ విషయం లో అందులోనూ ముఖ్యంగా మహిళల కాన్సర్ విషయం లో డా .నోరి దత్తాత్రేయుడు గారినే సంప్రదిస్తాం అని నిర్ద్వంద్వంగా తెలిపారు .అంటే అమెరికాలో అత్యున్నత కేన్సర్ వైద్యులు నోరివారే నని చాటి చెప్పారన్నమాట .మహిళల కాన్సర్ నివారణ కు ప్రపంచం లోనే ‘’టాప్ డాక్టర్’’ గా డా నోరివారికి సుస్థిర స్థానం లభించింది .

నోరి వారివైద్య సేవానిరతి గుర్తించిన అనేక దేశాలు సంస్థలు ,ప్రముఖులు వారిని ఆహ్వానించి సత్కరించి గౌరవించి ప్రాణ  రక్షకుని గా ప్రాణదాత గా  కీర్తించారు .ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వర్ణ పతకం అందించి సన్మానించింది .వీరి వద్దశిక్షణ పొందిన 300 మంది కి పైగా కాన్సర్ నిపుణులు  ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పదవులలో రాణిస్తున్నారు .వీరందరికీ స్పూర్తి ప్రదాత డా నోరి. కాన్సర్ రాకుండా పేగులలోపల ఉండే సున్నితమైన పొరను కాపాడేది ‘’పసుపు ‘’అని స్పష్టంగా చెప్పారు డా,నోరి .వంటనూనె ను అనేక సార్లు కాచి వాడటం ప్రమాదకరం అని హెచ్చరించారు .మన సంప్రదాయ వైద్య విధానాలలో ఉన్న మేలును కూడా గుర్తించారాయన .50 ఏళ్ళుగా అమెరికాలో కాన్సర్ వ్యాధి నిపుణులుగా సేవలందిస్తున్న దత్తత్రేయుడుగారికి అమెరికన్ కాన్సర్ సొసైటీ ‘’ట్రిబ్యూట్ టు లైఫ్ ‘’అనే గౌరవాన్ని బహూక రించి సత్కరించింది .భారత ప్రభుత్వం 1915 లో ‘’పద్మశ్రీ ‘’తో సరి పుచ్చింది .

  • బసవతారక క్యాన్స్ ర్ ఇంస్టి్ట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగినది . ఎన్‌టీ రామారావు భార్య బసవ తారకంకి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్నా దత్తాత్రేయుడు దగ్గరకు తీసుకొచ్చారు . చికిత్స జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్రతికింది. అంతకు ముందే దత్తాత్రేయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాలనే ఉద్దేశము ఉండడం … దానికి తోడు ముఖ్యమంత్రి అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వము 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడము, కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను, ప్రభుత్వ ఆర్థిక సాయముతో 200 పడకల ఆసుపత్రితో అన్ని నూతన వైద్య పరికరాలతో ” బసవతారక ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇంస్టిట్యూట్ ” నిర్మాణము జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభమంచడం జరిగింది.

 

.ఉచితంగా ఇక్కడ ఈ వ్యాధికి చికిత్స చేయటం  విశేషం .తరచుగా ఇక్కడికి వచ్చి డా.నోరి చికిత్సలు చేస్తూ ఉంటారు  .స్త్రీలకూ కాన్సర్ రాకుండా ఉండటానికి ఎన్నో మెళకువలు  చెప్పి చైతన్య వంతులను చేస్తున్నారు .పురుష కాన్సర్ పై కూడా విస్తృత అధ్యయనం చేశారు .జాతీయ ,అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో వారు లెక్కకు మించిన ఆర్టికల్స్ రచించి మార్గ దర్శనం చేశారు .2006 జులై లో ప్రతిష్టాత్మకమైన ‘’కనాలి మెడికల్ లిమిటెడ్ సంస్థ ‘’నిర్వ హించిన సర్వే లో ,మొత్తం లక్షమంది కాన్సర్ నిపుణులలో డా నోరి దత్తాత్రేయుడు గారు ప్రప్రధమ౦గా  నిలిచి చరిత్ర సృష్టించారు .అనేక కోణాలలో జరిగిన సర్వే లో కూడా ఈయనే అమెరికా అత్యుత్తమ డాక్టర్ గా ఎంపికయ్యారు .వీరు  కాన్సర్ వ్యాధి పై ర 4 గ్రంధాలు ,200 కు పైగా పరిశోధనా వ్యాసాలూ రాశారు .వీటిలో ఒక గ్రంథం ‘’యాన్ అట్లాస్ ఆఫ్  బ్రాకి థెరపి ‘’20 06 ఆగస్ట్ లో హైదరాబాద్ లో ఆవిష్కరణ పొందింది .2007 మార్చి 4 న వీరికి ప్రతిష్టాత్మక ‘’డా .యలవర్తి నాయుడమ్మ అవార్డ్ ‘’నిచ్చి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది .కాన్సర్ అంటేనే ‘’మరణ శాసనం ‘’అ నే భయాన్ని పోగొట్టి ,అసంభవమైన కేసుల్లోకూడా’’కాన్సర్ ?నో ఫియర్’’అని ఊరడిస్తూ , మరణాన్ని వాయిదా వేయించే అత్యంత సమర్ధులు డా నోరి దత్తాత్రేయుడు గారు ఆంధ్రులు ,కృష్ణా జిల్లావారు కావటం మనకు గర్వకారణం .

తాము సంపాదించినదంతా ‘’ఆరోగ్య సంపద పెంచటం అభి వృద్ధి చేయటం ‘’లకే ఖర్చు చేసిన వితరణ శీలి డా నోరి .’’బ్రాకీ థెరపి.’’వైద్య ప్రక్రియతో కాన్సర్ రాక్షస సంహారం చేస్తున్న అపర దత్తాత్రేయుడు డా నోరి దత్తాత్రేయుడు గారు .’లాంగ్ లివ్ డా నోరి ‘’ ‘’వైద్యో నారాయణో నోరి దత్తాత్రేయః’’

 

     గౌరవాలు – పురస్కారాలు

  • 1962 లో ప్రీ-యూనివర్సిటీలో చదివేటపుడు, 1965 లో బి.యస్ .సి చదివేటపుడు, ఉష్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
  • 1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నారు .
  • 2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషం వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడిస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిలల క్యాన్సర్ నివారణలో ఉత్తం డాక్టర్ ఎంపికయ్యారు .
  • 1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నారు .
  • 2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు .

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-8-18 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.