అంతరిక్ష పరిశోధన శాస్త్ర వేత్త ,ప్రముఖ పాప్యులర్ సైన్స్ రచయిత –డా మహీధర నళినీ మోహన రావు
తూర్పు గోదావరి జిల్లా ముంగండ లోసంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో డా .మహీధర నళినీ మోహన రావు 1933 లో ఆగస్ట్ 4 అంటే ఈ ఈ రోజే జన్మించారు .ఇక్కడే రస గంగాధరం అనే అలంకార శాస్త్రం రాసిన జగన్నాధ పండితరాయలు జన్మించాడు .మహీధర కుటుంబం ముగ్గురు స్వాతంత్ర సమర యోధులను అందించింది .తండ్రి మహీధర రామ మోహనరావు ప్రముఖ రచయిత, నవలాకారుడు స్వాతంత్ర్యోద్యమ సమర యోధుడు .ఈయన రాసిన ’’కత్తులవంతెన ‘’ నవల బాగా ప్రచారం పొందింది .‘’కొల్లాయి గట్టితే నేమి ‘’నవలకు 1960 లో తెలుగు సాహిత్య అకాడెమి పురస్కారం వచ్చింది .’’కత్తులవంతెన ‘’ .ప్రముఖ కవి ‘’మో’’ అని పిలువబడే శ్రీ వేగుంట మోహన ప్రసాద్ తో కలిసి దీన్ని ‘’స్వరాజ్యం ‘’గా ఆంగ్లీకరించారు .19 36 లో విశ్వ సాహిత్య మాల స్థాపించి 1964 వరకు అనేక పుస్తకాలు ప్రచురించారు .ముంగండ అగ్రహారం సంప్రదాయానికి నిలయమైనా ,మహీధర కుటుంబం వామ పక్ష భావాలున్నవారు .ప్రజాశక్తి ,విశాలాంధ్ర పత్రికల సంపాదకుడిగా చేశారు .తండ్రి సూర్య నారాయణగారు బ్రహ్మ సమాజ అభిమానులు కావటం తో కొడుకుకు రాజారామ మోహనరాయ్ పేరు పెట్టుకున్నారు .ఈ కుటుంబలో మహీధర జగన్మోహనరావు కూడా ప్రముఖ రచయిత.లెనిన్ జీవిత కధలు మధ్యయుగాల మహా చరిత్ర పుస్తకాలు రాశారు .
నళినీ మోహన్ ప్రాధమిక విద్య విజయవాడ సి. వి .ఆర్.స్కూల్ లో లో నేర్చి,15 వ ఏటనే కవిత్వం రాయటం మొదలు పెట్టారు . 1953-55 లో ఉస్మానియా యూని వర్సిటి నుంచి భౌతిక శాస్త్రం లో ఎం.ఎస్ .సి. పాసయ్యారు .తర్వాత మాస్కో వెళ్లి196౦ -63 లో – మాస్కో, లుముంబా యూని వర్సిటిల లో చదివి డాక్టరేట్ పొందారు ..స్వీడన్ వెళ్లి ఆయనో స్పెరిక్ అబ్జర్వేటరీ లోనూ ,బల్గేరియా దేశపు అకాడెమీ ఆఫ్ లాబ రేటరిలోనూ డిప్యూటీ డైరెక్టర్ గా ఉంటూనే తనకభిమానమైన అంతరిక్ష పరిశోధనలు చేశారు .
ఇండియా తిరిగి వచ్చి న్యు ఢిల్లీ నేషనల్ ఫిజికల్ లాబ్ డైరెక్టర్ అయ్యారు .రోదసీ శాస్త్ర వేత్తగా నళినీమోహన్ 16 రాకెట్ ప్రయోగాలలో పాల్గొన్నారు .శాస్త్ర పరిశోధనలు ప్రయోగాలు చేస్తూనే తెలుగులో వైజ్ఞానిక రచనలు చేసి పాప్యులర్ సైన్స్ ఆర్టికల్స్ రాశారు .ఇది తెలుగు వారికి వరమై అప్పటివరకు ఎవరికీ అందుబాటు లో లేని వైజ్ఞానిక విషయాలు కరతలామలక మయ్యాయి .దీనికి రావు గారికి మనం కృతజ్ఞులమై ఉండాలి .తెలుగు బాలలకోసం బాల సాహిత్యాన్నీ రాశారు .అందులో చొప్పదంటు ప్రశ్నలు , ,పిడుగు కధ ,క్షేత్ర వీధులలో మొదలైన 16 పుస్తకాలున్నాయి .నిత్య ,అనుక్షణ పరిశోధనలో మునిగి తేలుతూ కూడా వీటిని రాయటం మెచ్చదగినవిషయం .ఇవే కాక యువత కోసం 35 పుస్తకాలు రాసిన సైన్స్ పాప్యులర్ రచయిత సైంటిస్ట్ నళినీమోహన్ ..వీటిలో కాలెండర్ కథ ,గ్రహణాలకథ ,విద్యుత్కథ మొదలైనవి ఉన్నాయి .భారతీయ దార్శనికులు ,ప్రాచీన శాస్త్రజ్ఞుల భావాలకు గౌరవం కలిపిస్తూ ,ఎన్నో ఆధునిక విషయాలు వివరించి యువతకు స్పూర్తి కలిగించారు .ఒకరకంగా అంతరిక్షం లో విహరిస్తున్న సైన్స్ ను భూ మార్గం పట్టించారు .మూఢ విశ్వాసాలను శాస్త్రీయ దృక్పధం తో విమర్శించారు.
నళినీ మోహన్ రచించిన ‘’వనసీమలలో పండిత రాయల భావ తరంగాలు ‘’పండితుల ప్రశంసలను అందుకొన్నది .తెలుగు భాషపై ఉన్న మక్కువ ,అభిమానం, గౌరవాలతో ఆయన 35 కి పైగా సైన్స్ గ్రంథాలు,176 బాలసాహిత్య రచనలు చేశారు .మంచి కవి కూడా అవటం తో కవితా సంకలనాలు వెలువరించారు .కావ్యాలు వ్యాస సంపుటాలు రాసి ప్రచురించిన శాస్త్ర కవి .అప్పటి వరకు సైన్స్ పుస్తకాలు రష్యా నుంచి దిగుమతి అయి అర్ధం పర్ధం లేని తెలుగు అనువాదాలతో తెలుగు వాడి బుర్రలను తినేశాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టి దేశీయమైన తెలుగుతో సైన్స్ కు పరి పుస్టికలిగించారు నళినీ మోహన్ .రష్యా అనువాద జడి వాన నుంచి అచ్చమైన తెలుగు రచన గొడుగుతో కాపాడిన శాస్త్రీయ భాషా ఉద్యమకారుడు నళినీ మోహన్ గొప్ప సంస్కృత పండితుడు కూడా .
రావు గారి విజ్ఞాన శాస్త్ర కృషిని మెచ్చి 1968 లో దువ్వూరి రామి రెడ్డి స్మారక ప్రతిష్టాత్మక ‘’విజ్ఞాన బహుమతి’’ మొట్టమొదటి సారిగా అంద జేశారు . .తర్వాత ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతి పొందారు .తెలుగులో ఇంత విస్తృతంగా సైన్స్ గ్రంధాలు రాసిన వారు లేరు .శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలుగునాట వ్యాపింపజేసిన ప్రాతస్మరణీయులు నళినీ మోహన్ .ఆకర్షణీయమైన శైలి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సైంటిఫిక్ భావాలను స్పష్టంగా విడమర్చి చెప్పే విధానం గొప్ప ఆకర్షణగా నిలిచి ఆయన్ను అందరికీ దగ్గర చేశాయి .గణితం లో గమ్మత్తులను కూడా సరదాగా అరచేతిలో ఉసిరికాయ ను చేశారు .పత్రికలలో ఆయన రాసిన వ్యాసాలకు లెక్కే లేదు .శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని జనబాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చిన రచనా శిల్పి ఆయన .ఆ ఘనత రావు గారిదే. అనితరసాధ్య కృషి ఇది . మహీధర గేయకధలు,ప్రపంచానికి ఆఖరి ఘడియలు ,మెదడుకి పదును ఆయన రచనలలో ఆణిముత్యాలు .
పదవీ విరమణ చేశాక ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధికి గురైన నలినీకాంత రావు ,హైదరాబాద్ సరూర్ నగర్ వృద్ధాశ్రమంలో చికిత్స పొందుతూ 72 వ ఏట 21-10-20 05 న మరణించారు .ఆయనకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు .
ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు