ఔషధ మొక్కల శాస్త్ర వేత్త డా.శ్రీ కొప్పుల హేమాద్రి
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు లో జన్మించిన శ్రీ కొప్పుల హేమాద్రి అనకాపల్లి ఎమ్. ఎ.ఎల్ కాలేజీ లో కెమిస్ట్రీ లో బిఎస్ సి చదివి పాసై ,బాంబే యూని వర్సిటీనుండి బి .ఎస్ .సి. ఆనర్స్ పొందారు .పూనా లోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులుగా చేరారు .మొక్కలలోని జాతులు వైవిధ్యాలగురించి తీవ్రమైన అధ్యయనం చేశారు .ఏం ఎస్ సి చదువుతూనే పరి శోధనా పత్రాలు సమర్పించేందుకుశివాజీ మహారాజ్ జన్మించిన ‘’ఫ్లోరా ఆఫ్ జన్నర్ ‘’ప్రాంతం లో మొక్కలలో వివిధ జాతులపై పరిశోధన చేశారు.సహ్యాద్రి కొండలనడుమ దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్ .అక్కడ అణు అణువూ గాలించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు .వీటి గురించి అప్పటికి ఎవరికీ ఏమీ తెలియదు .అందుకోసం ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించి ,ఆ మొక్కల వినియోగం ప్రయోజనాలను తెలుసు కొన్నారు .తన పరిశోధన సారాంశాన్ని ‘’బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ‘’డైరెక్టర్ కు పరిశీలనకోసం పంపారు .ఆయన దానికి కొద్ది మార్పులు సూచించి పి .హెచ్ .డి. కి పంపమని సలహా ఇచ్చారు .వెంటనే హాలండ్ లోని ‘’రిజ్క్ హీర్బే రియం ‘’కు పంపారు .దాని డైరెక్టర్ దీన్ని బాగా పరిశీలించి ,హేమాద్రిగారికి పి .హెచ్ .డి. కి బదులు ‘’ డాక్టర్ ఆఫ్ సైన్స్ ‘’పట్టా ప్రదానం చేశాడు .ఈ ప్రోత్సాహం తో ప్రామాణిక పద్ధతులలో పరిశోధనలు చేసి కొత్త మొక్కలు ఎక్కడున్నా’’ కొప్పు పట్టి లాగి’’ ,40 మొక్కలను నూతనంగా కనుక్కొని వైద్య రంగానికి అందజేశారు కొప్పుల హేమాద్రిగారు .
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సుమారు 9 సంవత్సరాలు పని చేసి తన పరిశోధనా ఫలాలను పక్వానికి తెచ్చారు .ఔషధ మొక్కలపై వీరికున్న అవగాహనకు ప్రోత్సాహకరం గా కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థ లో సర్వే అధికారి గా నియమి౦ప బడ్డారు .అప్పటికి ఆయుర్వేద గ్రంధాలలో మందుల మొక్కల పేర్లు అన్నీ తప్పుల తడక గా ఉన్నట్లు ఆయన గుర్తించారు .వెంటనే పనికి పూనుకొని వాటిని వర్గీకరించి అసలైన సరైన పేర్లు పెట్టారు .దీనిపై 35 ఏళ్ళు తీవ్ర కృషి చేశారు .మన రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర ,ఒరిస్సా ,పశ్చిమ బెంగాల్ ,కర్నాటక లలో కూడా పర్యటించి,పరిశీలించి ,పరిశోధించి చరిత్ర గర్భం లో దాగి ఉన్న 24 మొక్కలను కొత్తగా పరి చయం చేశారు .
మన రాష్ట్రం లోని ఉభయ గోదావరి ,విశాఖ ,ప్రకాశం ,కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలో తిరిగి ,ఆ ప్రాంతాలలో ఉన్న ఔషధ మొక్కలను గుర్తించి ,సేకరించి ,గిరిజన సంప్రదాయ వైద్యం గురించి పూర్తిగా అధ్యయనమూ చేశారు .తర్వాత వీటిని గ్రంధస్ధం చేశారు .కడపజిల్లా లోని వేంపల్లి కొండలమీద ‘’రక్త మండలం ‘’పేరుతోనూ ,అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం లోని బంగారు నాయకుని కొండ పై ఉన్న ‘’ముని రెట్ట ‘’పేరుతోనూ ,మహబూబ్ నగర్ జిల్లా లో ‘’కొండముచ్చు మూత్రం ‘’గా వివిధ పేర్లతో ఆటవికులు పిలిచే దాన్ని ‘’గోమూత్ర శిలాజిత్ ‘’ గా హేమాద్రిగారు గుర్తించి , సంప్రదాయ వైద్య రంగానికి యెనలేని సేవలు చేశారు .
హేమాద్రిగారు 15 వైద్య గ్రంధాలు రచించారు .’’ఆంద్ర ప్రదేశ్ లో మందు మొక్కలు’’ ,’’ఔషధీ వృక్షశాస్త్రం ‘’గ్రంధాలను తెలుగు అకాడెమి ప్రచురించి బి .ఎస్ .సి .ఆయుర్వేద విద్యార్ధులకు పాఠ్య గ్రంధాలను చేసింది .మన రాష్ట్రం లో లభించే ఔషధ మొక్కలపై హేమాద్రిగారు చాలా పుస్తకాలు రాశారు .వారి రచన ‘’గిరిజన మూలికా వైద్యం ‘’బహుళ ప్రచారం లో ఉంది ఆయుర్వేద గ్రంధాలను అక్షర క్రమం లో పేర్లు పెట్టి సరి చేసిన ఘనత కొప్పులవారిది .కొప్పులవారి శేముషికి దర్పణం ’’గిరిజన వైద్య సర్వస్వం’’ అనే ఉద్గ్రంధం .మెడికో బొటానికల్ ఎక్స్ప్లో రేషన్ ,శాస్త్ర వేత్తలను ఆకర్షిస్తున్న గిరిజన వైద్యం ,గ్రాసెస్ ఆఫ్ జున్నార్ అండ్ ఇట్స్ సరౌ౦డింగ్స్,దిఫ్లోరా ఆఫ్ జున్నార్ అండ్ ఇట్స్ సరౌ౦డింగ్స్ గ్రంధాలు’’ కొప్పుల ‘’సిగలో అనర్ఘ రత్నాలు .
జీవిత కాలమంతా వృక్ష శాస్త్రానికే అంకితం చేసిన శ్రీ కొప్పుల హేమాద్రి గారు 72 పరిశోధనా పత్రాలు రాసి ప్రచురించారు .ఆయనలో గోప్పకవికూడా ఉన్నారు. చక్కని కవితలతో అలరిస్తారుకూడా .జనరంజకమైన కాల్పనిక కథలూ రాశారు .ప్రస్తుతం విజయవాడలో స్థిర నివాసం గా ఉన్నారు .
ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-8-18 –ఉయ్యూరు
—