‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

‘’ఇండియన్’’ హానిమన్ ‘’హోమియో డాక్టర్ ఎం .గురు రాజు

హోమియో వైద్యాన్ని జర్మన్ ఫిజిషియన్ సామ్యుల్  హానిమన్ కనిపెట్టి సంప్రదాయేతర వైద్య విధానం లో ఆయుర్వేదం తర్వాత అంతటి ప్రాముఖ్యతను తెచ్చాడు .ఇండియాలో ,ఆంధ్రాలో ముఖ్యం గా కృష్ణా జిల్లా కు హోమియో వైద్యం లో విప్లవాత్మక అభి వృద్ధి చెందించి ‘’ఇండియన్ హానిమన్’’అని పించుకున్నవారు డా.ఎం.గురురాజు .కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర 28-6- 189 7 జన్మించారు .స్కూల్ టీచర్ గాఉద్యోగం ప్రారంభించారు .తర్వాత మద్రా స్ మెడికల్ కాలేజి లో  అల్లోపతి వైద్యం చదివి 1922 లో డిగ్రీ తీసుకున్నారు .ఎం .బి.బి .ఎస్ .ను ఆ రోజుల్లో అల్లోపతి అనేవారు.1824 లో గుడివాడ లోనే డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పటికి  గుడివాడ తాలూకా మొత్తం మీద  గురు రాజుగారు ఒక్కరే డాక్టరీ  చదివి డిగ్రీ తీసుకున్నవారు .అందువల్ల ప్రాక్టీస్ బాగా ఉండేది .మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు లభించాయి .1932 లో స్వాతంత్రోద్యమం లో పాల్గొని  శాసనోల్లంఘన చేసి అరెస్ట్ అయి  జైలు శిక్ష అనుభవించిన దేశభక్తులాయన .జైలులో ఉండగానే ఆయనకు హోమియో వైద్యం పై మక్కువ కలిగి,దానికి సంబంధిన ఇంగ్లిష్ గ్రంధాలు అధ్యయనం చేశారు .దీనితో ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది .

  హోమియో వైద్యం అంటే రోగ లక్షణాలకు పూర్తిగా  చికిత్స చేయటం .ఇది ఒక విలక్షణమైన చికిత్సా విధానంగా గురురాజు గారి మనసును బాగా ఆకర్షించింది .జైలు లో ఉండగానే హోమియో వైద్య బీజాలు మనసులో పడి,నాటుకొని మహా వృక్షమై ,హోమియో వైద్య ప్రచారం లో హానిమాన్ లాగా ఉండాలని నిశ్చయించుకొన్నారు .జైలు నుండి విడుదలకాగానే అల్లో పతి కి స్వస్తి చెప్పి పూర్తిగా హోమియో వైద్యానికే అంకితమయ్యారు .హోమియో మందులు పరమ ప్రామాణీక మైనవని ,వాటిలో దివ్యత్వం ఉందని పూర్తిగా నమ్మారు .హోమియో వైద్యం లోను ఘనకీర్తి గడించారు .1936 లో ప్రసిద్ధ హోమియో వైద్యులవద్ద శిక్షణ పొంది క్వాలిఫైడ్ డాక్టర్ అనిపించుకున్నారు .అంతటితో ఆగి పోకుండా దానిపై తీవ్ర అధ్యయనం, పరిశోధనలు చేశారు .ప్రముఖ హోమియో డాక్టర్లు  హానిమాన్,  కెంట్ ల చికిత్సా విధానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని,అదే మార్గం లో చాలాకాలం పరిశోధనలు సలిపారు గురు రాజుగారు .దీనితో కొత్త ఔషధ మిశ్రమాలను ఆవిష్కరించారు .అమెరికా వెళ్లి హోమియోపతి లో పోస్ట్ గ్రాడ్యుయేషన్  ట్రెయినింగ్ పొందారు .అక్కడ ప్రసిద్ధ హోమియో వైద్యులు , స్టాల్ వర్ట్స్ అని పిలువబడిన  డాక్టర్ వుడ్ బరి,డా.రాబర్ట్స్ ,.స్పాల్డింగ్  ఎలిజబెత్ హబ్బార్డ్ లతో  పని చేసే గౌరవం లభించింది

  హోమియో వైద్య చేస్తూనే  దాని ప్రచారానికీ తగిన సమయం కేటాయించారు .నాటు వైద్యుల కబంధ హస్తాలనుండి రోగుల చెర విడిపించారు .దీనికి విపరీతంగా కష్ట పడాల్సి వచ్చింది  .తనవద్దకు చికిత్సకు వచ్చేవారిని ఆత్మీయంగా పలకరిస్తూ రోగ లక్షణాలు పూర్తిగా తెలుసుకొంటూ వారికి అత్యంత ఆప్తుడను అనే నమ్మకం కలిగించేవారు .అందువలన రోగులకు ఆయనపై సంపూర్ణ  విశ్వాసం , నమ్మకం కలిగి హోమియో కు గొప్ప ప్రచారం జరిగింది .1951 లో లక్నో లో జరిగిన రెండవ   అఖిలభారత హోమియోపతిక్ కాంగ్రెస్ కు అధ్యక్షులయ్యారు . హోమియో వైద్యానికి ఒక కళాశాల ఉంటె బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది .1954  లో తన ఇంటి వద్దనే’’ఆంధ్రా ప్రోవిన్షియల్ హోమియో పతిక్ మెడికల్ కాలేజి  అండ్ హాస్పిటల్ ‘’స్థాపించారు .1958 లో దీన్నిఆంద్ర ప్రదేశ్  ప్రభుత్వం గుర్తించింది.. .1954 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘’ఎక్స్ పర్ట్ హోమియోపతిక్ కమిటీ ఏర్పరచి రాజుగారిని సభ్యులను చేసింది .1958 లో రాజుగారిని కేంద్ర ప్రభుత్వం హోమియోపతిక్ అడ్వైజరీ కమిటీ లో సభ్యుని చేసి గౌరవించింది .కేంద్ర ప్రభుత్వపు ‘’అ డ్ హాక్ సిలబస్ కమిటీ ,ఫార్మోకోపియా కమిటీలలోగౌరవంగా  సభ్యులయ్యారు .ఇవన్నీ రాజుగారి సమర్ధతకు హోమియోలో  విద్వత్తుకు ,కృషి, సామర్ధ్యాలకు గుర్తింపు .1956 నుంచి ‘’ఆంధ్రా బోర్డ్  ఫర్  హోమియోపతి ‘’లో సభ్యులు .

  రెండవ ప్రపంచ యుద్ధ౦ పూర్తయిన కాల౦లొ ఒక సందిగ్ధ వాతావరణం ప్రపంచమంతా వ్యాపించి ఉంది .గుడివాడ లోనూ అదే పరిస్థితి ఉండేది . ‘ అదే సమయం లో కలరా, మసూచి ,క్షయ వ్యాధులు ప్రబలి  ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. వీటి చికిత్సకు ,మందులకు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. సంపన్నులకు మాత్రమే అల్లోపతి చికిత్స అందుబాటులో ఉండేది. పేద ,నిరుపేదలకు దేవుడే దిక్కు అన్నట్లు ఉండేది .పేదలకు ఈ ఆపత్సమయం లో వెన్ను దన్నుగానిలిచి ,,అతి తక్కువ ఖరీదైన మందులతో వైద్యం చేస్తూ రోగాలను పారదోలుతూ వారికి ఊరట కలిగించి తమ పాలిటి దేవుడు గురురాజు గారు అనిపించారు ఆయన .హోమియో వైద్యం సైడ్ ఎఫెక్ట్ లు లేని వైద్య విధానంగా  ప్రజలలో గొప్ప నమ్మకం కలిగించారు .ఎలాంటి జబ్బునైనా దీనితో నయం చేయవచ్చుననే ధీమా వారిలో కలిగింది .

  ఇదే సమయం లో కేంద్ర ప్రభుత్వం కూడా హోమియో వైద్యం బాగా ప్రచారం పొంది ప్రజలకు ఉపయోగ పడాలని భావించి జాతీయ స్థాయిలో ‘’హోమియోపతిక్ కాంగ్రెస్ ‘’ను ఏర్పరచింది .ఈ సభకు గురురాజు గారు అధ్యక్షత వహించి ,హోమియో వైద్యవిధానం ఎంతబాగా ప్రజలకు ఉపయోగపడుతుందో సాధికారికంగా తెలియ జేశారు .దీనికి ప్రభుత్వమూ ఒప్పుకున్నది .అందుకోసం చెయ్యాల్సిన చట్టాన్ని రూపొందించటం లో డా గుర్రాజు గారి పాత్ర చిరస్మరణీయం .విస్తృత స్థాయిలో దేశ వ్యాప్తంగా హోమియో పతి ని అభి వృద్ధి చేయటానికి రాజుగారు అహరహం శ్రమించారు స్వంత ధనం దీనికోసం చాలా ఖర్చు చేశారు .ధనం, మనం ,అంకితభావం తో దేశవ్యాప్తంగా హోమియోకు గొప్ప వైభవం తెచ్చారు .ఆయన కృషి ఫలించి రాజు గారికీ అంతర్జాతీయ ఖ్యాతి లభించింది . ప్రజా జీవితం లోనూ రాజుగారు బాగా రాణించారు .ప్రజా వైద్యులనిపించుకొన్నారు కనుకనే గుడివాడ మునిసిపల్ చైర్మన్ గా రాజు గారు రెండు సార్లు ఎన్నికయ్యారు .ఆంద్ర ప్రదేశ్ హోమియోపతిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.

1968 అక్టోబర్ 25 న’’ఇండియన్ హానిమన్ డా గురురాజు ‘’గారు  71 వయేట మరణించారు .రాజు గారిమరణానంతరం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడివాడలో ఉన్న హోమియో కాలేజి కి  ఆయన గౌరవార్ధ౦ ‘’డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో పతిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుడివాడ ‘’గా ‘నామకరణం చేసి గురురాజు గారి సేవలను చిరస్మరణీయం చేసింది .నిజంగా గుర్రాజుగారు ‘’హోమియో గురువులలో రాజు  ‘’.

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-18 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.